Wednesday, November 26, 2008

కాల ఙ్ఞానం!

బాబా కాల ఙ్ఞానం!
దశాబ్దాల క్రితమే హైదరాబాద్ దూర దర్శన్ వారి చాయాగ్రహణ యంత్రాల్లో ‘రెడ్ హాండెడ్’ గా దొరికి పోయి, పబ్లిక్ లో మేజిక్కులు చెయ్యడం మానేసిన సాయి బాబా, మొన్న కాల ఙ్ఞానం చెప్పారు! ‘వచ్చే 28 యేళ్ళలొ భారతదేశం అగ్రరాజ్యంగా అవతరిస్తుంది. కొద్ది రోజుల్లో ప్రపంచమంతా ఒకటై పోతుంది! 28 యేళ్ళ తరవాత ప్రపంచమంతా మన దేశం లో కలిసి పోతుంది! ఒకే గొడుగు కిందకు చేరి భారత దేశం అగ్ర రాజ్యం అవుతుంది! అందరూ భారతీయులు అయి పోతారు! మన ఆధిపత్యమే సాగుతుంది!’ అంటూ సెలవిచ్చారు. కొత్త బంగారులోకం కోసం యెంత అందమైన బంగారు కల! అంతేకాదు—‘సచ్చీలురుగా విదేశాలకు వెళ్ళి……..దుర్గుణాలతో తిరిగి వస్తున్నారు’ అని కూడా వాపొయారు(ట)! దీని భావమేమి శ్రీగిరీశా?—సారీ పుట్టపర్తి నివాసా? (బై ది బై, ‘కుల్వంత్’ యెవరో మీకు తెలిస్తే కాస్త చెప్పరూ?)

Sunday, November 23, 2008

ధనవంతుల దేవుడా!
శ్రీవారి ముష్టి కార్యక్రమంలో, కిలో బంగారాన్ని వేసేవాళ్ళకి, 1) 5 గ్రాముల బంగారు డాలర్ 2) వెండి డాలర్ 3)10 మహా ప్రసాదం ప్యాకెట్లు 4) 5 గురికి ప్రారంభ దర్శనం (ఇది యాదవులకే ప్రత్యేకం!) 5) తరవాత 25 ఏళ్ళపాటు ఏడాదికి 3 సార్లు అర్చనానంతర దర్శనంతో పాటు, 2,500 రూపాయల విలువైన వసతి సౌకర్యం—ఇవి ఇప్పటికే, పాతికవేలో యెంతో చెల్లిస్తే చేసే కల్యాణోత్సవాలు 2048 వ సంవత్సరం వరకూ ముందే రిజర్వు అయి పోయాయట! ఇంకేదో సేవలు 2018 వ సంవత్సరం వరకూ ఖాళీలు లేవట! శ్రీగిరుల్లో మళ్ళీ ప్రైవేటు గెస్ట్ హౌస్ ల నిర్మాణానికి అనుమతి ఇస్తున్నారు! ఇతర రాష్ట్రాల గవర్నమెంటులకి గెస్ట్ హౌస్ ల నిర్మాణానికి అనుమతి ఇచ్చేశారట! శ్రీపతి పట్టణానికి తాగు నీటి వసతికి, తితిదే నిధులని వాడుకోవాలని చూసిన ప్రభుత్వానికి మొట్టికాయలు వేసింది హై కోర్టు. అయినా ఏదో రకంగా శ్రీవారి వైభవాన్ని వాడుకోవాలని ప్రయత్నాలు! ఇంకా చాలా ప్రమాదకరమైన విషయం యేమిటంటే, ఈ మధ్య, శ్రీ వారి ఆలయాన్నీ, శ్రీగిరి శ్రీపతుల్నీ “వైష్ణవ” ఆలయం, క్షేత్రాలు, అని ప్రచారం చేస్తున్నారు! వేయి కాళ్ళ మంటపం అంటే, ’33 కుటుంబాలకి చక్కగా వండుకు తినడానికి, వుండడానికీ సరిపోయే వసతి’. ఇది శిధిలమైపోయిందని, పూర్తిగా తొలగిస్తే, ఈ స్వాములు పెద్ద రగడ చేసారు—ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా దాన్ని కూలగొట్టారనీ, మళ్ళీ కట్టాలనీ! ఇప్పుడు, అలిపిరి దగ్గర దివ్యభారతి ప్రాజెక్టు కింద 108 ‘వైష్ణవ’ దేవాలయాలని కడతారట! అసలు స్వామికి కొబ్బరికాయ సమర్పించే సాంప్రదాయం ఎందుకు ప్రవేశ పెట్టేరు? దేవుడికి భక్తితో సమర్పించి, ప్రసాదంగా స్వీకరించ తగ్గవి “పత్రం, పుష్పం, ఫలం, తోయం” అని శ్రీకృష్ణ పరమాత్ముడే చెప్పాడు! అందుకే, తులసీ దళాలని, గన్నేరు పువ్వుల్నీ, అరటి పండ్లనీ, రాగి పంచపాత్రలో నీటినీ తీసుకెళ్ళేవారు—విష్ణుభక్తులు—కోవెల కి వెళ్ళేటప్పుడు. ఇవన్నీ విష్ణువుకు ప్రీతి పాత్రమైనవే! ఇంకో విశేషమేమిటంటే, కదళీ ఫలం అంటే అరటి పండు పైకెలా కనిపిస్తుందో, లోపలా అలాగే వుంటుంది—అంటే, మిగిలిన ఏ ఫలంలోనైనా లోపల పురుగూ, పుచ్చూ వుండచ్చేమోగానీ అరటి పండులోపల చేరి బ్రతికే పురుగు పుట్టలేదింతవరకూ—కొన్ని బిలియన్ల సంవత్సరాలగా! అలాగే ఆలయం అనేది శివుడికి ప్రత్యేకించింది! (బ్రహ్మకి పాపం గుడీ, అర్చనా లేకుండా శపించబడ్డాడు!) శివుడికి ప్రీతిపాత్రమైనది నారికేళం అంటే కొబ్బరి కాయి! దీని గొప్పతనం యేమిటి? ముఖ్యంగా, ఇది ‘త్రినేత్రుడు’—మూడు కళ్ళుంటాయి! ఇంకా, పుష్పం, ఫలం, తోయం కలిసి వుంటుంది! అంటే, అది ఫలమైనా, దానిలోనే నీరు వుంటుంది, తరవాత ఆనీరూ, గుజ్జూ కలిసి, పువ్వుగా మారతాయి! ఆ పువ్వులోంచే మొక్క వచ్చి, పత్రాలు వస్తాయి! అందుకని, కోవెలలో అరటి పండ్లూ, ఆలయాల్లో కొబ్బరికాయలు సమర్పిస్తారు. మళ్ళీ వాటిని ప్రసాదంగా స్వీకరిస్తారు! అమ్మవార్లకెక్కడైన పసుపూ కుంకుమలూ, చీరలూ, రవికలూ, ఆభరణాలూ సమర్పిస్తారు! కోవెల్లో అర్చనలు చేస్తే, ఆలయాలలొ అభిషేకాలు చేస్తారు! శివుడికే అభిషేకం యెందుకంటే, శివుడు రుద్ర మూర్తి! అందుకే లింగాన్ని నిరంతరం చల్లబరచదానికి పైనించి చుక్క చుక్కగా నీళ్ళు పడుతుండే యేర్పాటు! మరి వాడికి అభిషేక స్నానమంటే అంతకు మించి సంతోషకరమైనది యేముంటుంది? మరి ఓ వంద నించి 200 యేళ్ళ క్రితం శైవులూ, వైష్ణవులూ కొట్టుకు చచ్చేవారు—మా దేవుడు గొప్ప అంటే మా దేవుడు గొప్ప అని! ఆ తరువాతి పరిణామాల్లో, ఒక్క వేంకటేశ్వర స్వామికి మాత్రం—కొబ్బరికాయ కొట్టే సంప్రదాయం, అభిషేకాలు ప్రవేశ పెట్టారు! అసలు ఆర్తులు ‘వెంకన్నా’ అని తోటి స్నేహితుణ్ణో, బంధువునో పిలిచినట్లు పిలిచి, తమ బాధల్ని చెప్పుకునే స్వామిని, మళ్ళీ ‘ఫలానా వాళ్ళ’ దేవుడు అంటే, జాతి క్షమించదు! ఇలాంటివాటికి దూరంగా వుండండి! జాగ్రత్తగా మాట్లాడండి! ఇది నా హెచ్చరిక!

Sunday, November 16, 2008

గోవిందా!

బంగారు ముష్టి
మొన్ననే, శ్రీవారికంటే చాలా పేదదైన బెజవాడ కనక దుర్గమ్మ తన ఆలయ విమానానికి బంగారు తాపడం చేయించుకొంది! మరి ఆవిడ యెవరినీ బంగారం ముష్టి యెత్తలేదే? ఆ మధ్య, అప్పటి తితిదే ఛైర్మన్ కరుణాకర్ రెడ్డి గొప్పగా శ్రీవారి ఆభరణాలనన్నిటినీ పబ్లిక్ ప్రదర్శన లో వుంచుతానంటే, వాటికి ‘భద్రత’ కల్పించలేము అని తెగేసి చెప్పారు—పోలీసులు! అప్పుడే, పేపర్లలో—మొత్తం బంగారం 43 టన్నులనీ, 47 టన్నులనీ—రకరకాలుగా వచ్చింది. అప్పుడే నాకు ఈ బ్లాగ్ వ్రాయాలనే ఆలోచన వచ్చింది! మరి ఆ బంగారం ప్రస్తుత భద్రత మాటేమిటి? అని! నేల మాళిగల్లో, భద్రంగా, అమెరికా లోని ‘ఫోర్ట్ నాక్స్’ కి ఉండే 24 గంటల కాపలా సైన్యంతో, అలారాలు, లేసర్ వలయాలు మొదలైనవాటి మధ్యలో--వుండాలా, వద్దా? మీరేమంటారు?

Wednesday, November 5, 2008

'దేవతా వస్త్రమా?'

శ్రీవారి గర్భగుడి విమానం ‘ఆనంద నిలయం’ పూర్తిగా ఇదివరకే బంగారు తాపడం చెయ్యబడింది. ఇప్పుడు ఆలయం లోపల మంటపాల్నీ, బంగారు వాకిలి ప్రాంతాన్నీ పూర్తిగా బంగారు తాపడం చెయ్యడానికి—35 కేజీల బంగారం అవసరమౌతుందని మొదట్లో అంచనా వేసి, ‘ఆదికేశవుడు’ శ్రీవారి బంగారు ముష్టి స్కీం ప్రవేశపెట్టాడు.

అంతలోకే, అంచనా (జలయజ్ఞం లో లాగ) 43 కేజీలకి పెరిగిపోయింది! స్పందన బాగానే వుందట!

సందట్లో సడేమియాగా, అనేకమంది ఈ బంగారు ముష్టి ప్రారంభించేసారట. అందులో శ్రీ వారికి చేరెదెంతో, ముష్టివాళ్ళ శ్రీమతులకి చేరెదెంతో!

ఇంకా అదేదో ‘చెన్నై సలహా మండలి’ట. అదేదో యెప్పుడో యేర్పడిందట! దాని మీద ఆగ్రహం వ్యక్తం చేసిన ‘ఆది కేశవుడు’ దాన్ని రద్దుచేసాడో—ఎంక్వైరీ కమిటీ వేశాడో—ఏదోనట! అసలు శ్రీ వారి దగ్గర ఎంత బంగారం వుంది?

‘హాథీరాంజీ మఠం’ నించి తి.తి.దే కంట్రోలు లోకి శ్రీ వారి ఆలయం వచ్చినప్పటినించి, శ్రీ వారికి వచ్చిన కానుకలకేమైనా లెఖ్ఖా పత్రం వున్నాయా?

వాటి భద్రత మాటేమిటి?

అందరూ చూస్తూ వుండగానే, పరకామణిలో డబ్బూ, బంగారు వస్తువులూ, బంగారు డాలర్లూ, అమెరికా డాలర్లూ, మాయమౌతున్నట్లు అప్పుడప్పుడు వస్తున్న వార్తల్లోనే, వాటి విలువ కొన్ని లక్షలల్లో వుంటోందే?

మరి ‘లోపలి’ వాటి మాటేమిటి?