Sunday, October 24, 2010

శ్రీగిరి శ్రీపతి

శ్రీవారి డాలర్లు

శ్రీవారి డాలర్ల కొరత త్వరలో తీరనుందట. తి తి దే ఆర్థిక సలహదారు, ముఖ్య నిఘా భద్రతాధికారీ ముంబాయిలోని మింట్ కు వెళ్లి, 600 కిలోల బరువుగల డాలర్లని సరఫరా చెయ్యడానికి యేర్పాట్లు చేసి వచ్చారట.

ఆంధ్రా బ్యాంకు ద్వారా 10, 5, 2 గ్రాముల డాలర్ల విక్రయానికి యేర్పాట్లు చేశారట. మరో రెండు సంవత్సరాల అవసరాలకి అవి సరిపోతాయట.

హుండీకి చేరే బంగారాన్ని స్టేట్ బ్యాంకులో వడ్డీకి డిపాజిట్ చేస్తున్నారనీ, అలా ఇప్పటికి 'వెయ్యి కిలోల' బంగారాన్ని డిపాజిట్ చేశారనీ వార్త వచ్చింది. అది ఆభరణాల రూపం లోనా, ఇటుకలూ, బిస్కెట్ల రూపం లోనా తెలియరాలేదు!

Tuesday, October 12, 2010

శ్రీగిరి శ్రీపతి

"కంచి" కిరీటం

మన కంచి పీఠం స్వామికి బాగా "డబ్బు" చేసేసిందనుకుంటా--యెలా తగ్గించుకోవాలో యెవరూ చెప్పట్లేదేమో!

2.5 కోట్లతో, 14.5 కిలోల బంగారం, వజ్రాలతో వెంకన్నకి ఓ కిరీటం చేయించారట.

రేపు 21 న అందజేస్తారట.

(మళ్లీ రేపు తి తి దే నుంచి యే పథకం కోసం యెంత టెండరు పెడతారో?)

Sunday, October 10, 2010

శ్రీగిరి శ్రీపతి

డాలర్ల కొరత

తి తి దే వద్ద నిల్వలు లేకపోవడం తో రెండు నెలలుగా ఐదు గ్రాముల డాలర్లు విక్రయించడంలేదట.

గతం లో శ్రీవారి హుండీ ద్వారా వచ్చిన చిన్నా చితకా ఆభరణాలని, రాళ్ళు అవీ తొలగించి, బంగారాన్ని కరిగించి మింట్ లో డాలర్ల ముద్రణా, సరఫరా జరిగేవి.

ఇప్పుడు బంగారం కరిగింపులో అక్రమాలు జరుగుతున్నాయని, ఈ వో కృష్ణారావుగారు బంగారాన్ని బ్యాంకుల్లో వడ్డీకి డిపాజిట్ చెయ్యడానికే మొగ్గు చూపారట. అందుకే కొరత అంటున్నారు.

మరి అన్ని వేలో, లక్షలో చిన్నా చితకా ఆభరణాలని యే యే బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తున్నారో, వాటి వివరాలు యెక్కడ యెలా నమోదు అవుతున్నాయో--పత్రికలు వ్రాయలేదు.

బంగారం ఇవ్వఖ్ఖర్లేకుండా, మింట్ వారే వారి బంగారం తో డాలర్లు తయారు చేసి సరఫరా చేసేలా వొప్పందాలకి ప్రయత్నాలు జరుగుతున్నాయట.

ఈ ప్రయత్నాలు ఫలించకపోతే, డాలర్ల విక్రయం పూర్తిగా నిలిచిపోయే అవకాశం వుందట!

అసలు ఈ డాలర్ల పథకం యెవరిని వుధ్ధరించడానికి?

యేమో! స్వామికే తెలియాలి!

Friday, October 1, 2010

ఆర్జితపాపం

ఆరు పిడికెళ్లే

ఆర్జిత సేవల టిక్కెట్ల కుంభకోణం లో "ఆ ముగ్గురిదే" హవా అని దేవస్థానం నిఘా సంస్థ నిగ్గు తేల్చిందట. వీళ్ల హవా
కూడా--చైర్మన్ గారి తరవాతేట! (పాపం ఆయన్నేమీ అనకూడదట లెండి--వీళ్ల ముగ్గురిమీదే చర్యలు తీసుకోవాలట.)

గత రెండేళ్లలో 14 మంది బోర్డు సభ్యులకి విచక్షణకోటా క్రింద లభించే టిక్కెట్లలో, ఆది కేశవుడు 16,463 టిక్కెట్లు
మంజూరు చేయించుకోగా, సుబ్రహ్మణ్యం 8,800; అంజయ్య 8,539; యాదయ్య 6,962; మాత్రమే మంజూరు చేయించుకొని, యేజంట్ల ద్వారా అమ్ముకునేవారట.

వాళ్ల పీయే ల ద్వారా, యేజంట్లనించి ప్రతీ నెలా లక్షల్లో ముట్టేవట వీళ్లకి ఈ సేవా టిక్కెట్ల రూపం లో!

ఇక బ్రేక్ దర్శనాల్లో, ముఖ్యమంత్రి కార్యాలయం, మంత్రులు, ఎం పీలు, ఎమ్మెల్యేలూ వగైరా అందరి కోటా కలిపి 600 కి మించలేదట. కానీ సాయంత్రం బ్రేక్ కి మొత్తం 14 మంది సభ్యులూ 1,33,974 టిక్కెట్లు మంజూరు చేయించుకుంటే,
ఆదికేశవుడితో సహా ఈ ముగ్గురికీ 73,823 మంజూరయ్యాయట.

వుదయం బ్రేక్ కి అయితే, రెండేళ్లలో ఈ నలుగురి కోటాలోనూ వరుసగా 71,624; 31,779; 27,369; 24,611 మంజూరయ్యాయట!

వెంకన్నా! ఈ లెఖ్ఖలన్నీ అర్థమవుతున్నాయా? కుబేరుడికి వడ్డీ యెక్కువ కట్టేస్తున్నావేమో చూసుకో!

ఈ మధ్యనే సెంట్రల్ సర్వీసుకి వెళ్లడానికి వొప్పుకొన్న రాష్ట యెన్నికల ప్రథానాధికారి ఐ వీ సుబ్బారావు, గతం లో
దేవస్థానం ఈ వో గా పనిచేసిన అనుభవం తో, "సుదర్శన కంకణాన్ని తిరిగి ప్రవేశపెట్టాలనీ", "సుపథం పేరుతో
'కదిలే తివాచీ' యేర్పాటుచేసి, మహర్ద్వారం ముందుభాగం నించి సన్నిధిని కలుపుతూ తిరిగి వెలుపలకి చేరుకొనేలా
అమర్చాలనీ, అవసరాన్నిబట్టి వేగాన్ని తగ్గించడం పెంచడం చేయచ్చనీ," రెండు విలువైన సూచనలు చేశారు.

(ఇవన్నీ ఇదివరకు మనం అనుకున్నవేకదా?)

మరి ఆలకించేవాడేమంటాడో?

Friday, September 10, 2010

శ్రీగిరి శ్రీపతి

అదే తీరు


చిరుతపులి తన మచ్చల్ని మార్చుకోగలదా? 

యెడం చేయి తీసి పుర్ర చెయ్యి పెడితే యేమైనా తేడా వుంటుందా?

ముల్లూపోయి కత్తీ వచ్చే......లో యెన్ని పోతే కథ పూర్తవుతుంది?

పాలక మండలి పోయి, సాధికార మండలి వస్తే యేమైనా మారుతుందా?

యేమో మరి!

ఏకగవాక్ష విధానం కోసం "శ్రీ-సేవ" పేరుతో ఓ నాలుగంతస్తుల భవనాన్ని నిర్మిస్తారట. రాష్ట్రం లో వివిధ ప్రాంతాలతోపాటు, తమిళనాడు, కర్ణాటకల్లో మొత్తం ఓ 50 శ్రీ-సేవ కేంద్రాలు యేర్పాటు చేస్తారట!

కొండమీద ధ్యాన మందిరాలు కట్టిస్తారట!

(భద్రాచలం లో కొండమీదే ఆలయం ప్రక్కన కట్టిన "శ్రీ రామదాసు ధ్యాన మందిరం" ఇప్పటివరకూ యెందుకూ వుపయోగపడిన దాఖలాలు లేవు--అలాగే శిధిలం అయిపోతూంది.)

అయినా అభివృధ్ధికల్లా మూలం బిల్డింగులు కట్టడమేనా?

సరే--మహాలఘువుని రేపు ఒకటో తారీకు నించీ రద్దు చేశామని ఇప్పటికే ప్రకటించారు కదా? మళ్లీ ఇప్పుడు దర్శనాలపై "పునః సమీక్ష" చేస్తామనడం యేమిటి?

కొన్ని రోజుల్లోనే ఈ మార్పుకి కారణం యేమిటి?

యేమీ లేదు--వీళ్లు రోశయ్యగారితో సమావేశం లో పాల్గొన్నారట. ఇంకా అందులో మంత్రులు గాదె వెంకట రెడ్డి, దానం నాగేందర్, ప్రథాన కార్యదర్శి ఎస్ వీ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారట!

ఇదేదో విక్రమార్కుడి సిం హాసనం కథ లాగ.....!

అదండీ సంగతి!



Friday, September 3, 2010

శ్రీగిరి శ్రీపతి

సామాన్యుడికి కాస్త వూరట

కొన్ని నిర్ణయాలు క్షణాల్లోనే జరగాలి. సంవత్సరాల తరబడి లాక్కుంటూ, పీక్కుంటూ కూర్చుంటే ప్రయోజనం వుండదు.

సాధికార మండలి మొదటి సమావేశం లోనే మంచి నిర్ణయాలు వెలువడ్డాయి.

మొదటిది--మహాలఘు దర్శనం రద్దుచెయ్యాలని.

సామాన్యులకి మూడురకాల దర్శనాలు అమల్లో వున్నాయి ఇన్నాళ్లూ.

లఘు దర్శనం--అంటే, స్వామికి దగ్గరగా వుండే మొదటి ద్వారం కాకుండా, రెండో ద్వారం దగ్గర దర్శనం కలిగించి, పంపించెయ్యడం.

మహాలఘు దర్శనం--అంటే, రెండోది కూడా కాకుండా, జయ విజయులు కాపలా వుండే మూడో ద్వారం దగ్గరనించే పంపించివెయ్యడం.

మహావీర లఘు దర్శనం--అంటే, మూడో ద్వారం దగ్గరకూడా నిలబడనియ్యకుండా, నెట్టేయడం/ఈడ్చెయ్యడం.

ఇప్పుడు మహా లఘువుని రద్దు చేస్తే, మహావీర లఘువు కూడా ఆటోమేటిగ్గా రద్దవుతుంది.

ఇక మిగిలేది లఘువు మాత్రమే! 

చూద్దాం, ఇదెలా వుంటుందో!

ఇక ఆర్జితసేవల కరెంటు బుక్కింగ్ మొదలెడతారట రేపు ఒకటో తారీఖు నించీ.

సుప్రభాతం, కల్యాణోత్సవం, నిజపాద దర్శనం లకి, ఒక్కోదానికీ 100 చొప్పున 300 టిక్కెట్లు వుదయం 8.00 నించీ, ముందు వచ్చినవారికి ముందు పధ్ధతిలో జారీ చేస్తారట.

ఊంజల సేవకి 10, సహస్రదీపాలంకరణకి 70, ఆర్జిత బ్రహ్మోత్సవానికి 25, వసంతోత్సవానికి 25 వంతున 135 టిక్కెట్లు జారీ చేస్తారట.

గుడ్డిలో మెల్లగా, డబ్బులు చెల్లించగల సామాన్యులకి ఇది మేలేగా?

ఇక ఆన్ లైన్ బుకింగులు మామూలేననుకుంటా.

సాధికార మండలి కొంచెం ముందుకెళ్లి, ఈ సేవల్ని పూర్తిగా రద్దుచేసే రోజొస్తే బాగుండును.

ఇంకా, ఈ ప్రమాణ స్వీకారాలు గుడిలో జరగకుండా నిరోధిస్తే ఇంకా బాగుండును.

ఇలా చేస్తే, లఘువుని కూడా రద్దు చేసి, మొదటి ద్వారం (కులశేఖరపడి) నుంచే అందరికీ, వీ ఐ పీ లతో సహా, చక్కగా దర్శనం కల్పించవచ్చు.

స్వామి ఇంకెప్పుడు కరుణిస్తాడో సామాన్యుల్ని!

Friday, August 20, 2010

తితిదే పాలక మండలి

శుభవార్త

ఇప్పటికి రాష్ట్ర మంత్రి మండలి, ప్రస్తుత తితిదే పాలక మండలి గడువు ముగిశాక, కొత్తగా యెవరినీ నియమించకుండా, ఓ ప్రత్యేక అధికార సంస్థ (అథారిటీ) యేర్పాటు చెయ్యాలని  నిర్ణయించిందట.

ఇప్పటికిది శుభవార్తే మరి. ఆ సంస్థ యెలా వుంటుందన్నది తరవాత సంగతి.

ఈ లోగా ఆదికేశవుడు మొయిలీ దగ్గరనించి ప్రణబ్ వరకూ; అహ్మద్ పటేల్ నించి సోనియా వరకూ వినతిపత్రాలు ఇచ్చుకుంటూ వస్తున్నాడట--తనకి ఇంకో అవకాశం ఇవ్వాలని! (ఆయనకి పగ్గాలు అప్పగించిన ఆసలు ఒప్పందం లో ఒకసారి అని వుందో, రెండుసార్లు, లేదా ఆయన జీవితకాలం అని వుందో తెలియదు మరి)

ఇక, ఆర్జితసేవా టిక్కెట్ల కుంభకోణం లో--ఇది గత నాలుగేళ్లుగా సాగుతోందనీ, పాలక మండలి సభ్యులు యాదయ్య, అంజయ్య, సుబ్రహ్మణ్యం అనేవాళ్లతో సహా మొత్తం 54 మంది  దీనికి బాధ్యులు అని వారి విజిలెన్స్ శాఖ నిర్ధారించి, వారిమీద చర్యలు తీసుకోమని నివేదిక ఇచ్చిందట.

ఇందులో, యాదయ్య, అంజయ్య--బలహీన వర్గాలకి చెందినందువల్లే తమని ఇరికించారని ఆరోపించారట! మరి నివేదికలోని మిగిలిన పాలకవర్గ సభ్యుల కులాలేమిటో మనకు తెలియదు.

(ప్రభుత్వ, ప్రభుత్వ సంస్థలేకాదు--మిగిలిన సంస్థల్లోకూడా, సహజం గా వాళ్ల విజిలెన్స్ శాఖలో, మేనేజిమెంటు యెవరిని నొక్కెయ్యమంటే వాళ్లని నొక్కేసే తొత్తులు వుంటారనుకోండి.)

నిజానిజాలు శ్రీవారికే తెలియాలి.

కొసమెరుపేమిటంటే, సూర్యనారాయణ రెడ్డి, కస్తూరి రంగన్ అనే తితిదే వుద్యోగులు ఈ తరహా కుంభకోణానికి పాల్పడుతున్నారని విజిలెన్స్ సంస్థ 2008 లోనే నివేదిక ఇచ్చినా, అప్పటి ఈవో అది బుట్టదాఖలు చెయ్యడమే కాకుండా, వాళ్లకి పదోన్నతులు ఇచ్చారని ఈ నివేదికలో పేర్కొన్నారట!

అదండీ సంగతి!