Friday, December 31, 2010

శ్రీగిరి శ్రీపతి

శ్రీవారి ఆభరణాల విలువ

హమ్మయ్య! బెటర్ లేట్ దేన్ నెవర్ అన్నట్టు, ఇప్పటికైనా మన వున్నత న్యాయస్థానం వారి ఆదేశాల మేరకు ఆభరణాల విలువ లెఖ్ఖింపు ప్రక్రియ పూర్తి అయ్యిందట.

ఇదివరకే ముంబై, రాజస్థాన్ ల లోని జెమాలజీ నిపుణులు వజ్ర వైఢూర్యాల, ఇతర "రాళ్ల" నాణ్యత, పరిమాణం, స్వచ్చత, (విలువ?!) గురించీ, హైదరాబాదు మింట్ నిపుణులు బంగారం నాణ్యత, పరిమాణం, స్వచ్చత గురించీ రెండు నివేదికలు సమర్పించి వుండగా, ఇప్పుడు ఆభరణాల విలువపై నియమించిన కమిటీ కూడా నివేదిక సమర్పించిందట.

(తిన్నవాళ్లు తినగా, పోయినవి పోగా) "తిరువాభరణ" దస్త్రం మేరకు 137; "శ్రీ మలయప్ప స్వామి" దస్త్రం మేరకు 444; వెండివి 365; "ఇతర ఆభరణాల" దస్త్రం మేరకు 82--ఆభరణాల విలువని లెఖ్ఖించారట. (శ్రీవారికి వెండివి లేవా? ఇతరాలు 82 యేనా అని అడగొద్దు.)

శ్రీవారి "నిత్య కట్లు" విలువ లెఖ్ఖించలేదట. (వాటి వివరాల నమోదు యెక్కడైనా జరిగిందో లేదో!).

(అయినా, ప్రతి గురువారం అవికూడా లేకుండా స్వామి దర్శనం చేయిస్తున్నారుగా? ఇలాంటి దర్శనాన్ని రెండురోజులకి పొడిగించామన్నారు ఆ మధ్య. మరి రెండురోజులు చాలవా నిపుణులకి వాటి విలువ లెఖ్ఖించడానికి? యేమో. అసలు ఈ దర్శనాన్ని నిషేధించాలంటాను నేను--యెందుకంటే, "స్రగ్భూషాంబర హేతీనాం, సుషుమావహ మూర్తయే....." వల్ల "....శమనాయాస్తు....." అన్నారు కదా?) 

ఇంకా, భద్రతా కారణాల దృష్ట్యా, ఆభరణాల 'మొత్తం విలువ' ప్రకటించకుండా జాగ్రత్తపడ్డారట. సరే.

ఆయా దస్త్రాల్లో యే తేదీ వరకూ నమోదయిన వాటిని లెఖ్ఖించారో, ఆ తరవాత వచ్చిన వాటి మాటేమిటో, న్యాయ స్థానం వారూ, ఈవోగారూ తగిన కట్టుదిట్టమయిన యేర్పాట్లు చేసేలా చూడాలి. ఇక నించీ యెప్పటికప్పుడు నమోదుల వివరాలూ, వాటి విలువలూ ప్రకటిస్తూ వుండాలి.

మన పిచ్చిగానీ, వాటిని కాపాడుకోవడం లో శ్రీవారికీ, దిగమింగడంలో దగుల్బాజీలకీ జరుగుతున్న పోటీలో యెవరు నెగ్గుతున్నారో చూస్తూనే వుంటాం కదా!

Sunday, December 26, 2010

శ్రీగిరి శ్రీపతి

ఆభరణాలూ.....

"(తమకి చూపించిన) శ్రీవారి బంగారు, వెండి ఆభరణాలు 'పూర్తి స్వచ్చంగా' 'నాణ్యతతో' వున్నాయి" అని హైదరాబాదు ప్రభుత్వ మింట్ నిర్ధారించిందట.

"వందల కోట్ల" ఆభరణాల పట్ల తితిదే నిర్లక్ష్య ధోరణి వ్యవహరిస్తోందంటూ, అప్పటి సీవీ యెస్వో రమణకుమార్ నివేదిక ఇచ్చారట. 

దరిమిలా, "ఆభరణాలన్నీ సక్రమంగానే వున్నాయని, వాటి విలువ 'రూ. 51 కోట్ల 'నీ (తుర్లపాటి వారు కూడా సభ్యులుగావున్న కమిటీ) తేల్చి, న్యాయస్థానానికి ప్రాథమిక నివేదిక సమర్పించారట!

ఇప్పుడు, మరో మూడు 'స్వచ్చంద ' కమిటీలని నియమించి, ఆభరణాల 'స్వచ్చత, నాణ్యత ' ల మీద నివేదికలిమ్మందట!

వీటిలో, హైదరాబాద్ మింట్, 'మా ఆధ్వర్యంలో (???!!!) 650 బంగారు, 350 వెండి....పరిశీలించాం, రాళ్ల స్వచ్చతని.....పరిశీలించాం.....పొందుపరచిన విధానంలోనే వున్నాయి ' అని సర్టిఫికెట్ ఇచ్చేసిందట.

ఇంకో జెమాలజీ కమిటీ, 'అంతా సక్రమంగానే వుంది ' అని సర్టిఫై చేసేసిందట.

మూడో.....ఇంకమ్‌టాక్స్ కమిటీ నివేదిక ఇంకా ఇవ్వాల్సి వుందట.

యెంత "పార దర్శకంగా" సా....గుతున్నాయో కదా ఈ 'పరిశోధనలు?'

చేటంత చెవులున్న మహాపరమాత్ముడికి చిన్న నక్షత్ర గడ్డిపువ్వులు పెడుతున్నట్లు లేదూ....ఈ వ్యవహారమంతా???!!!

ఇక్కడ దృష్టి దోషాలేమిటంటే........

మనం అడిగేది......

దేవస్థానం 'హాథీరామ్‌జీ మఠం' ఆధ్వర్యంలో వున్నప్పటినించీ, కృష్ణదేవరాయలు కన్నా ముందునించీ, యేరాజులు యెప్పుడు యేయే ఆభరణాలు ఇచ్చారూ? ఆ తరవాత యెవరెవరు యెప్పుడెప్పుడు యేయే ఆభరణాలు ఇచ్చారూ? ఇవన్నీ నమోదు కాబడిన 'అదేదో' రిజిష్టరు ప్రకారం మీ వెబ్ సైట్ లో పెట్టండి. (పాత రికార్డు లేకపోయినా, కరిగించేశారేమో అని అనుమానం వున్నా) ఇప్పుడు 'ఫిజికల్ 'గా వున్నవి మాత్రమే పెట్టండి చాలు. గతం గతః. అదీ పారదర్శకత అంటే! (వాటి నాణ్యతా వగైరాల విషయానికి తరవాత వద్దాం) ఈ కమిటీలూ, "క్లీన్ ఛిట్లు" అనవసరం.

తేదీలవారీగా (పాతవాటి విషయంలో శతాబ్దాల, దశాబ్దాల, సంవత్సరాలవారీగానూ)
వివరాలు ప్రకటించండి. రోజువారీగా వాటిని అప్డేట్ చేస్తూ వుండండి. (ఈపని ఇప్పటికే చేసి వుంటే నాలాంటివాళ్లూ, యావద్భక్తులూ సంతోషించివుందురు) 

ఇప్పుడు చేసినా, అదే ఫలితం!

చేస్తారా?

Wednesday, December 1, 2010

శ్రీగిరి శ్రీపతి

........స్వర్ణ "భయం"

......వదిలించింది వున్నత న్యాయ స్థానం చివరికి. ఈ పథకం చేపట్టడానికి తి ది దే బోర్డుకి అధికారమే లేదనీ, అది రాజ్యాంగం లోని 25, 26 అధికరణలకి విరుధ్ధమనీ తీర్పు ఇచ్చింది.

శ్రీవారి గరుడవాహనం సందర్భంగా అలంకరించే 'పెద్దకాసుల పేరు ' లోని కాసులపై 'విక్టోరియా మహారాణి ' చిత్రం (ముద్ర) వుంటుందని యెందరికి తెలుసు? ఆ కాసులే యెందుకు వున్నాయి? అనేదానికి సమాధానం యెందరికి తెలుసు?

శ్రీవారి బ్రహ్మోత్సవాలు మొట్టమొదటిసారి నిర్వహించిన భక్తురాలు యెవరు? ఆవిడ బ్రహ్మోత్సవాల నిర్వహణ ప్రతి యేటా జరగడానికి వీలుగా వితరణ చేసిన భూమి యెంత? ఆ అయివేజుతోనే ఇప్పుడు వుత్సవాలు నిర్వహిస్తున్నారా?

అప్పటి రాజులు స్వామికి యెప్పుడు యేమేమి సమర్పించారు?

ఇలాంటి విషయాలన్నీ ఆ ప్రాకారం మీద శాసనాల రూపం లో శాశ్వతం గా ప్రతిష్టించబడ్డాయి.

అలాంటి గోడలని తాపడం కోసం ఐదు వేలకు పైగా బోల్టులు బిగించడానికి రంధ్రాలు చేసేస్తే, వాటిలో నీరు చేరి శాసనాలు దెబ్బతింటాయి అనీ, కట్టడం దెబ్బతింటుంది అనీ, పురావస్తు శాఖ ఇచ్చిన నివేదికని కూడా లెఖ్ఖ చెయ్యకుండా ఈ పథకం యెందుకు ప్రవేశ పెట్టినట్టు?

పాలక మండలి 'అంచనా' మేరకు బంగారం, నగదు, రూపం లో 152 కిలోల బంగారం ఇంతవరకూ వచ్చిందట. ఆది కేశవుడేమో, 160 కిలోలు వచ్చింది, మిగతా 40 కిలోలూ నేనే ఇచ్చేద్దామనుకున్నాను--అంటున్నాడు.

ఆసలు లెఖ్ఖలెక్కడున్నాయి? ఆ బంగారం యెక్కడుంది? ఇప్పటివరకూ తయారుచేసిన రేకులు యెక్కడున్నాయి? ఈ బంగారం భద్రత మాటేమిటి? స్వామికే తెలియాలి.

దర్శనాలు త్వరితంగా జరగడానికి 'కదిలే తివాచీ' యేర్పాటు విషయం లో మాత్రం తప్పదనే అభిప్రాయానికొచ్చారట .....యెంత త్వరగా యేర్పాటైతే అంత మంచిది.

వేయికాళ్ల మండపం నిర్మాణానికి అడ్డంకులని తొలగిస్తూ కోర్టు తీర్పు ఇచ్చిందనీ, దేవస్థానం నిర్మాణానికి పూనుకోవడం శుభపరిణామమని చిన జీయరు స్వామి సంతోషిస్తున్నాడు. ప్రస్తుత మండపాన్ని వందకాళ్లకు కుదిస్తున్నారనీ, స్థంభాలని అడ్డంగా నిర్మించేలా ప్రణాళికలు--పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారట.

33 కుటుంబాలకి, వంటలు చేసుకొని, భోజనాలు చేసి, నిద్రపోయే వసతి కోసం నిక్షేపంగా సరిపోయేలా నిర్మించబడ్డ (ఆరోజుల్లో అతిపెద్దదీ, ఆలయానికి అతి దగ్గరలో వున్నదీ) అయిన వేయికాళ్ల మంటపాన్ని, శిధిలమయిపోయిందని తొలగిస్తే, అదేదో ఆగమ శాస్త్రాలకి విరుధ్ధమని ఈయన అనవసరం గా హడావిడి చేశాడు.

భవిష్యత్తులో బహుళ అంతస్థుల క్యూలైన్ యేర్పాటు చెయ్యవలసి వస్తే ఇది ఆదర్శమైన ప్రదేశం అవుతుంది. అలాంటి చోట మళ్లీ మంటపాలు నిర్మించడం యెట్టి పరిస్థితుల్లోనూ వాంఛితం కాదు.

దేవస్థానం వారు గమనిస్తే మంచిది!

Sunday, October 24, 2010

శ్రీగిరి శ్రీపతి

శ్రీవారి డాలర్లు

శ్రీవారి డాలర్ల కొరత త్వరలో తీరనుందట. తి తి దే ఆర్థిక సలహదారు, ముఖ్య నిఘా భద్రతాధికారీ ముంబాయిలోని మింట్ కు వెళ్లి, 600 కిలోల బరువుగల డాలర్లని సరఫరా చెయ్యడానికి యేర్పాట్లు చేసి వచ్చారట.

ఆంధ్రా బ్యాంకు ద్వారా 10, 5, 2 గ్రాముల డాలర్ల విక్రయానికి యేర్పాట్లు చేశారట. మరో రెండు సంవత్సరాల అవసరాలకి అవి సరిపోతాయట.

హుండీకి చేరే బంగారాన్ని స్టేట్ బ్యాంకులో వడ్డీకి డిపాజిట్ చేస్తున్నారనీ, అలా ఇప్పటికి 'వెయ్యి కిలోల' బంగారాన్ని డిపాజిట్ చేశారనీ వార్త వచ్చింది. అది ఆభరణాల రూపం లోనా, ఇటుకలూ, బిస్కెట్ల రూపం లోనా తెలియరాలేదు!

Tuesday, October 12, 2010

శ్రీగిరి శ్రీపతి

"కంచి" కిరీటం

మన కంచి పీఠం స్వామికి బాగా "డబ్బు" చేసేసిందనుకుంటా--యెలా తగ్గించుకోవాలో యెవరూ చెప్పట్లేదేమో!

2.5 కోట్లతో, 14.5 కిలోల బంగారం, వజ్రాలతో వెంకన్నకి ఓ కిరీటం చేయించారట.

రేపు 21 న అందజేస్తారట.

(మళ్లీ రేపు తి తి దే నుంచి యే పథకం కోసం యెంత టెండరు పెడతారో?)

Sunday, October 10, 2010

శ్రీగిరి శ్రీపతి

డాలర్ల కొరత

తి తి దే వద్ద నిల్వలు లేకపోవడం తో రెండు నెలలుగా ఐదు గ్రాముల డాలర్లు విక్రయించడంలేదట.

గతం లో శ్రీవారి హుండీ ద్వారా వచ్చిన చిన్నా చితకా ఆభరణాలని, రాళ్ళు అవీ తొలగించి, బంగారాన్ని కరిగించి మింట్ లో డాలర్ల ముద్రణా, సరఫరా జరిగేవి.

ఇప్పుడు బంగారం కరిగింపులో అక్రమాలు జరుగుతున్నాయని, ఈ వో కృష్ణారావుగారు బంగారాన్ని బ్యాంకుల్లో వడ్డీకి డిపాజిట్ చెయ్యడానికే మొగ్గు చూపారట. అందుకే కొరత అంటున్నారు.

మరి అన్ని వేలో, లక్షలో చిన్నా చితకా ఆభరణాలని యే యే బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తున్నారో, వాటి వివరాలు యెక్కడ యెలా నమోదు అవుతున్నాయో--పత్రికలు వ్రాయలేదు.

బంగారం ఇవ్వఖ్ఖర్లేకుండా, మింట్ వారే వారి బంగారం తో డాలర్లు తయారు చేసి సరఫరా చేసేలా వొప్పందాలకి ప్రయత్నాలు జరుగుతున్నాయట.

ఈ ప్రయత్నాలు ఫలించకపోతే, డాలర్ల విక్రయం పూర్తిగా నిలిచిపోయే అవకాశం వుందట!

అసలు ఈ డాలర్ల పథకం యెవరిని వుధ్ధరించడానికి?

యేమో! స్వామికే తెలియాలి!

Friday, October 1, 2010

ఆర్జితపాపం

ఆరు పిడికెళ్లే

ఆర్జిత సేవల టిక్కెట్ల కుంభకోణం లో "ఆ ముగ్గురిదే" హవా అని దేవస్థానం నిఘా సంస్థ నిగ్గు తేల్చిందట. వీళ్ల హవా
కూడా--చైర్మన్ గారి తరవాతేట! (పాపం ఆయన్నేమీ అనకూడదట లెండి--వీళ్ల ముగ్గురిమీదే చర్యలు తీసుకోవాలట.)

గత రెండేళ్లలో 14 మంది బోర్డు సభ్యులకి విచక్షణకోటా క్రింద లభించే టిక్కెట్లలో, ఆది కేశవుడు 16,463 టిక్కెట్లు
మంజూరు చేయించుకోగా, సుబ్రహ్మణ్యం 8,800; అంజయ్య 8,539; యాదయ్య 6,962; మాత్రమే మంజూరు చేయించుకొని, యేజంట్ల ద్వారా అమ్ముకునేవారట.

వాళ్ల పీయే ల ద్వారా, యేజంట్లనించి ప్రతీ నెలా లక్షల్లో ముట్టేవట వీళ్లకి ఈ సేవా టిక్కెట్ల రూపం లో!

ఇక బ్రేక్ దర్శనాల్లో, ముఖ్యమంత్రి కార్యాలయం, మంత్రులు, ఎం పీలు, ఎమ్మెల్యేలూ వగైరా అందరి కోటా కలిపి 600 కి మించలేదట. కానీ సాయంత్రం బ్రేక్ కి మొత్తం 14 మంది సభ్యులూ 1,33,974 టిక్కెట్లు మంజూరు చేయించుకుంటే,
ఆదికేశవుడితో సహా ఈ ముగ్గురికీ 73,823 మంజూరయ్యాయట.

వుదయం బ్రేక్ కి అయితే, రెండేళ్లలో ఈ నలుగురి కోటాలోనూ వరుసగా 71,624; 31,779; 27,369; 24,611 మంజూరయ్యాయట!

వెంకన్నా! ఈ లెఖ్ఖలన్నీ అర్థమవుతున్నాయా? కుబేరుడికి వడ్డీ యెక్కువ కట్టేస్తున్నావేమో చూసుకో!

ఈ మధ్యనే సెంట్రల్ సర్వీసుకి వెళ్లడానికి వొప్పుకొన్న రాష్ట యెన్నికల ప్రథానాధికారి ఐ వీ సుబ్బారావు, గతం లో
దేవస్థానం ఈ వో గా పనిచేసిన అనుభవం తో, "సుదర్శన కంకణాన్ని తిరిగి ప్రవేశపెట్టాలనీ", "సుపథం పేరుతో
'కదిలే తివాచీ' యేర్పాటుచేసి, మహర్ద్వారం ముందుభాగం నించి సన్నిధిని కలుపుతూ తిరిగి వెలుపలకి చేరుకొనేలా
అమర్చాలనీ, అవసరాన్నిబట్టి వేగాన్ని తగ్గించడం పెంచడం చేయచ్చనీ," రెండు విలువైన సూచనలు చేశారు.

(ఇవన్నీ ఇదివరకు మనం అనుకున్నవేకదా?)

మరి ఆలకించేవాడేమంటాడో?

Friday, September 10, 2010

శ్రీగిరి శ్రీపతి

అదే తీరు


చిరుతపులి తన మచ్చల్ని మార్చుకోగలదా? 

యెడం చేయి తీసి పుర్ర చెయ్యి పెడితే యేమైనా తేడా వుంటుందా?

ముల్లూపోయి కత్తీ వచ్చే......లో యెన్ని పోతే కథ పూర్తవుతుంది?

పాలక మండలి పోయి, సాధికార మండలి వస్తే యేమైనా మారుతుందా?

యేమో మరి!

ఏకగవాక్ష విధానం కోసం "శ్రీ-సేవ" పేరుతో ఓ నాలుగంతస్తుల భవనాన్ని నిర్మిస్తారట. రాష్ట్రం లో వివిధ ప్రాంతాలతోపాటు, తమిళనాడు, కర్ణాటకల్లో మొత్తం ఓ 50 శ్రీ-సేవ కేంద్రాలు యేర్పాటు చేస్తారట!

కొండమీద ధ్యాన మందిరాలు కట్టిస్తారట!

(భద్రాచలం లో కొండమీదే ఆలయం ప్రక్కన కట్టిన "శ్రీ రామదాసు ధ్యాన మందిరం" ఇప్పటివరకూ యెందుకూ వుపయోగపడిన దాఖలాలు లేవు--అలాగే శిధిలం అయిపోతూంది.)

అయినా అభివృధ్ధికల్లా మూలం బిల్డింగులు కట్టడమేనా?

సరే--మహాలఘువుని రేపు ఒకటో తారీకు నించీ రద్దు చేశామని ఇప్పటికే ప్రకటించారు కదా? మళ్లీ ఇప్పుడు దర్శనాలపై "పునః సమీక్ష" చేస్తామనడం యేమిటి?

కొన్ని రోజుల్లోనే ఈ మార్పుకి కారణం యేమిటి?

యేమీ లేదు--వీళ్లు రోశయ్యగారితో సమావేశం లో పాల్గొన్నారట. ఇంకా అందులో మంత్రులు గాదె వెంకట రెడ్డి, దానం నాగేందర్, ప్రథాన కార్యదర్శి ఎస్ వీ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారట!

ఇదేదో విక్రమార్కుడి సిం హాసనం కథ లాగ.....!

అదండీ సంగతి!Friday, September 3, 2010

శ్రీగిరి శ్రీపతి

సామాన్యుడికి కాస్త వూరట

కొన్ని నిర్ణయాలు క్షణాల్లోనే జరగాలి. సంవత్సరాల తరబడి లాక్కుంటూ, పీక్కుంటూ కూర్చుంటే ప్రయోజనం వుండదు.

సాధికార మండలి మొదటి సమావేశం లోనే మంచి నిర్ణయాలు వెలువడ్డాయి.

మొదటిది--మహాలఘు దర్శనం రద్దుచెయ్యాలని.

సామాన్యులకి మూడురకాల దర్శనాలు అమల్లో వున్నాయి ఇన్నాళ్లూ.

లఘు దర్శనం--అంటే, స్వామికి దగ్గరగా వుండే మొదటి ద్వారం కాకుండా, రెండో ద్వారం దగ్గర దర్శనం కలిగించి, పంపించెయ్యడం.

మహాలఘు దర్శనం--అంటే, రెండోది కూడా కాకుండా, జయ విజయులు కాపలా వుండే మూడో ద్వారం దగ్గరనించే పంపించివెయ్యడం.

మహావీర లఘు దర్శనం--అంటే, మూడో ద్వారం దగ్గరకూడా నిలబడనియ్యకుండా, నెట్టేయడం/ఈడ్చెయ్యడం.

ఇప్పుడు మహా లఘువుని రద్దు చేస్తే, మహావీర లఘువు కూడా ఆటోమేటిగ్గా రద్దవుతుంది.

ఇక మిగిలేది లఘువు మాత్రమే! 

చూద్దాం, ఇదెలా వుంటుందో!

ఇక ఆర్జితసేవల కరెంటు బుక్కింగ్ మొదలెడతారట రేపు ఒకటో తారీఖు నించీ.

సుప్రభాతం, కల్యాణోత్సవం, నిజపాద దర్శనం లకి, ఒక్కోదానికీ 100 చొప్పున 300 టిక్కెట్లు వుదయం 8.00 నించీ, ముందు వచ్చినవారికి ముందు పధ్ధతిలో జారీ చేస్తారట.

ఊంజల సేవకి 10, సహస్రదీపాలంకరణకి 70, ఆర్జిత బ్రహ్మోత్సవానికి 25, వసంతోత్సవానికి 25 వంతున 135 టిక్కెట్లు జారీ చేస్తారట.

గుడ్డిలో మెల్లగా, డబ్బులు చెల్లించగల సామాన్యులకి ఇది మేలేగా?

ఇక ఆన్ లైన్ బుకింగులు మామూలేననుకుంటా.

సాధికార మండలి కొంచెం ముందుకెళ్లి, ఈ సేవల్ని పూర్తిగా రద్దుచేసే రోజొస్తే బాగుండును.

ఇంకా, ఈ ప్రమాణ స్వీకారాలు గుడిలో జరగకుండా నిరోధిస్తే ఇంకా బాగుండును.

ఇలా చేస్తే, లఘువుని కూడా రద్దు చేసి, మొదటి ద్వారం (కులశేఖరపడి) నుంచే అందరికీ, వీ ఐ పీ లతో సహా, చక్కగా దర్శనం కల్పించవచ్చు.

స్వామి ఇంకెప్పుడు కరుణిస్తాడో సామాన్యుల్ని!

Friday, August 20, 2010

తితిదే పాలక మండలి

శుభవార్త

ఇప్పటికి రాష్ట్ర మంత్రి మండలి, ప్రస్తుత తితిదే పాలక మండలి గడువు ముగిశాక, కొత్తగా యెవరినీ నియమించకుండా, ఓ ప్రత్యేక అధికార సంస్థ (అథారిటీ) యేర్పాటు చెయ్యాలని  నిర్ణయించిందట.

ఇప్పటికిది శుభవార్తే మరి. ఆ సంస్థ యెలా వుంటుందన్నది తరవాత సంగతి.

ఈ లోగా ఆదికేశవుడు మొయిలీ దగ్గరనించి ప్రణబ్ వరకూ; అహ్మద్ పటేల్ నించి సోనియా వరకూ వినతిపత్రాలు ఇచ్చుకుంటూ వస్తున్నాడట--తనకి ఇంకో అవకాశం ఇవ్వాలని! (ఆయనకి పగ్గాలు అప్పగించిన ఆసలు ఒప్పందం లో ఒకసారి అని వుందో, రెండుసార్లు, లేదా ఆయన జీవితకాలం అని వుందో తెలియదు మరి)

ఇక, ఆర్జితసేవా టిక్కెట్ల కుంభకోణం లో--ఇది గత నాలుగేళ్లుగా సాగుతోందనీ, పాలక మండలి సభ్యులు యాదయ్య, అంజయ్య, సుబ్రహ్మణ్యం అనేవాళ్లతో సహా మొత్తం 54 మంది  దీనికి బాధ్యులు అని వారి విజిలెన్స్ శాఖ నిర్ధారించి, వారిమీద చర్యలు తీసుకోమని నివేదిక ఇచ్చిందట.

ఇందులో, యాదయ్య, అంజయ్య--బలహీన వర్గాలకి చెందినందువల్లే తమని ఇరికించారని ఆరోపించారట! మరి నివేదికలోని మిగిలిన పాలకవర్గ సభ్యుల కులాలేమిటో మనకు తెలియదు.

(ప్రభుత్వ, ప్రభుత్వ సంస్థలేకాదు--మిగిలిన సంస్థల్లోకూడా, సహజం గా వాళ్ల విజిలెన్స్ శాఖలో, మేనేజిమెంటు యెవరిని నొక్కెయ్యమంటే వాళ్లని నొక్కేసే తొత్తులు వుంటారనుకోండి.)

నిజానిజాలు శ్రీవారికే తెలియాలి.

కొసమెరుపేమిటంటే, సూర్యనారాయణ రెడ్డి, కస్తూరి రంగన్ అనే తితిదే వుద్యోగులు ఈ తరహా కుంభకోణానికి పాల్పడుతున్నారని విజిలెన్స్ సంస్థ 2008 లోనే నివేదిక ఇచ్చినా, అప్పటి ఈవో అది బుట్టదాఖలు చెయ్యడమే కాకుండా, వాళ్లకి పదోన్నతులు ఇచ్చారని ఈ నివేదికలో పేర్కొన్నారట!

అదండీ సంగతి!

Monday, July 19, 2010

శ్రీగిరి శ్రీపతి

దర్శనాలు

ఆది కేశవుడు మళ్ళీ ఇంకో కాంగీరేసు నాయకుణ్ణి 'మహావీర స్పెషల్' దర్శనానికి తీసుకెళ్ళాడట. క్యూలైన్లు ఆపలేదుట లెండి.

ఆ నాయకుడికీ, వెనకాలో పదిహేను మందికీ మాత్రమే, అందరికీ శీఘ్ర దర్శనం టిక్కెట్లు తెప్పించి, (అక్షరాలా తొమ్మిది వేల ఆరు వందల రూపాయలు--యెవరిచ్చారో!) వాళ్ళని ఆ లైన్లో రమ్మని, ఈయన మహర్ ద్వారం దగ్గర నించొని, వాళ్ళందరినీ తీసుకెళ్ళి, లఘు దర్శనం స్థానం లో వున్న తండులను తొలగించి, సన్నిధికి తీసుకెళ్ళి, నైవేద్యం గంట సమయం లో, ప్రత్యేక దర్శనం చేయించాడుట.

(మరి ఆ స్వామికి ఆ సమయం లో ఆ ప్రసాదం సహించిందో లేదో!)

ఈ దేవస్థానం పాలిటికి మోహన్ బాబొకడు. 

వేదపాఠశాలకెళ్ళి, 700 మంది విద్యార్థులు దారుణమైన మౌలిక వసతుల మధ్య వున్నారనీ, వాళ్ళ భోజన శాల పందులు తిరిగే ప్రదేశం లా వుంది అనీ, విలేకర్ల సమావేశం పెట్టి మరీ తగులుకున్నాడు.

ఈ వో గారు, "ఓ నెల లోపు" చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారట.

పాపం ఆ విద్యార్థుల గతేమౌతుందో!

మరి భక్తి చానెల్ వాళ్ళు, గంటకొట్టినంతసేపూ ఆడియో వినిపిస్తూ, గోపురం వీడియో చూపించేకంటే, ఇలాంటి పాఠశాలల్నీ వగైరాలని చూపిస్తే యెలా వుంటుందో.

 

Thursday, July 1, 2010

ఆభరణాల లెఖ్ఖలు

శ్రీ కృష్ణరాయాభరణీయం

నాకు గనక కార్టూన్లు గీయడం వస్తే, 'హా! హతవిథీ!' అని శ్రీ కృష్ణదేవరాయలు తల మొత్తుకుంటున్నట్టు కార్టూన్ గీసేవాడిని!

మరి ఆయన శ్రీవారికి సమర్పించిన ఆభరణాలేవీ ఇప్పుడు లేవట!

40 యేళ్ళ క్రితమే కరిగించివేసి వుండొచ్చు--అని తి తి దే వారి వువాచట!

ఇది మాత్రం పచ్చి అబధ్ధం! అప్పుడే నేను పత్రికల్లో చదివాను--"హుండీలోనూ వగైరా లభించిన చిన్నా, చితకా ఆభరణాల సంచులతో బొక్కసం నిండిపోతుంటే, వాటిని కరిగించి ఇటుకలు తయారు చెయ్యమని ప్రభుత్వ 'మింట్' కి పంపించారనీ, వాటిలో రాళ్ళని వేరే వేలం వేశారనీ!" (ఈ విషయం నా ఇదివరకు టపాల్లో స్పష్టం గా వ్రాశాను--వీటిలో ఖచ్చితం గా కంటెలూ, కాసుల పేర్లూ, కఠారులూ, కిరీటాలూ వగైరాలు లేవు!)

ఆభరణాల వివరాలకోసం నా క్రింది టపాని చూడండి--

http://krishnaagovindaa.blogspot.com/2009/10/blog-post_20.html


మొన్నీమధ్యనే ఓ కమిటీ శ్రీవారి ఆభరణాలన్నీ భద్రం గా వున్నాయనీ, వాటి విలువ కేవలం 52 కోట్లేననీ ప్రకటించింది!
(ఆ కమిటీకి తుర్లపాటి కుటుంబరావు దూరం గా వుండి వుంటే బాగుండేది అని నా అభిప్రాయం)

చూ|| http://krishnaagovindaa.blogspot.com/2009/11/blog-post_05.html

ఇక ఇప్పుడు రాయలు అసలు ఆభరణాలేవీ ఇవ్వలేదనీ, వూరికే పబ్లిసిటీ చేసుకున్నాడనీ ఆయన మీద పరువునష్టం దావా వేస్తుందేమో తి తి దే!

వీళ్ళిలాంటి వేర్రాలోచనలు చేస్తారని 500 యేళ్ళక్రితమే రాయలు వూహించి, రాళ్ళమీద శాసనాలు చెక్కించాడు!

అసలు ఈ శాసనాలని కనిపించకుండా చెయ్యడమే 'స్వర్ణమయం' వుద్దేశ్యమేమో!

నగరాల్లో 'కల్యాణోత్సవాల' పేరిట ప్రైవేటు వ్యక్తులు వీలైనంత దండుకున్న వార్తలు కూడా వచ్చాయి కదా?

ఇంకా వీళ్ళు యెన్నెన్ని వుపాయాలు కనిపెడతారో?

అందుకే అన్నారు "శతకోటి దరిద్రాలకి అనంతకోటి వుపాయాలు" అని!

(శతకోటి దరిద్రుల్లో వీళ్ళ శాతం యెంతో?)


Wednesday, June 23, 2010

అక్రమార్కులు

'......సేవలు'

కొంతమంది ఆర్జన కి మాత్రమే వుపయోగపడుతున్న ఆర్జిత సేవల టిక్కెట్ల కుంభకోణం లో, సుబ్బిరామిరెడ్డి హస్తం కూడా వుందట.

'ఓ ఇరవై లక్షలు పంపించాం! ఉదయాస్తమాన సేవ టిక్కెట్ కోసం--అవి లేవన్నారు, సరేపోనీ మిగిలిన సేవలకి ఓ 168 టిక్కెట్లో, 186 టిక్కెట్లో పంపించండి అన్నాం! వాళ్ళు వెంటనే పంపించారు' అని ఆయన భార్య వివరణ.

'ఇందులో యేమీ అక్రమాలు లేవు' అని ఆదికేశవుడి సమర్థన!

వీ ఐ పీ ల కోసం, గంటలతరబడి క్యూ లైన్లు ఆపెయ్యడం--'ఒక్క క్షణం కూడా ఆపలేదు' అని ఆదికేశవుడి బుకాయింపు!

లఘు, మహా లఘు, మహావీర లఘు దర్శనాలకి సామాన్యులకి అనుమతిస్తున్న ఓ సెకనో, రెండు సెకన్లో సమయం ప్రకారం రేటు కట్టి, వీ ఐ పీల దగ్గర అంత డబ్బూ యెందుకు వసూలు చెయ్యరు?

వాళ్ళు సేవలు చేస్తేనే స్వామి తరిస్తున్నాడా?

అసలు ఈ సేవల్ని యెందుకు రద్దు చెయ్యరు?

Tuesday, May 11, 2010

దర్శనాలూ, సేవలూ


ఆ(ర్జిత)ర్జన సేవలు

సేవల కోసం టిక్కెట్లని ఆన్ లైన్ లో విక్రయించడం తో, ఒక్కో భక్తుడిపేరిట కొన్ని వందల టిక్కెట్లు నమోదయ్యాయట.

అందుకని, ఇప్పుడు 'కఠిన నిర్ణయం' తీసుకొని, మార్గదర్శకాలు జారీ చేశారట.

ఇకపై గృహస్థులు యేడాదికి ఒకసారి మాత్రమే వస్త్రాలంకార (మేల్ చాట్ వస్త్రం) సేవలో పాల్గొనే అవకాశం ఇస్తారట.

అభిషేకం, తోమాల, అర్చన, సుప్రభాతం, సేవాటిక్కెట్లపై, యేదైనా ఐదు టిక్కెట్లపై మాత్రమే శ్రీవారి సేవలో పాల్గొనడానికి అనుమతిస్తారట.

సేవ వినియోగించుకునే సమయాన్ని యెంచుకునే అవకాశం భక్తులకే ఇస్తారట.

రేపు శుక్రవారం నించే, భక్తులు వైకుంఠం-1 వద్ద తమ గుర్తింపుకార్డులు చూపిస్తేనే, అనుమతిస్తారట.

గమనించండి--ఇక్కడకూడా భక్తులకే నష్టం!

విచక్షణ కోటా క్రింద రోజూ వెళ్ళే వందలాదిమందికి యేమీ నష్టం వుండదు!

అసలు ఇంత అవకతవక, కంగాళీ విధానాన్ని యెలా ప్రవేశ పెట్టారు? యే సాఫ్ట్ వేర్ నైనా కొన్ని వందలసార్లు పరీక్షించి, అది సరిగా పని చేస్తోందని నిర్ధారణ అయ్యాకే, ప్రవేశ పెడతారు కదా? 

ఆ విషయం వీళ్ళకి వర్తించదా? దీనికి బాధ్యులెవరు?

సమాధానం యెవరు చెపుతారు!

Sunday, May 2, 2010

శ్రీగిరి శ్రీపతి

'......గోవిందా!'(లు)

పట్టణ గోవిందం, పల్లె గోవిందం, గిరిజన గోవిందం లు కిట్టుబాటు కావడం లేదు కాబోలు--యేకం గా 'ఫారిన్  గోవిందం' తలపెట్టి, ఓ మందని దేవస్థానం ఖర్చుతో ఫారిన్ యాత్ర చేయిద్దామనుకొన్నారు.

దైవమింకొకటి తలిచి, మందలో చాల మందికి వీసాలు రాకపోవడం తో, కొంతమందే వెళ్ళారు.

ఓ నగరం లో మొన్ననే ఓ గోవిందం 'దిగ్విజయం' గా పూర్తయ్యింది కూడా!

యెలా?

1000 డాలర్లు చెల్లించినవారికి--వీ ఐ పీ దర్శనం, 10 నించి 1000 లోపు డాలర్లు చెల్లించినవారికి--ఓ గంటనించి 10 గంటల్లో దర్శనం--ఇలా దండుకున్నారని మీడియా కోడై కూస్తోంది. 

(ఈ మీడియాకేం పనిలేదు. అస్తమానూ కోడైపోతూ వుంటుంది--అని విసుక్కుంటున్నారు నిర్వాహకులు!)

1000 డాలర్లంటే దాదాపు 50,000 రూపాయలు!

మరీ ఇంత కక్కుర్తా అని చెవులు కొరుక్కుంటున్నారు--ప్రవాసీ భక్తులు!

పోతే వాళ్ళే కదా! మనకేం?

Thursday, April 22, 2010

శ్రీగిరి శ్రీపతి

తాజా వార్త

ఆయనెవరో వేసిన మాత్ర (పిల్) లో ఉన్నత న్యాయస్థానం 'ఆనంద.........మయం' కార్యక్రమం పై 'స్టే' ఇచ్చిందట.

(ఆనంద మయం కావలసిన నిలయాన్ని, స్వర్ణ మయం చెయ్యదలుచుకోడమే క్షమించరాని నేరం)

అయినా ఆదికేశవుడు వూరుకుంటాడా అని నా సందేహం. 

(ఓ పక్కన తెలంగాణా రాజుకుంటే, గాలి తన 'స్టేలు' వెకేట్ చేయించుకుని కొన్ని వేల కోట్ల ఇనప ఖనిజాన్ని యెగుమతి చేసేశాడు--సందట్లో సడేమియాగా! అలాంటివి మన న్యాయస్థానాలు!)

అన్నట్టు గాలి గారిచ్చిన వజ్రకిరీటం విలువ 23 కోట్లో యెంతో తేల్చారట కమిటీ వారు--అదేదో స్కోప్ తో పరీక్షించి! (మీడియా చెప్పిన, బహుశా ఆయన ఇన్ కమ్ టేక్స్ రిటర్న్ లలో చూపించిన--59 కోట్లో యెంతో కాదన్నమాట!)

పైగా అంబానీ లాంటివాళ్ళు తమ 'ఇస్తికఫాల్ ', 'తీసుకుంటి కపాల్ ' లాంటి స్వాగతాలకి సంబరపడిపోయి, మళ్ళీ ఈ 'మయం' కి 1.11 కోట్లు ఇచ్చారట. (ఇంతకు ముందు 5.5 కోట్లో యెంతో ఇచ్చారట.)

ఈ మధ్య ఇంకాచాలా మంది కొన్ని కేజీల బంగారాన్నీ, కోట్ల రూపాయల్నీ ఇచ్చారు. 

(రేపు మన కేశవుడు 'యేడుకొండలూ స్వర్ణమయం' కార్యక్రమాన్ని ప్రకటించినా ఆశ్చర్యం లేదు!)

దేవుడా! అందరికీ మంచి బుధ్ధిని ప్రసాదించు!

అని తప్ప ఆ స్వామిని యేం వేడుకోగలం?

Tuesday, April 13, 2010

శ్రీగిరి శ్రీపతి

దర్శనాలు......

గిరిజన గోవిందానికి హాజరయ్యే భక్తులకి, శ్రీవారి రాగి డాలర్లు పంచిపెడతారట.

ఆర్జితసేవా టిక్కెట్ల ధరల పెంపు విషయం లో ఇంకా యెలాంటి నిర్ణయం తీసుకోలేదట.

శీఘ్రదర్శనం ద్వారా నాలుగు గంటల్లో భక్తులకి దర్శనమయ్యేలా కృషి చేస్తారట.

ఏ వీ ఎస్ వో వెంకట శివుడు పై వేటు వేయాలని నిర్ణయించారట.  డిప్యూటీ ఈ వో భాస్కర రెడ్డి పై కఠిన చర్యలు తీసుకుంటారట.

వైకుంఠం 2 లో కాయిన్ బాక్స్ ఫోన్లు యేర్పాటు చేస్తారట.

కేటాయించినవారు కాకుండా ఇతరులు 'వినియోగిస్తున్న' 400 కాటేజీలని స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించారట.

ఈ వో--ఐ వై ఆర్ కే రావు గారి ప్రకటనలివి.

శుభం!

వీ ఐ పీ లకి మాత్రం వారి అనుచరుల్తో సహా అందరికీ 'పెద్ద పీటలు' పట్టుకొని రెడీ గా వుంటున్నారట--దేవస్థానం వారు.

నిన్న (13-04-2010) న ప్రముఖుల పేరిట 700 వీ ఐ పీ దర్శన టిక్కెట్లు విక్రయించారట. వీరందరికీ దర్శనం పూర్తి అయినా, 7-45 లోపే ధర్మ దర్శనం ప్రారంభించాల్సింది, 9-00 దాటినా మొదలవలేదట.

కారణం--ముఖ్యమంత్రి అల్లుడు తో పాటు ఓ 50 మందికి పైగా, వారి దర్శనం పూర్తయ్యాక, చిరంజీవి, అయన పార్టీ నేతలూ చాలాసమయం శ్రీవారి సన్నిధి లో గడిపారట!

వాళ్ళు శ్రీవారి సన్నిధిలో వున్నా, ధర్మ దర్శనం కొనసాగించవచ్చుకదా? వాళ్ళు యెలా మొక్కుతున్నారో సామాన్యులు చూస్తే వీ ఐ పీ లకీ, వాళ్ళ అనుచరులకీ నమోషీ యేమో!

ఇన్ని వందల మందికి 'పెద్ద పీటలు' యెప్పుడు మానేస్తారో!

తిరుమలేశా! నీదే భారం!

Monday, April 12, 2010

శ్రీగిరి శ్రీపతి

ప్రసాదాలూ, సేవలూ

మొన్న ఓ పేపర్లో, 'శ్రీవారి అన్నదానం కోసం లడ్డూలు చుడుతున్న కార్మికులు ' అంటూ కొందరు స్త్రీల ఫోటో ని ప్రచురించారు. 

వాళ్ళు శ్రీవైష్ణవులేనా? వాళ్ళని ఆగమ శాస్త్రం ప్రకారం నియమించారా? మొదలైన విషయాలు ఆ పత్రిక వ్రాయలేదు. 

అన్నదానం కోసం వేరే, ప్రసాదం కోసం వేరే లడ్డూలు తయారు చేస్తారా? అన్న విషయం కూడా ఆ పత్రిక వ్రాయలేదు.

ఇక శ్రీవారి సేవలకి ఆన్ లైన్ లో టిక్కెట్లు బుక్ చేసుకునే సదుపాయం కల్పించింది కదా దేవస్థానం! 

మనం ఇదివరకే లెఖ్ఖలు వేశాం--ఈ సేవల్లో పాల్గొనేవాళ్ళు యెంతెంత చెల్లించాలో! కానీ, సేవల టిక్కెట్టు ధర కేవలం 120 రూపాయలు మాత్రమేనట!

వుదాహరణకి, శ్రీవారి సుప్రభాత సేవకి, 200 మంది భక్తుల్ని మాత్రమే అనుమతిస్తారట. 24000/- మాత్రమే ఆదాయం వస్తుంది ఒక రోజుకి. కానీ, ఆన్ లైన్ లో ఒకే పేరుతో, ఒకే నెలలో, 16 టిక్కెట్లు బుక్ అయ్యాయట! మళ్ళీ ఒక్కొక్క టిక్కెట్ నీ 2000/- కు పైగా దళారులు విక్రయిస్తున్నారట!

యే పథకాన్నైనా ప్రవేశపెట్టే ముందు, దానికి సంబంధించిన సాఫ్ట్ వేర్ ని అనేక విధాల పరీక్షించి మరీ ప్రవేశ పెడతారు. కానీ మన దేవస్థానం వారు మాత్రం, డబ్బులు చెల్లించేసి, సప్లయర్స్ "ఇంక మీ ఇష్టం--తన్నుకు చావండి" అన్నా, చక్కగా వొప్పుకుంటారట.

ఇప్పుడు, కొత్త ప్రోగ్రాం రూపొందించారట!

అసలు, ఈ సేవల టిక్కెట్ల రేటునే 2000/- నిర్ణయించవచ్చుకదా? 4,00,000/- వస్తాయిగా? మన లెఖ్ఖకూడా దాదాపు సరిపోతుంది కదా? ఆ పని యెందుకు చెయ్యరు?

(ఈ సేవల్ని ఆసాంతం రద్దు చేస్తే మహా బాగుంటుంది--కానీ.......జరగడం లేదు!)

ఇక లడ్డూ కాకుండా, ఆపం, వడ, పొంగలి మొదలైన పదహారో యెన్నో రకాల ప్రసాదాలని నైవేద్యం పెడతారు ప్రతీరోజూ శ్రీవారికి! ఇవేవీ భక్తులకి దక్కవు.

ఓ హోటల్లో ఓ పెద్దమనిషికి 3000/- రూపాయలు ఇస్తే, ఒక్కొక్క ప్రసాదం నామకహా జాగ్రత్తెపెట్టి, మనకి ఇస్తారట!

అదే 8000/- ఇస్తే, కావలసినంత క్వాంటిటీలో అన్ని ప్రసాదాలూ మనకి ఇస్తారట!

మరి ఈ ప్రసాదాల రేటు కూడా అంతకి పెంచితే, అక్రమాలు జరగకుండా, కొనుక్కోగలిగినవాళ్ళకే అందుతాయి కదా? ఆ హోటలు వాళ్ళెందుకు బాగుపడాలి?

ఈ వో గారూ! కొంచెం చూస్తారా?

Saturday, April 3, 2010

శ్రీగిరి శ్రీపతి

దర్శనాలు, ప్రసాదాలు


శ్రీవారి నిత్యాన్నదానం ట్రస్ట్ కి 25 యేళ్ళు నిండుతున్నాయి. 60 లక్షల తో ప్రారంభమైన ట్రస్ట్, 220 కోట్లకి పెరిగిందట. శుభం!

అన్నిదానాలలోకీ అన్నదానం గొప్పది అంటారు. అలాంటి దానానికి డిపాజిట్లు ఇచ్చిన దాతలు ధన్యులు.

నిజం గా ఆకలిగొన్నవాళ్ళతోపాటు, శ్రీవారి ప్రసాదం గా భావించి స్వీకరించేవాళ్ళు, ఓ పనైపోతుంది అని యెంగిలి పడి లేచేవాళ్ళు--యెవరైనా, రోజుకి ఓ 80 వేలమంది భోజనాలు చేస్తున్నారు.

ఆ మధ్య ఈ డిపాజిట్లని బ్యాంకులకి తనఖా పెట్టి అప్పుచేసి, ఆ అప్పుని మళ్ళీ ఇంకో రకం గా వుపయోగిస్తున్నారు అని వార్తలు వచ్చాయి. మరి దీని సంగతి యేమయ్యిందో!

రోజుకు 3 లక్షల లడ్డూల తయారీ కోసం యేర్పాట్లు చేశారట. ఇందుకు "సనాతన సంప్రదాయం మేరకు" "ఆగమ శస్త్రోక్తం గా" 250 మంది "శ్రీవైష్ణవ బ్రాహ్మణులను" పోటు కార్మికులుగా నియమించారట. (అసలు ఆగమ శాస్త్రానికీ, బూందీ తయారీకీ, లడ్డూలు చుట్టడానికీ సంబంధం యేమిటో! వాళ్ళెవరికైనా ఈ విద్యల్లో ప్రావీణ్యం వుందో లేదో పరీక్షించారా? లేక శ్రీవైష్ణవులు అవడమే క్వాలిఫికేషనా? యేమో!)

ఈ మధ్య ద్వారకా తిరుమలలో లడ్డూ ప్రసాదం లో పటికబెల్లం బిళ్ళల సంఖ్యని కొంచెం తగ్గించారు. ఈలాంటి అలోచనేమైనా వీరికి వుందా?

ఇంకా, రోజుకు 8 టన్నుల ఆవునెయ్యి సరఫరాకి--గాలి సోమశేఖర రెడ్డి తో వొప్పందం చేసుకుంటారట! (ఈయన మన గాలి ధనార్జన రెడ్డి సోదరులకి యేమౌతారో తెలియదు.)

ఇక మనం ఓ ట్రెడ్ మిల్ లాంటిది యేర్పాటు చేస్తే బాగుంటుంది అనుకున్నట్టు, శ్రీవారి దర్శనానికి మహర్ద్వారం నించి శ్రీవారి సన్నిధి, విమాన ప్రాకారం కింది భాగం  మార్గం ద్వారా తిరిగి మందిరం వెలుపలివరకు 'చేరవేత పట్టా' (కన్వేయర్ బెల్ట్) యేర్పాటు పై బెంగుళూరుకు చెందిన బి ఎన్ ఎ టెక్నాలజీ కన్సల్టింగ్ లిమిటెడ్ కంపెనీ నిపుణులు ఆలయాన్ని సందర్శించారట.

యెంత శుభవార్త! 

కాని, ఇక లఘు, మహాలఘు, మహావీరలఘు దర్శనాల స్థానం లో, ఎక్స్ ప్రెస్, డీలక్స్, సూపర్ డీలక్స్ దర్శనాలు ప్రవేశపెడతారేమో--సామాన్యులకి, వీ ఐ పీ లకి, వీ వీ ఐ పీ లకి--అదే క్రమం లో! (అంటే, సామాన్యులు పట్టా యెక్కినప్పుడు వీర స్పీడులో పరిగెట్టేలా, మిగిలినవాళ్ళకి కొంచెం నెమ్మదిగా, తరవాతవాళ్ళకి ఇంకొంచెం నెమ్మదిగా నడుపుతారేమో ఆ పట్టాని!)

చూద్దాం!

Saturday, March 20, 2010

శ్రీగిరి శ్రీపతి

డ్రెస్ కోడ్

తాజా వార్త. ఇప్పటివరకూ శనివారాల్లో దేవస్థానం వుద్యోగులని డ్రెస్ కోడ్ పాటించి, పంచెలూ, నామాలూ ధరించమన్నారట.

ఇప్పుడు అన్నిరోజుల్లోనూ ధరించేలా చేస్తారట. ముఖ్యోద్దేశ్యం, భక్తులకీ, వుద్యోగులకీ తేడా తెలియడానికట.

అనేకవేల గుళ్ళలో (గుండులు అనే ప్రయోగం లేదు తెలుగు లో--గుడులకైనా, గుండులకైనా ఒకటే  మాట--గుళ్ళు!), నామాలూ, అడ్డపంచెల్లో,  వుద్యోగులని యెలా గుర్తుపట్టాలి?

అడ్డపంచె తమిళుల చిహ్నం. మన పురోహితులూ, అర్చకులూ, భక్తులూ చక్కగా గోచీపోసి పంచె కడతారు. అలాంటి అలవాటున్న వుద్యోగులు కూడా అడ్డపంచెలు ధరించవలసిందేనా?

ఇంతకన్నా, వాళ్ళు తమ ఐ డీ కార్డులని చొక్కా జేబుల్లో వేసుకొని, మెడచుట్టూ తాళ్ళతో కనిపించడం కాకుండా, కార్డులు కనిపించేలా మెడలో వేళ్ళాడేసుకోమంటే ఇంకా బాగుంటుంది కదా?

(ఆ మెడతాళ్ళు ప్రతీవాళ్ళకీ వుంటాయి--పోలీసులకీ, గైడ్ లకీ, డ్రైవర్లకీ, కంపెనీ ప్రతినిధులకీ--ఇలా)

(స్త్రీ వుద్యోగులు చొక్కాలు వేసుకోరు. అయినా వాళ్ళు కార్డులని 'జేబుల్లో' పెట్టుకోకుండా బయటికి వేసుకోవడం గమనించండి!)

ఎల్ కే జీ లో వున్న మా మనవడు వాళ్ళ స్కూల్ డ్రెస్ కోడ్ ప్రకారం నిక్కరూ వగైరా వేసుకొని, ఐ డీ కార్డు వేళ్ళాడేసుకొని స్కూల్ వ్యాన్ లో వెళ్ళి వస్తూంటే, ఆ కార్డువల్ల తొడలు గీరుకు పోయేవి. నేను చూసి, మెడతాడు పొడవు తగ్గేలా పైకి ముడివేసి వాణ్ణి పంపిస్తే, స్కూల్ నించి వచ్చాక, 'తాతా! అయాం హేపీ! ఇవాళ కార్డు గీరుకోలేదు!' అని ఆనందించాడు.

(ఇలాంటి పొడుగుతాళ్ళెందుకసలు? అవి తయారుచేసే కంపెనీల లాభాలకోసం తప్ప!) 

యేమంటారు?

Monday, March 1, 2010

ఆరంభశూరత్వం

సంస్కరణలు

భక్తుల సౌకర్యార్థం యేవో సంస్కరణలు తెస్తామనడం ఆరంభ శూరత్వమేనని తేలిపోయింది!

వీళ్ళు ప్రవేశపెట్టిన సంస్కరణల్లా 600 రూపాయల శీఘ్రదర్శనం ఒకటే!

మిగిలినవన్నీ దొడ్డిదారినో, ప్రత్యామ్నాయం గానో కొనసాగిస్తున్నారు.

ఈ శీఘ్ర దర్శనం కూడా, 8 నించి 10 గంటల తరవాత, మహా వీర లఘు గానే కొనసాగుతోందట.

పైగా టిక్కెట్లు 'బ్లాక్' లో అమ్ముతున్నారట. ఈ భక్తుల్ని కూడా శ్రీపతే రక్షించుగాక.

రెండో వైకుంఠం లో అనుకుంటా, తలుపులు తెరిచి బయటికి వెళ్ళి, మళ్ళీ చెప్పిన టైముకి తిరిగి కాంప్లెక్స్ లోకి వచ్చే సౌకర్యం కల్పించారట--మరి సుదర్శనం టోకెన్ల వుద్దేశ్యం అదే కదా? వాళ్ళు కూడా మళ్ళీ కాంప్లెక్స్ లోంచి బయటికి వచ్చి, చెప్పిన టైముకి తిరిగి రావాలో యేమిటో!

చంటిపిల్లల తల్లులకి కూడా మహర్ద్వారం నించి జనరల్ క్యూలో కలిపేస్తారట!

మొన్నటి బోర్డు సమావేశం తరవాత, విలేఖర్లు అడిగిన ప్రశ్నకి ఆదికేశవుడు 'యెస్కలేటర్ ప్రవేశపెట్టే ప్రతిపాదనేమీ లేదు--యెవరైనా ప్రతిపాదన బోర్డుకి పంపితే, చూస్తాం!' అన్నాడు.

మరి ప్రతిపాదన పెట్టవలసినవాళ్ళకి యేమైనా సూచన ఇచ్చారా? ఇవ్వరు! ప్రతిపాదన యెవరు పెట్టాలి? బ్లాగరులా? భక్తులా? వుద్యోగులా? వీ ఐ పీ లా? ప్రజా ప్రతినిధులా?

వీళ్ళెవరైనా ప్రతిపాదన చేస్తే దాన్ని బోర్డు స్వీకరిస్తుందా?

మరెందుకీ శషభిషలు!

పైగా 'బడ్జెట్' ప్రకారం దేవస్థానం ఆదాయం తగ్గిపోతోందట! శని ఆది వారాల్లోనే, హుండీ ద్వారానే కొన్ని కోట్ల ఆదాయం వస్తూంటే--తగ్గడం యెలానో?

అప్పలకీ, దొప్పలకీ అనవసర కేటాయింపులు మానుకుంటే, బడ్జెట్ బ్యాలన్స్ అవుతుంది కదా?

పైగా, రథాలో, బళ్ళో ద్వారా 'మొబైల్ ' దర్శనాలట--ప్రతీ వూళ్ళోనూ! ఇంకేం? కాసుల పంట, నిర్వాహకులకి!

కృష్ణారావుగారూ--ఈ స్కీం మీదేనా?

బ్రహ్మకైనా పుట్టు రిమ్మతెగులు అన్నట్టు ఆ స్వామికి యేమైనా పుడితే, అప్పుడు చూడాలి వీళ్ళ తైతక్కలు!

శుభం భూయాత్!

Saturday, January 2, 2010

దర్శనాలు

సదుపాయాలు  


మొన్న వైకుంఠ యేకాదశి సందర్భం గా, మన ఈ వో, ఐ వై ఆర్ కృష్ణారావు ఓ గేటు దగ్గరున్న వుద్యోగిని 'కొట్టేశారని' ఆరోపణలు వస్తే, 'అతని దృష్టిని ఆకర్షించడానికి మాత్రమే నేను అతని భుజం మీద రెండుసార్లు తట్టి, గేటెందుకు తెరిచావు అని అడిగానంతే!' అని వివరణ ఇచ్చుకోవలసివచ్చింది!  


జనవరి ఒకటిన కేవలం 1500 మాత్రమే వీ ఐ పీ పాసులు జారీ చేశారట! మరో పదిహేనువేలమందికి 'శీఘ్ర దర్శనం' టిక్కెట్లు అమ్మారట!  


వీ ఐ పీ లకి తప్ప, ధర్మ దర్శనం వాళ్ళతో సహా అందరికీ దక్కినది 'లఘు', 'మహా లఘు' 'మహావీర లఘు' దర్శనం మాత్రమే!  


శ్రీవారి దర్శనం ఒక సెకనుకి యెంత 'విలువ' చేస్తుందో ఇదివరకే లెఖ్ఖ కట్టాం!  


మరి ఈ వీ ఐ పీ దర్శనాలూ, సేవలూ యెందుకు రద్దు చెయ్యరు?  


(శ్రీ వారి హుండీ అదాయమే, సో కాల్డ్ పర్వదినాల్లో రెండుకోట్లు దాటుతుంటే, ఈ సేవల రద్దువల్ల పోయే అదాయం యేమూలకి? ఇంకా కావాలంటే--మఠాలకీ, ఇతర రాష్ట్రాల్లోని గుళ్ళకీ మన 'దాతృత్వాన్ని' నివారిస్తే సరి--కొన్ని కోట్లు మిగులుతాయి!)  


యెట్టకేలకు, మన ఈ వో గారు, 'తోపులాట నివారించడానికి మహర్ద్వారం నించి వెండివాకిలి వరకూ' బారికేడ్లు నిర్మిస్తామని మాట ఇచ్చారు! ధన్యులం!  


మరి వెండివాకిలి నుంచి బంగారువాకిలివరకూ--వికలాంగులకీ, చంటి బిడ్డ (మూడేళ్ళలోపు) తల్లిదండ్రులకీ మాత్రమే--బంగారు వాకిలి ప్రవేశాన్ని కల్పిస్తూ, మిగిలినవాళ్ళెవరైనాసరే--ఒకే క్యూ లైనులో వెళ్ళే సదుపాయం చేస్తే యెంత బాగుంటుంది!  


ప్రతీ భక్తుడూ--ఓ 15 సెకన్ల పాటు తనివితీరా స్వామిని చూడడానికీ, మరో 15 సెకన్లు కళ్ళుమూసుకొని, తన కోర్కెలు నివేదించుకోడానికీ కేటాయిస్తే, యెన్నివేలమందైనా దర్శనం చేసుకోవచ్చు కదా?  


నే చెప్పొచ్చేదేమిటంటే, కొంతమంది తెలివైనవాళ్ళు డబ్బుకోసమో, పరపతి కోసమో--శ్రీవారి అలయం లోని పరిస్థితుల్ని (కనీసం దర్శనాల వరకూ) నియంత్రించడం--అనే ఘోర అవలక్షణాన్ని నివారించడం మనచేతుల్లోనే వుంది అని!  


అధికారులు గమనింతురుగాక!