నేను వెనకనించి ‘ఇంక నడువమ్మా—లేక పోతే తోసేస్తారు—అక్కడ యెడమవైపుకి తిరుగుతూ, మెట్టుదిగు’—అని చెప్పి ఆవిడని రక్షించాను! ఆవిడ వెనకే నేనూ, వెనక మా ఆవిడా, మిగతావాళ్ళూ—రెండు నిమిషాల్లో బయటికి వచ్చేశాము.
ఇక్కడ, 1979 లో మేము చేసుకున్న దర్శనం సమయం లో ఓ చిన్న సరదా విషయం!
చెప్పానుగా, అప్పుడు శ్రీవారి గర్భగుడివరకూ వెళ్ళి, ఆ ద్వారం ముందు ఓ క్షణం నించొని కనులారా దర్శనం చేసుకొని, నమస్కరిస్తూనే, కుడివైపు తిరిగి వెనక్కి వచ్చేవాళ్ళం! కొంతమంది, ఇంకా తనివితీరక, వెనక్కి వెనక్కి తిరిగి చూస్తూ, నెత్తిమీద దణ్ణం పెడుతూ, తిరిగి వెళుతూండేవారు!
అప్పుడు కూడా, ఆ రెయిలింగు వెనక, ఇద్దరు ముగ్గురు ‘ముండలూ, వెధవలూ’ వుండేవాళ్ళు!
ముందు నేనూ, నా వెనకాల మా షేహితుడు, తరవాత మిగిలిన వాళ్ళూ—కదులుతూ వుండగా, ఒక ‘ముండ’ యెక్కడా ఆగకుండ అరుస్తూనేవుంది—‘కదలాలి, కదలాలి. ఒక్కొక్కళ్ళూ అంతసేపైతే కుదరదు—‘ అంటూ వాగుతూనే, మాముందు వెనక్కి వెళ్ళిపోతున్నవాళ్ళలో ఒకాయన వెనక్కి తిరిగి చూస్తూ వెళుతుంటే, ‘ఇదుగో! ఇంక అటు తిరుగు—నడువు—లేకపోతే మెడ అలాగే వుండిపోగలదు!’ అని వేళాకోళం చేస్తుంటే, నాకు వొళ్ళు మండింది.
అప్పట్లో నేను సరదాగా ‘వెంట్రిలాక్విజం’ అభ్యసించేవాడిని, సరదాగా మా స్నేహితులదగ్గర నా విద్యని ప్రదర్శిస్తూండేవాడిని!
నాకు వొళ్ళు మండగానే, అప్పటికి సరిగ్గా గర్భగుడి ముందునించి కుడివైపు తిరుగునున్నానేమో, గంభీరం గా, నా పెదవులు కదలకుండా, ‘నువ్వు నోరు ముయ్యవే!’ అన్నాను—గుడిలోని అర్చక స్వాములు కూడా ఆశ్చర్యంగా స్వామివారివైపు చూశారు!—సాక్షాత్తూ స్వామే మందలించారా అని!
క్యూలో వాళ్ళందరూ ఒకసారి గొల్లున నవ్వు! నా వెనకున్న మా స్నేహితుడైతే, బయటికి వచ్చేవరకూ కిసుక్కూ, కిసుక్కూ నవ్వుతూనే వున్నాడు! ఆ ముండ కంగారు పడిపోయింది—యెవరు? యెవరూ? అని అరిచి ఒక్కసారి సైలెంట్ అయి పోయింది!
మా స్నేహితుడు, బయటికి హుండీ వైపు వెళ్ళడానికి తిరగ్గానే, ‘మీరే కదూ! అవునా! భలే అన్నారండీ! అందరూ స్వామివారే అనుకున్నారు! భలే అన్నారండీ—నువ్వు నోరు ముయ్యవే!—అని!’ అని ఇమిటేట్ చేస్తుంటే, నేను ‘ష్!’ అన్నాను—యెక్కడ బయట పడిపోతానో అని!
ఇప్పటిక్కూడా, మా స్నేహితుడు అది తలుచుకునీ, అందరికీ చెప్పీ, పడి పడి నవ్వుతూనే వుంటాడు! ‘నువ్వు నోరు ముయ్యవే!’ అని చక్కగా ఇమిటేట్ చేస్తూ!