Saturday, June 20, 2009

షిరిడీయో, శ్రీపతో......

‘……..యేమి చెయ్యాలి?’—2
మొట్టమొదటిది—క్యూ లైన్లు. ఒకే మనిషి పట్టేలా, సరిగ్గా 32 అంగుళాల వెడల్పు మాత్రమే వుండేలాగ, ఆలయం బయటినించి గర్భగుడి ముందు ద్వారం దాకా ఒకే లైనూ, అక్కడ మూలవిరాట్టు ముందు నించి తిరగేసిన U ఆకారం లో మళ్ళీ వెనక్కి అదే లైను ని నడిపించి, హుండీ దగ్గరకీ, ప్రసాదాల దగ్గరికీ, అక్కడినించి బయటికీ నడిపించాలి.
క్యూ లైను ప్రాకారం లోపల గోడల పక్కనించే వెళుతుంది కాబట్టి, మధ్య మండపాలూ, ఇతర ప్రాంగణాలూ అన్నీ ఖాళీగా వుంటాయి! మిగిలిన చిన్న చిన్న మందిరాలు కూడా క్యూ లైను లోంచే దర్శించుకొనే యేర్పాటు చెయ్యచ్చు!
ఇంకా, తిరగేసిన U ఆకారం మొత్తాన్ని సరిపోయిన వేగం తో నడిచే ‘ట్రెడ్ మిల్’ లాంటిది బిగించ వచ్చు. అప్పుడు జనాన్ని తోసెయ్యడం, దొబ్బెయ్యడం వంటి వాటి అగత్యం వుండదు!
‘అయ్యా—ఇంతంత పెద్ద క్యూ కాంప్లెక్స్ లు వుంటేనే అవన్నీ నిండిపోయి, ఇంకా కిలోమీటర్ల దూరం క్యూ వుంటుందే, ఇదెలా సాధ్యం?’ అంటారు కదూ!
సాధ్యమే! ఆలయం బయట చాలా జాగా వుంటుంది కదా? అక్కడ లైనుని వీలైనంతదూరం ముందుకీ, అక్కడనించి ఆ పక్కనే మళ్ళీ వెనక్కీ, మళ్ళీ ఆ పక్కనించి ముందుకీ ఇలా నడిపించుకుంటూ వెళితే, కొన్ని కిలోమీటర్ల క్యూ తయారవుతుంది! (ద్వారకా తిరుమల గుడి ముందు ఇలాంటి క్యూ వుంటుంది!)
ఇంకా చాలకపోతే, నగరాల్లో యేర్పరుస్తున్న ‘అండర్ గ్రవుండ్ పార్కింగ్ లాట్’ ల లా కొన్ని అంతస్తులుగా నడిపించవచ్చు—ఇంకా కావాలంటే లిఫ్టులు కూడా యేర్పాటు చెయ్యవచ్చు! వాటిలోనే ‘టాయిలెట్’లు అవీ అవసరం అయిన చోట్ల యేర్పాటు చెయ్యవచ్చు! ఆలయం ముందు భాగంలో, అవసరమైతే అండర్ గ్రవుండ్ లో ఇవి వుంటాయి కాబట్టి, ఆలయ పవిత్రతకేమీ భంగం రాదు!
ఇంక మహర్ద్వారం దగ్గరా, మిగిలిన గుమ్మాలూ, వాకిళ్ళ దగ్గరా యెలాగంటారా? నిక్షేపం గా, రోడ్ల మీద ట్రాఫిక్ ని మళ్ళించడానికీ, నియంత్రించడానికీ ఉపయోగించే మొబైల్ ఇనుప చట్రాలలాంటి వాటిని ఉపయోగించుకోవచ్చు! (క్యూల లో తలుపు ముయ్యడానికీ, గొలుసులు తొలగించి మళ్ళీ తగిలించడానికీ ఇప్పుడుంటున్న వాళ్ళందరి చేతా ఆ మొబైల్ చట్రాలని గెంటించ వచ్చు కూడా! ఇంకా గర్భగుడి ముందు వరసగా నించుని ‘దొబ్బుతారు!’ ‘కదులు, కదులు’ అనేవాళ్ళకి కూడా వేరే ఉపయోగమైన పనులు చెప్పచ్చు!)
వీటంతటికీ ఖర్చు సంగతో? అంటారా—రాతి గోడలకీ, స్థంభాలకీ బంగారు తాపడం చేయించడానికి అయ్యే ఖర్చు ముందు ఇదెంత!
ఇక పని జరుగుతున్న రోజుల్లో ప్రజల దర్శనం సంగతో? అంటారా—పని జరిగేది ఆలయం బయటే కాబట్టి, ప్రస్తుతం వున్న యేర్పాటు కొనసాగుతూనే వుంటుంది కాబట్టి యే విధమైన ఇబ్బందీ వుండదు!
ఇంకా యేమైనా సందేహాలుంటే, వ్రాయండి, పరిష్కారం చూపిస్తాను!
ఇక ఇలాంటివి ‘శ్రీగిరి’ పైనే కాదు, శబరిమల అయినా, ఇంకో గిబరిమల అయినా, షిరిడి అయినా, ఇంకో బొరిడీ అయినా, అన్ని ఆలయాలవద్ద యేర్పాటు చెయ్యచ్చు!
యేమంటారు?
(రెండో పాయింటు—ముఖ్యమైనదీ—తరవాయి)

Friday, June 19, 2009

షిరిడీయో, శ్రీపతో......

‘……..యేమి చెయ్యాలి?’
లక్షలమంది వచ్చిపడిపోతుంటే యేమిచెయ్యాలి?
ఆది నించీ జనాలని గొఱ్ఱెలతో పోల్చారు! (ఇలా అంటే కోపమొచ్చే జనాలు కూడా వున్నారు!)
ఓ నలభై అయిదు—యాభై యేళ్ళ క్రితం చదువుకున్న కథ బాగా గుర్తు వుండి పోయింది! ఇది అందరికీ తెలిసిన కథే!
నాకు పూర్తిగా గుర్తులేదుగానీ—‘సైక్లోప్స్’ అనే రాక్షసుడు ఓ దీవిలో వుంటాడు. వాడికి నుదుటి మీద ఒక్క కన్నే వుంటుంది! వాడు రోజూ తన బోళ్ళన్ని గొర్రెలని తన నివాసమైన పెద్ద గుహలో రాత్రంతా బంధించి వుంచి, పగలు మేపడానికి బయటికి వదులుతూ వుండేవాడు. ఇంకెవరైనా పొరపాటున ఆ దీవికి వస్తే, వాళ్ళని కూడా ఆ గుహలో బంధించి, ఆకలేసినప్పుడు వండుకు తినేసేవాడు!
ఒక సారి, ‘యులిసెస్’ అనేవాడొకడు (ఇంకొంత మందితో అనుకుంటా) యెలాగో ఆ దీవి లో చిక్కుకుపోతాడు. ఇంక మర్నాడో యెప్పుడో వీడి వంతూ వస్తుందనగా, ఒకరోజు రాక్షసుడు నిద్రపోతూ వుండగా, కాలుతున్న కొఱకంచు తో వాడి ఒక్క కన్నునీ పొడిచేస్తాడు! తెల్లవార్లూ కష్టపడి, ఓ ప్లాను వేసి, వాడి బారినించి పొద్దున్నే తప్పించుకుంటాడు!
అది యెలాగంటే, గొఱ్ఱెలని ఒకదానిపక్క ఒకటిగా మూడేసి చొప్పున తీగలో యేవో వుపయోగించి కట్టేస్తాడు. (గుహ ద్వారం మూడు గొఱ్ఱెలు పక్క పక్కన వెళ్ళడానికే సరిపోతుంది!) తాను వాటిల్లో ఒక మూడింటి మధ్యన వుండే గొఱ్ఱె పొట్టకి క్రిందుగా తనను తాను కట్టేసుకుంటాడు! సైక్లోప్స్ పొద్దున్నే గుహద్వారం తెరిచి, ఓ పక్కగా కూర్చొని, గొఱ్ఱెల్ని బయటికి వదిలి, వాటి మీద యెవరూ బయటి పోవడం లేదు అని నిర్ధారించుకోవడానికి వాటి వీపులు తడుముతూండగా, మూడు వరసల్లో గొఱ్ఱెలన్నీ బయటికి నడవగానే, మనవాడు కట్లు విప్పుకొని ఒకటే పరుగు—సముద్రం చేరేదాకా—‘బ్రతుకు జీవుడా’ అనుకుంటూ!
తరవాత, ‘అతను జీవితాంతం సుఖం గా బ్రతికాడు’ (ట)!
ఇంతకీ, ‘ముగ్గురు నలుగురు పట్టే క్యూలు ’ అంటే, నాకు సైక్లోప్స్ గుహ ద్వారమే గుర్తుకు వస్తుంది! వాటిల్లోంచి, యెవరైనా (టెర్రరిష్టులతో సహా) తోసుకు పోవచ్చు కదా! అవసరమైతే ముందున్న వాళ్ళని క్రిందపడేసుకుంటూ, వాళ్ళ శరీరాల మీద నించి తొక్కుకుంటూ!
మరి ‘భద్రతా గురు ‘ లకి, సోకాల్డ్ ‘నిపుణులకి’ ఇంత చిన్న విషయం యెందుకు తట్టదో నాకైతే తెలియదు!
ఇంతకీ ‘యేం చెయ్యాలి?’ అంటారా! వస్తున్నానక్కడకే! వేచి వుండండి!

Thursday, June 18, 2009

'సోమరాజో, కామరాజో....'

డియర్ సుజాత! చాలాసంతోషం—ప్రజల్లో మూర్ఖత్వం పోవాలనే మీ ఆలోచనకి!
‘….సజీవంగా వున్నప్పుడు…..’ కి నా కొత్త టపాయే జవాబు (శ్రీ vibey కిచ్చినది)!
‘కాకడ ఆరతి’ ‘శెజారతి’—ఇలాంటివేమిటో నాకు తెలియదు!—‘మరి లక్షల్లో జనం వస్తూంటే యేం చెయ్యమన్నారు?’ అన్న మీ ప్రశ్న, అక్షర లక్షలు విలువ చేసేది!
(దీనికి జవాబు నా మరో టపాలో!)
‘ఇచ్చే భక్తులున్నారుకదాని…..’ అన్నదానికి, ‘గాలి దాతృత్వం’ మీద మా డ్రైవర్ కామెంటే జవాబు!
('పాదుకలికి కంటే, వాటికి వేసిన బంగారపు తొడుగులకి’ అంటే, సాయికి పాదుకలకీ, బంగారానికి తేడా తెలియకపోయినా, సంస్థాన్ వాళ్ళకీ, భక్తులకీ వాటి విలువ తెలుసు కాబట్టి, అవెక్కడ జనాలు ‘గోక్కుపోతారోనని’ భయమేమో! అరిగిపోతాయని కాదు!)
‘బట్టలు’ పెద్ద పెద్ద కానుకలు కాదు! అవి కూడా లేనివాళ్ళకిస్తేనే అవి కానుకలవుతాయి!
‘పెద్ద పెద్ద బంగారు హారాలు—వాటి కోసమైనా సెక్యూరిటీ—(!!!!?)!......'
వీటికేమైనా లెఖ్ఖా పత్రాలూ, కల్పించిన భద్రత వివరాలూ యేమైనా వున్నాయా? యెవరికైనా తెలుసా?
యెందుకు యేటేటా ప్రకటించరు—కంపెనీల నివేదికల్లాగ?
పైగా ‘లాగి పడేస్తున్నారు '—అని సంతోషమా!
(అంటే అవన్నీ క్యూల పక్కనే ప్రదర్శనకి వుంచారా? యెందుకు? వాటి సెక్యూరిటికోసమే లాగి పడేస్తున్నారా?)
(మిగతా తరవాత!)

'ఓం సాయి, శ్రీ సాయి.....

(నా టపా మీద శ్రీ vibey చేసిన కామెంట్ కి నా జవాబు ఇంకో టపా రూపం లో!)
డియర్ vibey! 'వాడుకూడా..........సంపాదనలో పడ్డాడా' అని అడిగారంటే, నాగోల సమూలం గా మీకు అర్థం అయినట్టే!
ఒక్క ముక్క అర్థం కాలేదంటే, అంగీకరించడానికి మొహమాట పడుతున్నారన్నమాట!
నా టపాలు అన్నీ ఓపికగా చదివితే, నా ముఖ్యోద్దేశ్యం ప్రజల, సోకాల్డ్ భక్తుల 'మూర్ఖత్వం' 'అట్టర్ ఫూలిష్ నెస్ ' ని బయటపెట్టి, కొంచెమైనా 'వారికి ' ఉపశమనం, సౌకర్యం కలిగించడానికే అని మీరే అంగీకరిస్తారు!
మరి ఆయనైతే, కలియుగాంతం వరకూ కుబేరుడికి వడ్డీ కట్టడానికి, నిలువుదోపిడీలు చేసేవాడు--ఇప్పుడెవరిస్తున్నార్లెండి నిలువుదోపిడిలు! ఈయనకేం పని? మరి చక్కగా అవుతున్న దర్శనాలని చెడగొట్టి, తోపులాటలకి యెందుకు అవకాశం కల్పించాలి?
ఆయన 'సజీవం' గా వున్నప్పుడు అని, ఆయనా 'ఒక మనిషే' అన్న నిజాన్ని అంగీకరించినందుకు నా ధన్యవాదాలు!
ఇక, ఆయన 'ఒకరోజులో పేదలకు పంచే డబ్బులు ' గురించి చెప్పాలంటే, అసలు ఆయనకి డబ్బంటే యేమిటో తెలుసా? దాహం గా వుందని చెపితే, మరుగుతున్న బంగారం ఇచ్చిన కంసాలి దగ్గరనించి దాన్ని తీసుకొని, మంచినీళ్ళలా తాగినవాడు (ట) సాయి!
ఓ ముప్ఫై యేళ్ళ క్రితం, ఆంధ్రదేశం ' లో ఓ 'జిల్లేళ్ళమూడి అమ్మ ' వుండేది! (అప్పటికి మీరు పుట్టారో, లేదో) ఆవిడ భక్తులకి నిత్యాన్నదానం జరిపించడానికి వీలుగా, ఉభయ గోదావరి జిల్లాల నించే, ప్రతీ వూరు నించీ, యేకం గా లారీలు లారీలు బియ్యం, కూరగాయలూ, పప్పు దినుసులూ, చింతపండు కరివేపాకు దగ్గరనించీ, ఉప్పు వరకూ (భక్తులు చేసిన వసూళ్ళ రూపం లో) వెళుతూ వుండేవి!
ఆవిడ, భోజనం పళ్ళెం లో అన్నం కలిపి, ఒక్కో భక్తుణ్ణీ దగ్గర కూర్చో పెట్టుకొని, ముద్దలు తినిపిస్తూ, 'తినరా నాన్నా! నువ్వు తింటే నాకు కడుపు నిండి పోతుందిరా!' అంటూ, ఒక్కో ముద్దా పెట్టి, 'బ్రేవ్' మని త్రేన్ చేదట! (చాలా గొప్పగా చెప్పుకొనేవారు!) (తన సొమ్మైతేగదా!)
చివరికి, 'కడుపులో గ్యాస్ ' యెక్కువై, 'ఉదర క్యాన్సర్ ' బారిన పడి మరణించింది! (ఆవిడ భర్తే దీనంతటికీ సూత్రధారుడని లోకం కోడై కూసింది ఆ రోజుల్లో!--ఈ రోజుల్లో కూడా ఆమెకి భక్తులు మిగిలి వున్నా, ఆశ్చర్యంలేదు!)
కాస్త ఆలోచించండి!

Wednesday, June 17, 2009

........‘మరో నక్క’ వాత!

పులిని చూసి ‘మరో నక్క’ వాత!
మేము శ్రీపతి యాత్రకి వెళ్ళిన రోజునే, మా అమ్మాయి తన అయిదేళ్ళూ, అయిదునెల్లూ వయసు ఇద్దరు కొడుకులతో, వాళ్ళ మామ, అత్తగార్లతో, షిరిడీ సాయి దర్శనానికి వెళ్ళీంది!
వాళ్ళు తరచూ, కనీసం నెలా, రెండునెలలకోసారి వెళుతూ వుంటారు! “తిరుపతిలా కాకుండా, అక్కడ యెంతమంది వున్నా, ప్రతీ ఒక్కరూ నిశ్శబ్దం గా, తనివితీరా, సాయి దర్శనం చేసుకోవడమే కాకుండా, ఆయన పాదాలు స్పృశించడం, చిన్నపిల్లల్ని ఒక నిమిషం ఆయన పాదాల దగ్గర పడుక్కోబెట్టడం, ‘ధుని’ లో వాళ్ళు అర్పణం చెయ్యడం—హాయిగా, సంతృప్తితో తిరిగి రావడం” జరుగుతాయని ఉత్సాహం గా చెప్పేవారు!
మరి ఇప్పుడు—తేడా యేమిటంటే—‘తొక్కేశారమ్మా! చంటి పిల్లలని కూదా చూడలేదు! ఆడవాళ్ళనీ చూడలేదు! ముసలీ, ముతకా కూడా చూడలేదు! అందరూ నలిగి, నలిగి, ప్రాణాలతో బయట పడ్డాము’ అని మా అమ్మాయి ఫోను!
తరవాత, ఇంటికి వచ్చాక, మమ్మల్ని కలిసినప్పుడు చెప్పారు—“ఇదివరకు కేవలం ఒక్క మనిషే పట్టేలాగ క్యూ లైన్లు వుండేవి! ఇప్పుడు ముగ్గురు నలుగురు ఒకేసారి వెళ్ళిపోయేలాగ, క్యూ లైన్ల వెడల్పు పెంచేశారు! బాబా దగ్గరకి వెళ్ళనివ్వడం లేదు! పాద స్పర్శ దేవుడెరుగు! బయటినించే గెంటేస్తున్నారు! అంతా గోల గోల!”
అదండీ సంగతి!
వీళ్ళు మూర్ఖులా? వాళ్ళు మూర్ఖులా? ప్రజలూ, భక్తులూ మూర్ఖులా?
వాడు కూడా ‘డబ్బు సంపాదన’లో పడ్డాడా? యెవరికి వడ్డీలు కట్టడానికి?
తేల్చుకోండి!

Monday, June 15, 2009

నీ కొండకు నీవే రప్పించుకో--9

కాళ్ళు కాలిపోతున్నాయి—ఆ యెండలో—సిమెంటు రోడ్డు మీద—అలా వెతుక్కుంటూ, ఓ చెట్టునీడన నిలిచాం—

ఉమేష్ ‘నేను చూసి వస్తాను, మీరిక్కడే వుండండి సార్!’ అని గబగబా నడుచుకుంటూ వెళ్ళాడు—పాపం! (మా చెప్పులూ, సెల్ ఫోన్ లూ, బ్యాగులూ, అన్నీ టాక్సీలోనే వదిలెయ్యమని మా గైడ్ సలహా ప్రకారం అన్నీ వదిలేశాము మరి)మామూలుగా యాత్రికులు వాళ్ళ చెప్పులు యెక్కడ వదులుతారో తెలియదు.

మేం సెల్లార్ దర్శనం క్యూలో వున్నప్పుడు, పడమర మాడా వీధిలో కొంతమంది భక్తులో, స్థానికులో, వుద్యోగులో—పిల్లలతో సహా, చెప్పులు వేసుకొని నడుస్తూండడం చూశాను.

ఒకవేళ సెల్లార్ దర్శనం క్యూ లోకి వెళ్ళడానికి ముందు అక్కడ చెప్పులూ వగైరాల ‘డిపాజిటరీ’ యేమైనా వుంటే, గుడినించి బయటికి వచ్చాక, మళ్ళీ తిరిగి తిరిగి ఆ క్యూ మొదటికి వచ్చి, అవి తిరిగి తీసుకోవాలేమో!

మా టాక్సీ డ్రైవరు మా దగ్గరకి వచ్చి ‘బండి ఇక్కడే వుంది సార్! రండి! అని దగ్గరలోనే వున్న ఇంకో చెట్టుక్రింద పార్క్ చేసిన మా టాక్సీ దగ్గరకి తీసుకెళ్ళాడు. మా గైడ్ కూడా అక్కడే వున్నాడు.

ఇంకా రమేష్ జాడలేకపోవడం తో, ఉమేష్ కాస్త యేమైన కూల్ డ్రింక్ తాగి వస్తాను అంటూ వెళ్ళాడు. అతను వెళ్ళాక మాక్కూడా అనిపించింది—యెండ యెక్కువగానే వుంది కదా, మనం కూడా కూల్ డ్రింకులు యేమైనా త్రాగి వస్తే బాగుంటుందని. మేమూ వెళ్ళాము.

తిరిగి ఓ పదినిమిషాల్లో మేం ముగ్గురం టాక్సీ దగ్గర చేరేసరికి, గైడ్ చెప్పాడు—రమేష్ కూడా వచ్చి, ఇప్పుడే ఏ టీ ఎం కి వెళ్ళి వస్తానని వెళ్ళాడని. ఇంకో అయిదు నిమిషాల్లో తనూ వచ్చేసాడు—అందరం క్రిందకి బయలుదేరాం!

మళ్ళీ విషయాలు చెప్పుకోవడం మొదలు పెట్టాము—ఒక్క నా దర్శనం అనుభవం తప్ప—అన్నీ మాట్లాడుకున్నాము!

నేను ‘ముప్ఫై సంవత్సరాల తరవాత ఐ ఆర్ సీ టీ సీ ప్యాకేజ్ పుణ్యమాని చక్కగా దర్శనం అయిపోతోంది కదా అని ధ్వజ స్థంభాలవరకూ సంతోషించాను! కాని—అయాం మచ్ డిజప్పాయింటెడ్!’ అన్నాను.

రమేష్, ‘మీరే అంత డిజప్పాయింట్ అయితే, రెండునెలలకోసారి ఖచ్చితం గా వచ్చే నేను, ఆ రెండునెల్లోనూ వచ్చిన మార్పులకి నేనెలా ఫీలవ్వాలి!’ అన్నాడు.

గేట్ల కంట్రోలు గురించీ, స్టాఫ్ దర్శనం క్యూ గురించీ, తోపులాట గురించీ విమర్శించాను. ‘అదేమి దర్శనం క్యూ అండి! నిజంగా జనాలు వెర్రికూపులు అన్నట్టుగా వుంది’ అని తిట్టేశాను!

(అన్నట్టు శ్రీ కే యన్ వై పతంజలి తన ఖాకీ వనం నవలలో ఓ పోలీసాయన నోటినించి ‘ఎర్రికూపా’ అని తిట్టించి, తెలుగు సాహిత్యం లో ఆ మాటని ప్రవేశ పెట్టాడు! ఆ రికార్డుని ఇంతవరకూ యెవరూ బ్రేక్ చెయ్యలేదు!).

మహర్ద్వారం దగ్గరనించి, ఒకే మనిషి వెళ్ళగలిగే క్యూ లైను నిర్మించి, వీ ఐ పీ లతో సహా అందరినీ అదే క్యూ లో కలిపేసి, గర్భగుడివరకూ అందరినీ అనుమతించినా, లఘువులూ, మహా, మహావీరలూ అక్కరలేదు—అన్నాన్నేను! (ఆర్జితాలూ, కల్యాణాలూ, అవీ యెలాగూ మామూలే కదా). నాకప్పగిస్తే చేసి చూపిస్తాన్నాను! అందరూ నవ్వారు!

వీ ఐ పీ దర్శనాల గురించి రమేష్, ఉమేష్ మాట్లాడారు—వాటిని రద్దు చెయ్యలేరుగానీ, రెండుపూటలా ఒక టైము ప్రత్యేకించి క్రమబద్ధీకరించవచ్చు—అని. అసలు తితిదే చైర్మన్ గా ఒక మంచివాడిని—ఐ యే యస్ అధికారిని—వేస్తే, రాజకీయుల్ని మానేస్తే, సగం దరిద్రాలు తీరిపోతాయన్నారు!

సుబ్బిరామిరెడ్డి గురించి ప్రస్తావన వచ్చింది—ఓ వందమంది తొంబనేసుకుని తిన్నగా మహర్ద్వారం గుండా లోపలికి వెళ్ళిపోయి, దేవుడి ముందు ఒక్కడూ బైఠాయించి, ‘నేను ధ్యానం లోకి వెళుతున్నాను’ అంటాడట! ఇక అన్నితలుపులూ, క్యూలూ మూసేస్తారట! వాళ్ళ మంద మాత్రం లోపలే వుంటుందట! వాడు ధ్యానం లోంచి బయటికి వచ్చానని ప్రకటించేవరకూ, యెంతసేపైనా ఇంకెవరికీ దర్శనం వుండదట!

మొన్న ‘వైకుంఠం కాంప్లెక్స్’ రెయిలింగులు జనం విరక్కొట్టెయ్యడానికి వాడే కారణమట!

ఇలా కబుర్లతో కాలక్షేపం చేస్తూ, క్రిందకి చేరాము.

Sunday, June 14, 2009

నీ కొండకు నీవే రప్పించుకో--8

మేము కొండపైకి టాక్సీలో వెళుతున్నప్పుడే, రమేష్ ప్రస్తావించాడు, గైడ్ నిర్ధారించాడు—యేమిటంటే, ప్రతి లక్ష్మివారం స్వామికి ‘చిన్న నామం’ పెడతారనీ, దానితో స్వామి నేత్రాలు సగం వరకూ కనపడుటూంటాయనీ, అందుకనే ఆ రోజు యెవరైనా కొండమీద అవినీతి గానీ, దొంగతనం గానీ, పాపం గానీ చేస్తే, వెంటనే దొరికిపోతారనీ! (అందుకే దేవస్థానం వుద్యోగులు సైతం, లక్ష్మివారాల్లో చాలా జాగ్రత్తగా వుంటారట! అనీ) వెంటనే, నేను ‘ట్రాష్’ అన్నాను—ఉమేష్, ‘మిగతా లోజుల్లో ధైర్యం గా పాపాలూ అవీ చేస్తారన్నమాట’ అన్నాడు! కానీ, అలంకార రహిత స్వామి గురించి ప్రముఖంగా ప్రస్తావన రాలేదు! ఇక కొన్ని చిన్న చిన్న ముచ్చట్లూ, తరవాత మా తిరుగు ప్రయాణం, మిగతా యాత్రా! రమేష్ (జర్నలిష్ట్) సన్నగా, అంత పొడుగూ, పొట్టి కాకుండా వుండడంతో, వెండివాకిలి దగ్గర తోపులాటకు ముందే లోపలికి వెళ్ళిపోయాడు! దర్శనం అయిపోయి, బయటికి టాక్సీ పార్కింగ్ దగ్గరకి మేమే ముందు వచ్చాముగానీ, ఆయన పత్తాలేదు! ఉమేష్ మాత్రం కాస్త ఒడ్డు, పొడుగూ వుండడంవల్ల నేను వెండివాకిలి ముందు ‘మీరు కొంచెం ముందు వుండి మాకు దారి చెయ్యండి—బయటికి వెళ్ళేవరకూ మీరు ముందు వుంటేగానీ, మా ముసలాళ్ళం క్షేమం గా వస్తామని గ్యారంటీ లేదు’ అని అభ్యర్థించాను! పాపం అతడు అలాగే కట్టుబడ్డాడు! బయటికి రాగానే, ‘మీరు హుండీ దగ్గరకి వెళ్ళాలా?’ అని అడిగాడు—ఉమేష్. నేను ‘మేము యేమీ వెయ్యాల్సిన అవసరం లేదు’—అన్నాను. తను, ‘మావాళ్ళిచ్చినవి నేను హుండీలో వెయ్యలి సార్, మీరు వెళ్ళండి, నేను వెనకాల వస్తాను’ అన్నాడు. నేను ‘ఆలా అయితే, అందరమూ కలిసే వెళదాము—కానీ హుండీ గర్భగుడికి కుడిపక్కన వుంటుంది, అక్కడికి డైరెక్టుగా గుడి వెనకాలనించి వెళ్ళచ్చు’ అన్నాను. కానీ, “ఇక్కడేదో మెట్లు యెక్కి అందరూ వెళుతున్నారు—హుండీ మార్చేశారేమో—బోర్డు కూడా ‘హుండీ కి దారి’ అని అటే వుంది” అన్నాడు! ‘అయితే అటే వెళదాం’ అని తీరా వెళితే, యేవో చిన్న మందిరాలూ, అవీ వున్నాయి. సరే, గుడివెనకనించి కుడివైపు తరవాత, వెనకనించీ చుట్టు తిరిగి, హుండీ దగ్గరకి చేరి, మేము చేతికి వచ్చిన చిల్లరా, తను తెచ్చుకున్నవీ హుండీ లో వేశాక, బయటికి వచ్చాము. ఇక ప్రసాదాలు తీసుకోవాలిగా! అటేపు నడుచుకొంటూ వెళుతూండగా, అక్కడ ‘ఈ బ్యాంకూ’ ‘ఆ బ్యాంకూ’ స్టాల్స్ ‘ప్రసాదం కవరు రూ.2/-‘ అని అన్ని ముఖ్య భాషల్లో వ్రాసుకొని అమ్ముకుంటున్నాయి—జనం అక్కడ కవర్లు కొనుక్కొని, ప్రసాదాలిచ్చే చోటికి వెళుతున్నారు! పాపం మా ఉమేష్, 'మీరిక్కడే వుండండి, నేను వెళ్ళి మన లడ్డూలు తెస్తాను! టిక్కెట్లు నా దగ్గరే వున్నాయి కదా?’ అని వెళ్ళాడు. మేం హమ్మయ్య అనుకొని, అక్కడ చతికిలపడ్డాము—ఓ బ్యాంకు స్టాల్ పక్కన పేవ్ మెంట్ మీద—ఇంతలో, ఓ దేవస్థానం ఉద్యోగి, ఓ రబ్బరు గొట్టం తో చివ్వున నీళ్ళు చిమ్ముతూ ఆ దారి శుభ్రం చేసేస్తున్నాడు—మనుషులు కూడా తడిసిపోయేలా—మమ్మల్ని మేము రక్షించుకున్నాం—తడిసిపోకుండా—పైపైకి జరిగి! ఉమేష్ ప్రసాదం లడ్డూలతో తిరిగి రాగానే, గుడి ఆవరణనించి బయటికి నడిచాము—మా టాక్సీ పార్క్ చేసి వున్న చోటు వెతుక్కుంటూ!