Sunday, November 23, 2014

బంగారం........చిల్లర........వెండి.......దేవుడు!


"వాటికన్‌ సిటీలా తయారు చేస్తాం!"

"ప్రపంచ ఆధ్యాత్మిక రాజథానిగా తయారు చేస్తాం!"

"భక్తులకి అవసరమైన అన్ని సౌకర్యాలూ కల్పించి, మంచి అనుభూతికలిగేలా తీర్చి దిద్దుతాం!"

శ్రీగిరి శ్రీపతి శ్రీవారి గురించి కొన్ని ప్రగల్భాలు ఇవి!

అసలు ఆ దేవస్థానం మీద యెవరికి అజమాయిషీ వుంది? జరిగేవాటికి బాధ్యులు యెవరు?

.........ఇవి ప్రస్తుతం అనేక "టన్నుల" ప్రశ్నలు!

వేడి చేసినవాడెవడో కొంచెం కొంచెం గా పోసినట్టు, అప్పుడప్పుడూ కొన్ని బయట పెడుతున్నారు.....పరోక్షంగా.......పత్రికల ద్వారా!

ఇంతకు ముందు--ఇన్ని టన్నుల బంగారం వుంది, ఇన్ని కోట్ల విలువ చేసే వజ్రాభరణాలు వున్నాయి వగైరా. మొత్తానికి అవన్నీ కరిగించి, బ్యాంకుల్లో బంగారం డిపాజిట్ చేస్తున్నారనిచెప్పారు. (వజ్రాలూ వగైరాల సంగతి ఇంకా తెలీదు).

తరువాత ఇన్ని టన్నుల బరువైన "చిల్లర" నాణాలు--అన్ని దేశాలవీ కలిసి--వున్నాయి, యేమిచేయాలో తెలియడం లేదు అన్నారు.

ఇప్పుడు ఇన్ని టన్నుల బరువైన "వెండి" వస్తువులూ, ఆభరణాలూ వున్నాయి, ఇవీ యేమి చేయాలో తెలీడం లేదు అంటున్నారు.

ఇంకా, నోట్లు లెఖ్ఖపెట్టడానికి కొన్ని వందల యంత్రాలతో "కొత్త పరకామణి"--ఆలయం బయట--నిర్మిస్తామంటున్నారు!

మధ్య లో తాపడం వగైరాలకి వసూలైన బంగారం, దాతల నుంచి వస్తున్న కోట్లాది రూపాయల విరాళాలూ, వాటి వినియోగం గురించి యెవరికీ యేమీ తెలీదు.

ఇదివరకు, వున్న పరకామణిలోనే, యేరోజుకారోజు హుండీ తో సహా అన్ని కానుకలూ లెఖ్ఖ పూర్తి అయ్యేది--బ్యాంకులలోనో, భాండాగారం లోనో జమ అయ్యేవి. మరి ఇప్పుడు అలా యెందుకు జరగడం లేదు? దానికి బాధ్యులు యెవరు? 

రెండు మూడు దశాబ్దాల క్రితం వరకూ, మన దేశం లో వివిధ విలువల చిల్లర నాణాలకి నిర్దిష్టమైన ఆకారాలూ, కొలతలూ, తూకం వుండేవి. దాంతో, జల్లెడలని వుపయోగింది, నాణాలని వేటికవి విడదీసి, తూకం ప్రకారం బస్తాల్లో నింపితే, ఖచ్చితంగా వాటి విలువకి సరిపోయేవి......బ్యాంకులూ, ఇతర కొనుగోలుదారులూ పట్టుకెళ్లి, వెంటనే మళ్లీ వినియోగఅం లోకి తెచ్చేవారు.

నాణాల దిగుమతీ వగైరాలతో, రిజర్వ్ బ్యాంక్ ఆర్థిక పండితమ్మన్యుల పుణ్యమా అనీ, నాణాలకి నిర్దిష్ట ఆకారాలు, కొలతలు, తూకాలు మృగ్యమయ్యాయి. మన నాణాలకీ, ఇతర దేశ నాణాలకీ తేడాలు లేకుండా పోయాయి. అందుకే ఇప్పుడీ టన్నుల కొద్దీ చిల్లర సమస్య. 

దీన్ని పరిష్కరిస్తే, దేశం లో చిల్లర సమస్య కూడా తీరుతుంది.......దేవుడికి ఆ విలువ జమ అవడం తో సహా! మరి ఈ చిన్న పరిష్కారానికి చర్యలు యేవి?

బంగారం డిపాజిట్లకి వున్నాయిగానీ, వెండి కి మార్గదర్శకాలు లేవని చెప్పారట......స్టేట్ బ్యాంకు వారు! స్టేట్ బ్యాంకు కాకపోతే, మిగిలిన బ్యాంకులులేవా? బ్యాంకులు కాకపోతే, నామమాత్రపు రిజర్వ్ బ్యాంకు నియంత్రణ తో వెలుగుతున్న, ముత్తూట్, మణుప్పురం వంటివాళ్లు లేరా?

బంగారం, వెండీ, వజ్రాలూ, మణులూ వుపయోగించి పాశ్చాత్య దేశాల్లో కట్టిన పురాతన చర్చిలూ వగైరాలలా మనం కూడా నిర్మాణాలు సాగించ లేమా? అప్పుడు వాటికన్‌ బాబులా తయారవదా మన శ్రీగిరి శ్రీపతి?

ఇనుప కంచెలు వెయ్యడానికే దిక్కులేదు......ఇవన్నీ యెవరు చేస్తారంటారా?! 

తప్పదు......ఆయనే చేయిస్తాడు.......నడుములూ, మెడలూ వంచి!

యెటొచ్చీ మనం కాస్త బుర్రపెట్టి ఆలోచించాలంతే.....ఇన్‌షా శ్రీపతి!