Monday, July 13, 2009

ఆపధ్ధర్మం

నీ కొండకు నీవే రప్పించుకో—11
ఇంతకు ముందు టపాల్లో (నీ. కొం. నీ. ర--4 లో) ఓ సూచన (హింట్) ఇచ్చాను—ఓ ఘోరమైన నిజం మీకు చెపుతాను అని—గుర్తుందా?
ఇప్పుడు చెపుతున్నాను!
నేను మొదటిసారి శ్రీపతికి వెళ్ళినప్పుడు (1975 లో) ప్రత్యేక దర్శనం టిక్కెట్టు 25 రూపాయలని గుర్తు. కొత్తగా పెల్లైన మా జంట, మా అమ్మగారితో వెళ్ళామని చెప్పానుగా!
అప్పట్లో నా వుద్యోగం విజయవాడలో—తిరుమల ఎక్స్ ప్రెస్ లో కొండ మీది దాకా టిక్కెట్ లు ఇచ్చేవారు—అలా శ్రీపతి చేరి, అక్కడ వెంటనే దేవస్థానం వారి మినీ బస్సు లో (అప్పుడు టిక్కెట్ 3 రూపాయలు అని గుర్తు!) రైల్వే వారి టిక్కెట్ తోనే కొండ మీదికి చేరాము.
(అంతకు కొద్ది రోజుల ముందే రెండో ఘాట్ రోడ్డు—పైకి వెళ్ళే ఇప్పటి మొదటి ఘాట్ రోడ్డు ప్రారంభించబడిందట).
బస్సు దిగగానే యెదురుగా దేవస్థానం వారి ‘ఉచిత సత్రం’, (అందులో వుండడానికే కాదు, వండుకోడానికి పొయ్యీ, కట్టెలతోసహా పాత్రలూ ఉచితం గా ఇచ్చేవారు—బియ్యమూ, సంబారాలూ మనమే తీసుకెళ్ళాలి), యెడం పక్కన ఓ చిన్న బూత్—అక్కడ ముగ్గురు, నలుగురు వున్న క్యూ—అక్కడ కాటేజీ లు కేటాయించేవారు—మాకు ఆ పక్కనే వున్న ‘శేషాద్రినగర్’ లో ఓ కాటేజీ కేటాయించి, ఒక రోజుకి 5 రూపాయలు అద్దెగా వసూలు చేశారు.
ఆ ప్రక్కనే ఇంకో క్వార్టరు దగ్గర ఒక పెద్ద గాడ్రెజ్ తాళం కావాలంటే, 20 రూపాయలు ‘డిపాజిట్’ కట్టమన్నారు—యెమో! మనం దైవ దర్శనానికి వెళ్ళిన సమయం లో యెవరైనా మన సామాన్లు దొబ్బేస్తారేమో అని భయపడి, డిపాజిట్ చెల్లించి, తాళం కప్పా, దానికి వున్న రెండు తాళాలూ (డూప్లికేట్ కీస్ అన్నమాటా) తీసుకొని ‘ఈ కాటేజ్ యెక్కడా?’ అని కనిపించినవాళ్ళందరినీ అడుగుతూ, పక్కనే ఓ యాభై అడుగుల దూరం లో వున్న కాటేజీ కి చేరాము.
స్నానాలు ముగించి, పెళ్ళిలో ధరించిన పసుపు బట్టలు కట్టుకొని, ఈ పక్కా ఆపక్కా వున్న చిన్న చిన్న దుకాణాల మధ్య సన్నని దారిలో, అందరు భక్తులతో గుడి దగ్గరకి బయలుదేరాము.
కోనేరులో కాళ్ళు కడుక్కొని, పైకి రాగానే, పంచే, చొక్కా వేసుకొన్న ఓ పెద్దమనిషి మా వెంట పడ్డాడు—ముగ్గురికీ త్వరగా దర్శనం చేయిస్తాను—పాతిక రూపాయలిప్పించండి—లడ్డూలు కూడా మీకెన్ని కావాలంటే అన్ని ఇప్పిస్తాను (అప్పట్లో లడ్డు ధర 2 రూపాయలు!).
‘నమ్మకమేనా?’ అని అడిగితే, ‘అన్నీ అయిన తరవాతే డబ్బులివ్వండి సార్!’ అన్నాడు. సరే అనగానే, గుళ్ళో మిమ్మలని అడిగితే, ‘నెల్లూరు నించి వచ్చామనీ, ఫలానా రెడ్డిగారి తాలూకా’ అని చెప్పమన్నాడు!
అలాగే అనగానే, మహర్ద్వారం లోపలకి తీసుకెళ్ళి అక్కడ అప్పటికే వేరే క్యూలో వున్న ఓ పదిమంది వెనకాల మమ్మల్ని నిలబెట్టాడు. ఈ క్యూని, సర్వదర్శనం క్యూలో కలిపేస్తున్నారు! మాముందువాళ్ళు కొంతమంది క్యూలోకి వెళ్ళిపోయారు.
కొంతమందిని బయటికి గెంటేశారు—అక్కడ వున్న దేవస్థానం వుద్యోగి వాళ్ళ సమాధానాలు విని, ‘అబద్ధం ఆడకండి—దేవుడి ముందు వున్నారు!' అని డబాయించగానే, నీళ్ళు నమిలారని!
నా వంతు వచ్చింది—చెప్పమన్నట్టు చెప్పగానే, ‘ఆ రెడ్డిగారు యెలా తెలుసు?’ అనడిగాడు—‘మా నాన్నగారి స్నేహితుడు’ అన్నాను. ‘నెల్లూరులో వాళ్ళ ఇల్లు యెక్కడ?’ అని అడిగితే, ‘బస్ స్టాండ్ దగ్గర పళ్ళకొట్టు ప్రక్కన రోడ్డులో వెళితే, తిన్నగా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాము!’ అన్నాను—‘సరే, వెళ్ళండి అని మమ్మల్ని క్యూలో కలిపేశాడు!
తరవాత, నిక్షేపం గా లడ్డూలు కూడా కొనుక్కొని, బయటకి వచ్చి, వాడికి పాతికా చేతులో పెట్టాను.
ఇదేదో ‘చేసిన పాపం చెపితే పోతుందని’ చెప్పలేదు—యెందుకంటే, అది పాపం కాదు—ఆపద్ధర్మం గా ఓ అబద్ధం ఆడినా, అది స్వామిని చూడడానికే కదా? పైగా, అక్కడున్నవాళ్ళు రకరకాల మార్గాల్లో ఆ క్యూలో చేరిపోతున్నప్పుడు, మనం మాత్రం దానికి విరుగుడు యెందుకు ప్రయోగించ కూడదు? ఆని!
అదీ సంగతి!

Sunday, July 5, 2009

......దర్శనాలు

సర్వ ‘సుదర్శనం’
సర్వదర్శనం సమయాలు ఓ నాలుగు ఐదు గంటలైనా పెంచాలని దేవస్థానం ఆలోచిస్తోందట!
యేకాంత సేవల కి అవకాశం కల్పిస్తారట!
ఆ ప్రకటనలో ఒక్క మాట అర్థం అయితే ఒట్టు!
అన్నట్టు మన కొత్త ఈ వో సామాన్యుడిలా వైకుంఠం కాంప్లెక్స్ లో ప్రయాణించి, భక్తుల సాధక బాధకాలు తెలుసుకున్నారట!
అది ఆదర్శం గా తీసుకొని, మిగిలిన దేవస్థానం వుద్యోగులు కూడా, అదే క్యూ కాంప్లెక్స్ లో ప్రయాణించాలని నిర్ణయించుకున్నారట!
ఇక ఆ కాంప్లెక్స్ లోని భక్తుల్ని కూడా ఆ శ్రీపతే రక్షించాలి!

Monday, June 29, 2009

శ్రీగిరి శ్రీపతి

శ్రీపతి లో చెత్త!
మేము కొండమీదికి వెళ్ళడానికి సిద్ధమై, శ్రీనివాసం అతిథి గృహం గ్రవుండ్ ఫ్లోర్ లో లిఫ్టు దగ్గర బెంచీ మీద ‘ఇంకొకాయన’ (రమేష్) వచ్చేవరకూ నిరీక్షించిన దాదాపు 40 నిమిషాల్లో, ప్రముఖం గా గమనించింది,--వరుసగా ఇద్దరిద్దరు పనివాళ్ళు నాలుగడుగుల యెత్తున్న పెద్ద పెద్ద ప్లాస్టిక్ బక్కెట్లలో పొర్లిపోతూ చెత్తని తీసుకొచ్చి బయటికి చేరవేస్తూండడం! అలా 52 కి పైగా బక్కెట్లు నేను లెక్క పెట్టాను!
ఒక్క శ్రీనివాసం లోనే అంత చెత్త ‘ఉత్పత్తి’ అవుతోందంటే, అది కూడా గదుల్లోనూ, లాకర్లు అద్దెకిచ్చే యేరియాల్లోనూ అని నా అనుమానం—ఇక కేంటినులోనూ, మిగతా చోట్లా యెంత చెత్త ఉత్పత్తి అవుతోందో కదా!
మిగిలిన అతిథి గృహాల్లోనూ, హోటళ్ళూ, మెస్సులూ, గృహాలూ, బస్ స్టాండూ, రైల్వే స్టేషనూ మొదలైన చోట్ల యెంత చెత్త ఉత్పత్తి అవుతోందా అని!
త్వరలో శ్రీపతిని యేడుకొండలవాడు అని కాకుండా, (చెత్తకొండతో కలిపి) యెనిమిది కొండలవాడు అని చెప్పుకోవాలేమో అని నా భయం!
మరి యెలాగో!

Wednesday, June 24, 2009

శ్రీగిరి శ్రీపతి

నీ కొండకు నీవే రప్పించుకో--10
అలా క్రిందకి వచ్చాక, ఇక మంగాపురానికి మన ప్రయాణం అన్నాడు గైడ్!
కానీ, మా రమేష్, తనకేదో పని వుందనీ, తరవాత వెళతాననీ, టాక్సీ దిగిపోయాడు.
మేము మంగాపురం బయలుదేరాము!
అక్కడ, మా గైడ్ ‘టిక్కెట్లు తెచ్చిస్తాను, ఈలోగా మీరు ఈ ప్రత్యేక లైను నించి గోపురం దాకా వెళ్ళి అక్కడ వుండండి’ అంటే, అలాగే వెళ్ళాము.
మేము కాసేపు వేచి వుందామనుకుంటూంటే, అక్కడ వున్న మహిళా హోం గార్డు అనుకుంటా—యెందుకు ఆగుతారు—జనం పెద్దగా లేరు కదా, వెళితే వెళ్ళిపోండి—అంది. అక్కడి నించీ రెండు క్యూలూ యెలాగా కలిసిపోతాయి కాబట్టి, మేము లోపలకి వెళ్ళిపోయాము!
అక్కడ ముఖ్యమైనది—శ్రీ కళ్యాణ వేంకటేశ్వరుని (వరదరాజ స్వామి) దర్శనం! ఆ కళ్యాణ మూర్తి ని తనివి తీరా దర్శించుకోవచ్చు! అందరూ, అసలు స్వామి కన్నా ఇక్కడే చక్కగా వున్నాడు, దర్శనమూ ఇస్తున్నాడు—అని చెప్పుకొంటున్నారు!
ఆ స్వామి అక్కడ కళ్యాణమాడాక, ఒక నెలరోజులు అక్కడే వుండిపోయాడట! ఆ తరవాత, దేవతలందరి ప్రార్థనలూ ఆలకించి, శ్రీవారి మెట్టు ద్వారా మళ్ళీ కొండపైకి చేరుకొన్నాడట!
ఇక అమ్మవారి దర్శనం కూడా చక్కగా అయ్యింది. యెందుకో అందరూ అమ్మవారి గుడి ద్వారం పైన వున్న లక్ష్మీ దేవి బొమ్మని ముట్టుకొంటూ వుండడం నాకు నచ్చలేదు!
తరవాత ప్రసాదాలు—ఇక్కడకూడా, ఒక్కో టిక్కెట్ కీ రెండు లడ్డూలు—ఇవి తొక్కుడు లడ్డూలు అని మా ఆవిడ తరవాత అంది—లోపలి వ్యక్తి ‘కవరుకి రెండు రూపాయలివ్వండి’ అని అడిగి తీసుకొని, లడ్డూలు ఇచ్చాడు. (పేరుకి రెండే అని చెప్పుకున్నా, డబ్బు తీసుకొని, యెన్ని కావాలంటే అన్ని లడ్డూలూ ఇచ్చేస్తున్నాడు!)
బయటికి వచ్చి, షరా మామూలుగా కాలుతున్న కాళ్ళతో, మా టాక్సీ యెక్కడ పార్క్ చేశాడో వెతుక్కొని, అందులో పడ్డాక, హమ్మయ్య అనుకొన్నాము.
దారిలో ఓ శిల్పారామం కనిపించింది. యెప్పుడో ప్రారంభించేశారట. అప్పుడప్పుడూ కార్యక్రమాలేవో జరుగుతాయట.
శ్రీగిరి నించి క్రిందకి దిగుతూండగా, ‘మాలవాడి గుండం’ అని ఒకటి చూపించారు—హరిజనులకి ఆలయ ప్రవేశం లేనప్పుడు, వాళ్ళు ఇక్కడిదాకా వచ్చి, జలపాతం క్రింద వున్న గుండం లో స్నానాలు చేసి, అక్కడ నించే స్వామికి మొక్కి, వెనుతిరిగేవారట! 1946 లో గాంధీగారి ఉద్యమం లో భాగం గా, కొందరు దేశ భక్తులు పోరాడి వారికి ఆలయ ప్రవేశం కల్పించారట!
వేసవికాలం కాబట్టి జలపాతం లేదుగానీ, ఇప్పుడు కూడా జలపాతమున్న రోజుల్లో పులులు నీళ్ళు తాగడానికి అక్కడికి వచ్చి, భక్తులకి కనిపిస్తాయట!
తరవాత, గరుడాద్రి కొన కొమ్ము అచ్చం నిలువెత్తు గరుడుని ఆకారం లో వుండడం నిజం గా అత్యద్భుతం!
శ్రీ గిరి మొత్తమ్మీద యెక్కడా ‘గంట ‘ శబ్దం విన్నట్టులేదు! ఇదివరకు శ్రీవారి గుడి ముందు ఒక పెద్ద గంట వుండేదని గుర్తు! ఇప్పుడెక్కడా గంటలు లేవో, అవి మ్రోగించే తీరికా, ఓపికా భక్తులకి లేవో మరి!
గోవిందరాజులు స్వామినీ, వరాహ స్వామినీ కూడా జనాలు మరిచిపోయినట్టే!
అవండీ సంగతులు!

Monday, June 22, 2009

షిరిడీయో, శ్రీపతో.....

‘……..యేమి చెయ్యాలి?’—3
ఇక రెండోదీ, ముఖ్యమైనదీ అన్నాను—అదేనండీ—మన వీ ఐ పీ ల బెడద!
దీనికేమి చెయ్యాలంటే, వీళ్ళకి ఒక స్థాయిని నిర్ణయించాలి—ఫలానా పదవిలోగాని, దానికి సమానమైన పదవిలోగానీ, అంతకు యెక్కువ హోదాలో వున్నవాళ్ళు మాత్రమే వీ ఐ పీ లు అని నిర్ధారించాలి! వాళ్ళ కుటుంబ సభ్యులు తప్ప, యెంత ముఖ్యులని చెప్పుకున్నా, వాళ్ళ తైనాతీలనీ, చెంచాలనీ, మందలనీ నిర్మొహమాటం గా మామూలు క్యూలకి పంపించాలి!
అంతే కాదు—వీళ్ళకి ఉదయం, సాయంత్రం ప్రత్యేక సమయం, ఓ గంటో, రెండు గంటలో—కేటాయించాలి. ఆ సమయాల్లో తప్ప, సాక్షాత్తూ దేశ ప్రథానీ, అధ్యక్షుడూ/రాలూ వచ్చినా, అమెరికా ప్రెసిడెంట్ వచ్చినా, ఇంతెందుకు బ్రహ్మ రుద్రాదులైనా, తరవాతి నిర్ణీత సమయం కొరకు వేచి వుండాలిసిందే!
ఆ సమయాల్లో, తనంతట తానే కదిలే ‘ట్రెడ్ మిల్’ కి ముందే సామాన్య క్యూలోని భక్తులని ఆపెయ్యచ్చు!
గర్భగుడిలోకీ, మూలబేరం ముందుకీ అర్చక స్వాములకీ, అలంకరణలు చేసేవాళ్ళకీ తప్ప ఇంకెవరికీ (ధ్యానం లో కూచుంటాను అనే వాళ్ళ లాంటి వాళ్ళకి) ప్రవేశం వుండ కూడదు!
ఇలా చేస్తే, లఘు, వీరలఘు, మహలఘు, మహావీరలఘు లాంటి వాటి అవసరం వుండదు!
కనీసం 80 వేల మంది తృప్తిగా స్వామిని దర్శించుకోగలరు!
అవునా, కాదా?

Saturday, June 20, 2009

షిరిడీయో, శ్రీపతో......

‘……..యేమి చెయ్యాలి?’—2
మొట్టమొదటిది—క్యూ లైన్లు. ఒకే మనిషి పట్టేలా, సరిగ్గా 32 అంగుళాల వెడల్పు మాత్రమే వుండేలాగ, ఆలయం బయటినించి గర్భగుడి ముందు ద్వారం దాకా ఒకే లైనూ, అక్కడ మూలవిరాట్టు ముందు నించి తిరగేసిన U ఆకారం లో మళ్ళీ వెనక్కి అదే లైను ని నడిపించి, హుండీ దగ్గరకీ, ప్రసాదాల దగ్గరికీ, అక్కడినించి బయటికీ నడిపించాలి.
క్యూ లైను ప్రాకారం లోపల గోడల పక్కనించే వెళుతుంది కాబట్టి, మధ్య మండపాలూ, ఇతర ప్రాంగణాలూ అన్నీ ఖాళీగా వుంటాయి! మిగిలిన చిన్న చిన్న మందిరాలు కూడా క్యూ లైను లోంచే దర్శించుకొనే యేర్పాటు చెయ్యచ్చు!
ఇంకా, తిరగేసిన U ఆకారం మొత్తాన్ని సరిపోయిన వేగం తో నడిచే ‘ట్రెడ్ మిల్’ లాంటిది బిగించ వచ్చు. అప్పుడు జనాన్ని తోసెయ్యడం, దొబ్బెయ్యడం వంటి వాటి అగత్యం వుండదు!
‘అయ్యా—ఇంతంత పెద్ద క్యూ కాంప్లెక్స్ లు వుంటేనే అవన్నీ నిండిపోయి, ఇంకా కిలోమీటర్ల దూరం క్యూ వుంటుందే, ఇదెలా సాధ్యం?’ అంటారు కదూ!
సాధ్యమే! ఆలయం బయట చాలా జాగా వుంటుంది కదా? అక్కడ లైనుని వీలైనంతదూరం ముందుకీ, అక్కడనించి ఆ పక్కనే మళ్ళీ వెనక్కీ, మళ్ళీ ఆ పక్కనించి ముందుకీ ఇలా నడిపించుకుంటూ వెళితే, కొన్ని కిలోమీటర్ల క్యూ తయారవుతుంది! (ద్వారకా తిరుమల గుడి ముందు ఇలాంటి క్యూ వుంటుంది!)
ఇంకా చాలకపోతే, నగరాల్లో యేర్పరుస్తున్న ‘అండర్ గ్రవుండ్ పార్కింగ్ లాట్’ ల లా కొన్ని అంతస్తులుగా నడిపించవచ్చు—ఇంకా కావాలంటే లిఫ్టులు కూడా యేర్పాటు చెయ్యవచ్చు! వాటిలోనే ‘టాయిలెట్’లు అవీ అవసరం అయిన చోట్ల యేర్పాటు చెయ్యవచ్చు! ఆలయం ముందు భాగంలో, అవసరమైతే అండర్ గ్రవుండ్ లో ఇవి వుంటాయి కాబట్టి, ఆలయ పవిత్రతకేమీ భంగం రాదు!
ఇంక మహర్ద్వారం దగ్గరా, మిగిలిన గుమ్మాలూ, వాకిళ్ళ దగ్గరా యెలాగంటారా? నిక్షేపం గా, రోడ్ల మీద ట్రాఫిక్ ని మళ్ళించడానికీ, నియంత్రించడానికీ ఉపయోగించే మొబైల్ ఇనుప చట్రాలలాంటి వాటిని ఉపయోగించుకోవచ్చు! (క్యూల లో తలుపు ముయ్యడానికీ, గొలుసులు తొలగించి మళ్ళీ తగిలించడానికీ ఇప్పుడుంటున్న వాళ్ళందరి చేతా ఆ మొబైల్ చట్రాలని గెంటించ వచ్చు కూడా! ఇంకా గర్భగుడి ముందు వరసగా నించుని ‘దొబ్బుతారు!’ ‘కదులు, కదులు’ అనేవాళ్ళకి కూడా వేరే ఉపయోగమైన పనులు చెప్పచ్చు!)
వీటంతటికీ ఖర్చు సంగతో? అంటారా—రాతి గోడలకీ, స్థంభాలకీ బంగారు తాపడం చేయించడానికి అయ్యే ఖర్చు ముందు ఇదెంత!
ఇక పని జరుగుతున్న రోజుల్లో ప్రజల దర్శనం సంగతో? అంటారా—పని జరిగేది ఆలయం బయటే కాబట్టి, ప్రస్తుతం వున్న యేర్పాటు కొనసాగుతూనే వుంటుంది కాబట్టి యే విధమైన ఇబ్బందీ వుండదు!
ఇంకా యేమైనా సందేహాలుంటే, వ్రాయండి, పరిష్కారం చూపిస్తాను!
ఇక ఇలాంటివి ‘శ్రీగిరి’ పైనే కాదు, శబరిమల అయినా, ఇంకో గిబరిమల అయినా, షిరిడి అయినా, ఇంకో బొరిడీ అయినా, అన్ని ఆలయాలవద్ద యేర్పాటు చెయ్యచ్చు!
యేమంటారు?
(రెండో పాయింటు—ముఖ్యమైనదీ—తరవాయి)

Friday, June 19, 2009

షిరిడీయో, శ్రీపతో......

‘……..యేమి చెయ్యాలి?’
లక్షలమంది వచ్చిపడిపోతుంటే యేమిచెయ్యాలి?
ఆది నించీ జనాలని గొఱ్ఱెలతో పోల్చారు! (ఇలా అంటే కోపమొచ్చే జనాలు కూడా వున్నారు!)
ఓ నలభై అయిదు—యాభై యేళ్ళ క్రితం చదువుకున్న కథ బాగా గుర్తు వుండి పోయింది! ఇది అందరికీ తెలిసిన కథే!
నాకు పూర్తిగా గుర్తులేదుగానీ—‘సైక్లోప్స్’ అనే రాక్షసుడు ఓ దీవిలో వుంటాడు. వాడికి నుదుటి మీద ఒక్క కన్నే వుంటుంది! వాడు రోజూ తన బోళ్ళన్ని గొర్రెలని తన నివాసమైన పెద్ద గుహలో రాత్రంతా బంధించి వుంచి, పగలు మేపడానికి బయటికి వదులుతూ వుండేవాడు. ఇంకెవరైనా పొరపాటున ఆ దీవికి వస్తే, వాళ్ళని కూడా ఆ గుహలో బంధించి, ఆకలేసినప్పుడు వండుకు తినేసేవాడు!
ఒక సారి, ‘యులిసెస్’ అనేవాడొకడు (ఇంకొంత మందితో అనుకుంటా) యెలాగో ఆ దీవి లో చిక్కుకుపోతాడు. ఇంక మర్నాడో యెప్పుడో వీడి వంతూ వస్తుందనగా, ఒకరోజు రాక్షసుడు నిద్రపోతూ వుండగా, కాలుతున్న కొఱకంచు తో వాడి ఒక్క కన్నునీ పొడిచేస్తాడు! తెల్లవార్లూ కష్టపడి, ఓ ప్లాను వేసి, వాడి బారినించి పొద్దున్నే తప్పించుకుంటాడు!
అది యెలాగంటే, గొఱ్ఱెలని ఒకదానిపక్క ఒకటిగా మూడేసి చొప్పున తీగలో యేవో వుపయోగించి కట్టేస్తాడు. (గుహ ద్వారం మూడు గొఱ్ఱెలు పక్క పక్కన వెళ్ళడానికే సరిపోతుంది!) తాను వాటిల్లో ఒక మూడింటి మధ్యన వుండే గొఱ్ఱె పొట్టకి క్రిందుగా తనను తాను కట్టేసుకుంటాడు! సైక్లోప్స్ పొద్దున్నే గుహద్వారం తెరిచి, ఓ పక్కగా కూర్చొని, గొఱ్ఱెల్ని బయటికి వదిలి, వాటి మీద యెవరూ బయటి పోవడం లేదు అని నిర్ధారించుకోవడానికి వాటి వీపులు తడుముతూండగా, మూడు వరసల్లో గొఱ్ఱెలన్నీ బయటికి నడవగానే, మనవాడు కట్లు విప్పుకొని ఒకటే పరుగు—సముద్రం చేరేదాకా—‘బ్రతుకు జీవుడా’ అనుకుంటూ!
తరవాత, ‘అతను జీవితాంతం సుఖం గా బ్రతికాడు’ (ట)!
ఇంతకీ, ‘ముగ్గురు నలుగురు పట్టే క్యూలు ’ అంటే, నాకు సైక్లోప్స్ గుహ ద్వారమే గుర్తుకు వస్తుంది! వాటిల్లోంచి, యెవరైనా (టెర్రరిష్టులతో సహా) తోసుకు పోవచ్చు కదా! అవసరమైతే ముందున్న వాళ్ళని క్రిందపడేసుకుంటూ, వాళ్ళ శరీరాల మీద నించి తొక్కుకుంటూ!
మరి ‘భద్రతా గురు ‘ లకి, సోకాల్డ్ ‘నిపుణులకి’ ఇంత చిన్న విషయం యెందుకు తట్టదో నాకైతే తెలియదు!
ఇంతకీ ‘యేం చెయ్యాలి?’ అంటారా! వస్తున్నానక్కడకే! వేచి వుండండి!