Saturday, May 21, 2011

వేదపాఠశాల - 3



.....వేధింపులు

స్వామి చర్చకులచేత నిజాలు మాట్లాడిస్తున్నా, మళ్లీ మళ్లీ గుడుగుడు గుంచం అంటూ మొదటికే వచ్చి, 'గోరంతల్ని కొండంతల్ని' చెయ్యడం అంటూనే మాట్లాడారు.

వేదాలు పవిత్రమైనవి, తిరుమల, తిరుపతి పవిత్రమైనవి, వేద పాఠ శాల కూడా పవిత్రంగా వుండాలి కదా? అక్కడ తప్పు జరుగుతోంది అంటే, ఆ పవిత్ర వాతావరణం అక్కడ లేదు.....కల్పించబడలేదు అనే కదా?

మరి పవిత్ర పాఠశాల పేరుతో ఇలాంటివాటిని చాపక్రిందకి తోసెయ్యాలనా? (సత్యసాయి మీద హత్యా ప్రయత్నం జరిగి, బులెట్లు ఆయన వాటర్ బెడ్ ని చీలిస్తే, కొన్ని హత్యలు జరిగితే, అప్పట్లో ఇన్ని ఛానెళ్లు లేక, అవన్నీ చాపక్రిందకి తోసేశారు. అప్పుడు చర్యలు తీసుకొనుంటే, ఇప్పుడు ట్రస్టు మీదా, కొంతమంది మీదా ఆరోపణలకి ఆస్కారమే వుండేది కాదు. చరిత్ర మరోలా వుండేది!)

ఆం. భూ. వారు, అసలు వాళ్లకి కంప్యూటర్లు యెందుకండీ అనీ, ఇంకో ఆయన సెల్ ఫోనులెందుకు అనీ, ఇంకో ఆయన సెల్ ఫోనులు బ్లాక్ & వైట్ వి అయితే సరిపోతాయి, కలర్లూ కెమేరాలూ నిషేధించాలి అనీ--ఇలా!

అంటే, వేద విద్యార్థులు (వేదం మాత్రమే) చదువు పూర్తి చేసుకొని, జీవితంలో ప్రవేశించేవరకూ కూపస్థ మండూకాల్లా వుండాలనా? నలందా, తక్షశిల వగైరాల్లో అలాగే జరిగిందా?

గర్భాష్టమం లో వుపనయనం చేసి, విద్యార్జనకి పంపితే, ఆరేళ్లలో 15 వ పుట్టినరోజు నాటికి "సకల శాస్త్రాలూ" చదివి, కొలువులు వెతుక్కోడానికి విద్యాలయాన్ని వదిలేవారు. మరి ఇప్పుడు 9 యేళ్లనించీ, 10 యేళ్లనించీ వేదం మాత్రమే పూర్తి చెయ్యలేకపోతున్నారంటే, ఆ సిలబస్ లో లోపమా? లేక అధ్యాపకులదా?

ఇంకా, ఈవో గారు చక్కగా వ్యవహరించారు అనీ, బయటపెట్టకపోయినా వెంటనే దర్యాప్తు చేయించి "ఇద్దరు విద్యార్థులని" టీసీలు ఇచ్చి పంపించారు అనీ అన్నారు. ఓ కుటుంబంలో యెవరైనా ఓ చిన్న తప్పు చేస్తే, యజమాని వెంటనే మీడియావాళ్లని పిలవరుగా? అనీ, ఈవోగారు క్యూలైన్లూ వగైరా వ్యవహారాలే చూసుకుంటాడా, వేదపాఠశాలని కాపలా కాస్తూ కూచుంటాడా? అని కూడా అన్నారు. 

యెంత విడ్డూరం! 845 మంది విద్యార్థులు (ఈ అంకె వాళ్లు చెప్పిందే) కొన్ని సంవత్సరాలుగా అక్కడే వుంటూ, తింటూ, చదువుకుంటుంటే, కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న దేవస్థానం వారు, ఆ పాఠశాల నిర్వహణకి తగిన యంత్రాంగాన్ని యేర్పాటు చెయ్యలేదు అని స్పష్టం అవుతోంది కదా? దీనికెవరు బాధ్యులు?

నిన్న (20-05-2011) న స్థానిక రెండో పట్టణ పోలీసులు ఓ విద్యార్థి ఇచ్చిన ఫిర్యాదుపై, ముగ్గురు విద్యార్థులమీదా, ప్రథానాచార్యుల మీదా కేసు నమోదు చేసి, ప్రథానాచార్యులు రామ మూర్తిగారిని స్టేషనుకి పిలిపించి విచారించారు అనీ ఇవాళ పేపరులో వార్త!

ఇంకా యెందుకు దాపరికాలు?

ప్రతీదానికీ దేవస్థానం యేమిచేస్తుంది? అని ఓ వెక్కిరింపు! టిక్కెట్లు బ్లాకులో అమ్మేసుకున్నా, వీఐపీలకి గంటలతరబడి క్యూలు ఆపేసి ధ్యానాలకీ, దర్శనాలకీ యేర్పాట్లు చేసినా, రాజకీయులు ర్యాలీలూ వగైరా చేసినా, అన్యమత ప్రచారం జరిగినా, లడ్డూ ప్రసాదాల్లో పంచదార బదులు వుప్పు వేసేసినా, ప్రసాదాలు హొటళ్లలో అమ్ముకున్నా.....ఇలా యేమి జరిగినా అన్నింటికీ దేవస్థానాన్ని అనేస్తారా?! అన్నట్టు లేదూ?

.....తరువాయి మరోసారి.

Friday, May 20, 2011

వేద పాఠశాల - 2



.......వేధింపులు

(మధ్యాహ్నం 12-00 నించి సాయంత్రం 5-00 వరకూ తీసెయ్యడం వల్లనేమో, రాత్రి 8-00 నించి 9-30 వరకూ కరెంటు పోలేదు. చర్చా కార్యక్రమాన్ని పూర్తిగా చూశాను.)

చర్చ బాగా.....నే....జరిగింది--మధ్య మధ్యలో ఆవేశపరుల కాల్స్ తో.

అసలు చర్చా విషయం--"సున్నితమైన.....కలిగించచ్చా?" అన్నదే "బయస్డ్" గా వుంది. 

చర్చకి వచ్చినవాళ్లు వుద్దండులే. ఆంధ్ర భూమి పత్రిక యెడిటరూ, దేవాలయ పరిరక్షణ కమిటీనో యేదో--దాని 'సమ్‌థింగ్' సౌందర రాజన్ అనే ఆయనా, ఓ మానసిక వైద్యుడూ, వైఖానస ట్రస్టు 'సమ్‌థింగ్' ఓ ఆచార్యులవారూ. 

అందరూ "కన్వీనియెంట్"గా మరిచిపోయిన విషయాలు కొన్ని వున్నాయి. అవి చివర్లో.

ముందు ఆ విషయం మీద దర్యాప్తు చెయ్యడానికి ఈవోగారిచేత నియమితుడైన డీయెస్పీ గారి ఫోన్ కోసం ప్రయత్నించారు కానీ "సాంకేతిక" కారణాలతో లైన్ కట్ అయ్యింది.

చర్చని ప్రారంభిస్తూ ఆం.భూ. వారు, సాధారణంగా ఇలాంటివి అన్ని హాస్టళ్లలోనూ జరుగుతూనే వుంటాయి అనీ, అయినా పత్రికల్లో ఆ సంస్థల పేర్లూ, బాధితుల పేర్లూ వ్రాయము అనీ, అనవసరంగా మీడియా "చిన్న"విషయాన్ని పెద్దది చేసింది అనీ అన్నారు. 

(మూడు నెలల క్రితమో యెప్పుడో జరిగిన విషయాన్ని, ఓ బాధితుడి తండ్రి బయటపెడితే, దాంట్లో "స్పెసిఫిక్"గా వేదపాఠశాలనీ, నిందితులనీ పేర్కొంటే, ఇంక "హిందువులకి చాలా పవిత్రమైన ఓ స్వామి గుడికి సంబంధించిన వేదపాఠశాలలో....." అంటూ రిపోర్టు చెయ్యవలసిన అవసరం యేమి వుంది? పైగా, ఇది కొన్ని కోట్ల మంది భక్తుల మనోభావాలకి సంబంధించిన విషయమాయె!)

అంతలో డీయెస్పీగారి కాల్ వచ్చింది. ఆయన ఖచ్చితంగా చెప్పారు--ఈవోగారు వెళ్లి దర్యాప్తు చెయ్యమంటే వెళ్లాననీ, అక్కడ జరిగిన విషయాన్ని రిపోర్టు చేశాను అనీ, బాధితుడి తండ్రి మాత్రం రిపోర్టు వ్రాసి ఇవ్వలేదు అనీ, తాను 'ఆధ్యాత్మిక వాతావరణాన్ని' కల్పించాలి అనీ, అన్ని వయసులవాళ్లనీ కలిపి ఒకే చోట నిద్రింపచేసే పధ్ధతిని మానుకోవాలనీ, కొంతమందిని కొత్తగా కడుతున్న భవనం లోకి మార్చాలనీ--వగైరా రికమెండేషన్లు చేశాను అనీ చెప్పుకొచ్చారు.

సౌందరరాజన్ గారు హాస్టలు మేనేజ్ మెంట్ మీద ఓ పుస్తకాన్ని కూడా వ్రాశారట. చూపించారు. ఆయన చక్కగా చెప్పాడు--హాస్టలు విద్యార్థులలో అసలు లైంగిక భావనలు తలెత్తకుండా వుండే "పవిత్ర" వాతావరణం కల్పించవలసిన బాధ్యత ఆ వుపాధ్యాయులమీద వుంటుంది అని. 

మానసిక వైద్యులు కూడా, "ఎడొల్సెంట్" వయసులో విద్యార్థులందరిలోనూ అలాంటి వికారాలు తలెత్తడం సహజమేననీ, వాటిని కంట్రోలు చెయ్యవలసిన బాధ్యత ఆ హాస్టలు వగైరా యాజమాన్యాలదేననీ చెప్పారు.

వైఖానస ఆచార్యులవారు ఈ వేదపాఠశాలకి వందేళ్లకి పైగా చరిత్ర వుంది అనీ, పదివేలకి పైగా విద్యార్థులు చదివి వెళ్లారనీ, 'యెప్పుడూ ఇలాంటివి జరిగినట్టు' వినలేదు అనీ, కాబట్టి ఇప్పుడు కూడా అలాంటివి జరిగినట్టు నమ్మఖ్ఖర్లేదు--అన్నట్టు చెప్పుకొచ్చారు.

మధ్యలో, ఓ వుపాధ్యాయుడు "ఇది వేదాలమీదా, హిందూ సంస్కృతి మీదా, దేవుడి మీదా జరుగుతున్న దాడి"--ఇలాంటి అర్థం వచ్చేలా మాట్లాడుతూ, ఇంకో ఆయన "నేనిక్కడే చదివి, వుపాధ్యాయుడిగా పని చేస్తున్నాను, అప్పటి ప్రిన్సిపాల్, అప్పటి అధ్యాపకులే వున్నారు, యేమీ మార్పులేనప్పుడు "అలాంటివాటికి" ఆస్కారమేలేదు అంటూ--క్లిప్పింగులు చూపించారు.

ఇంక కాలర్లయితే, తెగ ఆవేశపడిపోతూ, మా అబ్బాయి యేడాది నుంచీ, మా అబ్బాయి 9 యేళ్లనుంచీ--ఇలా అంటూ, ఒకళ్లయితే, మీఅబ్బాయికూడా అలాగేనా అని అందరూ అడుగుతున్నారు అంటూ, మీడియా వల్లే ఇదంతా, గోరంతలు కొండంతలు చేశారు అంటూ వాపోయారు. 

వీళ్లెవరూ ఒక్క విషయం ఆలోచించినట్టు లేదు--వాళ్ల పిల్లలు కూడా అలాగే వేధింపులకి గురయివుండీ చెప్పడానికి భయ పడ్డారేమో అనిగానీ, ఇన్నాళ్లూ జరగలేదు, ఇకముందు వాళ్లకీ జరిగితే మన పరిస్థితి యేమిటి అనిగానీ! (పాపం బాధితుడి తండ్రి 'మా అబ్బాయినీ, వాడి చెల్లెలినీ ఇంట్లో వదిలి బయటికి వెళ్లలేకపోతున్నామండీ' అని బాధపడ్డాడంటే, ఆయన పరిస్థితికి వీళ్ల జవాబేమిటో ఆలోచించారా?)

పైగా "పవిత్ర" పాఠశాలమీద అనవసర ప్రచారం అంటారు! (అదేదో సెంటిమెంటల్గా ఫీలయిపోతూ!)

.....తరువాయి మరోసారి.

Thursday, May 19, 2011

వేద పాఠశాల




"......క" వేధింపులు

తిరుమల "వేధ" (ఇలాగే అంటున్నారు ప్రతీ వి & ఎం న్యూస్ రీడర్లూ, రిపోర్టర్లూ!) పాఠశాలలో విద్యార్థులపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయట. 

ఇప్పుడు బయటికి వచ్చిందిగానీ, ఓ మూడు నెలల క్రితమే మన ఈవో కృష్ణారావుగారు దర్యాప్తు చేయించి, నలుగురు సీనియర్ విద్యార్థులనీ, ఓ అధ్యాపకుణ్నీ ఇంటికి పంపించేశారట! క్లైమాక్స్ అయిపోయాక వచ్చే పోలీసుల్లా మన మీడియావారూ తయారయ్యారు! ఆ తండ్రిని అలా ప్రశ్నించి, ఆయన గుడ్లనీళ్లు కుక్కుకుంటుంటే, జాలి తప్ప మనం యేమి పడగలం?

అసలు 150 మందికి సరిపోయే పాఠశాలలో 800 మందికి పైగా యెలా చేర్చుకొన్నారు? "ఇకనుంచీ" ప్రవేశాలు యెందుకు ఆపేశారు? ఇప్పుడు వున్నవాళ్ల సంగతేమిటి?

కృష్ణారావు ని యెక్కడికి పంపించాలా అని ఆలోచిస్తూందట ప్రభుత్వం--ఇవాళే టీవీలో విన్నాను.

మరింకేం! మీ తైనాతీనొకణ్ని వేస్తారో, మళ్లీ బోర్డుని పునరుధ్ధరించి, కావూరి నే వేస్తారో--కానివ్వండి! 

మా సామాన్యులకి పోయేదేమీ లేదు--శ్రీవారి దర్శనం తప్ప! (ఆ తరవాతేమి చేస్తారో మీ యిష్టం!)

(సున్నితమైన విషయాలని పబ్లిసిటీ చేసి, పసివాళ్లమీద ప్రభావం కలిగించచ్చా? అంటూ ఇవాళ (20-05-2011) రాత్రి 8-00 గంటలకి భక్తి ఛానెల్లో ఓ కార్యక్రమం ప్రసారం చేస్తారట. అందులో యేమి చెబుతారో చూడాలి మరి. సరిగ్గా ఆ సమయానికే మాకు కరెంటు పోతుంది!)


Saturday, May 7, 2011

శ్రీగిరి శ్రీపతి



.....దర్శనాలు

మూడేళ్లకి పైగా మనం మొత్తుకుంటూంటే, ఇప్పుడు ఈవోగారు స్వయంగా అదేదో "మూవింగ్ ప్లాట్ ఫామ్" (తెలుగులో కదిలే తివాచీ అంటున్నారు) ని స్వయంగా పరీక్షించారట--శ్రీవారి "నమూనా" దేవాలయంలో! 

ఆ తివాచీ మీద 12 మంది వెళ్లి, (వాళ్లే దాన్ని నడుపుకొంటూనో....డ్రైవరు వుండాలో?) కేవలం 10 నుంచి 20 సెకన్లలో శ్రీవారి దర్శనం చేసుకోవచ్చట. "మహాలఘు" రోజుల్లో దీన్ని ప్రవేశపెట్టచ్చేమో అని వారి ఆలోచనట!

దాని ఖరీదెంతో, ఓ లక్ష మందికి దర్శనం కల్పించడానికి అలాంటివి యెన్ని కావాలో, ఒకటే అనేక "ట్రిప్పులు" వేస్తుంటే, ఓ ఇరవై గంటల్లో (ఓ నాలుగ్గంటలు శ్రీవారిని నిద్రపోనిచ్చినా) యెంతమంది దర్శనం చేసుకోగలరో......వగైరాల లెఖ్ఖలకి మీ క్యాలిక్యులేటర్లు బయటికి తీయండి. (కేవలం 37,200 మంది మాత్రమే అని జవాబు వస్తుంది!)

పైగా, దాన్ని యెక్కడనుంచి యెక్కడవరకూ ప్రవేశపెడతారో తెలీదు. మహర్ద్వారం నుంచా, ధ్వజ స్థంభాలనుంచా, ఆళ్వారులనించా, అదేదో పడి నుంచా, జయవిజయులనుంచా.....యేమో!

మరి దారిలో వుండే యెత్తుపల్లాలమాటేమిటి? మెట్ల మాటేమిటి? ద్వారాల తలుపులు మూయవలసి వస్తే మాటేమిటి? 

ఈవోగారు కాదేమోగానీ, యెవరో యెవరితోనో "కుమ్మక్కయ్యారు" అనిపించడంలేదూ?

అప్పుడే టీవీలవాళ్లు అది "ఆగమ శాస్త్రానికి విరుధ్ధమా?" అని చర్చ. కొంతమంది పండితులు ఖచ్చితంగా విరుధ్ధమే--యెందుకంటే, శ్రీవారి దర్శనం "భూమి మీద నిలబడే" చేసుకోవాలి అంటూ! (అక్కడికి ఆ ప్లాట్ ఫామ్ యెక్కినవారు యేదో అంతరిక్షంలోకి వెళ్లిపోయినట్టు!)

అసలు "ఆగమ శాస్త్రాలకీ", దర్శనం చేసుకొనే భక్తులకీ సంబంధం యేమిటి?

ఈవోగారూ! ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలకి అనుమతించవద్దు. 

మాక్కావలసింది--ఓ "కన్వేయర్ బెల్ట్" లాంటిది--మహర్ ద్వారం గుండా--అవసరమైతే, వెయ్యికాళ్ల మండపం వుండే స్థానంలో బహుళ అంతస్తుల అండర్ గ్రవుండ్ క్యూలైన్లు కట్టి అయినాసరే! (దీంట్లో వున్న సౌలభ్యం ఇంకోటి తెలుసా? భక్తులు తమ "పృష్ట" భాగాన్ని శ్రీవారికి చూపించరు! మహమ్మదీయులు తమ "దర్గా"లలో ఇలా యెవరినీ అనుమతించరు! భక్తులు "వెనక్కి" నడవాల్సిందే!)

యెన్ని గంటలూ, యెంతమందీ లెఖ్ఖలు కాదు. 

వెంటనే ప్రణాళిక రచించండి. లేదా రచింపచెయ్యండి! (చేతకాకపోతే--సో కాల్డ్ ఆగమ పండితుల్ని కాదు--ఎల్ & టీ వారినో, జీ ఎం ఆర్ వారినో సంప్రదించండి! ఆ మాత్రం ఖర్చు స్వామి భరించగలడు!)

వింటారా?

Tuesday, April 12, 2011

శ్రీగిరి శ్రీపతి




......వుత్సవాలు


"పార్వేట" వుత్సవాలు నిషేధించాలి.

శ్రీనివాసుడు క్షత్రియుడు. ఆయన ఆ రోజుల్లో, కౄర మృగాలని వేటాడేవాడు. "కౄర" అంటే ఇప్పటి ఇంగ్లీషులో "వైల్డ్" అని. యేనుగు కౄర మృగమా? అప్పట్లో అవును. యెందుకంటే, యెంత శాకాహారి అయినా, మదం యెక్కినప్పుడు విచక్షణలేకుండా అందర్నీ తొక్కేస్తుంది. అందుకని దాన్ని వేటాడవచ్చు!

మరి ఇప్పుడు? కలప అక్రమ రవాణాతోపాటు, నేటి "క్షత్రియులు" (ఆ కులాన్ని అనడం లేదు) కుందేళ్లనీ, నెమళ్లనీ, లేళ్లనీ, నీటి కొంగల్నీ--ఇలా అన్నిటినీ వేటాడి, ఆనందిస్తున్నారే! వీళ్లకేమి రోగం?

నిస్సహాయుల్నీ, అసహాయుల్నీ వేటాడడం తప్పు. అందుకనే ఈ "పార్వేటల్ని" నిషేధించాలి.

రేపు రాయపాటి వస్తే యేమి జరుగుతుందో చూస్తూనే వుందామా? లేక "ఈజిప్టు" తరహా యేమైనా.......?

(ప్రతీవాడికీ ఇదొకటి లోకువ అయిపోయింది. ప్రతీచోటా "ఈజిప్టు" తరహాకి అమెరికా అన్ని కోట్ల డాలర్లు పెట్టుబడి పెట్టగలదా??!! అని ఆలోచించరు!)

==> తితిదే "దాస సాహిత్య" ప్రాజెక్టు ప్రత్యేకాధికారి పగడాల ఆనందతీర్థాచార్యులు ప్రతి జిల్లాలో భజన మండళ్లు, కోలాట బృందాలు యేర్పాటు చేస్తారట. బృందంలోని వారికి ధోవతి, పంచె (!!??), భజన సామాగ్రి అందజేస్తారట. కర్ణాటకలో ఇప్పటికే యెక్కువ సంఖ్యలో భజన మండళ్లు యేర్పాటు చేశారట! దేవుడిసొమ్ము--పిచ్చి ప్రాజెక్టుల పాలు అనాలేమో!

Wednesday, January 12, 2011

శ్రీగిరి శ్రీపతి

(ప్రసాద) లడ్డూలు

ఆ మధ్య శ్రీవారి లడ్డూలు "వుప్పు కషాయం"గా వున్నాయని ఓ ఫిర్యాదు రాగా, ఓ 600 లడ్డూల్లో ఆ విషయం నిజమేనని తేల్చి, అమ్మకం ఆపేశారట. సంబంధిత కాంట్రాక్టరు, ఓ ఇరవై పైగా యేళ్లనించీ లడ్డూలు చేయిస్తున్నా, ఇలా యెప్పుడూ జరగలేదు అన్నాడట. సరే.

సంబంధిత అధికారులు కొంతమంది, 'వుగ్ర్తాణం లోంచి పొరపాటున చక్కెరకి బదులు వుప్పు తెచ్చివుంటారు' అనీ, 'వుగ్రాణంలో వుప్పు ప్రసక్తిలేదు....గోవిందస్వాములు తమ ఇరుముడిల్లో తెచ్చిన వుప్పునే ఆ లడ్డూల్లో వాడి వుంటారు' అనీ--ఇలా పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేస్తున్నారు.

వుగ్రాణంలో 'రాళ్ల'వుప్పు వుంటుందా? పొడి వుప్పు వుంటుందా? చక్కెర 'ముడిగా' వుంటుందా, పొడిగా వుంటుందా? 20 యేళ్లకి పైగా లడ్డూలు చేస్తున్నవాళ్లకి--రాళ్ల వుప్పుకీ, ముడి చక్కెరకీ, మెత్తటి వుప్పుకీ, మెత్తటి చక్కెరకీ తేడాలు తెలియవా? 

సరే.....గోవిందస్వాములు యెన్ని కేజీల వుప్పుని సమర్పించారు? యెక్కడ? అది వుగ్రాణానికి యెలా చేరింది? అలాకాదు అంటే, నేరుగా ఆ పోటు కాంట్రాక్టరుకెలా చేరింది? లడ్డూల్లోకెలా చేరింది? ఇవన్నీ ప్రశ్నలే!

ఇవాళ లడ్డూల్లో 'మేకులు' వచ్చాయంటున్నారు! సంబంధిత కాంట్రాక్టరు, 'లవంగాలనుకొని, మేకులు తెచ్చారు' అంటాడేమో!

చూద్దాం! 

ఈవోగారూ! నాలుగుకళ్లతో పరిశీలిస్తారా?

Saturday, January 8, 2011

శ్రీగిరి శ్రీపతి

.....దేవస్థాన లీలలు

తిరుపతి-షిర్డీ భాయి భాయి బాగానే కొనసాగిస్తున్నారు. నూతన సంవత్సరం సందర్భంగా (టిక్కెట్టు తీసుకునే) ప్రత్యేక దర్శనాలని రద్దు చేశారు.

అన్నట్టు సాయి మందిరానికి రూ.32 కోట్ల విలువైన ఆభరణాలు వున్నట్టు ఆడిట్ వాళ్లు తేల్చారట. వార్షిక అదాయం 164 కోట్లట!

గత కొన్నేళ్లుగా మాత్రమే ఆభరణాలు వస్తున్న సాయికే 32 కోట్లు వుంటే, కొన్నివందలయేళ్లుగా వున్న స్వామికి కేవలం 51 కోట్లే మరి! 

సంతోషిద్దాం.....ఇప్పటికైనా అని.

శ్రీవారి బంగారు తాపడం చేసిన రథానికి వుండే స్వచ్చమైన బంగారంతో చేసిన, కోటి రూపాయలు విలువ చేసే 'గొడుగు' ని, రథం వున్న రేకుల మండపం దక్షిణవైపు రేకుని 'కత్తిరించి' యెవరో దొబ్బేశారట! అదికూడా, ఆ ప్రక్కనే జరుగుతున్న పెద్దజీయర్ మఠం కార్మికులు చెపితే, అధికారులకి తెలిసిందట! యెంత భద్రతో కదా?!

పైగా, నిన్న 07-01-2011 న, 'మహా అయితే ఆ రేకుల గొడుగు విలువ ఓ నలభై వేలే వుంటుంది.....రేపు రథ సప్తమికల్లా ఓ కొత్త గొడుగు చేయించి పారేస్తామంటున్నారు అధికారులు!' అని హామీ ఇస్తూ, పుండుమీద కారం చల్లుతున్నాడు రాష్ట్ర శాసన మండలి 'హామీల కమిటీ' అధ్యక్షులు బత్యాల చెంగల్రాయుల వారు! (యెన్ని కోట్లతో చేయిస్తారో చెప్పలేదు.....మామూలుగానే!)

యేడూ కొండల స్వామీ.......!

....................................................................................................................................................................

ప్రకటన :

శ్రీ దత్త చరితం

తొలి జగద్గురువు, విఙ్ఞానపు కాంతులను విరజిమ్మిన క్రాంతి పుంజం, అత్రి, అనసూయల గర్భ సుక్తి ముక్తాఫలం--శ్రీ దత్తాత్రేయుడు. ఆపురూప గురుహారం ఈ శ్రీ దత్త చరితం. 

ఈ డాక్యుమెంటరీ కి నిర్మాత, కెమేరామన్ : చిట్టావఝల కృష్ణ; వ్యాఖ్యనం/దర్శకత్వం : చక్రావధానుల రెడ్డప్ప ధవేజీ; సంగీతం/గానం : గోగులమండ రాజు & మోహిని కుమారి; సహ నిర్మాత : సవరం కృష్ణానందం. ప్రవచనం : 'భారతీపుత్ర ', కడిమెళ్ల వర ప్రసాద్ 'గురు సహస్రావధాని '. 

(దత్తచరిత్ర యథాతథంగా, కూర్పులూ, చేర్పులూ లేకుండా చెప్పబడింది--అనుచిత వ్యాఖ్యలు లేకుండా! దత్తపీఠలూ, క్షేత్రాలూ వగైరలు కూడా చూడండి.) 

ఈ సీడీలు కొనండి....ఒక్కొక్కటీ రూ.59/- మాత్రమే! ఈ ప్రకటన చూసి, ఆర్డరు ఇచ్చినవారికి రూ.54/- మాత్రమే. 

చిట్టావఝల కృష్ణ పేరున "మాకు అందేలా" కేరాఫ్ నర్సాపూర్ బ్రాహ్మణ సమాఖ్య, నరసాపురం, ప.గో.జిల్లా, 534275 కి (మనియార్డరు/పోస్టల్ ఆర్డరు/డీడీ) యెలాగైనా పంపించండి....ఓ సీడీ సొంతం చేసుకోండి! (ఇందులో వ్యాపారం లేదు.)

మీరు కోరితే, మీ మెయిల్ ఐడీ కి వీడియో పంపించడానికి ప్రయత్నిస్తాము.