Wednesday, June 17, 2009

........‘మరో నక్క’ వాత!

పులిని చూసి ‘మరో నక్క’ వాత!
మేము శ్రీపతి యాత్రకి వెళ్ళిన రోజునే, మా అమ్మాయి తన అయిదేళ్ళూ, అయిదునెల్లూ వయసు ఇద్దరు కొడుకులతో, వాళ్ళ మామ, అత్తగార్లతో, షిరిడీ సాయి దర్శనానికి వెళ్ళీంది!
వాళ్ళు తరచూ, కనీసం నెలా, రెండునెలలకోసారి వెళుతూ వుంటారు! “తిరుపతిలా కాకుండా, అక్కడ యెంతమంది వున్నా, ప్రతీ ఒక్కరూ నిశ్శబ్దం గా, తనివితీరా, సాయి దర్శనం చేసుకోవడమే కాకుండా, ఆయన పాదాలు స్పృశించడం, చిన్నపిల్లల్ని ఒక నిమిషం ఆయన పాదాల దగ్గర పడుక్కోబెట్టడం, ‘ధుని’ లో వాళ్ళు అర్పణం చెయ్యడం—హాయిగా, సంతృప్తితో తిరిగి రావడం” జరుగుతాయని ఉత్సాహం గా చెప్పేవారు!
మరి ఇప్పుడు—తేడా యేమిటంటే—‘తొక్కేశారమ్మా! చంటి పిల్లలని కూదా చూడలేదు! ఆడవాళ్ళనీ చూడలేదు! ముసలీ, ముతకా కూడా చూడలేదు! అందరూ నలిగి, నలిగి, ప్రాణాలతో బయట పడ్డాము’ అని మా అమ్మాయి ఫోను!
తరవాత, ఇంటికి వచ్చాక, మమ్మల్ని కలిసినప్పుడు చెప్పారు—“ఇదివరకు కేవలం ఒక్క మనిషే పట్టేలాగ క్యూ లైన్లు వుండేవి! ఇప్పుడు ముగ్గురు నలుగురు ఒకేసారి వెళ్ళిపోయేలాగ, క్యూ లైన్ల వెడల్పు పెంచేశారు! బాబా దగ్గరకి వెళ్ళనివ్వడం లేదు! పాద స్పర్శ దేవుడెరుగు! బయటినించే గెంటేస్తున్నారు! అంతా గోల గోల!”
అదండీ సంగతి!
వీళ్ళు మూర్ఖులా? వాళ్ళు మూర్ఖులా? ప్రజలూ, భక్తులూ మూర్ఖులా?
వాడు కూడా ‘డబ్బు సంపాదన’లో పడ్డాడా? యెవరికి వడ్డీలు కట్టడానికి?
తేల్చుకోండి!

Monday, June 15, 2009

నీ కొండకు నీవే రప్పించుకో--9

కాళ్ళు కాలిపోతున్నాయి—ఆ యెండలో—సిమెంటు రోడ్డు మీద—అలా వెతుక్కుంటూ, ఓ చెట్టునీడన నిలిచాం—

ఉమేష్ ‘నేను చూసి వస్తాను, మీరిక్కడే వుండండి సార్!’ అని గబగబా నడుచుకుంటూ వెళ్ళాడు—పాపం! (మా చెప్పులూ, సెల్ ఫోన్ లూ, బ్యాగులూ, అన్నీ టాక్సీలోనే వదిలెయ్యమని మా గైడ్ సలహా ప్రకారం అన్నీ వదిలేశాము మరి)మామూలుగా యాత్రికులు వాళ్ళ చెప్పులు యెక్కడ వదులుతారో తెలియదు.

మేం సెల్లార్ దర్శనం క్యూలో వున్నప్పుడు, పడమర మాడా వీధిలో కొంతమంది భక్తులో, స్థానికులో, వుద్యోగులో—పిల్లలతో సహా, చెప్పులు వేసుకొని నడుస్తూండడం చూశాను.

ఒకవేళ సెల్లార్ దర్శనం క్యూ లోకి వెళ్ళడానికి ముందు అక్కడ చెప్పులూ వగైరాల ‘డిపాజిటరీ’ యేమైనా వుంటే, గుడినించి బయటికి వచ్చాక, మళ్ళీ తిరిగి తిరిగి ఆ క్యూ మొదటికి వచ్చి, అవి తిరిగి తీసుకోవాలేమో!

మా టాక్సీ డ్రైవరు మా దగ్గరకి వచ్చి ‘బండి ఇక్కడే వుంది సార్! రండి! అని దగ్గరలోనే వున్న ఇంకో చెట్టుక్రింద పార్క్ చేసిన మా టాక్సీ దగ్గరకి తీసుకెళ్ళాడు. మా గైడ్ కూడా అక్కడే వున్నాడు.

ఇంకా రమేష్ జాడలేకపోవడం తో, ఉమేష్ కాస్త యేమైన కూల్ డ్రింక్ తాగి వస్తాను అంటూ వెళ్ళాడు. అతను వెళ్ళాక మాక్కూడా అనిపించింది—యెండ యెక్కువగానే వుంది కదా, మనం కూడా కూల్ డ్రింకులు యేమైనా త్రాగి వస్తే బాగుంటుందని. మేమూ వెళ్ళాము.

తిరిగి ఓ పదినిమిషాల్లో మేం ముగ్గురం టాక్సీ దగ్గర చేరేసరికి, గైడ్ చెప్పాడు—రమేష్ కూడా వచ్చి, ఇప్పుడే ఏ టీ ఎం కి వెళ్ళి వస్తానని వెళ్ళాడని. ఇంకో అయిదు నిమిషాల్లో తనూ వచ్చేసాడు—అందరం క్రిందకి బయలుదేరాం!

మళ్ళీ విషయాలు చెప్పుకోవడం మొదలు పెట్టాము—ఒక్క నా దర్శనం అనుభవం తప్ప—అన్నీ మాట్లాడుకున్నాము!

నేను ‘ముప్ఫై సంవత్సరాల తరవాత ఐ ఆర్ సీ టీ సీ ప్యాకేజ్ పుణ్యమాని చక్కగా దర్శనం అయిపోతోంది కదా అని ధ్వజ స్థంభాలవరకూ సంతోషించాను! కాని—అయాం మచ్ డిజప్పాయింటెడ్!’ అన్నాను.

రమేష్, ‘మీరే అంత డిజప్పాయింట్ అయితే, రెండునెలలకోసారి ఖచ్చితం గా వచ్చే నేను, ఆ రెండునెల్లోనూ వచ్చిన మార్పులకి నేనెలా ఫీలవ్వాలి!’ అన్నాడు.

గేట్ల కంట్రోలు గురించీ, స్టాఫ్ దర్శనం క్యూ గురించీ, తోపులాట గురించీ విమర్శించాను. ‘అదేమి దర్శనం క్యూ అండి! నిజంగా జనాలు వెర్రికూపులు అన్నట్టుగా వుంది’ అని తిట్టేశాను!

(అన్నట్టు శ్రీ కే యన్ వై పతంజలి తన ఖాకీ వనం నవలలో ఓ పోలీసాయన నోటినించి ‘ఎర్రికూపా’ అని తిట్టించి, తెలుగు సాహిత్యం లో ఆ మాటని ప్రవేశ పెట్టాడు! ఆ రికార్డుని ఇంతవరకూ యెవరూ బ్రేక్ చెయ్యలేదు!).

మహర్ద్వారం దగ్గరనించి, ఒకే మనిషి వెళ్ళగలిగే క్యూ లైను నిర్మించి, వీ ఐ పీ లతో సహా అందరినీ అదే క్యూ లో కలిపేసి, గర్భగుడివరకూ అందరినీ అనుమతించినా, లఘువులూ, మహా, మహావీరలూ అక్కరలేదు—అన్నాన్నేను! (ఆర్జితాలూ, కల్యాణాలూ, అవీ యెలాగూ మామూలే కదా). నాకప్పగిస్తే చేసి చూపిస్తాన్నాను! అందరూ నవ్వారు!

వీ ఐ పీ దర్శనాల గురించి రమేష్, ఉమేష్ మాట్లాడారు—వాటిని రద్దు చెయ్యలేరుగానీ, రెండుపూటలా ఒక టైము ప్రత్యేకించి క్రమబద్ధీకరించవచ్చు—అని. అసలు తితిదే చైర్మన్ గా ఒక మంచివాడిని—ఐ యే యస్ అధికారిని—వేస్తే, రాజకీయుల్ని మానేస్తే, సగం దరిద్రాలు తీరిపోతాయన్నారు!

సుబ్బిరామిరెడ్డి గురించి ప్రస్తావన వచ్చింది—ఓ వందమంది తొంబనేసుకుని తిన్నగా మహర్ద్వారం గుండా లోపలికి వెళ్ళిపోయి, దేవుడి ముందు ఒక్కడూ బైఠాయించి, ‘నేను ధ్యానం లోకి వెళుతున్నాను’ అంటాడట! ఇక అన్నితలుపులూ, క్యూలూ మూసేస్తారట! వాళ్ళ మంద మాత్రం లోపలే వుంటుందట! వాడు ధ్యానం లోంచి బయటికి వచ్చానని ప్రకటించేవరకూ, యెంతసేపైనా ఇంకెవరికీ దర్శనం వుండదట!

మొన్న ‘వైకుంఠం కాంప్లెక్స్’ రెయిలింగులు జనం విరక్కొట్టెయ్యడానికి వాడే కారణమట!

ఇలా కబుర్లతో కాలక్షేపం చేస్తూ, క్రిందకి చేరాము.

Sunday, June 14, 2009

నీ కొండకు నీవే రప్పించుకో--8

మేము కొండపైకి టాక్సీలో వెళుతున్నప్పుడే, రమేష్ ప్రస్తావించాడు, గైడ్ నిర్ధారించాడు—యేమిటంటే, ప్రతి లక్ష్మివారం స్వామికి ‘చిన్న నామం’ పెడతారనీ, దానితో స్వామి నేత్రాలు సగం వరకూ కనపడుటూంటాయనీ, అందుకనే ఆ రోజు యెవరైనా కొండమీద అవినీతి గానీ, దొంగతనం గానీ, పాపం గానీ చేస్తే, వెంటనే దొరికిపోతారనీ! (అందుకే దేవస్థానం వుద్యోగులు సైతం, లక్ష్మివారాల్లో చాలా జాగ్రత్తగా వుంటారట! అనీ) వెంటనే, నేను ‘ట్రాష్’ అన్నాను—ఉమేష్, ‘మిగతా లోజుల్లో ధైర్యం గా పాపాలూ అవీ చేస్తారన్నమాట’ అన్నాడు! కానీ, అలంకార రహిత స్వామి గురించి ప్రముఖంగా ప్రస్తావన రాలేదు! ఇక కొన్ని చిన్న చిన్న ముచ్చట్లూ, తరవాత మా తిరుగు ప్రయాణం, మిగతా యాత్రా! రమేష్ (జర్నలిష్ట్) సన్నగా, అంత పొడుగూ, పొట్టి కాకుండా వుండడంతో, వెండివాకిలి దగ్గర తోపులాటకు ముందే లోపలికి వెళ్ళిపోయాడు! దర్శనం అయిపోయి, బయటికి టాక్సీ పార్కింగ్ దగ్గరకి మేమే ముందు వచ్చాముగానీ, ఆయన పత్తాలేదు! ఉమేష్ మాత్రం కాస్త ఒడ్డు, పొడుగూ వుండడంవల్ల నేను వెండివాకిలి ముందు ‘మీరు కొంచెం ముందు వుండి మాకు దారి చెయ్యండి—బయటికి వెళ్ళేవరకూ మీరు ముందు వుంటేగానీ, మా ముసలాళ్ళం క్షేమం గా వస్తామని గ్యారంటీ లేదు’ అని అభ్యర్థించాను! పాపం అతడు అలాగే కట్టుబడ్డాడు! బయటికి రాగానే, ‘మీరు హుండీ దగ్గరకి వెళ్ళాలా?’ అని అడిగాడు—ఉమేష్. నేను ‘మేము యేమీ వెయ్యాల్సిన అవసరం లేదు’—అన్నాను. తను, ‘మావాళ్ళిచ్చినవి నేను హుండీలో వెయ్యలి సార్, మీరు వెళ్ళండి, నేను వెనకాల వస్తాను’ అన్నాడు. నేను ‘ఆలా అయితే, అందరమూ కలిసే వెళదాము—కానీ హుండీ గర్భగుడికి కుడిపక్కన వుంటుంది, అక్కడికి డైరెక్టుగా గుడి వెనకాలనించి వెళ్ళచ్చు’ అన్నాను. కానీ, “ఇక్కడేదో మెట్లు యెక్కి అందరూ వెళుతున్నారు—హుండీ మార్చేశారేమో—బోర్డు కూడా ‘హుండీ కి దారి’ అని అటే వుంది” అన్నాడు! ‘అయితే అటే వెళదాం’ అని తీరా వెళితే, యేవో చిన్న మందిరాలూ, అవీ వున్నాయి. సరే, గుడివెనకనించి కుడివైపు తరవాత, వెనకనించీ చుట్టు తిరిగి, హుండీ దగ్గరకి చేరి, మేము చేతికి వచ్చిన చిల్లరా, తను తెచ్చుకున్నవీ హుండీ లో వేశాక, బయటికి వచ్చాము. ఇక ప్రసాదాలు తీసుకోవాలిగా! అటేపు నడుచుకొంటూ వెళుతూండగా, అక్కడ ‘ఈ బ్యాంకూ’ ‘ఆ బ్యాంకూ’ స్టాల్స్ ‘ప్రసాదం కవరు రూ.2/-‘ అని అన్ని ముఖ్య భాషల్లో వ్రాసుకొని అమ్ముకుంటున్నాయి—జనం అక్కడ కవర్లు కొనుక్కొని, ప్రసాదాలిచ్చే చోటికి వెళుతున్నారు! పాపం మా ఉమేష్, 'మీరిక్కడే వుండండి, నేను వెళ్ళి మన లడ్డూలు తెస్తాను! టిక్కెట్లు నా దగ్గరే వున్నాయి కదా?’ అని వెళ్ళాడు. మేం హమ్మయ్య అనుకొని, అక్కడ చతికిలపడ్డాము—ఓ బ్యాంకు స్టాల్ పక్కన పేవ్ మెంట్ మీద—ఇంతలో, ఓ దేవస్థానం ఉద్యోగి, ఓ రబ్బరు గొట్టం తో చివ్వున నీళ్ళు చిమ్ముతూ ఆ దారి శుభ్రం చేసేస్తున్నాడు—మనుషులు కూడా తడిసిపోయేలా—మమ్మల్ని మేము రక్షించుకున్నాం—తడిసిపోకుండా—పైపైకి జరిగి! ఉమేష్ ప్రసాదం లడ్డూలతో తిరిగి రాగానే, గుడి ఆవరణనించి బయటికి నడిచాము—మా టాక్సీ పార్క్ చేసి వున్న చోటు వెతుక్కుంటూ!

Saturday, June 13, 2009

నీ కొండకు నీవే రప్పించుకో--7

నా శ్రీవారి దర్శనం! ఇక సీరియస్ గా దర్శనం, అనుభవం గురించి వ్రాస్తాను. గర్భగుడి ముందు క్యూ లోకి యెడమవైపు తిరిగినప్పటినుంచీ, నా ముందున్నవాళ్ళ తలల, మెడల పక్కనించీ స్వామిని చూడాలని అందరిలాగే ఆతృత! ముందు ‘సంజీవనీ పర్వతం యెడమచేత్తో పైకెత్తిపట్టుకుని, కుడిచేత్తో గదతో, వాలాన్ని తిప్పుతూ, గాలిలోకి యెగుస్తున్నట్టున్న’ ఆంజనేయ స్వామి ఆకారం గోచరించింది! ఒక్క క్షణం ఆశ్చర్యపోయి, దృష్టి కేంద్రీకరించి (నడుస్తూనే) చూడగా—ఓ షాక్ లాంటిది—స్వామి మూలబేరం రోడ్లు వెయ్యడానికీ, ఇళ్ళు కట్టేటప్పుడు కాంక్రీటు వెయ్యడానికీ వాడే కంకర మెటల్—దాన్నే ఇసుక రాయి (సాండ్ స్టోన్) అంటారనుకుంటా – తో తయారు చెయ్యబడ్డట్టు కనిపించింది! స్వామి వరద హస్తం, బేస్ బాల్ బౌలర్ కుడిచేతికి ధరించే తోలు ‘గ్లవ్’ అంత సైజులో, రేడియం లా మెరుస్తూ కనిపించింది! ఇక కటి హస్తం, చిన్నగా, రెండంగుళాల వెడల్పూ, నాలుగంగుళాల పొడవూ వున్న పచ్చ పొదగబడినట్టు, రేడియం లానే మెరుస్తూ, కనిపించింది! పాదాలు కనిపిస్తాయేమో అని వెతికాను! వాటికి వెండి తొడుగులేమీ లేవేమో, యెంత తీక్షణం గా చూసినా, కనిపించలేదు—ఆ మసక వెలుతురులో! స్వామివారికి ఇక యేవిధమైన అలంకారాలూ లేవు! ఇక, నా ముందున్నావిడని రక్షించి, నేను అందరికన్నా ముందున్నప్పుడు, స్వామివారి ‘నవ్వురాజిల్లెడు మోము’ చూద్దామని ప్రయత్నించా—శ్రీ నామం లో మధ్యవుండే యెరుపురంగు మాత్రమే కనిపించింది—ఇంకా బాగా వెతికితే, ఈ పక్కా, ఆ పక్కా నల్లటి రంగులో, కాటుక పెట్టినట్టు సగం నేత్రాలు గోచరమయ్యాయి—శ్రీనామం లో తెల్లటివి స్వామి రంగులో కలిసిపోయినట్టు అలవోకగా దర్శనమిచ్చాయనుకుంటా! ఈ లోపల మెట్టుదిగి యెడమవైపు మళ్ళడం, బయటికి నడవడం, మామూలే! నాకు తెలిసి, స్వామివారి విగ్రహం, నల్లని గ్రానైట్ రాయితో నిగనిగలాడుతూ వుండేది! అందరూ అదే చెప్పేవారు! మరి ఇప్పుడు, అనవసర అభిషేకాలతో, అరిగిపోయి, తెల్లబడిపోయిందా? వెంటనే ఓక నిజ నిర్ధారణ కమిటీని వేసి, రిపోర్టు తెప్పించాలి! అవసరమైతే, నిజరూప దర్శనాలూ, అభిషేకాలూ రద్దుచెయ్యాలి! స్వామి మూలబేరం కలియుగాంతం వరకూ సం రక్షింపబడాలి! ఇది నా ముఖ్య డిమాండ్! మిగిలిన ప్రజలు కూడా, తాము దర్శించినప్పుడు స్వామి యెలా గోచరించాడో, ఆత్మవంచన చేసుకోకుండా బయటపెట్టి, దేవస్థానం మీదా, ప్రభుత్వం మీదా వత్తిడి తేవాలి ఈ విషయం లో! నిజానికి స్వామివారిని అలా అలంకార రహితంగా నేనెప్పుడూ ఊహించుకోలేదు! మా చిన్నప్పుడు వచ్చినె ‘శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యం’ అనే సినిమాలో, చివరలో—శ్రీదేవి, భూదేవి—నారదుడితో అనుకుంటా మాట్లాడుతూ వుండగా, స్వామి నెమ్మదిగా ఒక్కో అడుగు వెనక్కి వేస్తూ, యేడడుగులువేసి, కొండచివరికి చేరి, విగ్రహం గా వెలసినట్టు చూపించారు—అదే విగ్రహాన్ని—చాలా విగ్రహాలు తయారు చేయించి, సినిమా ప్రదర్శితమవుతున్న ప్రతీ హాలు ముందూ వుంచారు—జనాలందరూ కొబ్బరికాయలు కొట్టి, హారతులూ, ప్రసాదాలూ పెట్టి, భక్తి పరవశులైపోయేవారు! అప్పుడు చూడడమే స్వామిని—అలంకార రహితం గా! మరి ప్రతీ లక్ష్మివారం, స్వామిని ఇలాగే దర్శనం చేయిస్తున్నారట—యెప్పటి నించి మొదలుపెట్టారో తెలియదు!

Friday, June 12, 2009

నీ కొండకు నీవే రప్పించుకో--6

నేను వెనకనించి ‘ఇంక నడువమ్మా—లేక పోతే తోసేస్తారు—అక్కడ యెడమవైపుకి తిరుగుతూ, మెట్టుదిగు’—అని చెప్పి ఆవిడని రక్షించాను! ఆవిడ వెనకే నేనూ, వెనక మా ఆవిడా, మిగతావాళ్ళూ—రెండు నిమిషాల్లో బయటికి వచ్చేశాము. ఇక్కడ, 1979 లో మేము చేసుకున్న దర్శనం సమయం లో ఓ చిన్న సరదా విషయం! చెప్పానుగా, అప్పుడు శ్రీవారి గర్భగుడివరకూ వెళ్ళి, ఆ ద్వారం ముందు ఓ క్షణం నించొని కనులారా దర్శనం చేసుకొని, నమస్కరిస్తూనే, కుడివైపు తిరిగి వెనక్కి వచ్చేవాళ్ళం! కొంతమంది, ఇంకా తనివితీరక, వెనక్కి వెనక్కి తిరిగి చూస్తూ, నెత్తిమీద దణ్ణం పెడుతూ, తిరిగి వెళుతూండేవారు! అప్పుడు కూడా, ఆ రెయిలింగు వెనక, ఇద్దరు ముగ్గురు ‘ముండలూ, వెధవలూ’ వుండేవాళ్ళు! ముందు నేనూ, నా వెనకాల మా షేహితుడు, తరవాత మిగిలిన వాళ్ళూ—కదులుతూ వుండగా, ఒక ‘ముండ’ యెక్కడా ఆగకుండ అరుస్తూనేవుంది—‘కదలాలి, కదలాలి. ఒక్కొక్కళ్ళూ అంతసేపైతే కుదరదు—‘ అంటూ వాగుతూనే, మాముందు వెనక్కి వెళ్ళిపోతున్నవాళ్ళలో ఒకాయన వెనక్కి తిరిగి చూస్తూ వెళుతుంటే, ‘ఇదుగో! ఇంక అటు తిరుగు—నడువు—లేకపోతే మెడ అలాగే వుండిపోగలదు!’ అని వేళాకోళం చేస్తుంటే, నాకు వొళ్ళు మండింది. అప్పట్లో నేను సరదాగా ‘వెంట్రిలాక్విజం’ అభ్యసించేవాడిని, సరదాగా మా స్నేహితులదగ్గర నా విద్యని ప్రదర్శిస్తూండేవాడిని! నాకు వొళ్ళు మండగానే, అప్పటికి సరిగ్గా గర్భగుడి ముందునించి కుడివైపు తిరుగునున్నానేమో, గంభీరం గా, నా పెదవులు కదలకుండా, ‘నువ్వు నోరు ముయ్యవే!’ అన్నాను—గుడిలోని అర్చక స్వాములు కూడా ఆశ్చర్యంగా స్వామివారివైపు చూశారు!—సాక్షాత్తూ స్వామే మందలించారా అని! క్యూలో వాళ్ళందరూ ఒకసారి గొల్లున నవ్వు! నా వెనకున్న మా స్నేహితుడైతే, బయటికి వచ్చేవరకూ కిసుక్కూ, కిసుక్కూ నవ్వుతూనే వున్నాడు! ఆ ముండ కంగారు పడిపోయింది—యెవరు? యెవరూ? అని అరిచి ఒక్కసారి సైలెంట్ అయి పోయింది! మా స్నేహితుడు, బయటికి హుండీ వైపు వెళ్ళడానికి తిరగ్గానే, ‘మీరే కదూ! అవునా! భలే అన్నారండీ! అందరూ స్వామివారే అనుకున్నారు! భలే అన్నారండీ—నువ్వు నోరు ముయ్యవే!—అని!’ అని ఇమిటేట్ చేస్తుంటే, నేను ‘ష్!’ అన్నాను—యెక్కడ బయట పడిపోతానో అని! ఇప్పటిక్కూడా, మా స్నేహితుడు అది తలుచుకునీ, అందరికీ చెప్పీ, పడి పడి నవ్వుతూనే వుంటాడు! ‘నువ్వు నోరు ముయ్యవే!’ అని చక్కగా ఇమిటేట్ చేస్తూ!

Wednesday, June 10, 2009

నీ కొండకు నీవే రప్పించుకో--5

శ్రీవారి గర్భగుడి ముందు ఒక నడవాలా వుంటుంది. అందులో తిరగేసిన ‘U’ ఆకారం లో క్యూ లైను వెల్లేది. ఆ ‘U’ లో ముందు భాగం లో స్వామివారి గర్భగుడి ద్వారం వుంటుంది. లోపల అర్చక స్వాములు కర్పూర నీరాజనాలు అర్పిస్తూ, దేదీప్యమానంగా సర్వాలంకరణాలతో వెలిగిపోతున్న స్వామివారినీ, వారి పాదాలనీ, కటి, వరద హస్తాలనీ చూపిస్తూ, భక్తులకి వివరిస్తూండేవారు! ఇప్పుడవేవీ లేవు! లోపలికి ప్రవేశించగానే, చీకటి గుయ్యారం! యెడమవైపు తిరిగితే, స్వామివారి మూలబేరం కనిపిస్తుంది! అక్కడ సుమారు ఓ పది అడుగుల మేర క్యూ లైను! ఆ రెయిలింగుకి ఆనుకొని, జారబడి, ఓ పదిహేను, ఇరవై మంది ‘ఖాకీ’ యూనిఫారాలు వేసుకున్న ‘ముండలు’! వాళ్ళ మధ్య అణువంత యెడం కూడా లేదు! ఆ రెయిలింగు వెనకాల, గుహ గోడకి ముందు ఉన్న ఖాళీ స్థలం లో, ఇంకో నలుగురైదుగురు ‘ముండలు’ అదే యూనిఫారాలతో! కుడివైపు రెయిలింగు కి ఆనుకొని, నలుగురైదుగురు ‘వెధవలు’—అలాగే యూనిఫారాలు వేసుకొని! అక్కడ కుడి పక్కనించి, ఇంకేదో క్యూ—వాళ్ళు రాకుండా గొలుసు అడ్డం పెట్టేసి—అక్కడొక ఉద్యోగి!—ఇదీ సీను! (నా ప్రథమ కోపానికి నా మనసులో నాకు తెలిసిన పెద్ద తిట్లుగా ‘ముండలు’, ‘వెధవలు’ అని వాడాను గానీ, నిజంగా వాళ్ళు ‘విధవలూ’, ‘విధురులూ’ కాదన్న విషయం గమనించగోర్తాను!) గోడ పక్కన, (రెయిలింగు వెనక) ఉన్న ఓ ముండ అరుస్తోంది, నా ముందున్న ఓకావిడని ఉద్దేశించి—“యేమ్మా! నువ్వు కదులు—లేదా నీ వెనకున్నవాళ్ళు నిన్ను ‘దొబ్బుతారు’ చూడు—వినపడడం లేదా? నిన్నే! అదిగో! ఇప్పుడు దొబ్బుతారు చూడు” అని! (నిజం గా యెవరూ ‘దొబ్బక’ పోతే, వాళ్ళే రెయిలింగు క్రిందనించి కాళ్ళతో నడుస్తున్నవాళ్ళకి ‘బ్రేకులు’ వేసి, వాళ్ళు పడి పోయేలాగ చేస్తున్నారని నేను గమనించాను! అక్కడ స్వామి గర్భగుడి ముందు నడవా లోకి వెళ్ళకుండా, లైనుని యెడం వైపు తిప్పేస్తారు—అక్కడొక మెట్టులా వుంటుంది—క్రిందిక దిగాలి! వీళ్ళు తొయ్యడం వల్ల, అక్కడ కొంతమంది పడిపోతున్నారు!)

Tuesday, June 9, 2009

నీ కొండకు నీవే రప్పించుకో--4

మా యెడమపక్కన ఉన్న క్యూ లైన్ లో, గుళ్ళో పెళ్ళి చేసుకున్న దంపతులతోపాటు ఓ పది మందికనుకుంటా—సెల్లార్ దర్శనం అనుమతిస్తున్నారు—అలాంటివాళ్ళూ, కొండమీడికి నడిచి వచ్చే వాళ్ళకి వెంటనే సెల్లార్ దర్శనం అనుమతిస్తున్నారట—అలాంటివాళ్ళూ వెళుతున్నారు! రెండు క్యూ లైన్లూ పడమర మాడావీధి కనిపిస్తూండగా, పైకి మెట్లు యెక్కి వెళ్ళవలసివుంది. అక్కడ, పైకి యెక్కేసరికి, ఇంకా యెడమ పక్క వున్న క్యూ లైన్ నించి మా యెడమ పక్క క్యూలైన్ లోకి తెరుచుకొనే గేటు తెరిచారెవరో! ఆ క్యూలు రెండూ కొంతసేపు కలిసి పోవడమే కాదు, వాళ్ళ లైను త్వరగా కదిలి పోయింది! మా లైను ఓ పావుగంట కదల్లేదు! (ఆ గేటు ని యెవరో ‘మేనేజి’ చేసి వుంటారని మా లైన్లో అనుమానాలు!) అక్కడి నించి ఓ గదిలో ప్రవేశించి, మళ్ళీ మెట్లెక్కుతూ, కుడివైపు తిరుగుతాయి క్యూ లైన్లు. అక్కడ మాత్రం, చీమల బారుల్లా నెమ్మదిగానే కదిలాయి లైన్లు! ఆ తరవాత, మెట్లు క్రిందికి దిగి, మాడా వీధి గుండా క్యూ లైన్లు త్వర త్వరగానే కదిలి, దక్షిణ మాడా వీధికి మలుపు తిరిగి, త్వరలోనే మహర్ద్వారం దగ్గరికి చేరాము! ఈ లోపల, నా క్రితం దర్శనాల్లో, ఈ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లూ, సెల్లార్ దర్శనాలూ లేవని, ముఖ్య ప్రాకారం చుట్టూ మాత్రమే క్యూ లైను (సర్వ దర్శనానికి) వుండేదనీ, అప్పటిలో పాతిక రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్ కొనుక్కున్న వారిని మహర్ద్వారం దగ్గర సర్వదర్శనం క్యూ లైన్ లో కలిపేవారనీ, మేము 1975 లో చేసుకున్న దర్శనం అదేననీ) (ఆ దర్శనం గురించి ఇంకో సంచలన నిజం తరవాత చెపుతాను!) ఆ క్యూ ప్రాకారం లోపల మళ్ళీ గోడ పక్కనే వెళుతూ, వెండివాకిలి దగ్గరకి చేరేదనీ, అప్పుడు వీఐపీ లని, మహర్ద్వారం గుండా బంగారువాకిలి దగ్గరకి తీసుకెళ్ళి, అక్కడ గర్భ గుడి దగ్గరదాకా వెళ్ళే జనరల్ క్యూ లో కలిపేవారనీ, బంగారు వాకిలి లోపల యెంతటివారైనా ఒకటే అనీ, (1979 లో నేను చేసుకున్నది వీఐపీ పాస్ దర్శనమే అనీ) నా ఙ్ఞాపకాలు చెప్పాను! ఇప్పుడు ప్రాకారం లోపల గోడ పక్కన క్యూలు లేవనుకుంటా! లేకపోతే, అదంతా గడిచి సర్వ దర్శనం వాళ్ళు వచ్చారో తెలీదుగాని, వెండి వాకిలి ముందు ఓ పెద్ద మంద చేరింది! అక్కడ నించి తోపులాటలు మొదలు! వెనకవాళ్ళు ‘గోవిందా! గోవింద!’ అంటూ ఒక్క తోపు తొయ్యడం, ముందువాళ్ళు ఇత్తడి కంచెలకి నొక్కుకు పోవడం! పాత ధ్వజ స్థంభం ముట్టుకోవడానికీ, కొత్త ధ్వజ స్థంభం (పాత ధ్వజ స్థంభం యెప్పటినించో లేదు--స్థంభ మూలం మాత్రమే వుంది! మరి అది వుండగా, ఇంకో కొత్తమూలం, ఇంకో ధ్వజ స్థంభం యే ఆగమ శాస్త్ర ప్రకారం నిర్మించారో వారికే తెలియాలి!) ముట్టుకోడానికి అదే తోపులాట! అక్కడికి నలిగి నలిగి, వెండి ద్వారం ముందుకి చేరాం! అక్కడొక ఇరవై నిమిషాలపాటు వుండిపోయాం! (పదకొండు గంటల నించీ—వికలాంగులకి, వయోవృద్ధులకీ ప్రత్యేక దర్శనాలు వుంటాయట—వాళ్ళు వెండివాకిలి గుండా తిరిగి వస్తూనే వున్నారు అంతసేపూ! (దేవస్థానం వాళ్ళు ఇలా ప్రత్యేక దర్శనాలకి కేటాయించడం చాలా ముదావహమని మాలో మేము సంతోషించాము!) ఇంతలో, మా కుడిపక్క ఇంకో ప్రత్యేక క్యూ వెలుస్తోంది—దేవస్థానం వుద్యోగుల తాలూకు ప్రత్యేక క్యూ అట అది—లోపలి వాళ్ళందరూ దాదాపు బయటకి వచ్చెయ్యగానే, వీళ్ళని లోపలకి వదిలేశారు! ఆ తరవాత మా క్యూలు (అంటే నిజంగా క్యూలు లేవు—మందలే!) వెండివాకిలి లోకి వదిలారు—మళ్ళీ వీలైనంతగా తోపులాట! అక్కడ మళ్ళీ చిన్న క్యూ లైను! అక్కడికి వైకుంఠ ద్వారం కనిపిస్తూ వుంటుంది! అక్కడనించి కుడివైపు లోపలికి (బంగారువాకిలి దగ్గరకి) క్యూ! చెప్పానుగా, అప్పటికే అన్ని క్యూలూ కలిసిపోయాయని! ఇక అక్కడ నించి ‘మహా లఘు’ లేదా ‘మహావీర లఘు’ దర్శనం!