Thursday, April 22, 2010

శ్రీగిరి శ్రీపతి

తాజా వార్త

ఆయనెవరో వేసిన మాత్ర (పిల్) లో ఉన్నత న్యాయస్థానం 'ఆనంద.........మయం' కార్యక్రమం పై 'స్టే' ఇచ్చిందట.

(ఆనంద మయం కావలసిన నిలయాన్ని, స్వర్ణ మయం చెయ్యదలుచుకోడమే క్షమించరాని నేరం)

అయినా ఆదికేశవుడు వూరుకుంటాడా అని నా సందేహం. 

(ఓ పక్కన తెలంగాణా రాజుకుంటే, గాలి తన 'స్టేలు' వెకేట్ చేయించుకుని కొన్ని వేల కోట్ల ఇనప ఖనిజాన్ని యెగుమతి చేసేశాడు--సందట్లో సడేమియాగా! అలాంటివి మన న్యాయస్థానాలు!)

అన్నట్టు గాలి గారిచ్చిన వజ్రకిరీటం విలువ 23 కోట్లో యెంతో తేల్చారట కమిటీ వారు--అదేదో స్కోప్ తో పరీక్షించి! (మీడియా చెప్పిన, బహుశా ఆయన ఇన్ కమ్ టేక్స్ రిటర్న్ లలో చూపించిన--59 కోట్లో యెంతో కాదన్నమాట!)

పైగా అంబానీ లాంటివాళ్ళు తమ 'ఇస్తికఫాల్ ', 'తీసుకుంటి కపాల్ ' లాంటి స్వాగతాలకి సంబరపడిపోయి, మళ్ళీ ఈ 'మయం' కి 1.11 కోట్లు ఇచ్చారట. (ఇంతకు ముందు 5.5 కోట్లో యెంతో ఇచ్చారట.)

ఈ మధ్య ఇంకాచాలా మంది కొన్ని కేజీల బంగారాన్నీ, కోట్ల రూపాయల్నీ ఇచ్చారు. 

(రేపు మన కేశవుడు 'యేడుకొండలూ స్వర్ణమయం' కార్యక్రమాన్ని ప్రకటించినా ఆశ్చర్యం లేదు!)

దేవుడా! అందరికీ మంచి బుధ్ధిని ప్రసాదించు!

అని తప్ప ఆ స్వామిని యేం వేడుకోగలం?

Tuesday, April 13, 2010

శ్రీగిరి శ్రీపతి

దర్శనాలు......

గిరిజన గోవిందానికి హాజరయ్యే భక్తులకి, శ్రీవారి రాగి డాలర్లు పంచిపెడతారట.

ఆర్జితసేవా టిక్కెట్ల ధరల పెంపు విషయం లో ఇంకా యెలాంటి నిర్ణయం తీసుకోలేదట.

శీఘ్రదర్శనం ద్వారా నాలుగు గంటల్లో భక్తులకి దర్శనమయ్యేలా కృషి చేస్తారట.

ఏ వీ ఎస్ వో వెంకట శివుడు పై వేటు వేయాలని నిర్ణయించారట.  డిప్యూటీ ఈ వో భాస్కర రెడ్డి పై కఠిన చర్యలు తీసుకుంటారట.

వైకుంఠం 2 లో కాయిన్ బాక్స్ ఫోన్లు యేర్పాటు చేస్తారట.

కేటాయించినవారు కాకుండా ఇతరులు 'వినియోగిస్తున్న' 400 కాటేజీలని స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించారట.

ఈ వో--ఐ వై ఆర్ కే రావు గారి ప్రకటనలివి.

శుభం!

వీ ఐ పీ లకి మాత్రం వారి అనుచరుల్తో సహా అందరికీ 'పెద్ద పీటలు' పట్టుకొని రెడీ గా వుంటున్నారట--దేవస్థానం వారు.

నిన్న (13-04-2010) న ప్రముఖుల పేరిట 700 వీ ఐ పీ దర్శన టిక్కెట్లు విక్రయించారట. వీరందరికీ దర్శనం పూర్తి అయినా, 7-45 లోపే ధర్మ దర్శనం ప్రారంభించాల్సింది, 9-00 దాటినా మొదలవలేదట.

కారణం--ముఖ్యమంత్రి అల్లుడు తో పాటు ఓ 50 మందికి పైగా, వారి దర్శనం పూర్తయ్యాక, చిరంజీవి, అయన పార్టీ నేతలూ చాలాసమయం శ్రీవారి సన్నిధి లో గడిపారట!

వాళ్ళు శ్రీవారి సన్నిధిలో వున్నా, ధర్మ దర్శనం కొనసాగించవచ్చుకదా? వాళ్ళు యెలా మొక్కుతున్నారో సామాన్యులు చూస్తే వీ ఐ పీ లకీ, వాళ్ళ అనుచరులకీ నమోషీ యేమో!

ఇన్ని వందల మందికి 'పెద్ద పీటలు' యెప్పుడు మానేస్తారో!

తిరుమలేశా! నీదే భారం!

Monday, April 12, 2010

శ్రీగిరి శ్రీపతి

ప్రసాదాలూ, సేవలూ

మొన్న ఓ పేపర్లో, 'శ్రీవారి అన్నదానం కోసం లడ్డూలు చుడుతున్న కార్మికులు ' అంటూ కొందరు స్త్రీల ఫోటో ని ప్రచురించారు. 

వాళ్ళు శ్రీవైష్ణవులేనా? వాళ్ళని ఆగమ శాస్త్రం ప్రకారం నియమించారా? మొదలైన విషయాలు ఆ పత్రిక వ్రాయలేదు. 

అన్నదానం కోసం వేరే, ప్రసాదం కోసం వేరే లడ్డూలు తయారు చేస్తారా? అన్న విషయం కూడా ఆ పత్రిక వ్రాయలేదు.

ఇక శ్రీవారి సేవలకి ఆన్ లైన్ లో టిక్కెట్లు బుక్ చేసుకునే సదుపాయం కల్పించింది కదా దేవస్థానం! 

మనం ఇదివరకే లెఖ్ఖలు వేశాం--ఈ సేవల్లో పాల్గొనేవాళ్ళు యెంతెంత చెల్లించాలో! కానీ, సేవల టిక్కెట్టు ధర కేవలం 120 రూపాయలు మాత్రమేనట!

వుదాహరణకి, శ్రీవారి సుప్రభాత సేవకి, 200 మంది భక్తుల్ని మాత్రమే అనుమతిస్తారట. 24000/- మాత్రమే ఆదాయం వస్తుంది ఒక రోజుకి. కానీ, ఆన్ లైన్ లో ఒకే పేరుతో, ఒకే నెలలో, 16 టిక్కెట్లు బుక్ అయ్యాయట! మళ్ళీ ఒక్కొక్క టిక్కెట్ నీ 2000/- కు పైగా దళారులు విక్రయిస్తున్నారట!

యే పథకాన్నైనా ప్రవేశపెట్టే ముందు, దానికి సంబంధించిన సాఫ్ట్ వేర్ ని అనేక విధాల పరీక్షించి మరీ ప్రవేశ పెడతారు. కానీ మన దేవస్థానం వారు మాత్రం, డబ్బులు చెల్లించేసి, సప్లయర్స్ "ఇంక మీ ఇష్టం--తన్నుకు చావండి" అన్నా, చక్కగా వొప్పుకుంటారట.

ఇప్పుడు, కొత్త ప్రోగ్రాం రూపొందించారట!

అసలు, ఈ సేవల టిక్కెట్ల రేటునే 2000/- నిర్ణయించవచ్చుకదా? 4,00,000/- వస్తాయిగా? మన లెఖ్ఖకూడా దాదాపు సరిపోతుంది కదా? ఆ పని యెందుకు చెయ్యరు?

(ఈ సేవల్ని ఆసాంతం రద్దు చేస్తే మహా బాగుంటుంది--కానీ.......జరగడం లేదు!)

ఇక లడ్డూ కాకుండా, ఆపం, వడ, పొంగలి మొదలైన పదహారో యెన్నో రకాల ప్రసాదాలని నైవేద్యం పెడతారు ప్రతీరోజూ శ్రీవారికి! ఇవేవీ భక్తులకి దక్కవు.

ఓ హోటల్లో ఓ పెద్దమనిషికి 3000/- రూపాయలు ఇస్తే, ఒక్కొక్క ప్రసాదం నామకహా జాగ్రత్తెపెట్టి, మనకి ఇస్తారట!

అదే 8000/- ఇస్తే, కావలసినంత క్వాంటిటీలో అన్ని ప్రసాదాలూ మనకి ఇస్తారట!

మరి ఈ ప్రసాదాల రేటు కూడా అంతకి పెంచితే, అక్రమాలు జరగకుండా, కొనుక్కోగలిగినవాళ్ళకే అందుతాయి కదా? ఆ హోటలు వాళ్ళెందుకు బాగుపడాలి?

ఈ వో గారూ! కొంచెం చూస్తారా?

Saturday, April 3, 2010

శ్రీగిరి శ్రీపతి

దర్శనాలు, ప్రసాదాలు


శ్రీవారి నిత్యాన్నదానం ట్రస్ట్ కి 25 యేళ్ళు నిండుతున్నాయి. 60 లక్షల తో ప్రారంభమైన ట్రస్ట్, 220 కోట్లకి పెరిగిందట. శుభం!

అన్నిదానాలలోకీ అన్నదానం గొప్పది అంటారు. అలాంటి దానానికి డిపాజిట్లు ఇచ్చిన దాతలు ధన్యులు.

నిజం గా ఆకలిగొన్నవాళ్ళతోపాటు, శ్రీవారి ప్రసాదం గా భావించి స్వీకరించేవాళ్ళు, ఓ పనైపోతుంది అని యెంగిలి పడి లేచేవాళ్ళు--యెవరైనా, రోజుకి ఓ 80 వేలమంది భోజనాలు చేస్తున్నారు.

ఆ మధ్య ఈ డిపాజిట్లని బ్యాంకులకి తనఖా పెట్టి అప్పుచేసి, ఆ అప్పుని మళ్ళీ ఇంకో రకం గా వుపయోగిస్తున్నారు అని వార్తలు వచ్చాయి. మరి దీని సంగతి యేమయ్యిందో!

రోజుకు 3 లక్షల లడ్డూల తయారీ కోసం యేర్పాట్లు చేశారట. ఇందుకు "సనాతన సంప్రదాయం మేరకు" "ఆగమ శస్త్రోక్తం గా" 250 మంది "శ్రీవైష్ణవ బ్రాహ్మణులను" పోటు కార్మికులుగా నియమించారట. (అసలు ఆగమ శాస్త్రానికీ, బూందీ తయారీకీ, లడ్డూలు చుట్టడానికీ సంబంధం యేమిటో! వాళ్ళెవరికైనా ఈ విద్యల్లో ప్రావీణ్యం వుందో లేదో పరీక్షించారా? లేక శ్రీవైష్ణవులు అవడమే క్వాలిఫికేషనా? యేమో!)

ఈ మధ్య ద్వారకా తిరుమలలో లడ్డూ ప్రసాదం లో పటికబెల్లం బిళ్ళల సంఖ్యని కొంచెం తగ్గించారు. ఈలాంటి అలోచనేమైనా వీరికి వుందా?

ఇంకా, రోజుకు 8 టన్నుల ఆవునెయ్యి సరఫరాకి--గాలి సోమశేఖర రెడ్డి తో వొప్పందం చేసుకుంటారట! (ఈయన మన గాలి ధనార్జన రెడ్డి సోదరులకి యేమౌతారో తెలియదు.)

ఇక మనం ఓ ట్రెడ్ మిల్ లాంటిది యేర్పాటు చేస్తే బాగుంటుంది అనుకున్నట్టు, శ్రీవారి దర్శనానికి మహర్ద్వారం నించి శ్రీవారి సన్నిధి, విమాన ప్రాకారం కింది భాగం  మార్గం ద్వారా తిరిగి మందిరం వెలుపలివరకు 'చేరవేత పట్టా' (కన్వేయర్ బెల్ట్) యేర్పాటు పై బెంగుళూరుకు చెందిన బి ఎన్ ఎ టెక్నాలజీ కన్సల్టింగ్ లిమిటెడ్ కంపెనీ నిపుణులు ఆలయాన్ని సందర్శించారట.

యెంత శుభవార్త! 

కాని, ఇక లఘు, మహాలఘు, మహావీరలఘు దర్శనాల స్థానం లో, ఎక్స్ ప్రెస్, డీలక్స్, సూపర్ డీలక్స్ దర్శనాలు ప్రవేశపెడతారేమో--సామాన్యులకి, వీ ఐ పీ లకి, వీ వీ ఐ పీ లకి--అదే క్రమం లో! (అంటే, సామాన్యులు పట్టా యెక్కినప్పుడు వీర స్పీడులో పరిగెట్టేలా, మిగిలినవాళ్ళకి కొంచెం నెమ్మదిగా, తరవాతవాళ్ళకి ఇంకొంచెం నెమ్మదిగా నడుపుతారేమో ఆ పట్టాని!)

చూద్దాం!