Thursday, October 29, 2009

శ్రీగిరి శ్రీపతి


దర్శనాలు, సేవలు


రూ.600 ల శీఘ్ర దర్శనం అమల్లోకి వచ్చింది! మొదటిరోజు అస్తవ్యస్తంగా నడిచిందట--యెవరిని ముందు, యెవరిని వెనక అనే మీమాంసలతో!  


ఇక సేవల విషయం లో కమిటీ యేమీ తేల్చలేదు--త్వరలో తేల్చవచ్చట.  


సుప్రభాత, తోమాల సేవల రుసుము సుమారు 200 కావడంతో, దీన్ని పెంచాలని ఆలోచిస్తున్నారని వినికిడి. ఈ సేవల టిక్కెట్లు కొనుక్కున్నవాళ్ళు, కనీసం ఓ గంటసేపు స్వామి సన్నిధిలో వుండిపోతారట.  


ఇప్పుడు తెల్లవారుజామున 4.30 నించీ, రాత్రి 2.30 వరకూ, 22 గంటల్లో, మహాలఘు దర్శనం తో దాదాపు 80 వేలమందికి దర్శనం కలిగించేస్తున్నారు! అంటే స్వామి అలంకారానికీ, భోగానికీ, సేవలకీ ఓ నాలుగు గంటలు మినహాయించినా, 64800 సెకన్లలో, సెకనుకి సుమారు ఒకటింపావు మంది దర్శనం చేసుకుంటున్నారు! 


ఈ లెఖ్ఖన, రూ.600 శీఘ్రదర్శనం వాళ్ళుకూడ సెకనుకి ఒకటింపావు మంది మాత్రమే డర్శనం చేసుకోగలరు కదా (సెకనుకి దర్శనం ఖరీదు రూ.750/-!), మరి సేవల పేరుచెప్పి కనీసం గంట వుండేవాళ్ళ ఒక్కొక్కళ్ళ దగ్గరనించి 3600 సెకన్లకి, సెకనుకి రూ.750/- చొప్పున యెంత వసూలు చెయ్యాలి? (ఓ వందమంది ఆ సేవల టిక్కెట్లు కొన్నారనుకున్నా, ఒక్కొక్కళ్ళూ రూ.27000/- చెల్లించాలి!  


ఈ లెఖ్ఖలు మానేసి, ఈ సేవలన్నీ రద్దు చేస్తే, 'మహా' లేని 'లఘు' తోటే 80 వేలమంది దర్శనాలు చేసుకోవచ్చుకదా?  


తి తి దే ఆర్థికవేత్తలు యేమంటారో!  


ఇంకో ముఖ్యమైన విషయం--శీఘ్ర దర్శనం వాళ్ళూ, ఉచిత/టిక్కెట్టు సుదర్శనం వాళ్ళూ, చంటిబిడ్డ తల్లిదండ్రులూ, సన్నిధిలో వివాహం చేసుకున్న జంటలూ, వాళ్ళతోపాటు నలుగురో యెంతమందో, కాలినడకన కొండ యెక్కేవాళ్ళూ--ఇలా అందర్నీ 'మహర్ద్వారం' దగ్గర నించి ఒకే క్యూలో కలిపేసి, తోసుకుంటూ బంగారువాకిలి వరకూ పొమ్మనడాన్ని నివారించడానికి ఓ కమిటీనెందుకు వెయ్యరు?  


ఇది శ్రీవారి భక్తులందరి తరఫునా నా ప్రధాన 'డిమాండ్'. నెరవేర్చవలసిందే!  


పైగా, ఈ వో గారు--చంటిబిడ్డ తల్లులకొక్కళ్ళకే అనుమతిస్తే వాళ్ళు నలిగిపోతారని, వాళ్ళ భర్తలకి కూడా ప్రవేశం కల్పిస్తే, చైర్మన్ ఆదికేశవుడు దానికి మొదటినించీ వ్యతిరేకమేనట! 


మరి వాడి లెఖ్ఖలేమిటో!  


('డైరీ' కూడా అప్ డేట్ అయ్యింది. చదవండి)

Tuesday, October 20, 2009

శ్రీగిరి శ్రీపతి

డైరీ

తఱచుగా శ్రీవారికి భక్తులు సమర్పించే విలువైన కానుకల్ని తేదీలవారీగా ఈ డైరీలో అప్ డేట్ చేస్తూ వుంటాను. చదువరుల సౌకర్యం కోసం!

10-02-1513
శ్రీకృష్ణ దేవరాయల చే కెంపులు, పచ్చలు, నీలాలు, మాణిక్యాలు, వైడూర్యాలు, గోమేధికాలతో పొదిగిన వజ్ర కిరీటం

02-05-1513  నవరత్నఖచిత ఉడుధార, స్వర్ణ ఖడ్గం, భుజకీర్తులు, 30 తీగల పతకం

తంజావూరు రాజు పాండ్యన్ ఓ కిరీటం

మైసూరు మహారాజు, తదితరులు--108 బంగారు పుష్పాలు, 32 కిలోల సహస్రనామహారం, నాలుగు కిలోల చతుర్భుజ లక్ష్మీ హారం, 7 కిలోల రత్నాల మకరకంఠి 13.6 కిలోల నవరత్న కిరీటం, 500 గ్రాముల అరుదైన గరుడ మేరు పచ్చ ఆభరణం

రతన్ టాటా, అంబానీలు, విజయ్ మాల్యా, గోయెంకా మొదలైనవారు--1940 లో వజ్ర కిరీటం, 1954 లో వజ్రాల హారం, 1972 లో వజ్రాల శంఖు చక్రాలు, కర్ణపత్రాలు, 1974 లో కటిహస్తం

1986 లో 5 కోట్ల విలువైన వజ్రాల కిరీటం తి.తి.దే వారు చేయించారు.

ఇప్పటికి మూలబేరానికి 8 కిరీటాలు, ఉత్సవ బేరాలకి 7 కిరీటాలు వున్నాయి.  

13-11-2008

ఆపోలో ఆస్పత్రుల అధిపతి శ్రీ ప్రతాప్ సి. రెడ్డి చేత, 5 కిలోల బరువూ, 80 లక్షల విలువా చేసే—అభయ, కటి హస్తాలు.

18-11-2008

తిరుపతి శాసన సభ్యులు వెంకటరమణ--పద్మావతి అమ్మవారికి--ఇరవై లక్షల విలువైన 2 కేజీల బంగారంతో తాపడం చేసిన 'అశ్వ వాహనం'

(ఇంతకు ముందు రెండు మూడు రోజుల క్రితం, ఇంకో కానుక యెవరో ఇచ్చారు గాని, వివరాలు వెదక లేక పోయాను—అందుకే, ఇదే మొదటి నమోదు!)

17-1-2009

—ఫాబ్ టెక్ కంపెనీ వారు రూ. ఒక కోటి విరాళం.
ఇంతకుముందు రూ. రెండు కోట్లు విరాళమిచ్చిన స్విస్ మహిళ ఎలిజబెత్ జెయిగ్లర్.

09-03-2009

--వీరెంద్ర మహేష్ గౌడ్ అనే ఆయన ముంబాయి నించి--51 లక్షల నగదు--అన్నదానం ట్రస్టు కోసం వినియోగిస్తామని ఈ వో ప్రకటన!

(ఈ మధ్యలో కొన్ని కానుకలు వచ్చాయి గానీ, వాటిని యెప్పటికప్పుడు ఇందులో చేర్చలేకపోయాను! మీకెవరికైనా తెలిస్తే, నాకుచెప్పెనాసరే, కామెంట్ లో వ్రాసినా సరే!--మీ యిష్టం)

11-06-2009--కర్ణాటక ఎమ్మెల్యే, ఇనుపఖనిజం ఫేం 'గాలి జనార్దన రెడ్డి ', 45 కోట్ల ఖర్చుతో, ఓ సరికొత్త బంగారు,వజ్ర కిరీటం!

25-07-2009--నవీన్ జిందాల్ దంపతులు--రూ.46 లక్షల విలువ చేసే బంగారు శంఖుచక్రాలు,తిరుచానూరు పద్మావతీ అమ్మవారుకి ఎస్ ఆర్ కన్నన్ అనే ఆయన రూ.1.50 లక్షల విలువ చేసే బంగారు హారం.

15-10-2009--ఎం పీ మేకపాటి రాజమోహన రెడ్డి, కుటుంబ సభ్యులూ--20.785 కిలోల బరువుగల, 3.69 కోట్లు ఖర్చైన 'స్వర్ణ పీతాంబరం'


19-10-2009--ఎన్ జె మోహన్ అనే భక్తుడు రూ.50 లక్షల విలువ చేసే బంగారు పళ్ళెం, రెండు దీపాలు, కర్పూరహారతి గెంటె, శ్రీ పద్మావతి అమ్మవారికి మాంగల్యం, బంగారు బిస్కెట్ మొదలైన పూజా సామాగ్రి


కీర్తి జోషి అనే భక్తుడు రూ.99 లక్షల విరాళం

26-10-2009--న్యూఢిల్లీ కి చెందిన ఓ భక్తుడు రూ. 3 కోట్ల విలువ చేసే 17 కిలోల బరువుగల, 50 లీటర్ల పరిమాణంతో, బంగారు గంగాళం


01-08-2009
న్యూఢిల్లీ కి చెందిన అజయ్ మోడీ దంపతులు ప్రతిపాదిత కంటి ఆస్పత్రి కోసం రూ. 50 లక్షలు విరాళం


{17-08-2009
 బెంగుళూరు నగరానికి చెందిన విమల తన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్న అనంతరం 16 లక్షల విలువైన 'కిలో బంగారాన్నీ 'అనంత స్వర్ణమయం' కోసం ఇచ్చారు.  ఇది శ్రీ వారి తరఫున 'ఆది కేశావుడి ' ముష్టి లో భాగం కాబట్టి, శ్రీ వారికి చెందని కానుక కాబట్టి అంత పెద్ద బ్రాకెట్టేశాను!}

{31-08-2009
మహారాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి విజయ్వనిత్ తివారీ రెండు కిలోల బంగారాన్నీ, ఇంకో అఙ్ఞాత హైదరాబద్ భక్తుడు ఇంకో కీలో బంగారాన్నీ--'.........స్వర్ణమయం' కోసమే ఇచ్చారట.}

Saturday, October 3, 2009

శ్రీగిరి శ్రీపతి


శ్రీవారి ఆస్తులు


దేవాదాయశాఖ అధికారిక 'వెబ్ సైట్' నిన్న (02-10-2009) ప్రారంభించారట ముఖ్యమంత్రిగారు!  


ఆ సందర్భంగా--ఆస్తులు దురాక్రమణ కాకుండా, ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుంది అనీ, తి తి దే ఆస్తులని ప్రత్యేకంగా పరిరక్షించడానికి ఐ యే యస్ అధికారిని నియమించడానికి ప్రభుత్వం 'సానుకూలంగా' వుంది అనీ, దేవాలయాలకు ఆదాయాన్ని సమకూర్చే ఆస్తులు, ఆభరణాల వివరాలేవీ 'పధ్ధతి ప్రకారం' రికార్డులోకి యెక్కడం లేదు అనీ--ప్రకటించారట.  


రాష్ట్ర దేవాదాయ శాఖ అధీనంలో ప్రస్తుతం మొత్తం 4,30,033.19 యెకరాల భూమి వుందట, అందులో 34,813.37 యెకరాలు 'అన్యాక్రాంతం' అయ్యాయట.  


దేవాదాయ ఆస్తుల పరిరక్షణకోసం 'అంధ్రప్రదేశ్ ధార్మిక పరిషత్తు '--దేవాదాయశాఖ చైర్మన్ అధ్యక్షుడిగా, 'వివిధరంగాలలో నిష్ణాతులైన ' 21 మంది సభ్యులతో, ఐదుగురు ప్రత్యేక ఆహ్వానితులతో, దేవాదాయశాఖ కమిషనర్ కార్యదర్శిగా--యేర్పాటు చేసిందట.  


ఇక (తి తి దే కాకుండా) అన్ని దేవాలయాలలో కలిపి మొత్తం 1135 కిలోల బంగారం, 58,170 కిలోల వెండి వున్నాయట.  


ఆఖరుగా తి తి దే వద్ద కేవలం 1396 కిలోల బంగారం, 3,440 కిలోల వెండి, 2,180 కిలోల 'బంగారుపూత ' ఆభరణాలు మాత్రమే వున్నాయట!  


'నమ్మలేని నిజాల్లో' ఈ ఆఖరుది ప్రముఖ స్థానం ఆక్రమిస్తుందేమో--గిన్నిస్ రికార్డుకి యెక్కినా యెక్కొచ్చు! లేదా, 'రిప్లీ' వారు వారి 'నమ్ము-నమ్మకపో' లో చేర్చవచ్చునేమో!  


అదండీ సంగతి!