Saturday, March 20, 2010

శ్రీగిరి శ్రీపతి

డ్రెస్ కోడ్

తాజా వార్త. ఇప్పటివరకూ శనివారాల్లో దేవస్థానం వుద్యోగులని డ్రెస్ కోడ్ పాటించి, పంచెలూ, నామాలూ ధరించమన్నారట.

ఇప్పుడు అన్నిరోజుల్లోనూ ధరించేలా చేస్తారట. ముఖ్యోద్దేశ్యం, భక్తులకీ, వుద్యోగులకీ తేడా తెలియడానికట.

అనేకవేల గుళ్ళలో (గుండులు అనే ప్రయోగం లేదు తెలుగు లో--గుడులకైనా, గుండులకైనా ఒకటే  మాట--గుళ్ళు!), నామాలూ, అడ్డపంచెల్లో,  వుద్యోగులని యెలా గుర్తుపట్టాలి?

అడ్డపంచె తమిళుల చిహ్నం. మన పురోహితులూ, అర్చకులూ, భక్తులూ చక్కగా గోచీపోసి పంచె కడతారు. అలాంటి అలవాటున్న వుద్యోగులు కూడా అడ్డపంచెలు ధరించవలసిందేనా?

ఇంతకన్నా, వాళ్ళు తమ ఐ డీ కార్డులని చొక్కా జేబుల్లో వేసుకొని, మెడచుట్టూ తాళ్ళతో కనిపించడం కాకుండా, కార్డులు కనిపించేలా మెడలో వేళ్ళాడేసుకోమంటే ఇంకా బాగుంటుంది కదా?

(ఆ మెడతాళ్ళు ప్రతీవాళ్ళకీ వుంటాయి--పోలీసులకీ, గైడ్ లకీ, డ్రైవర్లకీ, కంపెనీ ప్రతినిధులకీ--ఇలా)

(స్త్రీ వుద్యోగులు చొక్కాలు వేసుకోరు. అయినా వాళ్ళు కార్డులని 'జేబుల్లో' పెట్టుకోకుండా బయటికి వేసుకోవడం గమనించండి!)

ఎల్ కే జీ లో వున్న మా మనవడు వాళ్ళ స్కూల్ డ్రెస్ కోడ్ ప్రకారం నిక్కరూ వగైరా వేసుకొని, ఐ డీ కార్డు వేళ్ళాడేసుకొని స్కూల్ వ్యాన్ లో వెళ్ళి వస్తూంటే, ఆ కార్డువల్ల తొడలు గీరుకు పోయేవి. నేను చూసి, మెడతాడు పొడవు తగ్గేలా పైకి ముడివేసి వాణ్ణి పంపిస్తే, స్కూల్ నించి వచ్చాక, 'తాతా! అయాం హేపీ! ఇవాళ కార్డు గీరుకోలేదు!' అని ఆనందించాడు.

(ఇలాంటి పొడుగుతాళ్ళెందుకసలు? అవి తయారుచేసే కంపెనీల లాభాలకోసం తప్ప!) 

యేమంటారు?

No comments: