Saturday, May 7, 2011

శ్రీగిరి శ్రీపతి



.....దర్శనాలు

మూడేళ్లకి పైగా మనం మొత్తుకుంటూంటే, ఇప్పుడు ఈవోగారు స్వయంగా అదేదో "మూవింగ్ ప్లాట్ ఫామ్" (తెలుగులో కదిలే తివాచీ అంటున్నారు) ని స్వయంగా పరీక్షించారట--శ్రీవారి "నమూనా" దేవాలయంలో! 

ఆ తివాచీ మీద 12 మంది వెళ్లి, (వాళ్లే దాన్ని నడుపుకొంటూనో....డ్రైవరు వుండాలో?) కేవలం 10 నుంచి 20 సెకన్లలో శ్రీవారి దర్శనం చేసుకోవచ్చట. "మహాలఘు" రోజుల్లో దీన్ని ప్రవేశపెట్టచ్చేమో అని వారి ఆలోచనట!

దాని ఖరీదెంతో, ఓ లక్ష మందికి దర్శనం కల్పించడానికి అలాంటివి యెన్ని కావాలో, ఒకటే అనేక "ట్రిప్పులు" వేస్తుంటే, ఓ ఇరవై గంటల్లో (ఓ నాలుగ్గంటలు శ్రీవారిని నిద్రపోనిచ్చినా) యెంతమంది దర్శనం చేసుకోగలరో......వగైరాల లెఖ్ఖలకి మీ క్యాలిక్యులేటర్లు బయటికి తీయండి. (కేవలం 37,200 మంది మాత్రమే అని జవాబు వస్తుంది!)

పైగా, దాన్ని యెక్కడనుంచి యెక్కడవరకూ ప్రవేశపెడతారో తెలీదు. మహర్ద్వారం నుంచా, ధ్వజ స్థంభాలనుంచా, ఆళ్వారులనించా, అదేదో పడి నుంచా, జయవిజయులనుంచా.....యేమో!

మరి దారిలో వుండే యెత్తుపల్లాలమాటేమిటి? మెట్ల మాటేమిటి? ద్వారాల తలుపులు మూయవలసి వస్తే మాటేమిటి? 

ఈవోగారు కాదేమోగానీ, యెవరో యెవరితోనో "కుమ్మక్కయ్యారు" అనిపించడంలేదూ?

అప్పుడే టీవీలవాళ్లు అది "ఆగమ శాస్త్రానికి విరుధ్ధమా?" అని చర్చ. కొంతమంది పండితులు ఖచ్చితంగా విరుధ్ధమే--యెందుకంటే, శ్రీవారి దర్శనం "భూమి మీద నిలబడే" చేసుకోవాలి అంటూ! (అక్కడికి ఆ ప్లాట్ ఫామ్ యెక్కినవారు యేదో అంతరిక్షంలోకి వెళ్లిపోయినట్టు!)

అసలు "ఆగమ శాస్త్రాలకీ", దర్శనం చేసుకొనే భక్తులకీ సంబంధం యేమిటి?

ఈవోగారూ! ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలకి అనుమతించవద్దు. 

మాక్కావలసింది--ఓ "కన్వేయర్ బెల్ట్" లాంటిది--మహర్ ద్వారం గుండా--అవసరమైతే, వెయ్యికాళ్ల మండపం వుండే స్థానంలో బహుళ అంతస్తుల అండర్ గ్రవుండ్ క్యూలైన్లు కట్టి అయినాసరే! (దీంట్లో వున్న సౌలభ్యం ఇంకోటి తెలుసా? భక్తులు తమ "పృష్ట" భాగాన్ని శ్రీవారికి చూపించరు! మహమ్మదీయులు తమ "దర్గా"లలో ఇలా యెవరినీ అనుమతించరు! భక్తులు "వెనక్కి" నడవాల్సిందే!)

యెన్ని గంటలూ, యెంతమందీ లెఖ్ఖలు కాదు. 

వెంటనే ప్రణాళిక రచించండి. లేదా రచింపచెయ్యండి! (చేతకాకపోతే--సో కాల్డ్ ఆగమ పండితుల్ని కాదు--ఎల్ & టీ వారినో, జీ ఎం ఆర్ వారినో సంప్రదించండి! ఆ మాత్రం ఖర్చు స్వామి భరించగలడు!)

వింటారా?

Tuesday, April 12, 2011

శ్రీగిరి శ్రీపతి




......వుత్సవాలు


"పార్వేట" వుత్సవాలు నిషేధించాలి.

శ్రీనివాసుడు క్షత్రియుడు. ఆయన ఆ రోజుల్లో, కౄర మృగాలని వేటాడేవాడు. "కౄర" అంటే ఇప్పటి ఇంగ్లీషులో "వైల్డ్" అని. యేనుగు కౄర మృగమా? అప్పట్లో అవును. యెందుకంటే, యెంత శాకాహారి అయినా, మదం యెక్కినప్పుడు విచక్షణలేకుండా అందర్నీ తొక్కేస్తుంది. అందుకని దాన్ని వేటాడవచ్చు!

మరి ఇప్పుడు? కలప అక్రమ రవాణాతోపాటు, నేటి "క్షత్రియులు" (ఆ కులాన్ని అనడం లేదు) కుందేళ్లనీ, నెమళ్లనీ, లేళ్లనీ, నీటి కొంగల్నీ--ఇలా అన్నిటినీ వేటాడి, ఆనందిస్తున్నారే! వీళ్లకేమి రోగం?

నిస్సహాయుల్నీ, అసహాయుల్నీ వేటాడడం తప్పు. అందుకనే ఈ "పార్వేటల్ని" నిషేధించాలి.

రేపు రాయపాటి వస్తే యేమి జరుగుతుందో చూస్తూనే వుందామా? లేక "ఈజిప్టు" తరహా యేమైనా.......?

(ప్రతీవాడికీ ఇదొకటి లోకువ అయిపోయింది. ప్రతీచోటా "ఈజిప్టు" తరహాకి అమెరికా అన్ని కోట్ల డాలర్లు పెట్టుబడి పెట్టగలదా??!! అని ఆలోచించరు!)

==> తితిదే "దాస సాహిత్య" ప్రాజెక్టు ప్రత్యేకాధికారి పగడాల ఆనందతీర్థాచార్యులు ప్రతి జిల్లాలో భజన మండళ్లు, కోలాట బృందాలు యేర్పాటు చేస్తారట. బృందంలోని వారికి ధోవతి, పంచె (!!??), భజన సామాగ్రి అందజేస్తారట. కర్ణాటకలో ఇప్పటికే యెక్కువ సంఖ్యలో భజన మండళ్లు యేర్పాటు చేశారట! దేవుడిసొమ్ము--పిచ్చి ప్రాజెక్టుల పాలు అనాలేమో!

Wednesday, January 12, 2011

శ్రీగిరి శ్రీపతి

(ప్రసాద) లడ్డూలు

ఆ మధ్య శ్రీవారి లడ్డూలు "వుప్పు కషాయం"గా వున్నాయని ఓ ఫిర్యాదు రాగా, ఓ 600 లడ్డూల్లో ఆ విషయం నిజమేనని తేల్చి, అమ్మకం ఆపేశారట. సంబంధిత కాంట్రాక్టరు, ఓ ఇరవై పైగా యేళ్లనించీ లడ్డూలు చేయిస్తున్నా, ఇలా యెప్పుడూ జరగలేదు అన్నాడట. సరే.

సంబంధిత అధికారులు కొంతమంది, 'వుగ్ర్తాణం లోంచి పొరపాటున చక్కెరకి బదులు వుప్పు తెచ్చివుంటారు' అనీ, 'వుగ్రాణంలో వుప్పు ప్రసక్తిలేదు....గోవిందస్వాములు తమ ఇరుముడిల్లో తెచ్చిన వుప్పునే ఆ లడ్డూల్లో వాడి వుంటారు' అనీ--ఇలా పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేస్తున్నారు.

వుగ్రాణంలో 'రాళ్ల'వుప్పు వుంటుందా? పొడి వుప్పు వుంటుందా? చక్కెర 'ముడిగా' వుంటుందా, పొడిగా వుంటుందా? 20 యేళ్లకి పైగా లడ్డూలు చేస్తున్నవాళ్లకి--రాళ్ల వుప్పుకీ, ముడి చక్కెరకీ, మెత్తటి వుప్పుకీ, మెత్తటి చక్కెరకీ తేడాలు తెలియవా? 

సరే.....గోవిందస్వాములు యెన్ని కేజీల వుప్పుని సమర్పించారు? యెక్కడ? అది వుగ్రాణానికి యెలా చేరింది? అలాకాదు అంటే, నేరుగా ఆ పోటు కాంట్రాక్టరుకెలా చేరింది? లడ్డూల్లోకెలా చేరింది? ఇవన్నీ ప్రశ్నలే!

ఇవాళ లడ్డూల్లో 'మేకులు' వచ్చాయంటున్నారు! సంబంధిత కాంట్రాక్టరు, 'లవంగాలనుకొని, మేకులు తెచ్చారు' అంటాడేమో!

చూద్దాం! 

ఈవోగారూ! నాలుగుకళ్లతో పరిశీలిస్తారా?

Saturday, January 8, 2011

శ్రీగిరి శ్రీపతి

.....దేవస్థాన లీలలు

తిరుపతి-షిర్డీ భాయి భాయి బాగానే కొనసాగిస్తున్నారు. నూతన సంవత్సరం సందర్భంగా (టిక్కెట్టు తీసుకునే) ప్రత్యేక దర్శనాలని రద్దు చేశారు.

అన్నట్టు సాయి మందిరానికి రూ.32 కోట్ల విలువైన ఆభరణాలు వున్నట్టు ఆడిట్ వాళ్లు తేల్చారట. వార్షిక అదాయం 164 కోట్లట!

గత కొన్నేళ్లుగా మాత్రమే ఆభరణాలు వస్తున్న సాయికే 32 కోట్లు వుంటే, కొన్నివందలయేళ్లుగా వున్న స్వామికి కేవలం 51 కోట్లే మరి! 

సంతోషిద్దాం.....ఇప్పటికైనా అని.

శ్రీవారి బంగారు తాపడం చేసిన రథానికి వుండే స్వచ్చమైన బంగారంతో చేసిన, కోటి రూపాయలు విలువ చేసే 'గొడుగు' ని, రథం వున్న రేకుల మండపం దక్షిణవైపు రేకుని 'కత్తిరించి' యెవరో దొబ్బేశారట! అదికూడా, ఆ ప్రక్కనే జరుగుతున్న పెద్దజీయర్ మఠం కార్మికులు చెపితే, అధికారులకి తెలిసిందట! యెంత భద్రతో కదా?!

పైగా, నిన్న 07-01-2011 న, 'మహా అయితే ఆ రేకుల గొడుగు విలువ ఓ నలభై వేలే వుంటుంది.....రేపు రథ సప్తమికల్లా ఓ కొత్త గొడుగు చేయించి పారేస్తామంటున్నారు అధికారులు!' అని హామీ ఇస్తూ, పుండుమీద కారం చల్లుతున్నాడు రాష్ట్ర శాసన మండలి 'హామీల కమిటీ' అధ్యక్షులు బత్యాల చెంగల్రాయుల వారు! (యెన్ని కోట్లతో చేయిస్తారో చెప్పలేదు.....మామూలుగానే!)

యేడూ కొండల స్వామీ.......!

....................................................................................................................................................................

ప్రకటన :

శ్రీ దత్త చరితం

తొలి జగద్గురువు, విఙ్ఞానపు కాంతులను విరజిమ్మిన క్రాంతి పుంజం, అత్రి, అనసూయల గర్భ సుక్తి ముక్తాఫలం--శ్రీ దత్తాత్రేయుడు. ఆపురూప గురుహారం ఈ శ్రీ దత్త చరితం. 

ఈ డాక్యుమెంటరీ కి నిర్మాత, కెమేరామన్ : చిట్టావఝల కృష్ణ; వ్యాఖ్యనం/దర్శకత్వం : చక్రావధానుల రెడ్డప్ప ధవేజీ; సంగీతం/గానం : గోగులమండ రాజు & మోహిని కుమారి; సహ నిర్మాత : సవరం కృష్ణానందం. ప్రవచనం : 'భారతీపుత్ర ', కడిమెళ్ల వర ప్రసాద్ 'గురు సహస్రావధాని '. 

(దత్తచరిత్ర యథాతథంగా, కూర్పులూ, చేర్పులూ లేకుండా చెప్పబడింది--అనుచిత వ్యాఖ్యలు లేకుండా! దత్తపీఠలూ, క్షేత్రాలూ వగైరలు కూడా చూడండి.) 

ఈ సీడీలు కొనండి....ఒక్కొక్కటీ రూ.59/- మాత్రమే! ఈ ప్రకటన చూసి, ఆర్డరు ఇచ్చినవారికి రూ.54/- మాత్రమే. 

చిట్టావఝల కృష్ణ పేరున "మాకు అందేలా" కేరాఫ్ నర్సాపూర్ బ్రాహ్మణ సమాఖ్య, నరసాపురం, ప.గో.జిల్లా, 534275 కి (మనియార్డరు/పోస్టల్ ఆర్డరు/డీడీ) యెలాగైనా పంపించండి....ఓ సీడీ సొంతం చేసుకోండి! (ఇందులో వ్యాపారం లేదు.)

మీరు కోరితే, మీ మెయిల్ ఐడీ కి వీడియో పంపించడానికి ప్రయత్నిస్తాము. 

Friday, December 31, 2010

శ్రీగిరి శ్రీపతి

శ్రీవారి ఆభరణాల విలువ

హమ్మయ్య! బెటర్ లేట్ దేన్ నెవర్ అన్నట్టు, ఇప్పటికైనా మన వున్నత న్యాయస్థానం వారి ఆదేశాల మేరకు ఆభరణాల విలువ లెఖ్ఖింపు ప్రక్రియ పూర్తి అయ్యిందట.

ఇదివరకే ముంబై, రాజస్థాన్ ల లోని జెమాలజీ నిపుణులు వజ్ర వైఢూర్యాల, ఇతర "రాళ్ల" నాణ్యత, పరిమాణం, స్వచ్చత, (విలువ?!) గురించీ, హైదరాబాదు మింట్ నిపుణులు బంగారం నాణ్యత, పరిమాణం, స్వచ్చత గురించీ రెండు నివేదికలు సమర్పించి వుండగా, ఇప్పుడు ఆభరణాల విలువపై నియమించిన కమిటీ కూడా నివేదిక సమర్పించిందట.

(తిన్నవాళ్లు తినగా, పోయినవి పోగా) "తిరువాభరణ" దస్త్రం మేరకు 137; "శ్రీ మలయప్ప స్వామి" దస్త్రం మేరకు 444; వెండివి 365; "ఇతర ఆభరణాల" దస్త్రం మేరకు 82--ఆభరణాల విలువని లెఖ్ఖించారట. (శ్రీవారికి వెండివి లేవా? ఇతరాలు 82 యేనా అని అడగొద్దు.)

శ్రీవారి "నిత్య కట్లు" విలువ లెఖ్ఖించలేదట. (వాటి వివరాల నమోదు యెక్కడైనా జరిగిందో లేదో!).

(అయినా, ప్రతి గురువారం అవికూడా లేకుండా స్వామి దర్శనం చేయిస్తున్నారుగా? ఇలాంటి దర్శనాన్ని రెండురోజులకి పొడిగించామన్నారు ఆ మధ్య. మరి రెండురోజులు చాలవా నిపుణులకి వాటి విలువ లెఖ్ఖించడానికి? యేమో. అసలు ఈ దర్శనాన్ని నిషేధించాలంటాను నేను--యెందుకంటే, "స్రగ్భూషాంబర హేతీనాం, సుషుమావహ మూర్తయే....." వల్ల "....శమనాయాస్తు....." అన్నారు కదా?) 

ఇంకా, భద్రతా కారణాల దృష్ట్యా, ఆభరణాల 'మొత్తం విలువ' ప్రకటించకుండా జాగ్రత్తపడ్డారట. సరే.

ఆయా దస్త్రాల్లో యే తేదీ వరకూ నమోదయిన వాటిని లెఖ్ఖించారో, ఆ తరవాత వచ్చిన వాటి మాటేమిటో, న్యాయ స్థానం వారూ, ఈవోగారూ తగిన కట్టుదిట్టమయిన యేర్పాట్లు చేసేలా చూడాలి. ఇక నించీ యెప్పటికప్పుడు నమోదుల వివరాలూ, వాటి విలువలూ ప్రకటిస్తూ వుండాలి.

మన పిచ్చిగానీ, వాటిని కాపాడుకోవడం లో శ్రీవారికీ, దిగమింగడంలో దగుల్బాజీలకీ జరుగుతున్న పోటీలో యెవరు నెగ్గుతున్నారో చూస్తూనే వుంటాం కదా!

Sunday, December 26, 2010

శ్రీగిరి శ్రీపతి

ఆభరణాలూ.....

"(తమకి చూపించిన) శ్రీవారి బంగారు, వెండి ఆభరణాలు 'పూర్తి స్వచ్చంగా' 'నాణ్యతతో' వున్నాయి" అని హైదరాబాదు ప్రభుత్వ మింట్ నిర్ధారించిందట.

"వందల కోట్ల" ఆభరణాల పట్ల తితిదే నిర్లక్ష్య ధోరణి వ్యవహరిస్తోందంటూ, అప్పటి సీవీ యెస్వో రమణకుమార్ నివేదిక ఇచ్చారట. 

దరిమిలా, "ఆభరణాలన్నీ సక్రమంగానే వున్నాయని, వాటి విలువ 'రూ. 51 కోట్ల 'నీ (తుర్లపాటి వారు కూడా సభ్యులుగావున్న కమిటీ) తేల్చి, న్యాయస్థానానికి ప్రాథమిక నివేదిక సమర్పించారట!

ఇప్పుడు, మరో మూడు 'స్వచ్చంద ' కమిటీలని నియమించి, ఆభరణాల 'స్వచ్చత, నాణ్యత ' ల మీద నివేదికలిమ్మందట!

వీటిలో, హైదరాబాద్ మింట్, 'మా ఆధ్వర్యంలో (???!!!) 650 బంగారు, 350 వెండి....పరిశీలించాం, రాళ్ల స్వచ్చతని.....పరిశీలించాం.....పొందుపరచిన విధానంలోనే వున్నాయి ' అని సర్టిఫికెట్ ఇచ్చేసిందట.

ఇంకో జెమాలజీ కమిటీ, 'అంతా సక్రమంగానే వుంది ' అని సర్టిఫై చేసేసిందట.

మూడో.....ఇంకమ్‌టాక్స్ కమిటీ నివేదిక ఇంకా ఇవ్వాల్సి వుందట.

యెంత "పార దర్శకంగా" సా....గుతున్నాయో కదా ఈ 'పరిశోధనలు?'

చేటంత చెవులున్న మహాపరమాత్ముడికి చిన్న నక్షత్ర గడ్డిపువ్వులు పెడుతున్నట్లు లేదూ....ఈ వ్యవహారమంతా???!!!

ఇక్కడ దృష్టి దోషాలేమిటంటే........

మనం అడిగేది......

దేవస్థానం 'హాథీరామ్‌జీ మఠం' ఆధ్వర్యంలో వున్నప్పటినించీ, కృష్ణదేవరాయలు కన్నా ముందునించీ, యేరాజులు యెప్పుడు యేయే ఆభరణాలు ఇచ్చారూ? ఆ తరవాత యెవరెవరు యెప్పుడెప్పుడు యేయే ఆభరణాలు ఇచ్చారూ? ఇవన్నీ నమోదు కాబడిన 'అదేదో' రిజిష్టరు ప్రకారం మీ వెబ్ సైట్ లో పెట్టండి. (పాత రికార్డు లేకపోయినా, కరిగించేశారేమో అని అనుమానం వున్నా) ఇప్పుడు 'ఫిజికల్ 'గా వున్నవి మాత్రమే పెట్టండి చాలు. గతం గతః. అదీ పారదర్శకత అంటే! (వాటి నాణ్యతా వగైరాల విషయానికి తరవాత వద్దాం) ఈ కమిటీలూ, "క్లీన్ ఛిట్లు" అనవసరం.

తేదీలవారీగా (పాతవాటి విషయంలో శతాబ్దాల, దశాబ్దాల, సంవత్సరాలవారీగానూ)
వివరాలు ప్రకటించండి. రోజువారీగా వాటిని అప్డేట్ చేస్తూ వుండండి. (ఈపని ఇప్పటికే చేసి వుంటే నాలాంటివాళ్లూ, యావద్భక్తులూ సంతోషించివుందురు) 

ఇప్పుడు చేసినా, అదే ఫలితం!

చేస్తారా?

Wednesday, December 1, 2010

శ్రీగిరి శ్రీపతి

........స్వర్ణ "భయం"

......వదిలించింది వున్నత న్యాయ స్థానం చివరికి. ఈ పథకం చేపట్టడానికి తి ది దే బోర్డుకి అధికారమే లేదనీ, అది రాజ్యాంగం లోని 25, 26 అధికరణలకి విరుధ్ధమనీ తీర్పు ఇచ్చింది.

శ్రీవారి గరుడవాహనం సందర్భంగా అలంకరించే 'పెద్దకాసుల పేరు ' లోని కాసులపై 'విక్టోరియా మహారాణి ' చిత్రం (ముద్ర) వుంటుందని యెందరికి తెలుసు? ఆ కాసులే యెందుకు వున్నాయి? అనేదానికి సమాధానం యెందరికి తెలుసు?

శ్రీవారి బ్రహ్మోత్సవాలు మొట్టమొదటిసారి నిర్వహించిన భక్తురాలు యెవరు? ఆవిడ బ్రహ్మోత్సవాల నిర్వహణ ప్రతి యేటా జరగడానికి వీలుగా వితరణ చేసిన భూమి యెంత? ఆ అయివేజుతోనే ఇప్పుడు వుత్సవాలు నిర్వహిస్తున్నారా?

అప్పటి రాజులు స్వామికి యెప్పుడు యేమేమి సమర్పించారు?

ఇలాంటి విషయాలన్నీ ఆ ప్రాకారం మీద శాసనాల రూపం లో శాశ్వతం గా ప్రతిష్టించబడ్డాయి.

అలాంటి గోడలని తాపడం కోసం ఐదు వేలకు పైగా బోల్టులు బిగించడానికి రంధ్రాలు చేసేస్తే, వాటిలో నీరు చేరి శాసనాలు దెబ్బతింటాయి అనీ, కట్టడం దెబ్బతింటుంది అనీ, పురావస్తు శాఖ ఇచ్చిన నివేదికని కూడా లెఖ్ఖ చెయ్యకుండా ఈ పథకం యెందుకు ప్రవేశ పెట్టినట్టు?

పాలక మండలి 'అంచనా' మేరకు బంగారం, నగదు, రూపం లో 152 కిలోల బంగారం ఇంతవరకూ వచ్చిందట. ఆది కేశవుడేమో, 160 కిలోలు వచ్చింది, మిగతా 40 కిలోలూ నేనే ఇచ్చేద్దామనుకున్నాను--అంటున్నాడు.

ఆసలు లెఖ్ఖలెక్కడున్నాయి? ఆ బంగారం యెక్కడుంది? ఇప్పటివరకూ తయారుచేసిన రేకులు యెక్కడున్నాయి? ఈ బంగారం భద్రత మాటేమిటి? స్వామికే తెలియాలి.

దర్శనాలు త్వరితంగా జరగడానికి 'కదిలే తివాచీ' యేర్పాటు విషయం లో మాత్రం తప్పదనే అభిప్రాయానికొచ్చారట .....యెంత త్వరగా యేర్పాటైతే అంత మంచిది.

వేయికాళ్ల మండపం నిర్మాణానికి అడ్డంకులని తొలగిస్తూ కోర్టు తీర్పు ఇచ్చిందనీ, దేవస్థానం నిర్మాణానికి పూనుకోవడం శుభపరిణామమని చిన జీయరు స్వామి సంతోషిస్తున్నాడు. ప్రస్తుత మండపాన్ని వందకాళ్లకు కుదిస్తున్నారనీ, స్థంభాలని అడ్డంగా నిర్మించేలా ప్రణాళికలు--పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారట.

33 కుటుంబాలకి, వంటలు చేసుకొని, భోజనాలు చేసి, నిద్రపోయే వసతి కోసం నిక్షేపంగా సరిపోయేలా నిర్మించబడ్డ (ఆరోజుల్లో అతిపెద్దదీ, ఆలయానికి అతి దగ్గరలో వున్నదీ) అయిన వేయికాళ్ల మంటపాన్ని, శిధిలమయిపోయిందని తొలగిస్తే, అదేదో ఆగమ శాస్త్రాలకి విరుధ్ధమని ఈయన అనవసరం గా హడావిడి చేశాడు.

భవిష్యత్తులో బహుళ అంతస్థుల క్యూలైన్ యేర్పాటు చెయ్యవలసి వస్తే ఇది ఆదర్శమైన ప్రదేశం అవుతుంది. అలాంటి చోట మళ్లీ మంటపాలు నిర్మించడం యెట్టి పరిస్థితుల్లోనూ వాంఛితం కాదు.

దేవస్థానం వారు గమనిస్తే మంచిది!