Monday, July 19, 2010

శ్రీగిరి శ్రీపతి

దర్శనాలు

ఆది కేశవుడు మళ్ళీ ఇంకో కాంగీరేసు నాయకుణ్ణి 'మహావీర స్పెషల్' దర్శనానికి తీసుకెళ్ళాడట. క్యూలైన్లు ఆపలేదుట లెండి.

ఆ నాయకుడికీ, వెనకాలో పదిహేను మందికీ మాత్రమే, అందరికీ శీఘ్ర దర్శనం టిక్కెట్లు తెప్పించి, (అక్షరాలా తొమ్మిది వేల ఆరు వందల రూపాయలు--యెవరిచ్చారో!) వాళ్ళని ఆ లైన్లో రమ్మని, ఈయన మహర్ ద్వారం దగ్గర నించొని, వాళ్ళందరినీ తీసుకెళ్ళి, లఘు దర్శనం స్థానం లో వున్న తండులను తొలగించి, సన్నిధికి తీసుకెళ్ళి, నైవేద్యం గంట సమయం లో, ప్రత్యేక దర్శనం చేయించాడుట.

(మరి ఆ స్వామికి ఆ సమయం లో ఆ ప్రసాదం సహించిందో లేదో!)

ఈ దేవస్థానం పాలిటికి మోహన్ బాబొకడు. 

వేదపాఠశాలకెళ్ళి, 700 మంది విద్యార్థులు దారుణమైన మౌలిక వసతుల మధ్య వున్నారనీ, వాళ్ళ భోజన శాల పందులు తిరిగే ప్రదేశం లా వుంది అనీ, విలేకర్ల సమావేశం పెట్టి మరీ తగులుకున్నాడు.

ఈ వో గారు, "ఓ నెల లోపు" చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారట.

పాపం ఆ విద్యార్థుల గతేమౌతుందో!

మరి భక్తి చానెల్ వాళ్ళు, గంటకొట్టినంతసేపూ ఆడియో వినిపిస్తూ, గోపురం వీడియో చూపించేకంటే, ఇలాంటి పాఠశాలల్నీ వగైరాలని చూపిస్తే యెలా వుంటుందో.

 

Thursday, July 1, 2010

ఆభరణాల లెఖ్ఖలు

శ్రీ కృష్ణరాయాభరణీయం

నాకు గనక కార్టూన్లు గీయడం వస్తే, 'హా! హతవిథీ!' అని శ్రీ కృష్ణదేవరాయలు తల మొత్తుకుంటున్నట్టు కార్టూన్ గీసేవాడిని!

మరి ఆయన శ్రీవారికి సమర్పించిన ఆభరణాలేవీ ఇప్పుడు లేవట!

40 యేళ్ళ క్రితమే కరిగించివేసి వుండొచ్చు--అని తి తి దే వారి వువాచట!

ఇది మాత్రం పచ్చి అబధ్ధం! అప్పుడే నేను పత్రికల్లో చదివాను--"హుండీలోనూ వగైరా లభించిన చిన్నా, చితకా ఆభరణాల సంచులతో బొక్కసం నిండిపోతుంటే, వాటిని కరిగించి ఇటుకలు తయారు చెయ్యమని ప్రభుత్వ 'మింట్' కి పంపించారనీ, వాటిలో రాళ్ళని వేరే వేలం వేశారనీ!" (ఈ విషయం నా ఇదివరకు టపాల్లో స్పష్టం గా వ్రాశాను--వీటిలో ఖచ్చితం గా కంటెలూ, కాసుల పేర్లూ, కఠారులూ, కిరీటాలూ వగైరాలు లేవు!)

ఆభరణాల వివరాలకోసం నా క్రింది టపాని చూడండి--

http://krishnaagovindaa.blogspot.com/2009/10/blog-post_20.html


మొన్నీమధ్యనే ఓ కమిటీ శ్రీవారి ఆభరణాలన్నీ భద్రం గా వున్నాయనీ, వాటి విలువ కేవలం 52 కోట్లేననీ ప్రకటించింది!
(ఆ కమిటీకి తుర్లపాటి కుటుంబరావు దూరం గా వుండి వుంటే బాగుండేది అని నా అభిప్రాయం)

చూ|| http://krishnaagovindaa.blogspot.com/2009/11/blog-post_05.html

ఇక ఇప్పుడు రాయలు అసలు ఆభరణాలేవీ ఇవ్వలేదనీ, వూరికే పబ్లిసిటీ చేసుకున్నాడనీ ఆయన మీద పరువునష్టం దావా వేస్తుందేమో తి తి దే!

వీళ్ళిలాంటి వేర్రాలోచనలు చేస్తారని 500 యేళ్ళక్రితమే రాయలు వూహించి, రాళ్ళమీద శాసనాలు చెక్కించాడు!

అసలు ఈ శాసనాలని కనిపించకుండా చెయ్యడమే 'స్వర్ణమయం' వుద్దేశ్యమేమో!

నగరాల్లో 'కల్యాణోత్సవాల' పేరిట ప్రైవేటు వ్యక్తులు వీలైనంత దండుకున్న వార్తలు కూడా వచ్చాయి కదా?

ఇంకా వీళ్ళు యెన్నెన్ని వుపాయాలు కనిపెడతారో?

అందుకే అన్నారు "శతకోటి దరిద్రాలకి అనంతకోటి వుపాయాలు" అని!

(శతకోటి దరిద్రుల్లో వీళ్ళ శాతం యెంతో?)