మా యెడమపక్కన ఉన్న క్యూ లైన్ లో, గుళ్ళో పెళ్ళి చేసుకున్న దంపతులతోపాటు ఓ పది మందికనుకుంటా—సెల్లార్ దర్శనం అనుమతిస్తున్నారు—అలాంటివాళ్ళూ, కొండమీడికి నడిచి వచ్చే వాళ్ళకి వెంటనే సెల్లార్ దర్శనం అనుమతిస్తున్నారట—అలాంటివాళ్ళూ వెళుతున్నారు!
రెండు క్యూ లైన్లూ పడమర మాడావీధి కనిపిస్తూండగా, పైకి మెట్లు యెక్కి వెళ్ళవలసివుంది. అక్కడ, పైకి యెక్కేసరికి, ఇంకా యెడమ పక్క వున్న క్యూ లైన్ నించి మా యెడమ పక్క క్యూలైన్ లోకి తెరుచుకొనే గేటు తెరిచారెవరో! ఆ క్యూలు రెండూ కొంతసేపు కలిసి పోవడమే కాదు, వాళ్ళ లైను త్వరగా కదిలి పోయింది! మా లైను ఓ పావుగంట కదల్లేదు! (ఆ గేటు ని యెవరో ‘మేనేజి’ చేసి వుంటారని మా లైన్లో అనుమానాలు!)
అక్కడి నించి ఓ గదిలో ప్రవేశించి, మళ్ళీ మెట్లెక్కుతూ, కుడివైపు తిరుగుతాయి క్యూ లైన్లు. అక్కడ మాత్రం, చీమల బారుల్లా నెమ్మదిగానే కదిలాయి లైన్లు!
ఆ తరవాత, మెట్లు క్రిందికి దిగి, మాడా వీధి గుండా క్యూ లైన్లు త్వర త్వరగానే కదిలి, దక్షిణ మాడా వీధికి మలుపు తిరిగి, త్వరలోనే మహర్ద్వారం దగ్గరికి చేరాము!
ఈ లోపల, నా క్రితం దర్శనాల్లో, ఈ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లూ, సెల్లార్ దర్శనాలూ లేవని, ముఖ్య ప్రాకారం చుట్టూ మాత్రమే క్యూ లైను (సర్వ దర్శనానికి) వుండేదనీ, అప్పటిలో పాతిక రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్ కొనుక్కున్న వారిని మహర్ద్వారం దగ్గర సర్వదర్శనం క్యూ లైన్ లో కలిపేవారనీ, మేము 1975 లో చేసుకున్న దర్శనం అదేననీ) (ఆ దర్శనం గురించి ఇంకో సంచలన నిజం తరవాత చెపుతాను!) ఆ క్యూ ప్రాకారం లోపల మళ్ళీ గోడ పక్కనే వెళుతూ, వెండివాకిలి దగ్గరకి చేరేదనీ, అప్పుడు వీఐపీ లని, మహర్ద్వారం గుండా బంగారువాకిలి దగ్గరకి తీసుకెళ్ళి, అక్కడ గర్భ గుడి దగ్గరదాకా వెళ్ళే జనరల్ క్యూ లో కలిపేవారనీ, బంగారు వాకిలి లోపల యెంతటివారైనా ఒకటే అనీ, (1979 లో నేను చేసుకున్నది వీఐపీ పాస్ దర్శనమే అనీ) నా ఙ్ఞాపకాలు చెప్పాను!
ఇప్పుడు ప్రాకారం లోపల గోడ పక్కన క్యూలు లేవనుకుంటా! లేకపోతే, అదంతా గడిచి సర్వ దర్శనం వాళ్ళు వచ్చారో తెలీదుగాని, వెండి వాకిలి ముందు ఓ పెద్ద మంద చేరింది! అక్కడ నించి తోపులాటలు మొదలు!
వెనకవాళ్ళు ‘గోవిందా! గోవింద!’ అంటూ ఒక్క తోపు తొయ్యడం, ముందువాళ్ళు ఇత్తడి కంచెలకి నొక్కుకు పోవడం!
పాత ధ్వజ స్థంభం ముట్టుకోవడానికీ, కొత్త ధ్వజ స్థంభం (పాత ధ్వజ స్థంభం యెప్పటినించో లేదు--స్థంభ మూలం మాత్రమే వుంది! మరి అది వుండగా, ఇంకో కొత్తమూలం, ఇంకో ధ్వజ స్థంభం యే ఆగమ శాస్త్ర ప్రకారం నిర్మించారో వారికే తెలియాలి!) ముట్టుకోడానికి అదే తోపులాట! అక్కడికి నలిగి నలిగి, వెండి ద్వారం ముందుకి చేరాం!
అక్కడొక ఇరవై నిమిషాలపాటు వుండిపోయాం! (పదకొండు గంటల నించీ—వికలాంగులకి, వయోవృద్ధులకీ ప్రత్యేక దర్శనాలు వుంటాయట—వాళ్ళు వెండివాకిలి గుండా తిరిగి వస్తూనే వున్నారు అంతసేపూ! (దేవస్థానం వాళ్ళు ఇలా ప్రత్యేక దర్శనాలకి కేటాయించడం చాలా ముదావహమని మాలో మేము సంతోషించాము!)
ఇంతలో, మా కుడిపక్క ఇంకో ప్రత్యేక క్యూ వెలుస్తోంది—దేవస్థానం వుద్యోగుల తాలూకు ప్రత్యేక క్యూ అట అది—లోపలి వాళ్ళందరూ దాదాపు బయటకి వచ్చెయ్యగానే, వీళ్ళని లోపలకి వదిలేశారు!
ఆ తరవాత మా క్యూలు (అంటే నిజంగా క్యూలు లేవు—మందలే!) వెండివాకిలి లోకి వదిలారు—మళ్ళీ వీలైనంతగా తోపులాట!
అక్కడ మళ్ళీ చిన్న క్యూ లైను! అక్కడికి వైకుంఠ ద్వారం కనిపిస్తూ వుంటుంది! అక్కడనించి కుడివైపు లోపలికి (బంగారువాకిలి దగ్గరకి) క్యూ! చెప్పానుగా, అప్పటికే అన్ని క్యూలూ కలిసిపోయాయని!
ఇక అక్కడ నించి ‘మహా లఘు’ లేదా ‘మహావీర లఘు’ దర్శనం!