Saturday, February 21, 2009

అక్రమార్క సేవలు

మన శ్రీ. శ్రీ. దే. లో చిరుద్యోగులు సైతం, సొంత కార్లలో కార్యాలయాలకి వస్తున్నారట! శ్రీవారి సేవల టిక్కెట్లని దొడ్డి దారిలో అమ్మేసుకొని, లక్షాధికారులు అయి పోతున్నారట! మామూలుగా రిజార్వేషనే కాకుండా ‘విచక్షణ’ కోటా కూడా వుంటుంది! ఈ విచక్షణ కోటా క్రిందే మొన్న వేలాది పాసులు జారీ చేస్తె, క్యూ లైన్లు కదలడంలేదని జనాలు అందోళన చేసి, ఆ లైన్లనే విరగ్గొట్టారు! వస్త్రాలంకార సేవకి మామూలుగా రూ.12,250/- టిక్కెట్ అయితే, విచక్షణ కోటా క్రింద రూ.50,000/- ట. మరి వీటిని రూ. లక్షకి అమ్ముకుంటే యెంత లాభం? అభిషేక సేవకి జులై 2029 వరకూ రిజర్వేషన్ లు అయి పోయాయట! వస్త్రాలంకార సేవకి ఏప్రిల్ 2020 వరకూ అయి పోయాయట! మరి మీరేమో వీ ఐ పీ! రేపే మీకు వీటిల్లో యేదో సేవకి టిక్కెట్ కావాలి. యెమి చేస్తారు? మేము యేమి చేస్తాము? యెలాగోలా మీకు ఆ టిక్కెట్లు దాఖలు చెయ్యక చస్తామా! సందట్లో సడేమియా, మేమో రెండు నొక్కేస్తాము! అన్నిటికీ ఆ పైవాడే వున్నాడు! విజిలెన్స్ వాళ్ళు కొన్ని సంవత్సరాలుగా పై అధికారుల దృష్టికి తెచ్చినా, మనకేం ఊడింది! అదండీ సంగతి!

Monday, February 16, 2009

దర్శనం

మనం అనుకున్న దర్శనాల్లో ఓ రకం దర్శనం గురించి ఇవాళ ఈనాడు (16-02-2009) లో పడింది! ఊదయ్ శెట్టి అనే ఓ కిడ్నాపర్ నేపాల్ కీ మనకీ మధ్య అగ్గిపుల్ల వేశాడు! ముంబయి లో కిడ్నాపులు, బెదిరింపులు చేసి చేసి, పోలీసులు వెంటపడగానే, నేపాల్ పారి పోయాడట! అక్కడి కిడ్నాప్ కింగ్ తో కలిసి, కిడ్నాప్ లు చేస్తున్నాడట! ఒచ్చిన మొత్తంలో ఇంత % అని శ్రీవారి హుండీ లో వేస్తున్నాడట! అదీ సంగతి! యెలాంటి డబ్బయినా, శ్రీవారి హుండీ చేరగానే పవిత్రం అయిపోతుంది సరే! కానీ ఈ పవిత్రమైన సొమ్ము కాదని, శ్రీ వారికి ముష్టి యెత్తుకోవలసిన ఖర్మ యేమిటి? ఇప్పటికైనా ఈ ముష్టి పధకం రద్దు చేస్తారా?