Saturday, May 21, 2011

వేదపాఠశాల - 4



.....వేధింపులు

బాధిత బిడ్డ తండ్రి మీడియావారిముందు ఆక్రోశిస్తే, మీడియావాళ్లు ఈవోగారిని ప్రశ్నిస్తేనే--ఆయనకి ప్రకటన చెయ్యక తప్పలేదు అని స్పష్టం అవలేదూ?

అలా అని విలేఖరులు యెవరినీ "సూటిగా" ప్రశ్నించకూడదు అనో, "వేలికేస్తే కాలికేసి...." యెలాగైనా "నిజాన్ని" రాబట్టడానికి ప్రయత్నించకూడదు అనో అంటే యెలాగ?

యెమర్జెన్సీ విధించాక, మన దేశంలో పత్రికల సెన్సార్ అమల్లో వుండగా, (వీటిగురించి వివరించాలంటే ఇప్పుడు జరిగేపని కాదు గానీ, తెలుసుకోడానికి యెవరి ప్రయత్నాలు వాళ్లు చెయ్యండి--యువకులు) బీబీసీ రిపోర్టరు మార్క్ టులీ ఇందిరాగాంధీని అలాగే ఇంటర్వ్యూ చేస్తూ, గుచ్చి గుచ్చి ప్రశ్నించేదాకా ఆవిడ "అవును. కొంతమంది నాయకులని నిర్బంధించాం" అని చెప్పేదాకా ప్రపంచానికి తెలీదు--జేపీ, మొరార్జీ వగైరాలు యేమయ్యారో!

మీడియాకి ఆ స్వేచ్చ లేకపోతే, ఇన్నిన్ని కుంభకోణాలూ గట్రా యెప్పటికైనా వెలుగు చూసేవా?

ఆం. భూ. వారే అనుకుంటా--టీవీవాళ్లు తమ టీపీఆర్ రేటింగులు పెంచుకోడానికి--అని దాఋణమైన ఆరోపణ చేశారు. చర్చకుల్లో యెవరు ఈ ఆరోపణ చేసినా అది వారి స్థాయికి తగదు. 

24 గంటల వార్తా ఛానెళ్లు కొంత "అతి" చేస్తున్న మాట నిజమే. కానీ, వాళ్లు మాత్రం కొత్తవార్తలే రాకపోతే యేమి చేస్తారు? పాడిందేపాటరా అంటారు. ఓ వార్తకి సంబంధించి ఓ ముఖ్యమైన విజువల్ 10 సెకండ్లదే వుంటే, వార్తాకథనం ఓ 40 సెకండ్లది వుంటే, ఆ విజువల్నే 4 సార్లు రిపీట్ చెయ్యక తప్పదుకదా?

మీడియా ప్రతినిధిగా ఆం.భూ.వారే యెందుకు ముందుకు వురికినట్టు? వారికి టీవీ ఛానెల్ లేదుకాబట్టా? వొకవేళ వుండి వుంటే వాళ్లు ఇంకేమైనా పొడిచేవారా?

ఇంకో కాలర్ అయితే, "మీరు ఈ చర్చ నిర్వహించడమే తప్పు. రేపు మీడియావాళ్లందరూ మీమీద దాడికి వస్తారు....ఇంకా రచ్చ అవుతుంది" అనే అర్థం వచ్చేలాగ మాట్లాడడం, నిర్వాహకుడు శ్రీనివాస్ పదే పదే "ఇది మీడియావాళ్లకి వ్యతిరేకంగా నిర్వహిస్తున్నది కాదు......కేవలం నిజ పరిస్థితులని ప్రతిబింబించడం, పరిష్కారాలు సూచించడం" కోసమే నిర్వహిస్తున్నాము అనీ ప్రకటించారు.

చివరికి వాళ్లు సూచించిన పరిష్కారాలు....హళ్లికి హళ్లి, సున్నకి సున్న!

ఇంకో "పెద్ద" విషయం.....ఆ విద్యార్థులకి "బయటనించి" యెక్కువగా డబ్బు అందుతూండడంతో, సినిమాలూ అవీ చూస్తున్నారు అనీ, ఇంటర్నెట్లూ, డౌన్లోడ్లూ చేస్తున్నారు అనీ, సెల్లుల్లో ఫోటోలూ, వీడియోలూ గట్రా చూస్తున్నారు అనీ వెల్లడించారు. అంటే యెవరో "బయటి వ్యక్తుల" ప్రమేయం వున్నట్టేకదా? వాళ్లెవరో బయటపడడానికైనా దర్యాప్తులు జరగాలి కదా? 

పవిత్రమైనచోట దర్యాప్తులేమిటి అంటారా?
  
.....తరువాయి మరోసారి.

No comments: