Saturday, September 3, 2011

దర్శనాలూ



తరించేలా సేవలూ

"శ్రీవారి భక్తులకి విశేషమైన సేవలందించి వారి ఆత్మీయతను అందుకుంటాను.
ఉడతాభక్తిగా శ్రీవారి సేవలో పాల్గొని యాత్రికుల కష్టాలను తొలగిస్తాను.
వసతి సౌకర్యం కల్పనలో ఎదురవుతున్న సమస్యలను తొలగిస్తాను.
భక్తులే దేవుళ్లుగా సేవలందిస్తానని హామీ ఇస్తున్నాను.
అలిపిరి నుంచి తిరుమలకి వచ్చి, శ్రీవారిని దర్శించి, తరించి, తిరిగి అలిపిరి చేరేవరకు నేను పూచీగా వుంటాను"
"ముఖ్యమంత్రి కి కు రె విశ్వాసాన్ని వమ్ముచేయకుండా నడుచుకుంటాను.
సోనియాగాంధీ త్వరగా కోలుకోవాలని ప్రార్థించాను"

......ఇవన్నీ క్రొత్తగా తి తి దే పాలకమండలి అధ్యక్షులుగా ప్రమాణస్వీకారం చేసిన బుగ్గమీసాల బాపిరాజుగారి వువాచలు!

మరి ఈయన వొరగబెట్టింది యేమిటి?

బంగారువాకిలిలోని గరుడాళ్వారు ముందు ప్రమాణస్వీకారం చేశాడు ఇతర సభ్యులందరితోనూ, ప్రతీ సభ్యుడి వెనకా మూకలతోనూ!

3 గంటలకి పైగా భక్తుల దర్శనాన్ని నిలిపేశారుట! భక్త దేవుళ్ల "సేవకి" అలా శ్రీకారం చుట్టాడన్నమాట!

200 మంది అనుచరగణం బంగారువాకిలి లోకి చేరుకొన్నారట. ఇంకో 400 మంది బయట వెండివాకిలివరకూ ఆక్రమించారట! అందరూ బంగారువాకిలిలో దూరడానికి తోసుకున్నారట. సిబ్బందితో వాగ్వాదం చేశారట. యెలాగైతేనేం, ప్రమాణస్వీకారం అయ్యాక, అందరూ లోపల చొరబడ్డారట!

అదీ శ్రీవారిమీద ఆయనకీ, అనుచరులకీ వున్న గౌరం, భక్తీ!

భార్యతో శ్రీవారి కళ్యాణోత్సవం లో పాల్గొన్నారట. రాత్రి మళ్లీ "అనుచరగణానికి" వీ ఐ పీ దర్శనానికి యేర్పాట్లు చేశారట! ఇదీవారి "ఉడతాభక్తి"!

పద్మావతి నగర్లో అతిథిగృహాలు ఖాళీలేకుండా పోయాయట!

ఇవీ ఆయన వసతి సౌకర్యాల కల్పనలో సమస్యలని తొలగించే, భక్తులే దేవుళ్లుగా సేవలందించే, దర్శించి తరించేవరకూ పూచీపడే--పధ్ధతులు! 

ఈవోగారిమీద ఇదివరకే యేవో ఆరోపణలున్నాయన్నారు. మరి ఇప్పుడు వీళ్లిద్దరూ కలిస్తే, యెన్నికొండలని కరిగించడానికి ప్లాన్లు వేస్తారో!

బాగుంది కదూ రాజుగారి పాలన!

Tuesday, August 23, 2011

శ్రీవారి ఆలయం-2



దర్శనాలూ

రావులపర్తి భద్రిరాజుగారేమో.....ఖచ్చితంగా నాకు తెలీదు....."యేడుకొండల శ్రీనివాసా......." అనే పాటలో వ్రాశారు.......

"కోటికీ పడగెత్తినా ధనవంతుడూ.....నీ గుడి ముంగిటా సామాన్యుడు....."(గుడి ముంగిట అన్నారుగానీ, గుడిలోపల అనలేదు చూడండి!)

"కూటికోసం శ్రమ పడే నిర్భాగ్యుడూ.....నీ కృపకెప్పుడు సమపాత్రుడు....." (కృపకి సమపాత్రుడు --అంటే అర్హత వున్నవాడు అన్నారుగానీ--ఆ కృపని అందుకుంటాడని గ్యారెంటీగా చెప్పలేదు!).

ఇవన్నీ యెంత నిజాలూ.....!

Monday, August 22, 2011

శ్రీవారి ఆలయం



దర్శనాలూ

మొన్నేదో "డయల్ యువర్ ఈవో" నో ఇంకేదో కార్యక్రమంలో, భక్తులు చెప్పినమేరకు, శ్రీవారి వెండివాకిలి నుంచి బంగారు వాకిలి వరకూ, భక్తుల నడక ఒకే యెత్తులో వుండేలా (మరి  ఇన్నాళ్లూ భక్తులు దేవుణ్నే చూశారా, తమకాళ్లు యెక్కడ వేస్తున్నమో చూసుకొంటున్నారా?) "చెక్క బెంచీల" యేర్పాటు చేస్తామని సెలవిచ్చారు. ఇన్నాళ్లూ చెక్కలు లేవా? వున్నాయి కానీ గుమ్మాలెక్కడం దిగడంలో యెగుడుదిగుడుగా--యెత్తుగా, వాలుగా, ఇంకోలా (జనాలు బోల్తా కొట్టేలా!)

ఇప్పుడు చేస్తామన్న యేర్పాటు బాగానే వుంది గానీ, ఇన్నాళ్లూ వారికి తెలియదా ఈ సంగతి? కొన్ని లక్షలో యెన్నో ఖర్చుపెట్టడానికి కాకపోతే, జనాల చెవుల్లో పువ్వులు పెట్టడానికి కాకపోతే, ఈ యేర్పాటు యెందుకు? మరి పాత చెక్కలు యేమి చేస్తారు?

వీటన్నింటికీ బదులుగా, వాకిళ్లని సన్నగా వుండే వాళ్లయితే ఇద్దరు, మీడియంగా వుండేవాళ్లయితే, 1న్నర మంది, కాస్త లావు వాళ్లయితే ఒక్కరే పట్టేలా మార్పు చేస్తే, ఇంక తోపులాటలు వుండవు కదా? దానికి ఖర్చు కూడా యెక్కువ కాదు--ఇంకా వెండి, బంగారు తాపడాల్లో బోళ్లు మిగులుతుంది!

చేస్తారా? చూద్దాం!

Wednesday, May 25, 2011

శ్రీవారి ఆలయం



సేవలూ, పురావస్తు

శ్రీసేవ "ప్రాజెక్ట్" నిపుణుల సూచనలు వివాదాస్పదమౌతున్న నేపధ్యంలో ప్రాజెక్టుని సమీక్షించి, తుదిమెరుగులు దిద్దడం, అనుమానాలని నివృత్తి చెయ్యాలని సాధికార మండలి భావిస్తోంది(ట) 07-02-2011 న.

శ్రీవారికి విరాళాలు ఇచ్చే 'భక్తులకు ' ప్రత్యేక వ్యవస్థను అందుబాటులోకి తీసుకు రావాలని "తి తి దే" (అంటే సాధికార మండలి అని కవి హృదయం!) నిర్ణయించింది(ట). దాతలనుంచి విరాళాలు అందినవెంటనే, వారికి ప్రత్యేక "పాసు పుస్తకాలు" జారీ చేస్తారు(ట). 

తిరుమలలో క్రొత్తగా నిర్మిస్తున్న నిత్య అన్నదాన సముదాయాన్ని ఉగాదినాటికి అందుబాటులోకి తేవాలని ప్రయత్నిస్తున్నారు(ట). "రోటీ"లు వడ్డించడానికి కూడా యేర్పాట్లు చేస్తున్నారు(ట). (పులిని చూసి నక్క వాతలు పెట్టుకొంటే, వాతలు లేని నక్కని చూసి పులి తన చారలు "డిటర్జెంట్" తో తొలగించుకుందామనుకుందిట!). అంటే, షిరిడీ & తిరుమల ఆర్ హేండ్ ఇన్ హేండ్! (మన బుర్రోవాదుల ఆలోచనలు ఇలాగే వుంటాయి మరి!)

"మూడువేలమంది" (ఇదేదో అప్పుతచ్చు అనుకుంటా!) భోజనం చేసే సౌకర్యం వున్న నేపధ్యంలో, ఆ మేరకు సిబ్బంది నియామకం పై కూడా 'సమీక్షించారు'(ట). 

ఇంతవరకూ బాగానే వుంది. 

శ్రీవారి ఆలయాన్ని పురావస్తు శాఖవారికి అప్పగిస్తాము అని నిశ్చయించిన, (మళ్లీ "థూ నా బొడ్డు" అనుకొన్నారు!) సందర్భంలో, పురావస్తు శాఖ సంచాలకుడు, "నిత్యపూజలూ, వుత్సవాల్లో తమ జోక్యం వుండబోదు" అని ప్రకటించారట--"వొకవేళ ఆ దేవాలయం తమ పరిథిలోకి వచ్చినా"--అని! (ఆలూ లేదు, చూలూ లేదు, కొడుకు పేరు....అన్నట్టు!)

ఒకవేళ అలా జరిగినా, "ఆలయంలో ఓ మేకు కొట్టాలన్నా, తమ అనుమతి తీసుకోవాలంటూ జరుగుతున్న 'ప్రచారంలో' యేమాత్రం నిజం లేదని కూడా చెప్పారట వారు. (పురావస్తు శాఖవారి అధీనంలో వున్న యే నిర్మాణంలో అయినా, యెవరైనా, వాళ్లిష్టం వచ్చినట్టు మేకులు కొట్టుకోవచ్చా? అనే విషయం యెవరూ ఆయనని అడగలేదు మరి.) 

ఇంకా, ఆలయ పాలకమండలి ఛైర్మన్లు మారినప్పుడల్లా వాళ్ల ఇష్టానుసారంగా ప్రాచీన నిర్మాణాలని 'ధ్వంసం' చేస్తున్నారనీ, వేయికాళ్లమంటపం, వాహన మండపాల కూల్చివేతే ఇందుకు నిదర్శనమనీ కూడా అన్నారు(ట).

.....తరువాయి మరోసారి.

Tuesday, May 24, 2011

"అనంత.....




......సమస్యలమయం"!

ఆదికేశవుడి మానస (గర్భజనిత) పుత్రిక "ఆనంద......మయం" కార్యక్రమానికి 95 కిలోల బంగారం, 12 కోట్ల నగదూ వచ్చిందట--హైకోర్టు తీర్పు ఇచ్చేటప్పటికి.

12 కొట్ల నగదుకి సంబంధించిన దాతల/భక్తుల వివరాలు వున్నాయట. కానీ, బంగారానికి సంబంధించి, చాలావరకు వివరాలు లేవట. ఆదికేశవుడికి వ్రాసినా, వ్యతిరేక సమాధానమే వచ్చిందట!

సాధికార మండలి నిర్ణయం ప్రకారం, ఆ పథకం విరాళాలు ఇచ్చినవారికే తిరిగి ఇచ్చెయ్యడం గానీ, వారి "అనుమతితో" వేరే పథకాలకి మళ్లించడం గానీ చెయ్యాలట.

మరి పేర్లు వున్నా చిరునామాలు లేనివాళ్లనీ, పేర్లు కూడా లేనివాళ్లనీ యెలా 'సంప్రతిస్తా'రబ్బా? ఒక్క రిలయన్స్ సంస్థ మాత్రమే తన విరాళం గురించి సమాధానం ఇచ్చిందట. మిగిలినవాళ్లందరూ "నస్మరంతిగాళ్లు"!

మరి ఆ బంగారం అంతా యెవరిచ్చారో, యెందుకు, యెలా ఇచ్చారో, వసూలు చేసినవాళ్లు యెంతకి యెంత జమకట్టారో.....దర్యాప్తు చెయ్యాలా, అఖ్ఖరలేదా?

(ఈవోగారు యేమైనా చేస్తున్నారా, తట్టా బుట్టా సర్దుకొంటున్నారా?!)

లేక, "పవిత్రత" అనే చాపక్రిందకి నెట్టేద్దామా?  

Sunday, May 22, 2011

వేదపాఠశాల - 5



.....వేధింపులు

సోకాల్డ్ చర్చ గురించి ఇంకా చాలా వున్నా, ఈ మాత్రం చాలనుకుంటా. 

ఇంక చర్చా నిర్వాహకుడూ, చర్చకులూ "కన్వీనియెంట్" గా మరిచిపోయిన విషయాలు :

1. జరిగాయి అని ఆరోపించబడిన సంఘటనల పూర్వాపరాలు. అసలు యేమి జరిగింది అన్నదాని గురించి ఆయన యేమనుకుంటున్నాడో  ఈవోగారిని ప్రశ్నించి, ఆయన సమాధానాన్ని క్లిప్పింగు చూపించకపోవడం.

2. బాధితుడి/అతడి తండ్రి, బయటపెట్టిన మీడియా వాళ్ల--విజువల్స్ చూపించకపోవడం.

3. 150 మందికి మాత్రమే వుద్దేశించిన పాఠశాలలో 845 మందిని యెలా చేర్చుకొన్నారు? ఓ పెద్దగదికి 10 మంది చొప్పున వున్నా, మొత్తం 85 గదులూ, వుపాధ్యాయులకి--వందమంది విద్యార్థులకి ఒక వుపాధ్యాయుడు లెఖ్ఖవేసుకొన్నా, 9 గదులూ, ప్రథానాచార్యుడికో గదీ ఇలా లెఖ్ఖవేసినా, 100 గదులు కనీసం వుండాలి. అన్ని వున్నాయా? పోనీ పెద్ద పెద్ద హాళ్లు వున్నా, కనీసం ఓ యేడంతస్తుల భవనమైనా వుండాలి కదా? మరి వుందా?

4. విద్యార్థులకి నిద్రించడానికి డార్మెటరీల్లాంటి యేర్పాటు యేమైనా వుందా? నేలమీదే నిద్రిస్తున్నారా?

5. విద్యార్థులు యే క్లాసులవాళ్లు యే గదుల్లో/హాళ్లలో నిద్రించాలో యెవరు నిర్దేశించారు? లేక యెవరిష్టం వాళ్లదా?

6. హాస్టళ్లకి వార్డెన్లు యెవరైనా వున్నారా? వంట, భోజన శాలలనీ, క్లాసు రూములనీ, స్టడీ రూములనీ, లైబ్రరీలనీ యెవరు పర్యవేక్షిస్తున్నారు?

7. విద్యార్థుల అటెండెన్సు సంగతేమిటి? వాళ్లు చూపించిన విజువల్స్ ప్రకారం ఓ క్లాసులో గురువుతో వేదం వల్లెవేస్తున్నవాళ్లు 15 నుంచి 20 లోపు మంది మాత్రమే కనిపించారు. ఆ లెఖ్ఖన రోజూ కనీసం 400 కి పైగా క్లాసులు జరుగుతూ వుండాలి. మరి 9 యేళ్లుగా, 10 యేళ్లుగా విద్యార్థులు యెన్నిరోజులపాటు వేదాన్ని పఠించారు?

8. ఇకనుంచీ "ఎడ్మిషన్లు" రద్దుచేస్తున్నాము అని ఈవోగారు స్పష్టంగా ప్రకటించారు. మరి "ఎడ్మిషన్లు కొనసాగుతాయి. యెట్టి పరిస్థితుల్లోనూ ఆగవు" అని చర్చాపకుడు శ్రీనివాస్ కాలర్స్ కి హామీ పదే పదే యెలా ఇచ్చారు? జరుగుతున్నది యేమిటి? జరగబోయేది యేమిటి?

ఇలా వ్రాస్తూపోతే, అనేక ప్రశ్నలు. 

కొన్నిటికైనా సమాధానాలు రాబట్టగలమేమో చూద్దాం!

(యిప్పటికింతే!)


Saturday, May 21, 2011

వేదపాఠశాల - 4



.....వేధింపులు

బాధిత బిడ్డ తండ్రి మీడియావారిముందు ఆక్రోశిస్తే, మీడియావాళ్లు ఈవోగారిని ప్రశ్నిస్తేనే--ఆయనకి ప్రకటన చెయ్యక తప్పలేదు అని స్పష్టం అవలేదూ?

అలా అని విలేఖరులు యెవరినీ "సూటిగా" ప్రశ్నించకూడదు అనో, "వేలికేస్తే కాలికేసి...." యెలాగైనా "నిజాన్ని" రాబట్టడానికి ప్రయత్నించకూడదు అనో అంటే యెలాగ?

యెమర్జెన్సీ విధించాక, మన దేశంలో పత్రికల సెన్సార్ అమల్లో వుండగా, (వీటిగురించి వివరించాలంటే ఇప్పుడు జరిగేపని కాదు గానీ, తెలుసుకోడానికి యెవరి ప్రయత్నాలు వాళ్లు చెయ్యండి--యువకులు) బీబీసీ రిపోర్టరు మార్క్ టులీ ఇందిరాగాంధీని అలాగే ఇంటర్వ్యూ చేస్తూ, గుచ్చి గుచ్చి ప్రశ్నించేదాకా ఆవిడ "అవును. కొంతమంది నాయకులని నిర్బంధించాం" అని చెప్పేదాకా ప్రపంచానికి తెలీదు--జేపీ, మొరార్జీ వగైరాలు యేమయ్యారో!

మీడియాకి ఆ స్వేచ్చ లేకపోతే, ఇన్నిన్ని కుంభకోణాలూ గట్రా యెప్పటికైనా వెలుగు చూసేవా?

ఆం. భూ. వారే అనుకుంటా--టీవీవాళ్లు తమ టీపీఆర్ రేటింగులు పెంచుకోడానికి--అని దాఋణమైన ఆరోపణ చేశారు. చర్చకుల్లో యెవరు ఈ ఆరోపణ చేసినా అది వారి స్థాయికి తగదు. 

24 గంటల వార్తా ఛానెళ్లు కొంత "అతి" చేస్తున్న మాట నిజమే. కానీ, వాళ్లు మాత్రం కొత్తవార్తలే రాకపోతే యేమి చేస్తారు? పాడిందేపాటరా అంటారు. ఓ వార్తకి సంబంధించి ఓ ముఖ్యమైన విజువల్ 10 సెకండ్లదే వుంటే, వార్తాకథనం ఓ 40 సెకండ్లది వుంటే, ఆ విజువల్నే 4 సార్లు రిపీట్ చెయ్యక తప్పదుకదా?

మీడియా ప్రతినిధిగా ఆం.భూ.వారే యెందుకు ముందుకు వురికినట్టు? వారికి టీవీ ఛానెల్ లేదుకాబట్టా? వొకవేళ వుండి వుంటే వాళ్లు ఇంకేమైనా పొడిచేవారా?

ఇంకో కాలర్ అయితే, "మీరు ఈ చర్చ నిర్వహించడమే తప్పు. రేపు మీడియావాళ్లందరూ మీమీద దాడికి వస్తారు....ఇంకా రచ్చ అవుతుంది" అనే అర్థం వచ్చేలాగ మాట్లాడడం, నిర్వాహకుడు శ్రీనివాస్ పదే పదే "ఇది మీడియావాళ్లకి వ్యతిరేకంగా నిర్వహిస్తున్నది కాదు......కేవలం నిజ పరిస్థితులని ప్రతిబింబించడం, పరిష్కారాలు సూచించడం" కోసమే నిర్వహిస్తున్నాము అనీ ప్రకటించారు.

చివరికి వాళ్లు సూచించిన పరిష్కారాలు....హళ్లికి హళ్లి, సున్నకి సున్న!

ఇంకో "పెద్ద" విషయం.....ఆ విద్యార్థులకి "బయటనించి" యెక్కువగా డబ్బు అందుతూండడంతో, సినిమాలూ అవీ చూస్తున్నారు అనీ, ఇంటర్నెట్లూ, డౌన్లోడ్లూ చేస్తున్నారు అనీ, సెల్లుల్లో ఫోటోలూ, వీడియోలూ గట్రా చూస్తున్నారు అనీ వెల్లడించారు. అంటే యెవరో "బయటి వ్యక్తుల" ప్రమేయం వున్నట్టేకదా? వాళ్లెవరో బయటపడడానికైనా దర్యాప్తులు జరగాలి కదా? 

పవిత్రమైనచోట దర్యాప్తులేమిటి అంటారా?
  
.....తరువాయి మరోసారి.