Saturday, June 6, 2009

నీ కొండకు నీవే రప్పించుకో.....

కలియుగ దైవం పిలిచింది!
1975 జూన్ 19 న నా వివాహం అయ్యాక, మా మామగారి మొక్కుబడి తీర్చడం కోసం, పసుపుబట్టలతో ఆ నెల ఆఖరి వారం లో మా దంపతులం వెళ్ళాం—కలియుగ దైవం దర్శనానికి! తరవాత, 1979 లో మా స్నేహితుడి అన్న పెళ్ళికి చెన్నై వెళ్ళి, తిరిగి వచ్చేటప్పుడు, మా స్నేహితుడితో మరోసారి వెళ్ళాను ఆయన దర్శనానికి ఆ స్నేహితుడికి కంపెనీ కోసమని! మళ్ళీ మొన్న, 03-06-2009 న బయలుదేరాము—మా దంపతులం! (ఐ ఆర్ సీ టీ సీ వారి ప్యాకేజ్ పుణ్యమాని!) నా అనుభవాలు—వివరంగా—చదవండి! రైలు శ్రీపతి చేరుతుందనగా, వారి ప్రతినిధి నించి ఫోన్—ఒక్క ఐదు నిమిషాలు వేచి వుండండి ప్లాట్ ఫాం మీద—నేను వస్తున్నాను—అని! మేమిద్దరం కాకుండా ఇంకొక యువకుడు—వేచి వుండగానే, ఆ ప్రతినిధి వచ్చి, మాకు ఇవ్వవలసిన పత్రాలు ఇచ్చి, యేమి చెయ్యాలో చెప్పి, బయట టాక్సీ దగ్గరకి మమ్మల్ని తోడ్కొని వెళ్ళి, అక్కడ ఇంకొక ప్రతినిధి (గైడ్) కి మమ్మల్ని అప్పచెప్పి వెళ్ళిపోయాడు—మీరు తిరిగి వచ్చేటప్పటికి మీకోసం యెదురు చూస్తూ వుంటాను మళ్ళీ రైలు లో మిమ్మల్ని సాగనంపడానికి—అని చెప్పి! అప్పటికి ఉదయం 6.40 అయ్యింది. టాక్సీ లో మమ్మలని తీసుకెళ్ళి, ‘శ్రీనివాసం’ అతిథి గృహం లో మాకు బస యేర్పాటు చేసి, ఫలహారాలకి చీటీలు ఇచ్చి, ‘8.45 కల్లా సిద్ధంగా వుండండి—కొండపైకి వెళదాం’ అని చెప్పి, గైడ్ వెళ్ళాడు—మరొకర్ని స్వాగతించడానికి! మేము స్నానాలు, ఫలహారాలు కానిచ్చి, క్రిందకి వచ్చి, శ్రీనివాసం అతిథి గృహాన్ని ఓ సారి పరిశీలించి, సిద్ధంగా వుండగా, గైడ్, ‘ఇంకో ప్రయాణీకుడు వస్తున్న రైలు ఆలస్యం అయ్యింది సార్! ఇప్పుడే వచ్చింది! ఆయన కూడా సిద్ధం అవగానే, కలసి వెళ్ళిపోదాం—కొన్ని నిమిషాలు వేచి వుండండి’ అన్నాడు. మేము ముగ్గురం వేచి వుండగానే, నాలుగో ఆయన (ఇంకో నవ యువకుడు) రావడం, మేము నలుగురూ, గైడ్ తో కలిసి అయిదుగురం టాక్సీ యెక్కి—10.30 కి కొండపైకి బయలుదేరాము.

Monday, May 25, 2009

‘ఆదికేశవుడి.....

…………నెత్తిన సొడ్డు!'
అయిపోయింది! అక్రమంగా ఆర్జించిన పదవి వూడి పోయింది! కేంద్ర ప్రభుత్వం రద్దవగానే, ఆయన (అవిశ్వాసానికి వ్యతిరేకంగా) ఇచ్చిన ఓటు విలువ సున్నా అయిపోయింది—ఆయన ఇక ‘తసమదీయుడు’ అయిపోయాడు! అందుకే ‘అసమదీయుడు’ భూమా కరుణాకర రెడ్డి మళ్ళీ పీఠం యెక్కుతున్నాడు! తను చెయ్యలేకపోయిన, మధ్యలో ఆగిపోయిన పనులన్నీ పూర్తి చెయ్యద్దూ? (వీడు నాస్తికుడట—కానీ, పెద్దసారువాడి మత ప్రచారానికి దోహదం చేశాడు శ్రీ గిరి మీద! ఇంకా యూత్ కాంగ్రెస్ నాయకులు కొండపైకి నిషేధిత ‘అన్నీ’ తీసుకెళుతుంటే అడ్డుకున్నవాళ్ళ మీద తన ప్రతాపం చూపించాడు!) పనిలో పనిగా ఈవో రమణాచారి ని కూడా వేటు వేశాడు—వాళ్ళ వుద్యోగులచేతా, ప్రజలతోటీ కాంగ్రెస్ కి వోట్లు వేయించలేదట! (ప్రజారాజ్యానికి వేయించారని అనుమానమేమో—లేకపోతే చిరంజీవి నెగ్గడుగా!) ఇక ఆది కేశవుడి గతి? యేమో—మరో అవకాశం తలుపు తట్టక పోతుందా! చూద్దాం! బై ది బై ‘బంగారు ముష్ఠి’ లో యెంత గిట్టుబాటై వుంటుంది? దాని లెఖ్ఖలు సరిగ్గా అప్పచెపుతున్నాడా?—ఆ శ్రీనివాసునికే యెరుక!

Friday, May 8, 2009

బా బా

బా బా బ్లాక్ షీప్
ఓ పాతికేళ్ళ క్రితమే, ఆత్మలింగం పుట్టిస్తూ, దూరదర్శన్ కెమేరా ‘కన్ను’ కి నగ్నంగా పట్టుబడిన శ్రీ సత్య సాయి బాబా, అప్పటినించీ పబ్లిక్ గా మేజిక్కులు చెయ్యడం మానేశారు—అప్పుడప్పుడు ఓ రాజకీయ నాయకుడికి ఓ గొలుసో, వుంగరమో సృష్టించి ఇవ్వడం తప్ప! నిన్న మన రాష్ట్రపతి శ్రీమతి ప్రతిభా పాటిల్ ‘సకుటుంబంగా’ పుట్టపర్తి చేరగానే, ‘అత్యంత అత్మీయ స్వాగతం’ లభించిందట! తరవాత, ఓ మంత్రీ, ఇంకెవరో వారిని ‘సాయి కుల్వంత్’ హాలుకి తీసుకువెళితే, అక్కడ ‘గ్రీన్ రూం’ లో బాబా ఓ పాతిక నిమిషాలు ‘ప్రత్యేక ఆసీస్సులు’ కురిపించారట ఆ కుటుంబం పై! ఆవిడకి గొలుసులూ, వుంగరాలూ ఇచ్చిన దాఖలాల్లేవు! రాష్త్రం ఓ స్త్రీ అయితే, దానికి ఓ రాష్త్రపతి వుంటాడు. మరి ఓ స్త్రీ రాష్త్రపతి పదవికి యెన్నికైతే, ఆమెని యేమనాలి? రాష్ట్ర పత్ని అనొచ్చా? కూడదు! యెందుకంటే, ఒక స్త్రీకి మరో స్త్రీ పతిగాని, పత్ని గానీ అవడానికి చాన్స్ లేదు! ఇంకేమనాలీ? రాష్ట్ర ‘సవితి’ అంటే? అదీ తప్పే! రాష్ట్ర సోదరి అంటే? మరీ చిన్న పిల్ల అయిపోతుంది! (రాష్ట్ర పురుషులందరికీ) పోనీ రాష్ట్ర మాత అంటే? మొగ రాష్ట్రపతిని రాష్ట్ర పిత అనాలి! రాష్ట్ర దొడ్డమ్మ అంటే? ఇదేదో బాగున్నట్టుంది! చూడండి! మనలో మాట—రాష్ట్ర మాతా లాగే, మన ఆంధ్ర మాత అనుకుంటే, ఆ గౌరవం యెవరికి దక్కుతుంది? (హిందీలో రాష్ట్ర అంటే దేశ అని, తెలుగులో రాష్ట్ర అంటే మన రాష్ట్ర అనీ అర్ధం) ఇంకెవరికి—గోంగూరకి తప్ప! (మన ఆచార్య పింగళి గారన్నట్టు) గోంగూర రాష్ట్ర మాత అయితే, బచ్చలి కూర మన రాష్ట్ర దొడ్డమ్మ! తోటకూర మన రాష్ట్ర పెద్ద పిన్ని! మెంతికూర మన రాష్ట్ర చిన్న దొడ్డమ్మ! చుక్క కూరా, పొన్నగంటికూరా మొదలైనవి చిన్న పిన్నులు! యెలా వుంది?

Saturday, February 21, 2009

అక్రమార్క సేవలు

మన శ్రీ. శ్రీ. దే. లో చిరుద్యోగులు సైతం, సొంత కార్లలో కార్యాలయాలకి వస్తున్నారట! శ్రీవారి సేవల టిక్కెట్లని దొడ్డి దారిలో అమ్మేసుకొని, లక్షాధికారులు అయి పోతున్నారట! మామూలుగా రిజార్వేషనే కాకుండా ‘విచక్షణ’ కోటా కూడా వుంటుంది! ఈ విచక్షణ కోటా క్రిందే మొన్న వేలాది పాసులు జారీ చేస్తె, క్యూ లైన్లు కదలడంలేదని జనాలు అందోళన చేసి, ఆ లైన్లనే విరగ్గొట్టారు! వస్త్రాలంకార సేవకి మామూలుగా రూ.12,250/- టిక్కెట్ అయితే, విచక్షణ కోటా క్రింద రూ.50,000/- ట. మరి వీటిని రూ. లక్షకి అమ్ముకుంటే యెంత లాభం? అభిషేక సేవకి జులై 2029 వరకూ రిజర్వేషన్ లు అయి పోయాయట! వస్త్రాలంకార సేవకి ఏప్రిల్ 2020 వరకూ అయి పోయాయట! మరి మీరేమో వీ ఐ పీ! రేపే మీకు వీటిల్లో యేదో సేవకి టిక్కెట్ కావాలి. యెమి చేస్తారు? మేము యేమి చేస్తాము? యెలాగోలా మీకు ఆ టిక్కెట్లు దాఖలు చెయ్యక చస్తామా! సందట్లో సడేమియా, మేమో రెండు నొక్కేస్తాము! అన్నిటికీ ఆ పైవాడే వున్నాడు! విజిలెన్స్ వాళ్ళు కొన్ని సంవత్సరాలుగా పై అధికారుల దృష్టికి తెచ్చినా, మనకేం ఊడింది! అదండీ సంగతి!

Monday, February 16, 2009

దర్శనం

మనం అనుకున్న దర్శనాల్లో ఓ రకం దర్శనం గురించి ఇవాళ ఈనాడు (16-02-2009) లో పడింది! ఊదయ్ శెట్టి అనే ఓ కిడ్నాపర్ నేపాల్ కీ మనకీ మధ్య అగ్గిపుల్ల వేశాడు! ముంబయి లో కిడ్నాపులు, బెదిరింపులు చేసి చేసి, పోలీసులు వెంటపడగానే, నేపాల్ పారి పోయాడట! అక్కడి కిడ్నాప్ కింగ్ తో కలిసి, కిడ్నాప్ లు చేస్తున్నాడట! ఒచ్చిన మొత్తంలో ఇంత % అని శ్రీవారి హుండీ లో వేస్తున్నాడట! అదీ సంగతి! యెలాంటి డబ్బయినా, శ్రీవారి హుండీ చేరగానే పవిత్రం అయిపోతుంది సరే! కానీ ఈ పవిత్రమైన సొమ్ము కాదని, శ్రీ వారికి ముష్టి యెత్తుకోవలసిన ఖర్మ యేమిటి? ఇప్పటికైనా ఈ ముష్టి పధకం రద్దు చేస్తారా?

Saturday, January 31, 2009

పులిని చూసి.....!

అంతా రామమయం!
దేవాదాయ, ధర్మాదాయ శాఖ కమిషనర్ శ్రీ సుందర కుమార్ 'భక్త రామదాసు సాహిత్య కీర్తన విభాగం' అనే వ్యవస్థను శ్రీ రామనవమి నాటికల్లా యేర్పాటు చేసి, భజ గోవిందం తరహాలో 'అంతా రామమయం' యేర్పాటు చేసి, ధార్మిక కార్యక్రమాలు చేపడతామన్నారు! సెహభాష్!

Monday, January 26, 2009

దర్శనాలు
అసలు శ్రీవారి దర్శనం కోరుకునే వాళ్ళు యెవరు? యెన్ని రకాలు? 1. పాపాలు చేసిన వాళ్ళు—వీళ్ళలో మళ్ళీ రెండు రకాలు-- అ) తెలియకుండా చేసేవాళ్ళూ ఆ) తెలిసీ చేసేవాళ్ళు. 2. కోరికలతో వెళ్ళేవాళ్ళు—వీళ్ళలో చాలా రకాలు. ఉదా: రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, వ్యాపారులు, విద్యార్థులు, సామాన్యులు—ఇలా. 3. మొక్కులు తీర్చుకునే వాళ్ళు—వీళ్ళలో కూడా పై రకాలవాళ్ళు వుంటారు! 4. ప్రచారంకోసం వెళ్ళేవాళ్ళు—తమ మఠాలకి, సంఘాలకి, శిష్యులకీ ప్రచారం తెచ్చుకోడానికి వెళ్ళే వాళ్ళు—ఇలా 5. సెలవలు కలిసొచ్చాయిగదా, గడిపినట్టూ వుంటుంది, పనిలోపనిగా దర్శనంకూడా అయిపోతుంది అనుకొనేవాళ్ళు 6. యాత్రా స్పెషల్ లో దక్షిణదేశ, ఉత్తరదేశ యాత్రలు చేసేవాళ్ళు 7. ఇతర దేవుళ్ళని దర్శించుకొని, దారిలో పనిలో పనిగా వచ్చేవాళ్ళు. 8. కేవలం స్వామి మీది భక్తితో వెళ్ళేవాళ్ళు.—ఇంకా కొన్ని (నేను మరిచిపోయిన) రకాలు వుండవచ్చు. పైవాళ్ళలో, ఒక్క పాపాలు తెలియకుండా చేసేవాళ్ళూ, సామాన్యులు తప్ప, మిగిలినవాళ్ళందరూ, సిఫార్సులతొటో, అధికారంతోటో, డబ్బుపోసి టికెట్లు కొనుక్కొనో అరికాళ్ళు కందకుండా క్షణాల్లొనో, గంటల్లోనో దర్శనం చేసేసుకొని, వీలైతే కొన్ని నిమిషాలో, గంటలో శ్రీవారి సన్నిధిలో గడపడానికి ప్రయత్నించేవాళ్ళే! ఇక గంటలతరబడీ క్యూలలో గడిపి, చివరకి ‘లఘు’, ‘మహాలఘు’ ‘మహావీరలఘు’ దర్శనాల పాలబడే వాళ్ళలొ కూడా చాలా మంది పై 3, 5, 6 రకాల వాళ్ళే. వీళ్ళందరివల్ల—సెలవు రోజుల్లోనూ, ప్రత్యేక దినాల్లోను, పర్వ దినాల్లోను—శ్రీవారి హుండీ ఆదాయం—రూ. కోటి కి తగ్గకుండా వస్తొంది! మరి మూడో రకం, యెనిమిదో రకం వాళ్ళ మాటేమిటి? సామాన్యులకి కష్టం వచ్చినప్పుడు వెంటనే గుర్తొచ్చే దేవుడు—ఇంకెవరు? స్వామివారే! మనుషులకి, ఎంతటివారికైనా తప్పని భయాలు—రోగ భయం, జరా భయం, మృత్యు భయం—ఈ త్రయమే లేకపోతే ప్రతీ మనిషీ మొనగాడైపోడూ! అప్పుడు దేవుడితో పనేముంటుంది? సాధారణంగా కుటుంబ యజమానికో, గృహిణికో, పిల్లలకో యెదైన రోగం వస్తేనో, చంటిపిల్లకి ‘బాలపాప చిన్నె’ కనిపిస్తేనో, యెవరికైనా శస్త్రచికిత్స అవసరం అయితేనో, తమ తాహతునికూడా తాత్కాలికంగా మరిచిపోయి, మొక్కుకునేవాళ్ళే యెక్కువ. మొక్కుకునేటప్పుడే తమ తాహతు గుర్తొచ్చి తక్కువలోనే మొక్కుకునేవాళ్ళు ఇంకా యెక్కువ. ‘వీలైనంత త్వరలో మీ దర్శనానికి వస్తాం’ అనో, ‘డబ్బు కూడగానే వస్తాం’ అనో, ‘పది యిళ్ళలో జోగి దండుకు వస్తాం’ అనో, ‘కేజీ ఆవునెయ్యి—కాదు కాదు—పావు కేజీ ఆవు నెయ్యీ, నూటొక్క వత్తులూ అఖండం లో సమర్పిస్తాం’ అనో—ఇలా రక రకాల మొక్కులు! తీరా గండం గడిచాక, చూద్దాంలే అని వాయిదా వేస్తూ గడిపినంతకాలం గడిపి, మల్లీ ఇంకో కష్టం వచ్చే సూచనలు కనిపించగానే పాత మొక్కు తీర్చడానికి బయలుదేరతారు! రయిల్లో సామాన్య రెండవతరగతి పెట్టెల్లో, కొండమీదికి కాలినడకన—తట్ట బుట్టా, పిల్లా జెల్లాతో—అక్కడనించీ క్యూలల్లో, రోజుల తరబడీ కష్టపడి, ప్రతీ క్షణం కష్టాన్ని మరిచిపోవడానికి ‘గోవిందా! గోవింద!’ అంటూ, మహావీర లఘువైనా, క్షణం పాటే అయిన, దర్శనమయింది చాలు అని మురిసిపోయే వాళ్ళు మాత్రమే నిజమైన భక్తులు. నిజంగా శ్రీగిరి శ్రీపతి ని దర్శించుకొనే ‘వీఐపీ’ లు వీళ్ళే! కాదంటారా? మరి వీళ్ళకి ఆ హోదా యెప్పుడు దక్కేను? అలాంటి హామీని ఇవ్వగలిగిన పార్టీకే మనం ఓటు వేద్దామా?