Monday, November 30, 2009

శ్రీగిరి శ్రీపతి

నిర్మాణాలు, కేటాయింపులు

“నిత్యం వివాహాలు చేసుకొనేందుకు వీలుగా, ‘కేంద్రీకృత కల్యాణ వేదిక’ నిర్మించాలని పాలక మండలి నిర్ణయించి, వాళ్ళ ఇంజనీరింగు విభాగానికి అనుమతి” ఇచ్చిందట.
“పురోహిత సంఘాన్ని కూడా కల్యాణవేదిక వద్దకు” మార్పు చేస్తారట.
(ఇన్నాళ్ళూ వివాహాలు యెక్కడ యెలా జరుగుతున్నాయో, పురోహిత సంఘం యెక్కడ వుందో—వీటివల్ల ఇబ్బందులేమైనా వున్నాయో నాకైతే తెలియదు—తెలిసున్నవాళ్ళు చెపితే సంతోషం!)
అయినా యెందుకు వ్రాస్తున్నానంటే, ‘నిర్మాణాలు‘ అనేప్పటికల్లా, యెందుకంత ‘శీఘ్రం గా’ నిర్ణయాలూ, అనుమతులూ జరిగిపోతాయో అని నా అనుమానం! (శుభ్రం గా ఇసుకా, సిమెంటూ, కంకరా భోంచెయ్యచ్చనా అని సందేహం!)
ఇక, “వరదలకారణం గా నష్టపోయిన ఆలయలకు ఆర్థిక సహాయం” చేస్తారట! బాగుంది.
మరి, ఈ పేరుతో, మొదట ‘మంత్రాలయం’ లో అభివృధ్ధి పనులకోసం, 5 కోట్లు యెందుకు కేటాయించాలి? 

అదేమీ పురాతన హిందూ దేవాలయం కాదే? పైగా రాఘవేంద్రస్వామి కి వుండే భక్తులు ఆయనకి వున్నారు—ఆ మఠం ప్రస్తుత స్వామిని, వరదలు మొదలయ్యేలోపల, హెలికాప్టరులో సురక్షిత స్థానానికి తరలించారు కదా? మరి ఆ సంస్థ అంత బీద స్థితిలో వుందనా ఈ గొరిగింపు? (ఈ వంకని ‘సిఫార్సు’ చెయ్యబడ్డ అడ్డమైన గుడికీ కేటాయింపులు చేసుకోవచ్చనేమో అని నా అనుమానం!)
పైగా, కర్ణాటకలోని ఉడిపి శ్రీకృష్ణాలయం లో ‘అన్న బ్రహ్మ’ (ఈ బ్రహ్మెవరో!) పథకాన్ని ఆదివారం (29-11-2009) న ఆదికేశవుడు ప్రారంభిస్తాడట.
అన్నవరం సత్యదేవుడితో మొదలెట్టి, జంగారెడ్డిగూడెం దగ్గర ‘గోకుల తిరుమల పారిజాత గిరి’ మీది స్వామి వరకూ, వాళ్ళ వాళ్ళ ‘నిరతాన్నదాన’ పథకాలు ప్రవేశపెట్టుకున్నారు! ప్రతీ వీధి చివరి గుడీ, పర్వదినాల్లో ‘అన్న సంతర్పణలు’ చేస్తున్నాయి! మరి ఉడిపి స్వామి కేమి దొబ్బుడాయి?
ఇవన్నీ మారాలంటారా, వద్దా?

Sunday, November 29, 2009

శ్రీగిరి శ్రీపతి


ఆభరణాల లెఖ్ఖలు—2

మొత్తానికి దేవస్థానం వారు ఓ మూడు కంపెనీలకో యేజన్సీలకో శ్రీవారి నగల విలువని నిర్ధారించడానికి కాంట్రాక్టు ఇచ్చారట. మరి వీళ్ళలో యెవరెవరు యేయే ఆభరణాలకి యెంతెంత విలువ యెలా యెలా కడతారో చూద్దాం!

వున్న ఆభరణాల మాట సరే, మరి లేవేమో అని అనుమానిస్తున్నవాటి మాటేమిటి?

ఇంకో సంగతి—గాలి సమర్పించిన కిరీటానికి ‘బిల్లులు ‘ లేవట! అసలు ఇచ్చాడో లేదో, ఇనుముమీద కోటింగు ఇప్పించాడో యెవరికి తెలుసు!

ఇక సేవల విషయం లో కూడా, రద్దు చెయ్యట్లేదని తెలుస్తోంది!

పైగా, చంటిపిల్ల తల్లులకి దర్శనాన్ని యెత్తేశారట.

ఇంకో ముగ్గురినో యెందరినో ఎం ఎల్ యే లని పాలక మండలి లో చేర్చుకొన్నారట. సరే.

వాళ్ళు ప్రమాణస్వీకారం చేసే తతంగం జరుగుతున్నంతసేపూ, ధర్మ దర్శనం, శీఘ్ర దర్శనం క్యూలని ఆపేశారట!

ఇలాంటి తతంగాలని యే టీ టీ డీ ఎడ్మినిస్ట్రేటివ్ బిల్డింగులోనో యేడవచ్చుగా? దర్శనాన్ని ఆపేసి, గుడిలో దొబ్బించుకోవడం యెందుకు?

శ్రీవారు పాలకులకీ, వాళ్ళ మండళ్ళకీ మంచి బుధ్ధిని ఒసగు గాక!

Thursday, November 5, 2009

శ్రీగిరి శ్రీపతి


ఆభరణాల లెఖ్ఖలు

అనుకున్నంతా అయ్యింది! కోర్టువారికి తి తి దే వారు శ్రీ వారి ఆభరణాల విలువ కేవలం రూ. 52 కోట్లే (52 వేల కోట్లు కాదు) అని చెప్పారట!  


అలా యెందుకంటే, 'అప్పటి లెఖ్ఖల ప్రకారమే మేము కూడికలూ, తీసివేతలూ చెయ్యగలం గానీ, హెచ్చవేతలూ అవీ మాకు రావు కదండీ' అంటున్నారట!  


ఉదాహరణకి శ్రీ కృష్ణదేవరాయలు చేయించిన వజ్రకిరీటం విలువ ఆ రోజుల్లో అర్థనూట పదహార్లు అనుకుందాం--దాంట్లో బంగారం ఓ 30 రూపాయలూ, మిగిలిన కెంపులూ, పచ్చలూ, వజ్రాలూ, వైడూర్యాలూ, నీలాలూ, గోమేధికాలూ వగైరా--సైజులని బట్టి--మూడణాల ముక్కానీ నించి, మూడురూపాయల ముప్పావలా అర్థణా వరకూ లెఖ్ఖ వేసి, రూ. 28 సరిపెట్టారన్నమాట.  


ఇక రాలిపోయిన పెద్ద కెంపు విలువ--మూడురూపాయల ముప్పావలా అర్థణాయే కదా?  


ఈ లెఖ్ఖన మొత్తం ఆభరణాలు యెంత యెక్కువగా లెఖ్ఖగట్టినా, రూ. 52 కోట్లంటే--అన్నన్నా! యేమి తి తి దే వారి దాతృత్వము!  


పోనీ ఆ లెఖ్ఖలే చూసుకున్నా, గత 50 యేళ్ళుగా, మొన్నటి ఆర్థిక సంవత్సర ముగింపువరకూ వచ్చిన కానుకల్ని లెఖ్ఖవేసుకున్నా, అప్పటప్పటి ధరల ప్రకారమైనా, ఓ వందకోట్లన్నా వుండవా?  


నేను 'డైరీ' లో ప్రచురించిన వాటి విలువని కూడినా చాలానే వుంటుందే?  


మరి యెవరి చెవుల్లో పువ్వులు పెడతున్నారు?  


కోర్టే తేలుస్తుంది!


Sunday, November 1, 2009

శ్రీగిరి శ్రీపతి


ఘంటారావం


శ్రీగిరిపై యెక్కడా గంట వినిపించడం లేదు--ఆలయం లో గంట జాడగానీ, భక్తులెవరూ గంట కొడుతున్న జాడ గానీ లేవని వ్రాశాను ఇంతకు ముందు.  


ఇప్పుడు యేకం గా సాయంత్రం యేడున్నరనించీ ఓ అరగంటపాటు 'ఘంటారావం' పేరుతో 'భక్తి చానెల్ ' లో ప్రత్యక్ష ప్రాసారం చేస్తున్నారు యేదో ఓ చిన్న గంటని మ్రోగించి!  


గమనించారా?  


అదికూడా నిజం గా గుడిలో మోగిస్తున్నారో, టేప్ రెకార్డు చేసి వినిపిస్తున్నారో నాకు సందేహమే!  


మరి ఆలయం లోని పెద్ద కంచుగంట మోగిస్తే 'గాంగ్.........గాంగ్' అని మోగేది--అదేమయ్యిందో?