Friday, October 12, 2012

ఆపదమొక్కులవాడూ................ఆగమ శాస్త్రమూ

అప్పుడెప్పుడో, శ్రీ రామానుజులవారు, ఆయన మరో ఆగమానికిచెందినా, స్వామికి మాత్రం అన్నీ "వైఖానస" ఆగమం ప్రకారమే జరగాలని శాసించారట. 

ఆ ఆగమం ప్రకారం, స్వామిని రోజూ కొంచెం సేపైనా నిద్రపుచ్చాలని ఇప్పుడు గుర్తొచ్చిందట పెద్దలకి. 

అందుకని ఇప్పుడు ప్రతీరాత్రీ 1-30 కి ఆయనకి పవళింపు సేవ జరిపి, "జో అచ్యుతానంద......." అంటూ నిద్రపుచ్చుతారట.....కనీసం ఓ గంటసేపు! 

ఇప్పుడు దర్శనాల్లో మూడు రకాలు--ఐ పీ లూ, వీ ఐపీ లూ, వీ వీ ఐపీ లూ--అని వున్నాయట, వాటిని ఇప్పుడు రెండే రకాలుగా విభజిస్తే చాలని ఒకాయన అంటే, ఇంకొకాయన కుదరదు, మూడూ వుండాల్సిందే అంటున్నాడట!

అసలు ఇలాంటివి యే ఆగమం ప్రకారం జరుగుతున్నాయో వాళ్లెవరూ చెప్పట్లేదు. 

ఆసలు ఆగమ శాస్త్రం ప్రకారం ఐతే, స్వామికి రాత్రి 8-30 కి ఏకాంతంలో తోమాలసేవా, అర్చనా అయ్యాక నైవేద్యం పెట్టి, మూడో గంట కొట్టాక, ఓ గంటసేపు ధర్మదర్శనానికి అనుమతి ఇచ్చి, 10-00 గంటలకల్లా పానుపు సేవ/పవళింపు సేవ (ఐదుగురికి రూ.13/- మాత్రమే వసూలు చేసి) జరిపించేవారు. మళ్లీ సుప్రభాత సేవ ఉదయం 6-00 గంటలకి. (ప్రతీ శనివారం రేడియోలో ప్రారంభ కార్యక్రమంగా రిలే చేసేవారు).

ఇంక ప్రసాదాల విషయానికొస్తే, మధ్యాహ్నం 12-00 కి నైవేద్యం అయి మొదటిగంట కొట్టాక, అందరికీ "ఉచితంగా" ముఖ్య ప్రసాదమైన, స్వామికి సమర్పింపబడిన "శ్రీచందనం"; కర్పూరనామానికి చెందిన "శ్రీపాదరేణువు" ఇచ్చేవారట. (ప్రతీ గురువారం పచ్చకర్పూరనామం తొలగించడం ఆచారం. ఆ కర్పూరమే శ్రీపాద రేణువు.)

ఇప్పుడు ప్రసాదం అంటే--లడ్డూలే--రోజూ ఇన్ని లక్షలు చేయిస్తున్నాము, బ్రహ్మోత్సవాలకి మరిన్ని లక్షలు చేయిస్తాము--ఇలా! 

పై ముఖ్య ప్రసాదం కాకుండా, భక్తులు నైవేద్యంగా సమర్పించే ప్రసాదాలని కూడా యాత్రికులకి ఉచితంగా పంచిపెట్టేవారు. (నైవేద్యం పెట్టేవాళ్లు ఆ ఖర్చుని భరించి, దేవస్థానానికి నిర్ణీత రుసుము చెల్లించి, రశీదు పొందేవారు.)

ఆ ప్రసాదాలు రెండు రకాలు--అన్న ప్రసాదాలు, "పడుల" ప్రసాదాలు అని.

1. దధ్యోదనము; 2. పులిహోర; 3. పొంగలి; 4. చక్కెర పొంగలి; 5. సాకర బాత్; 6. కేసరి బాత్; 7. పాయసము; 8. నీరా--ఇవీ అన్న ప్రసాదాలు.

1. లడ్డు; 2. వడ; 3. పోళి; 4. దోసె; 5. అప్పము; 6. తేనె తొళ; 7. సుఖియ; 8. మనోహరము; 9. జిలేబి; 10. ఊకాయ పచ్చడి (చేయించువారే కాయలు సప్లై చేయవలెను.)--ఇవీ పడుల ప్రసాదాలు. 

ఏ ప్రసాదానికి ఆ రుసుము చెల్లిస్తే, వారిపేరనే వైవేద్యం సమర్పించి, చేయించినవారికి కొంత ప్రసాదం ఇచ్చి, మిగిలినవి యాత్రికులకి ఉచితంగా పంచిపెట్టేవారు. 

ఒకవేళ పై నైవేద్యాలు సమర్పించలేనివారు అయితే, కలకండ; కొబ్బరి; జీడిపప్పు మొదలైనవానిని తగిన సొమ్ము స్వీకరించి, రశీదు ఇచ్చి, అవే నైవేద్యం పెట్టి, ప్రసాదాలుగా ఇచ్చేవారు. 

ఇప్పట్లో చాలామంది "భక్తులు" పై ప్రసాదాల పేర్లయినా విని వుండరు! ఈ సారి వెళ్లినప్పుడు, వీటి విషయమై "పారుపత్య దారు" ని ప్రశ్నించండి. 

ఇదివరకు లేని "బ్రేక్" దర్శనాలూ, సెల్లార్ దర్శనాలూ, ఏ ఆగమం ప్రకారం నిర్వహిస్తున్నారో అడగండి.

పీఠాధిపతులు కూడా, దేవాలయానికి యెదురుగా నిర్మించబడిన అతి పెద్ద "సత్రం"--110 కుటుంబాలకి వసతికి అనుకూలంగా చిన్ని గృహములుగా మార్చబడిన దానిని--పడగొట్టడం ఆగమ శాస్త్రానికి విరుధ్ధం అని వాదించకుండా, నిజంగా ఆగమానికనుగుణంగా సేవలూ అవీ జరిపించడానికి కృషి చెయ్యాలి.

దక్షిణ భారతంలోని అన్ని ఆలయాలూ, కోవెలలూ మధ్యాహ్నం, రాత్రీ నిర్ణీతవేళల్లో మూసేస్తారు. వాళ్లది వేరే ఆగమమేమో అని డబాయించినా, ఇక్కడా ఆగమం అనేది ఒకటి వుంది అని ఒప్పుకొని, జనాలు యెగబడుతున్నారు కాబట్టి వీలైనంత సొమ్ము చేసుకుందాం అనే ధోరణిని యెప్పుడు విడిచిపెడితే అప్పుడు తిరుమల కి మళ్లీ "పవిత్రత" చేకూరుతుంది. 

ఇవన్నీ జరగాలంటే--ఆ స్వామే పూనుకోవాలి!

{పైన వ్రాసిన విషయాలు అధికారికంగా తి తి దే 1956--దుర్ముఖి; ఆశ్వయుజంలో ప్రచురించిన, నాలుగణాల వెలగల "తిరుపతి" (తిరుమల యాత్ర వివరములు) అనే పుస్తకం నించి గ్రహించబడ్డాయి}