Monday, January 26, 2009

దర్శనాలు
అసలు శ్రీవారి దర్శనం కోరుకునే వాళ్ళు యెవరు? యెన్ని రకాలు? 1. పాపాలు చేసిన వాళ్ళు—వీళ్ళలో మళ్ళీ రెండు రకాలు-- అ) తెలియకుండా చేసేవాళ్ళూ ఆ) తెలిసీ చేసేవాళ్ళు. 2. కోరికలతో వెళ్ళేవాళ్ళు—వీళ్ళలో చాలా రకాలు. ఉదా: రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, వ్యాపారులు, విద్యార్థులు, సామాన్యులు—ఇలా. 3. మొక్కులు తీర్చుకునే వాళ్ళు—వీళ్ళలో కూడా పై రకాలవాళ్ళు వుంటారు! 4. ప్రచారంకోసం వెళ్ళేవాళ్ళు—తమ మఠాలకి, సంఘాలకి, శిష్యులకీ ప్రచారం తెచ్చుకోడానికి వెళ్ళే వాళ్ళు—ఇలా 5. సెలవలు కలిసొచ్చాయిగదా, గడిపినట్టూ వుంటుంది, పనిలోపనిగా దర్శనంకూడా అయిపోతుంది అనుకొనేవాళ్ళు 6. యాత్రా స్పెషల్ లో దక్షిణదేశ, ఉత్తరదేశ యాత్రలు చేసేవాళ్ళు 7. ఇతర దేవుళ్ళని దర్శించుకొని, దారిలో పనిలో పనిగా వచ్చేవాళ్ళు. 8. కేవలం స్వామి మీది భక్తితో వెళ్ళేవాళ్ళు.—ఇంకా కొన్ని (నేను మరిచిపోయిన) రకాలు వుండవచ్చు. పైవాళ్ళలో, ఒక్క పాపాలు తెలియకుండా చేసేవాళ్ళూ, సామాన్యులు తప్ప, మిగిలినవాళ్ళందరూ, సిఫార్సులతొటో, అధికారంతోటో, డబ్బుపోసి టికెట్లు కొనుక్కొనో అరికాళ్ళు కందకుండా క్షణాల్లొనో, గంటల్లోనో దర్శనం చేసేసుకొని, వీలైతే కొన్ని నిమిషాలో, గంటలో శ్రీవారి సన్నిధిలో గడపడానికి ప్రయత్నించేవాళ్ళే! ఇక గంటలతరబడీ క్యూలలో గడిపి, చివరకి ‘లఘు’, ‘మహాలఘు’ ‘మహావీరలఘు’ దర్శనాల పాలబడే వాళ్ళలొ కూడా చాలా మంది పై 3, 5, 6 రకాల వాళ్ళే. వీళ్ళందరివల్ల—సెలవు రోజుల్లోనూ, ప్రత్యేక దినాల్లోను, పర్వ దినాల్లోను—శ్రీవారి హుండీ ఆదాయం—రూ. కోటి కి తగ్గకుండా వస్తొంది! మరి మూడో రకం, యెనిమిదో రకం వాళ్ళ మాటేమిటి? సామాన్యులకి కష్టం వచ్చినప్పుడు వెంటనే గుర్తొచ్చే దేవుడు—ఇంకెవరు? స్వామివారే! మనుషులకి, ఎంతటివారికైనా తప్పని భయాలు—రోగ భయం, జరా భయం, మృత్యు భయం—ఈ త్రయమే లేకపోతే ప్రతీ మనిషీ మొనగాడైపోడూ! అప్పుడు దేవుడితో పనేముంటుంది? సాధారణంగా కుటుంబ యజమానికో, గృహిణికో, పిల్లలకో యెదైన రోగం వస్తేనో, చంటిపిల్లకి ‘బాలపాప చిన్నె’ కనిపిస్తేనో, యెవరికైనా శస్త్రచికిత్స అవసరం అయితేనో, తమ తాహతునికూడా తాత్కాలికంగా మరిచిపోయి, మొక్కుకునేవాళ్ళే యెక్కువ. మొక్కుకునేటప్పుడే తమ తాహతు గుర్తొచ్చి తక్కువలోనే మొక్కుకునేవాళ్ళు ఇంకా యెక్కువ. ‘వీలైనంత త్వరలో మీ దర్శనానికి వస్తాం’ అనో, ‘డబ్బు కూడగానే వస్తాం’ అనో, ‘పది యిళ్ళలో జోగి దండుకు వస్తాం’ అనో, ‘కేజీ ఆవునెయ్యి—కాదు కాదు—పావు కేజీ ఆవు నెయ్యీ, నూటొక్క వత్తులూ అఖండం లో సమర్పిస్తాం’ అనో—ఇలా రక రకాల మొక్కులు! తీరా గండం గడిచాక, చూద్దాంలే అని వాయిదా వేస్తూ గడిపినంతకాలం గడిపి, మల్లీ ఇంకో కష్టం వచ్చే సూచనలు కనిపించగానే పాత మొక్కు తీర్చడానికి బయలుదేరతారు! రయిల్లో సామాన్య రెండవతరగతి పెట్టెల్లో, కొండమీదికి కాలినడకన—తట్ట బుట్టా, పిల్లా జెల్లాతో—అక్కడనించీ క్యూలల్లో, రోజుల తరబడీ కష్టపడి, ప్రతీ క్షణం కష్టాన్ని మరిచిపోవడానికి ‘గోవిందా! గోవింద!’ అంటూ, మహావీర లఘువైనా, క్షణం పాటే అయిన, దర్శనమయింది చాలు అని మురిసిపోయే వాళ్ళు మాత్రమే నిజమైన భక్తులు. నిజంగా శ్రీగిరి శ్రీపతి ని దర్శించుకొనే ‘వీఐపీ’ లు వీళ్ళే! కాదంటారా? మరి వీళ్ళకి ఆ హోదా యెప్పుడు దక్కేను? అలాంటి హామీని ఇవ్వగలిగిన పార్టీకే మనం ఓటు వేద్దామా?

No comments: