Monday, June 8, 2009

నీ కొండకు నీవే రప్పించుకో--3

ఇక ఇతర విషయాల మీదకి మళ్ళింది సంభాషణ. నా ఇదివరకటి యాత్రల గురించి చెప్పగానే, రాజేష్, ‘మరీ ముఫ్ఫై యేళ్ళా! వడ్డీ భారం పెరిగి పోతుంది కదా సార్! నేను మాత్రం నెల విడిచి నెల ఠంచన్ గా వచ్చేస్తాను! ఏప్రిల్ 26 న వచ్చాను, మళ్ళీ ఇప్పుదు వచ్చాను! ఇలా వస్తూనే వుంటాను!’ అన్నాడు. నేను, ‘స్వామి వడ్డీ కడతానన్నాడు కుబేరుడికి—నేనైతే వడ్డి కూడా చెల్లించనని తెలుసాయనకి!’ అన్నాను. ఉమేష్ ‘నేను వచ్చి దగ్గర దగ్గర ఐదు సంవత్సరాలు అయ్యింది—మళ్ళీ ఇప్పుడు వచ్చాను’ అన్నాడు. తరవాత, అప్పటికీ, ఇప్పటికీ తేడాల మీద సాగింది సంభాషణ. కొండమీద టొల్ గేటు చేరగానే, మా గైడ్ మాకు యేమిచెయ్యాలి, దర్శనం అయ్యాక యెక్కడ కలవాలి, అన్నీ చెప్పి, మమ్మల్ని సెల్లార్ లో చేర్పించి, తను వెళ్ళిపోయాడు, మా టిక్కెట్ లు మాకిచ్చేసి. రెండునెల్లకోసారి వచ్చే రమేష్ పుణ్యమాని, మేము త్వర త్వరగా ఆ క్యూ లైన్ లో నడుచుకుంటూ, వెళుతున్నాము.

Sunday, June 7, 2009

నీకోండకు నీవే రప్పించుకో--2

మచిలీపట్నం—తిరుపతి ఎక్ష్ ప్రెస్ లో మా దంపతులతోపాటు వచ్చిన విజయవాడ వ్యాపారి (పేరు ‘ఉమేష్’ అందాం!) తో ముగ్గురం అంబాసిడర్ వెనక సీట్లో కూర్చున్నాము, ముందు సీట్లో గైడ్ పక్కన ఇంకో నవయువకుడు—ఈయన ఓ ఫ్రీలాన్స్ జర్నలిష్ట్ అట—ఇండియన్ ఎక్ష్ ప్రెస్ కి యెక్కువగా వ్రాస్తూ వుంటాడట! (పేరు ‘రమేష్’ అందాం!)—కూర్చొన్నారు. రమేష్ వేడి వేడిగా టాపిక్ మొదలు పెట్టాడు—‘కరుణాకరరెడ్డి శ్రీవారి ఆభరణాల ఎగ్సిబిషన్ పెడతానన్నాడు కదా? యెందుకు పెట్టలేదు? యెందుకు పెట్టనివ్వలేదు?—వాటిల్లోని ఖరీదయిన వజ్రాలని లేపేశారు సార్!’ అని. ‘అసలు కారణం అది కాదు! మనపోలీసులు తగిన రక్షణ కల్పించలేమన్నారు కదా? ఇది పైకి కనిపించే, చెప్పే కారణం! నిజం గా కూడా, అన్ని టన్నుల బంగారానికి ‘ఫోర్ట్ నాక్స్’ కి వున్నంత భద్రత కల్పించాలి మరి! ఇక అసలు కారణం, 1933 నించీ, శ్రీవారికీ, అమ్మవార్లకీ వచ్చినె కానుకలకి లెఖ్ఖా పత్రం లేదు—అందుకనీ’ అని నేనన్నాను. ‘అన్నీ యెందుకు, కనీసం శ్రీ కృష్ణదేవరాయలు ఇచ్చిన ఆభరణాలైనా ప్రదర్శించవచ్చుకదా? ఓ జర్నలిష్ట్ గా నాకు కొన్ని ప్రత్యేక సమాచార చానెళ్ళు వుంటాయి! అందుకే చెపుతున్నాను! తిరుపతిలో అతిపెద్ద బంగారు ఆభరణాల దుఖాణం యెవరిదో తెలుసా? అది అంత పెద్దది యెలా అయ్యిందో తెలుసా?’ అన్నాడు—రమేష్. ఉమేష్ కల్పించుకొని, ‘ఇది బహిరంగ రహస్యమే సార్! కరుణాకర్రెడ్డి 700 కోట్లు సంపాదించాడట!’ అన్నాడు. ‘మరి మళ్ళీ కరుణాకర్రెడ్డే దేవస్థానం చైర్మన్ అవుతాడంటున్నారు’ అన్నాన్నేను. ‘ఆది కేశవుల్నాయుడు అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకం గా వోటు వేసినందుకు, చైర్మన్ గిరీ, కొన్ని కోట్లూ సంపాదించుకున్నాడు! అతని అవసరం తీరి పోయింది కదా? అసలు అవిశ్వాస తీర్మానానికీ, ఎంపీలకి ముట్టిన డబ్బులకీ, ఐసీఐసీఐ బ్యాంకు కామత్ కీ యేమిటి సంబంధం? అంటే, అక్కడ నించీ డొంక కదుల్తుంది’ అన్నాడు, రమేష్. ‘సరే, మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంటులు వచ్చేశాయిగదా! ఇప్పుడెలా వుంటుందో?’ అన్నాన్నేను. ‘గొప్ప విజయమే లెండి! ‘ఇన్ని’ సీట్లు వందలోపు మెజారిటీ తోనూ, ‘ఇన్ని’ సీట్లు 5 వందల లోపు మెజారిటీతోనూ, ‘ఇన్ని’ సీట్లు వెయ్యి లోపు మెజారిటీ తోనూ నెగ్గారు!’ అని స్టాటిస్టిక్స్ వల్లించిన రమేష్, ‘మొదటి విడత పోలింగు అవగానే, ఇంటలిజెన్స్ యేజన్సీలు ‘మెజారిటీలు బొటబొటీగా వుండబోతున్నాయి’ అని చెప్పాయిట. వెంటనే, కాంగ్రెస్ వారు, పోస్టల్ బ్యాలెట్ లని కొనేశారు! రాష్టృఅం లో 8 వందల పైచిలుకు పోస్టల్ బ్యాలెట్ లని కాంగ్రెస్ వాళ్ళు కొనేశారని పేపర్లలో వచ్చింది కదా? మరి అందుకే చిదంబరం, పొన్నాల లక్ష్మయ్యా, ఉండవిల్లి అరుణ్ కుమార్ మొదలైనవాళ్ళు నెగ్గారు!’ అన్నాడు రమేష్! ‘నిజమే కదా! ఆ మర్నాటివరకూ వీళ్ళందరూ వోడి పోయారనే అనుకున్నాను నేను’ అన్నాడు ఉమేష్.

Saturday, June 6, 2009

నీ కొండకు నీవే రప్పించుకో.....

కలియుగ దైవం పిలిచింది!
1975 జూన్ 19 న నా వివాహం అయ్యాక, మా మామగారి మొక్కుబడి తీర్చడం కోసం, పసుపుబట్టలతో ఆ నెల ఆఖరి వారం లో మా దంపతులం వెళ్ళాం—కలియుగ దైవం దర్శనానికి! తరవాత, 1979 లో మా స్నేహితుడి అన్న పెళ్ళికి చెన్నై వెళ్ళి, తిరిగి వచ్చేటప్పుడు, మా స్నేహితుడితో మరోసారి వెళ్ళాను ఆయన దర్శనానికి ఆ స్నేహితుడికి కంపెనీ కోసమని! మళ్ళీ మొన్న, 03-06-2009 న బయలుదేరాము—మా దంపతులం! (ఐ ఆర్ సీ టీ సీ వారి ప్యాకేజ్ పుణ్యమాని!) నా అనుభవాలు—వివరంగా—చదవండి! రైలు శ్రీపతి చేరుతుందనగా, వారి ప్రతినిధి నించి ఫోన్—ఒక్క ఐదు నిమిషాలు వేచి వుండండి ప్లాట్ ఫాం మీద—నేను వస్తున్నాను—అని! మేమిద్దరం కాకుండా ఇంకొక యువకుడు—వేచి వుండగానే, ఆ ప్రతినిధి వచ్చి, మాకు ఇవ్వవలసిన పత్రాలు ఇచ్చి, యేమి చెయ్యాలో చెప్పి, బయట టాక్సీ దగ్గరకి మమ్మల్ని తోడ్కొని వెళ్ళి, అక్కడ ఇంకొక ప్రతినిధి (గైడ్) కి మమ్మల్ని అప్పచెప్పి వెళ్ళిపోయాడు—మీరు తిరిగి వచ్చేటప్పటికి మీకోసం యెదురు చూస్తూ వుంటాను మళ్ళీ రైలు లో మిమ్మల్ని సాగనంపడానికి—అని చెప్పి! అప్పటికి ఉదయం 6.40 అయ్యింది. టాక్సీ లో మమ్మలని తీసుకెళ్ళి, ‘శ్రీనివాసం’ అతిథి గృహం లో మాకు బస యేర్పాటు చేసి, ఫలహారాలకి చీటీలు ఇచ్చి, ‘8.45 కల్లా సిద్ధంగా వుండండి—కొండపైకి వెళదాం’ అని చెప్పి, గైడ్ వెళ్ళాడు—మరొకర్ని స్వాగతించడానికి! మేము స్నానాలు, ఫలహారాలు కానిచ్చి, క్రిందకి వచ్చి, శ్రీనివాసం అతిథి గృహాన్ని ఓ సారి పరిశీలించి, సిద్ధంగా వుండగా, గైడ్, ‘ఇంకో ప్రయాణీకుడు వస్తున్న రైలు ఆలస్యం అయ్యింది సార్! ఇప్పుడే వచ్చింది! ఆయన కూడా సిద్ధం అవగానే, కలసి వెళ్ళిపోదాం—కొన్ని నిమిషాలు వేచి వుండండి’ అన్నాడు. మేము ముగ్గురం వేచి వుండగానే, నాలుగో ఆయన (ఇంకో నవ యువకుడు) రావడం, మేము నలుగురూ, గైడ్ తో కలిసి అయిదుగురం టాక్సీ యెక్కి—10.30 కి కొండపైకి బయలుదేరాము.

Monday, May 25, 2009

‘ఆదికేశవుడి.....

…………నెత్తిన సొడ్డు!'
అయిపోయింది! అక్రమంగా ఆర్జించిన పదవి వూడి పోయింది! కేంద్ర ప్రభుత్వం రద్దవగానే, ఆయన (అవిశ్వాసానికి వ్యతిరేకంగా) ఇచ్చిన ఓటు విలువ సున్నా అయిపోయింది—ఆయన ఇక ‘తసమదీయుడు’ అయిపోయాడు! అందుకే ‘అసమదీయుడు’ భూమా కరుణాకర రెడ్డి మళ్ళీ పీఠం యెక్కుతున్నాడు! తను చెయ్యలేకపోయిన, మధ్యలో ఆగిపోయిన పనులన్నీ పూర్తి చెయ్యద్దూ? (వీడు నాస్తికుడట—కానీ, పెద్దసారువాడి మత ప్రచారానికి దోహదం చేశాడు శ్రీ గిరి మీద! ఇంకా యూత్ కాంగ్రెస్ నాయకులు కొండపైకి నిషేధిత ‘అన్నీ’ తీసుకెళుతుంటే అడ్డుకున్నవాళ్ళ మీద తన ప్రతాపం చూపించాడు!) పనిలో పనిగా ఈవో రమణాచారి ని కూడా వేటు వేశాడు—వాళ్ళ వుద్యోగులచేతా, ప్రజలతోటీ కాంగ్రెస్ కి వోట్లు వేయించలేదట! (ప్రజారాజ్యానికి వేయించారని అనుమానమేమో—లేకపోతే చిరంజీవి నెగ్గడుగా!) ఇక ఆది కేశవుడి గతి? యేమో—మరో అవకాశం తలుపు తట్టక పోతుందా! చూద్దాం! బై ది బై ‘బంగారు ముష్ఠి’ లో యెంత గిట్టుబాటై వుంటుంది? దాని లెఖ్ఖలు సరిగ్గా అప్పచెపుతున్నాడా?—ఆ శ్రీనివాసునికే యెరుక!

Friday, May 8, 2009

బా బా

బా బా బ్లాక్ షీప్
ఓ పాతికేళ్ళ క్రితమే, ఆత్మలింగం పుట్టిస్తూ, దూరదర్శన్ కెమేరా ‘కన్ను’ కి నగ్నంగా పట్టుబడిన శ్రీ సత్య సాయి బాబా, అప్పటినించీ పబ్లిక్ గా మేజిక్కులు చెయ్యడం మానేశారు—అప్పుడప్పుడు ఓ రాజకీయ నాయకుడికి ఓ గొలుసో, వుంగరమో సృష్టించి ఇవ్వడం తప్ప! నిన్న మన రాష్ట్రపతి శ్రీమతి ప్రతిభా పాటిల్ ‘సకుటుంబంగా’ పుట్టపర్తి చేరగానే, ‘అత్యంత అత్మీయ స్వాగతం’ లభించిందట! తరవాత, ఓ మంత్రీ, ఇంకెవరో వారిని ‘సాయి కుల్వంత్’ హాలుకి తీసుకువెళితే, అక్కడ ‘గ్రీన్ రూం’ లో బాబా ఓ పాతిక నిమిషాలు ‘ప్రత్యేక ఆసీస్సులు’ కురిపించారట ఆ కుటుంబం పై! ఆవిడకి గొలుసులూ, వుంగరాలూ ఇచ్చిన దాఖలాల్లేవు! రాష్త్రం ఓ స్త్రీ అయితే, దానికి ఓ రాష్త్రపతి వుంటాడు. మరి ఓ స్త్రీ రాష్త్రపతి పదవికి యెన్నికైతే, ఆమెని యేమనాలి? రాష్ట్ర పత్ని అనొచ్చా? కూడదు! యెందుకంటే, ఒక స్త్రీకి మరో స్త్రీ పతిగాని, పత్ని గానీ అవడానికి చాన్స్ లేదు! ఇంకేమనాలీ? రాష్ట్ర ‘సవితి’ అంటే? అదీ తప్పే! రాష్ట్ర సోదరి అంటే? మరీ చిన్న పిల్ల అయిపోతుంది! (రాష్ట్ర పురుషులందరికీ) పోనీ రాష్ట్ర మాత అంటే? మొగ రాష్ట్రపతిని రాష్ట్ర పిత అనాలి! రాష్ట్ర దొడ్డమ్మ అంటే? ఇదేదో బాగున్నట్టుంది! చూడండి! మనలో మాట—రాష్ట్ర మాతా లాగే, మన ఆంధ్ర మాత అనుకుంటే, ఆ గౌరవం యెవరికి దక్కుతుంది? (హిందీలో రాష్ట్ర అంటే దేశ అని, తెలుగులో రాష్ట్ర అంటే మన రాష్ట్ర అనీ అర్ధం) ఇంకెవరికి—గోంగూరకి తప్ప! (మన ఆచార్య పింగళి గారన్నట్టు) గోంగూర రాష్ట్ర మాత అయితే, బచ్చలి కూర మన రాష్ట్ర దొడ్డమ్మ! తోటకూర మన రాష్ట్ర పెద్ద పిన్ని! మెంతికూర మన రాష్ట్ర చిన్న దొడ్డమ్మ! చుక్క కూరా, పొన్నగంటికూరా మొదలైనవి చిన్న పిన్నులు! యెలా వుంది?

Saturday, February 21, 2009

అక్రమార్క సేవలు

మన శ్రీ. శ్రీ. దే. లో చిరుద్యోగులు సైతం, సొంత కార్లలో కార్యాలయాలకి వస్తున్నారట! శ్రీవారి సేవల టిక్కెట్లని దొడ్డి దారిలో అమ్మేసుకొని, లక్షాధికారులు అయి పోతున్నారట! మామూలుగా రిజార్వేషనే కాకుండా ‘విచక్షణ’ కోటా కూడా వుంటుంది! ఈ విచక్షణ కోటా క్రిందే మొన్న వేలాది పాసులు జారీ చేస్తె, క్యూ లైన్లు కదలడంలేదని జనాలు అందోళన చేసి, ఆ లైన్లనే విరగ్గొట్టారు! వస్త్రాలంకార సేవకి మామూలుగా రూ.12,250/- టిక్కెట్ అయితే, విచక్షణ కోటా క్రింద రూ.50,000/- ట. మరి వీటిని రూ. లక్షకి అమ్ముకుంటే యెంత లాభం? అభిషేక సేవకి జులై 2029 వరకూ రిజర్వేషన్ లు అయి పోయాయట! వస్త్రాలంకార సేవకి ఏప్రిల్ 2020 వరకూ అయి పోయాయట! మరి మీరేమో వీ ఐ పీ! రేపే మీకు వీటిల్లో యేదో సేవకి టిక్కెట్ కావాలి. యెమి చేస్తారు? మేము యేమి చేస్తాము? యెలాగోలా మీకు ఆ టిక్కెట్లు దాఖలు చెయ్యక చస్తామా! సందట్లో సడేమియా, మేమో రెండు నొక్కేస్తాము! అన్నిటికీ ఆ పైవాడే వున్నాడు! విజిలెన్స్ వాళ్ళు కొన్ని సంవత్సరాలుగా పై అధికారుల దృష్టికి తెచ్చినా, మనకేం ఊడింది! అదండీ సంగతి!

Monday, February 16, 2009

దర్శనం

మనం అనుకున్న దర్శనాల్లో ఓ రకం దర్శనం గురించి ఇవాళ ఈనాడు (16-02-2009) లో పడింది! ఊదయ్ శెట్టి అనే ఓ కిడ్నాపర్ నేపాల్ కీ మనకీ మధ్య అగ్గిపుల్ల వేశాడు! ముంబయి లో కిడ్నాపులు, బెదిరింపులు చేసి చేసి, పోలీసులు వెంటపడగానే, నేపాల్ పారి పోయాడట! అక్కడి కిడ్నాప్ కింగ్ తో కలిసి, కిడ్నాప్ లు చేస్తున్నాడట! ఒచ్చిన మొత్తంలో ఇంత % అని శ్రీవారి హుండీ లో వేస్తున్నాడట! అదీ సంగతి! యెలాంటి డబ్బయినా, శ్రీవారి హుండీ చేరగానే పవిత్రం అయిపోతుంది సరే! కానీ ఈ పవిత్రమైన సొమ్ము కాదని, శ్రీ వారికి ముష్టి యెత్తుకోవలసిన ఖర్మ యేమిటి? ఇప్పటికైనా ఈ ముష్టి పధకం రద్దు చేస్తారా?