Friday, May 30, 2014

శేషాద్రీ............


.............డాలర్లూ

చాలా కాలం తరవాత మళ్లీ ఈ బ్లాగులో వ్రాయవలసిన అవసరం కనిపిస్తూ వుంది.

మోడీ ప్రథాన మంత్రి కాబోతున్నాడని నిర్ధారణకాగానే, మన తి తి దే వారు, తట్టా, బుట్టా తో ఢిల్లీ వెళ్లిపోయి, ఆయనకి ఆశీర్వచనాలూ, శేష వస్త్రాలూ, ప్రసాద సమర్పణా చేసేసి వచ్చేశారు....ధూం ధాం గా....యెవరూ రమ్మనకపోయినా!

వాళ్లలో ప్రముఖుడు డాలరు శేషాద్రి!

(ఆయన మెడలో డాలరు యెప్పుడూ ధరిస్తాడు కాబట్టి అలా పిలుస్తారు అంటారు కొందరు. కాదు, శ్రీవారి డాలర్ల కుంభకోణం లో ఆయనకి సంబంధం వుంది కాబట్టి అంటారు ఇంకొందరు.)

ఆయన యెప్పుడో పదవీ విరమణ చేసినా, ప్రత్యేకం గా ఓ ఎస్ డీ (ఆఫీసర్ ఆన్‌ స్పెషల్ డ్యూటీ) కొనసాగుతున్నాడు. 

ఈయన చేసే "స్పెషల్ డ్యూటీ" యేమిటీ? 

కొండకి యెవరు యెప్పుడు రాబోతున్నారో అధికార సమాచారం ద్వారా గానీ, వాళ్ల తైనాతీల ద్వారాగానీ ముందే తెలుసులోవడం, అక్కణ్ణుంచీ వాళ్లకి "తగిన" యేర్పాట్లు చేయడం లో నిమగ్నం అవడం!

ఉదాహరణకి, ప్రథానమంత్రులూ, ముఖ్యమంత్రులూ వగైరాలకి "ఇస్తి కఫాల్, పుచ్చుకొంటి కఫాల్" లాంటి స్వాగతాలూ వగైరాలు; సినిమా వాళ్లకీ, అంబానీల్లాంటి వాళ్లకీ, రౌడీ మూకలకీ....ఇలా అందరికీ "తగిన" యేర్పాట్లు చేయడం; కొండొకచో, వాళ్ల బసల్లో భోజన, ఫలాహార, ఇతర యేర్పాట్లు చేయడం; అప్పటి తి ది దే ఛైర్మన్‌ ని బట్టి, పేరు చివర నాయుడు, రెడ్డి, రాజు అని వున్న వాళ్లందరికీ ఉచిత దర్శనాలూ వగైరా లు యేర్పాటు చేయడం--ఇలా.

అప్పుడెప్పుడో, కొన్ని అవకతవకలమీద దర్యాప్తు పూర్త్తయ్యేవరకూ ఆయన కొనసాగవలసిందే అన్నారు ప్రభుత్వం వారు. మరి అవి యెప్పుడు పూర్తవుతాయో.......లేక ఆయన కి అది జీవిత పదవో?

పాపం ఆయన "నేనింకా అద్దెకొంపలోనే నివశిస్తున్నాను.....యేమీ సంపాదించుకో లేదు.......పిల్లా పాపా లేరు......యెవరికోసం సంపాదిస్తాను......"అంటూ వాపోతాడు.

ఆయనకి శాశ్వత గృహం, జీవన భృతీ వగైరాలు యేర్పాటు చేసి, విశ్రాంతి ఇవ్వవలసిన అవసరం కనిపించడం లేదూ?