Friday, December 31, 2010

శ్రీగిరి శ్రీపతి

శ్రీవారి ఆభరణాల విలువ

హమ్మయ్య! బెటర్ లేట్ దేన్ నెవర్ అన్నట్టు, ఇప్పటికైనా మన వున్నత న్యాయస్థానం వారి ఆదేశాల మేరకు ఆభరణాల విలువ లెఖ్ఖింపు ప్రక్రియ పూర్తి అయ్యిందట.

ఇదివరకే ముంబై, రాజస్థాన్ ల లోని జెమాలజీ నిపుణులు వజ్ర వైఢూర్యాల, ఇతర "రాళ్ల" నాణ్యత, పరిమాణం, స్వచ్చత, (విలువ?!) గురించీ, హైదరాబాదు మింట్ నిపుణులు బంగారం నాణ్యత, పరిమాణం, స్వచ్చత గురించీ రెండు నివేదికలు సమర్పించి వుండగా, ఇప్పుడు ఆభరణాల విలువపై నియమించిన కమిటీ కూడా నివేదిక సమర్పించిందట.

(తిన్నవాళ్లు తినగా, పోయినవి పోగా) "తిరువాభరణ" దస్త్రం మేరకు 137; "శ్రీ మలయప్ప స్వామి" దస్త్రం మేరకు 444; వెండివి 365; "ఇతర ఆభరణాల" దస్త్రం మేరకు 82--ఆభరణాల విలువని లెఖ్ఖించారట. (శ్రీవారికి వెండివి లేవా? ఇతరాలు 82 యేనా అని అడగొద్దు.)

శ్రీవారి "నిత్య కట్లు" విలువ లెఖ్ఖించలేదట. (వాటి వివరాల నమోదు యెక్కడైనా జరిగిందో లేదో!).

(అయినా, ప్రతి గురువారం అవికూడా లేకుండా స్వామి దర్శనం చేయిస్తున్నారుగా? ఇలాంటి దర్శనాన్ని రెండురోజులకి పొడిగించామన్నారు ఆ మధ్య. మరి రెండురోజులు చాలవా నిపుణులకి వాటి విలువ లెఖ్ఖించడానికి? యేమో. అసలు ఈ దర్శనాన్ని నిషేధించాలంటాను నేను--యెందుకంటే, "స్రగ్భూషాంబర హేతీనాం, సుషుమావహ మూర్తయే....." వల్ల "....శమనాయాస్తు....." అన్నారు కదా?) 

ఇంకా, భద్రతా కారణాల దృష్ట్యా, ఆభరణాల 'మొత్తం విలువ' ప్రకటించకుండా జాగ్రత్తపడ్డారట. సరే.

ఆయా దస్త్రాల్లో యే తేదీ వరకూ నమోదయిన వాటిని లెఖ్ఖించారో, ఆ తరవాత వచ్చిన వాటి మాటేమిటో, న్యాయ స్థానం వారూ, ఈవోగారూ తగిన కట్టుదిట్టమయిన యేర్పాట్లు చేసేలా చూడాలి. ఇక నించీ యెప్పటికప్పుడు నమోదుల వివరాలూ, వాటి విలువలూ ప్రకటిస్తూ వుండాలి.

మన పిచ్చిగానీ, వాటిని కాపాడుకోవడం లో శ్రీవారికీ, దిగమింగడంలో దగుల్బాజీలకీ జరుగుతున్న పోటీలో యెవరు నెగ్గుతున్నారో చూస్తూనే వుంటాం కదా!

Sunday, December 26, 2010

శ్రీగిరి శ్రీపతి

ఆభరణాలూ.....

"(తమకి చూపించిన) శ్రీవారి బంగారు, వెండి ఆభరణాలు 'పూర్తి స్వచ్చంగా' 'నాణ్యతతో' వున్నాయి" అని హైదరాబాదు ప్రభుత్వ మింట్ నిర్ధారించిందట.

"వందల కోట్ల" ఆభరణాల పట్ల తితిదే నిర్లక్ష్య ధోరణి వ్యవహరిస్తోందంటూ, అప్పటి సీవీ యెస్వో రమణకుమార్ నివేదిక ఇచ్చారట. 

దరిమిలా, "ఆభరణాలన్నీ సక్రమంగానే వున్నాయని, వాటి విలువ 'రూ. 51 కోట్ల 'నీ (తుర్లపాటి వారు కూడా సభ్యులుగావున్న కమిటీ) తేల్చి, న్యాయస్థానానికి ప్రాథమిక నివేదిక సమర్పించారట!

ఇప్పుడు, మరో మూడు 'స్వచ్చంద ' కమిటీలని నియమించి, ఆభరణాల 'స్వచ్చత, నాణ్యత ' ల మీద నివేదికలిమ్మందట!

వీటిలో, హైదరాబాద్ మింట్, 'మా ఆధ్వర్యంలో (???!!!) 650 బంగారు, 350 వెండి....పరిశీలించాం, రాళ్ల స్వచ్చతని.....పరిశీలించాం.....పొందుపరచిన విధానంలోనే వున్నాయి ' అని సర్టిఫికెట్ ఇచ్చేసిందట.

ఇంకో జెమాలజీ కమిటీ, 'అంతా సక్రమంగానే వుంది ' అని సర్టిఫై చేసేసిందట.

మూడో.....ఇంకమ్‌టాక్స్ కమిటీ నివేదిక ఇంకా ఇవ్వాల్సి వుందట.

యెంత "పార దర్శకంగా" సా....గుతున్నాయో కదా ఈ 'పరిశోధనలు?'

చేటంత చెవులున్న మహాపరమాత్ముడికి చిన్న నక్షత్ర గడ్డిపువ్వులు పెడుతున్నట్లు లేదూ....ఈ వ్యవహారమంతా???!!!

ఇక్కడ దృష్టి దోషాలేమిటంటే........

మనం అడిగేది......

దేవస్థానం 'హాథీరామ్‌జీ మఠం' ఆధ్వర్యంలో వున్నప్పటినించీ, కృష్ణదేవరాయలు కన్నా ముందునించీ, యేరాజులు యెప్పుడు యేయే ఆభరణాలు ఇచ్చారూ? ఆ తరవాత యెవరెవరు యెప్పుడెప్పుడు యేయే ఆభరణాలు ఇచ్చారూ? ఇవన్నీ నమోదు కాబడిన 'అదేదో' రిజిష్టరు ప్రకారం మీ వెబ్ సైట్ లో పెట్టండి. (పాత రికార్డు లేకపోయినా, కరిగించేశారేమో అని అనుమానం వున్నా) ఇప్పుడు 'ఫిజికల్ 'గా వున్నవి మాత్రమే పెట్టండి చాలు. గతం గతః. అదీ పారదర్శకత అంటే! (వాటి నాణ్యతా వగైరాల విషయానికి తరవాత వద్దాం) ఈ కమిటీలూ, "క్లీన్ ఛిట్లు" అనవసరం.

తేదీలవారీగా (పాతవాటి విషయంలో శతాబ్దాల, దశాబ్దాల, సంవత్సరాలవారీగానూ)
వివరాలు ప్రకటించండి. రోజువారీగా వాటిని అప్డేట్ చేస్తూ వుండండి. (ఈపని ఇప్పటికే చేసి వుంటే నాలాంటివాళ్లూ, యావద్భక్తులూ సంతోషించివుందురు) 

ఇప్పుడు చేసినా, అదే ఫలితం!

చేస్తారా?

Wednesday, December 1, 2010

శ్రీగిరి శ్రీపతి

........స్వర్ణ "భయం"

......వదిలించింది వున్నత న్యాయ స్థానం చివరికి. ఈ పథకం చేపట్టడానికి తి ది దే బోర్డుకి అధికారమే లేదనీ, అది రాజ్యాంగం లోని 25, 26 అధికరణలకి విరుధ్ధమనీ తీర్పు ఇచ్చింది.

శ్రీవారి గరుడవాహనం సందర్భంగా అలంకరించే 'పెద్దకాసుల పేరు ' లోని కాసులపై 'విక్టోరియా మహారాణి ' చిత్రం (ముద్ర) వుంటుందని యెందరికి తెలుసు? ఆ కాసులే యెందుకు వున్నాయి? అనేదానికి సమాధానం యెందరికి తెలుసు?

శ్రీవారి బ్రహ్మోత్సవాలు మొట్టమొదటిసారి నిర్వహించిన భక్తురాలు యెవరు? ఆవిడ బ్రహ్మోత్సవాల నిర్వహణ ప్రతి యేటా జరగడానికి వీలుగా వితరణ చేసిన భూమి యెంత? ఆ అయివేజుతోనే ఇప్పుడు వుత్సవాలు నిర్వహిస్తున్నారా?

అప్పటి రాజులు స్వామికి యెప్పుడు యేమేమి సమర్పించారు?

ఇలాంటి విషయాలన్నీ ఆ ప్రాకారం మీద శాసనాల రూపం లో శాశ్వతం గా ప్రతిష్టించబడ్డాయి.

అలాంటి గోడలని తాపడం కోసం ఐదు వేలకు పైగా బోల్టులు బిగించడానికి రంధ్రాలు చేసేస్తే, వాటిలో నీరు చేరి శాసనాలు దెబ్బతింటాయి అనీ, కట్టడం దెబ్బతింటుంది అనీ, పురావస్తు శాఖ ఇచ్చిన నివేదికని కూడా లెఖ్ఖ చెయ్యకుండా ఈ పథకం యెందుకు ప్రవేశ పెట్టినట్టు?

పాలక మండలి 'అంచనా' మేరకు బంగారం, నగదు, రూపం లో 152 కిలోల బంగారం ఇంతవరకూ వచ్చిందట. ఆది కేశవుడేమో, 160 కిలోలు వచ్చింది, మిగతా 40 కిలోలూ నేనే ఇచ్చేద్దామనుకున్నాను--అంటున్నాడు.

ఆసలు లెఖ్ఖలెక్కడున్నాయి? ఆ బంగారం యెక్కడుంది? ఇప్పటివరకూ తయారుచేసిన రేకులు యెక్కడున్నాయి? ఈ బంగారం భద్రత మాటేమిటి? స్వామికే తెలియాలి.

దర్శనాలు త్వరితంగా జరగడానికి 'కదిలే తివాచీ' యేర్పాటు విషయం లో మాత్రం తప్పదనే అభిప్రాయానికొచ్చారట .....యెంత త్వరగా యేర్పాటైతే అంత మంచిది.

వేయికాళ్ల మండపం నిర్మాణానికి అడ్డంకులని తొలగిస్తూ కోర్టు తీర్పు ఇచ్చిందనీ, దేవస్థానం నిర్మాణానికి పూనుకోవడం శుభపరిణామమని చిన జీయరు స్వామి సంతోషిస్తున్నాడు. ప్రస్తుత మండపాన్ని వందకాళ్లకు కుదిస్తున్నారనీ, స్థంభాలని అడ్డంగా నిర్మించేలా ప్రణాళికలు--పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారట.

33 కుటుంబాలకి, వంటలు చేసుకొని, భోజనాలు చేసి, నిద్రపోయే వసతి కోసం నిక్షేపంగా సరిపోయేలా నిర్మించబడ్డ (ఆరోజుల్లో అతిపెద్దదీ, ఆలయానికి అతి దగ్గరలో వున్నదీ) అయిన వేయికాళ్ల మంటపాన్ని, శిధిలమయిపోయిందని తొలగిస్తే, అదేదో ఆగమ శాస్త్రాలకి విరుధ్ధమని ఈయన అనవసరం గా హడావిడి చేశాడు.

భవిష్యత్తులో బహుళ అంతస్థుల క్యూలైన్ యేర్పాటు చెయ్యవలసి వస్తే ఇది ఆదర్శమైన ప్రదేశం అవుతుంది. అలాంటి చోట మళ్లీ మంటపాలు నిర్మించడం యెట్టి పరిస్థితుల్లోనూ వాంఛితం కాదు.

దేవస్థానం వారు గమనిస్తే మంచిది!