Friday, December 18, 2009

శ్రీగిరి శ్రీపతి


"తిరుప్పావై"

ఆంధ్రదేశానికీ, తెలుగువాళ్ళకీ వ్యతిరేకం గా, బాగా వేళ్ళూనుకొన్న కుట్ర యేదో జరుగుతోందేమో అనిపిస్తూంది నాకు.  


ఇదేదో--ప్రత్యేక తెలంగాణా గురించో, సమైక్య ఆంధ్ర గురించో, 'తిరు ' చిదంబరం గురించో అనడం లేదు.  


శ్రీగిరి శ్రీపతి దేవస్థానం మొత్తం క్రమం గా 'తమిళీకరణ ' జరుగుతోందా--అని అనుమానం వస్తోంది!  


లేకపోతే, సుప్రభాత సేవ కూడా రద్దుచేసి, 'తిరుప్పావై' పఠించాలని నిర్ణయించడం గత 40 యేళ్ళలో యెప్పుడైనా జరిగిందా? జరిగితే యెప్పుడు మొదలయ్యింది?  


ఇంకా తి తి దే వారి "ఆళ్వారు దివ్య ప్రబంధ ప్రాజెక్ట్" సంస్థ ద్వారా, ఆంధ్ర దేశమంతటా, చిన్న పట్టణాళ్ళో కూడా, ఊరూపేరూ లేని విష్ణ్వాలయాలలోనూ, శివాలయలలోవున్న చిన్న చిన్న వైష్ణవాలయాల్లోనూ 'ధనుర్మాసం' పేరు చెప్పి, ప్రతిరోజూ 'తిరుప్పావై' పఠింపచెయ్యడం యేమిటి?  


దానికి పత్రికలూ, మీడియా అమాయకం గా పబ్లిసిటీ ఇవ్వడం యేమిటి?  


ఉదాహరణకి--పంచారామాల్లో ఒకటైన భీమవరం లోని భీమేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం లోని--శ్రీ రాధాకృష్ణ దేవాలయంలో--ఈ నెల 16 నించి జనవరి 14 వరకూ, అదే వూళ్ళో, 'సాంస్కృత కేంద్రం' లో వేంచేసిన శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం వద్ద--ఈ నెల 16 నించి జనవరి 13 వరకూ, పాలకొల్లులో 'అష్టభుజ లక్ష్మీనారాయణస్వామి 'ఆలయంలోనూ, తిరుప్పావై ప్రవచనాలు జరుగుతాయట!  


ఇక ఈనాడు 'ఆధ్యాత్మికం' లో ఆప్పరుసు రమాకాంతరావు గారు (ఈయన క్రెడెన్షియల్స్ యేమిటో నాకు తెలియవు)-- 'విష్ణుచిత్తుడికి ' ఓ పాప దొరికితే, ఆమెకి 'చూడి కొడుత్త నాచ్చియర్ ' అని పేరు పెట్టాడని--అవాకులూ చెవాకులూ యెందుకు వ్రాసారో, దాన్ని ఈనాడు వారు యెందుకు ప్రచురించారో--వారికే తెలియాలి!  


విష్ణుచిత్తుడికి దొరికిన పాపకి ఆయన పెట్టింది 'గోదాదేవి ' అనే పేరు! దాన్నే తమిళులు 'ఆండాళ్' అని పెట్టుకున్నారు!  


మరి 'చూడి కొడుత్త నాచ్చియర్ ' యేమిటి?  


గోదాదేవి యుక్తవయస్సులోకి వచ్చాక, రంగనాధుడిని వరించి, తను అందంగా వున్నానో లేదో, స్వామికి నచ్చుతానో లేదో అనుకొంటూ--స్వామికోసం కట్టిన పూల మాలల్నీ, దండల్నీ తానే ధరించి, నూతిలో నీడ చూసుకొని నమ్మకం కుదిరాక, వాటిని స్వామికి అలంకరించేది (ట)! అందుకని, 'తాను ధరించినవి అర్పించినది ' అనే అర్థం లో, 'శూడి కుడుత్త నాచ్చియర్ ' అన్నారట! 


(ఆవిడ శ్రీరంగనాధుణ్ణే పెళ్ళాడానని వూహించుకోవడం, తిరుప్పావై రచించి గానం చెయ్యడం చరిత్ర--లేదా కొంతమందికి పుక్కిటి పురాణం!)  


మరి ఆంధ్రులకి ఈ భావ దాస్యం యెందుకు?  


ఐటీ, నీటిపారుదల, పారిశ్రామిక రంగాల్లో అభివృధ్ధి చెందుతున్న ఆంధ్రప్రదేశ్ ను ముక్కలు చెయ్యడానికి తమిళులు కుట్ర పన్నుతున్నారని అనుమానాలు వస్తున్నాయి అని మాజీ మంత్రి మాగంటి బాబు కూడా అన్నారట!  


నేను మరోసారి హెచ్చరిస్తున్నాను--శ్రీగిరి శ్రీపతి ఆలయాన్ని 'వైష్ణవ దేవాలయం' అని వ్యవహరించడానికి వీల్లేదు!  


ఆయన దేశ, కాల, భాషా, ప్రాంతీయ, కుల, మతాలకి అతీతుడు--కోట్లాది భారతీయులకి--అందులో సామాన్యులకి--కలియుగ దైవం!  


పిచ్చి పిచ్చి వేషాలు వేశారో--ఝాగ్రత్త!

4 comments:

చిలమకూరు విజయమోహన్ said...

క్రీ.శ 1330 నుండి 1360 వరకు శ్రీరంగనాథుడు తిరుమలలో ప్రవాసమున్నప్పుడు ఆయన సమక్షమున గోదాదేవి సప్తపదులు పఠించుట ప్రాతఃకాలమున మేలుకొలుపులుగా పరిగణించుట జరిగేది. ఇదే శ్రీవారిని ప్రశంసించుచు వ్రాసిన సుప్రభాతశ్లోకముల ఆవిర్భావానికి హేతువై ఉండును. ప్రతివాది భయంకర అన్నన్ గారిచే కూర్పుచేయబడిన మధురాతిమధుర సుప్రభాత శ్లోక పఠనం మొదటగా 14 వ శతాబ్దము అంతమునగానీ 15 వశతాబ్దము ప్రారంభమున గానీ ప్రారంభింపబడి ఉండును.క్రీశ. 1476 పూర్వము తమిళ ప్రబంధములు తిరుమల దేవాలయంలో పారాయణము గావించుటయు లేదు.తాళ్ళపాక అన్నమయ్య మేలుకొలుపులతోగాని,సుప్రభాతంతో గాని తిరుప్పళ్ళి ఎళుచ్చి( ఆండాళ్ సప్తపది లేక గోదాదేవి తిరుప్పావై)లోని మేలుకొలుపులు పఠించుట జరుగలేదు.తోమాలసేవ ప్రవేశపెట్టిన అనంతరమే తమిళప్రబంధపారాయణము అమలులోకి వచ్చింది.--తిరుపతి చరిత్రము టి.కె.టి.వీరరాఘవాచార్యులు.ఆంగ్లానువాదము సర్దార్ దీవి రంగనాథాచార్యులు.
కాబట్టి తిరుప్పావై పఠనం ఈమధ్యకాలం నుంచి ప్రారంభం కాలేదు.నేటి సుప్రభాత పఠనం కన్నా ముందునుంచే ఉందని అర్థమవుతోంది.

చిలమకూరు విజయమోహన్ said...

>>"ఐటీ, నీటిపారుదల, పారిశ్రామిక రంగాల్లో అభివృధ్ధి చెందుతున్న ఆంధ్రప్రదేశ్."
నిజమా ! 1968లో ప్రారంభమయి సంవత్సరంలో తొమ్మిది నెలలు నిండుగా ప్రవహించి మా తాడిపత్రి ప్రాంతభూములను తడిపిన తుంగభద్ర ఎగువకాలువ నీళ్ళు ఇప్పుడు వారంరోజులు కూడా రావడంలేదు.
ఒకప్పుడు ఇరవై అడుగులు తవ్వితే సమృద్ధిగా జలం మరి నేడో వందల అడుగులు వేసినా కనిపించడంలేదు.
జలయజ్ఞం గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.నీళ్ళు పేపర్లలోనే ప్రవహించేది పొలాలలోకాదు.
మా చిన్నప్పుడు పల్లెలు పాడిపంటలతో కళ కళలాడేవి మరి నేడో పశుసంపద క్షీణించి,పంటాపొలాలన్నీనిస్సారాలై, బీడులై దర్శనమిస్తున్నాయి.మా నానమ్మ ఎన్ని లీటర్ల పాలు వచ్చినా అమ్మేది కాదు .వాటిని మజ్జిగ చేసి కూలీలకు పంచేది.ఉదయం సమయమంతా వచ్చిన వాళ్ళకు పంచడానికే సమయం సరిపోయేది. మరి నేడో ఒకలీటరు పాలు(మంచివి) దొరకాలన్నా మాకు కష్టమైపోతోంది.ఆనాడు నెయ్యి మాత్రమే అదీ ఎక్కువైతే మాత్రమే అమ్మేది.

A K Sastry said...

డియర్ చిలమకూరు విజయమోహన్!

విలువైన సమాచారం ఇచ్చారు--చాలా సంతోషం!

'తిరుపతి చరిత్రము' గురించి మరిన్ని వివరాలూ, దొరుకు చోటు, అంతర్జాలం లో దొరుకుతుందా, వ్రాయబడిందెప్పుడు, అది సిధ్ధాంత గ్రంధమా--ఇలాంటి వివరాలు మీకు తెలిస్తే, తప్పక వ్రాయగలరు అని నా ప్రార్థన.

ఇక నా బాధల్లా--ఇప్పుడు ఊరూరా పనిగట్టుకొని ఆ సంస్థ ద్వారా ఇంత ప్రచారం కల్పించడం యెందుకనే!

తెలుగునాడులో వున్న స్వామి, తెలుగునాడులోవున్న మనం--యేభాషో తెలియని--ఇస్థెకఫాల్ స్వాగతం; మేల్ చాట్ వస్త్రం; తమిళమే అని తెలుస్తున్న స్నపన తిరుమంజనం; కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం--లాంటి పదాలతో యెందుకు సహజీవనం చెయ్యాలి?

ధన్యవాదాలు!

A K Sastry said...

డియర్ చిలమకూరు విజయమోహన్!

మీరన్నది నిజమే!

నేను 'తమిళ కుట్ర' అన్నదానికి మద్దతుగా మాజీ మంత్రిగారి వ్యాఖ్యని జోడించాను గానీ, నేను ఆయన అభిప్రాయాల్ని సమర్థిస్తున్నాను అని అర్థం చేసుకోవద్దు!

సరిగ్గా నేను అనుకున్నట్టే మీరూ అన్నందుకు నా ధన్యవాదాలు!