Friday, May 20, 2011

వేద పాఠశాల - 2



.......వేధింపులు

(మధ్యాహ్నం 12-00 నించి సాయంత్రం 5-00 వరకూ తీసెయ్యడం వల్లనేమో, రాత్రి 8-00 నించి 9-30 వరకూ కరెంటు పోలేదు. చర్చా కార్యక్రమాన్ని పూర్తిగా చూశాను.)

చర్చ బాగా.....నే....జరిగింది--మధ్య మధ్యలో ఆవేశపరుల కాల్స్ తో.

అసలు చర్చా విషయం--"సున్నితమైన.....కలిగించచ్చా?" అన్నదే "బయస్డ్" గా వుంది. 

చర్చకి వచ్చినవాళ్లు వుద్దండులే. ఆంధ్ర భూమి పత్రిక యెడిటరూ, దేవాలయ పరిరక్షణ కమిటీనో యేదో--దాని 'సమ్‌థింగ్' సౌందర రాజన్ అనే ఆయనా, ఓ మానసిక వైద్యుడూ, వైఖానస ట్రస్టు 'సమ్‌థింగ్' ఓ ఆచార్యులవారూ. 

అందరూ "కన్వీనియెంట్"గా మరిచిపోయిన విషయాలు కొన్ని వున్నాయి. అవి చివర్లో.

ముందు ఆ విషయం మీద దర్యాప్తు చెయ్యడానికి ఈవోగారిచేత నియమితుడైన డీయెస్పీ గారి ఫోన్ కోసం ప్రయత్నించారు కానీ "సాంకేతిక" కారణాలతో లైన్ కట్ అయ్యింది.

చర్చని ప్రారంభిస్తూ ఆం.భూ. వారు, సాధారణంగా ఇలాంటివి అన్ని హాస్టళ్లలోనూ జరుగుతూనే వుంటాయి అనీ, అయినా పత్రికల్లో ఆ సంస్థల పేర్లూ, బాధితుల పేర్లూ వ్రాయము అనీ, అనవసరంగా మీడియా "చిన్న"విషయాన్ని పెద్దది చేసింది అనీ అన్నారు. 

(మూడు నెలల క్రితమో యెప్పుడో జరిగిన విషయాన్ని, ఓ బాధితుడి తండ్రి బయటపెడితే, దాంట్లో "స్పెసిఫిక్"గా వేదపాఠశాలనీ, నిందితులనీ పేర్కొంటే, ఇంక "హిందువులకి చాలా పవిత్రమైన ఓ స్వామి గుడికి సంబంధించిన వేదపాఠశాలలో....." అంటూ రిపోర్టు చెయ్యవలసిన అవసరం యేమి వుంది? పైగా, ఇది కొన్ని కోట్ల మంది భక్తుల మనోభావాలకి సంబంధించిన విషయమాయె!)

అంతలో డీయెస్పీగారి కాల్ వచ్చింది. ఆయన ఖచ్చితంగా చెప్పారు--ఈవోగారు వెళ్లి దర్యాప్తు చెయ్యమంటే వెళ్లాననీ, అక్కడ జరిగిన విషయాన్ని రిపోర్టు చేశాను అనీ, బాధితుడి తండ్రి మాత్రం రిపోర్టు వ్రాసి ఇవ్వలేదు అనీ, తాను 'ఆధ్యాత్మిక వాతావరణాన్ని' కల్పించాలి అనీ, అన్ని వయసులవాళ్లనీ కలిపి ఒకే చోట నిద్రింపచేసే పధ్ధతిని మానుకోవాలనీ, కొంతమందిని కొత్తగా కడుతున్న భవనం లోకి మార్చాలనీ--వగైరా రికమెండేషన్లు చేశాను అనీ చెప్పుకొచ్చారు.

సౌందరరాజన్ గారు హాస్టలు మేనేజ్ మెంట్ మీద ఓ పుస్తకాన్ని కూడా వ్రాశారట. చూపించారు. ఆయన చక్కగా చెప్పాడు--హాస్టలు విద్యార్థులలో అసలు లైంగిక భావనలు తలెత్తకుండా వుండే "పవిత్ర" వాతావరణం కల్పించవలసిన బాధ్యత ఆ వుపాధ్యాయులమీద వుంటుంది అని. 

మానసిక వైద్యులు కూడా, "ఎడొల్సెంట్" వయసులో విద్యార్థులందరిలోనూ అలాంటి వికారాలు తలెత్తడం సహజమేననీ, వాటిని కంట్రోలు చెయ్యవలసిన బాధ్యత ఆ హాస్టలు వగైరా యాజమాన్యాలదేననీ చెప్పారు.

వైఖానస ఆచార్యులవారు ఈ వేదపాఠశాలకి వందేళ్లకి పైగా చరిత్ర వుంది అనీ, పదివేలకి పైగా విద్యార్థులు చదివి వెళ్లారనీ, 'యెప్పుడూ ఇలాంటివి జరిగినట్టు' వినలేదు అనీ, కాబట్టి ఇప్పుడు కూడా అలాంటివి జరిగినట్టు నమ్మఖ్ఖర్లేదు--అన్నట్టు చెప్పుకొచ్చారు.

మధ్యలో, ఓ వుపాధ్యాయుడు "ఇది వేదాలమీదా, హిందూ సంస్కృతి మీదా, దేవుడి మీదా జరుగుతున్న దాడి"--ఇలాంటి అర్థం వచ్చేలా మాట్లాడుతూ, ఇంకో ఆయన "నేనిక్కడే చదివి, వుపాధ్యాయుడిగా పని చేస్తున్నాను, అప్పటి ప్రిన్సిపాల్, అప్పటి అధ్యాపకులే వున్నారు, యేమీ మార్పులేనప్పుడు "అలాంటివాటికి" ఆస్కారమేలేదు అంటూ--క్లిప్పింగులు చూపించారు.

ఇంక కాలర్లయితే, తెగ ఆవేశపడిపోతూ, మా అబ్బాయి యేడాది నుంచీ, మా అబ్బాయి 9 యేళ్లనుంచీ--ఇలా అంటూ, ఒకళ్లయితే, మీఅబ్బాయికూడా అలాగేనా అని అందరూ అడుగుతున్నారు అంటూ, మీడియా వల్లే ఇదంతా, గోరంతలు కొండంతలు చేశారు అంటూ వాపోయారు. 

వీళ్లెవరూ ఒక్క విషయం ఆలోచించినట్టు లేదు--వాళ్ల పిల్లలు కూడా అలాగే వేధింపులకి గురయివుండీ చెప్పడానికి భయ పడ్డారేమో అనిగానీ, ఇన్నాళ్లూ జరగలేదు, ఇకముందు వాళ్లకీ జరిగితే మన పరిస్థితి యేమిటి అనిగానీ! (పాపం బాధితుడి తండ్రి 'మా అబ్బాయినీ, వాడి చెల్లెలినీ ఇంట్లో వదిలి బయటికి వెళ్లలేకపోతున్నామండీ' అని బాధపడ్డాడంటే, ఆయన పరిస్థితికి వీళ్ల జవాబేమిటో ఆలోచించారా?)

పైగా "పవిత్ర" పాఠశాలమీద అనవసర ప్రచారం అంటారు! (అదేదో సెంటిమెంటల్గా ఫీలయిపోతూ!)

.....తరువాయి మరోసారి.

No comments: