మేము కొండపైకి టాక్సీలో వెళుతున్నప్పుడే, రమేష్ ప్రస్తావించాడు, గైడ్ నిర్ధారించాడు—యేమిటంటే, ప్రతి లక్ష్మివారం స్వామికి ‘చిన్న నామం’ పెడతారనీ, దానితో స్వామి నేత్రాలు సగం వరకూ కనపడుటూంటాయనీ, అందుకనే ఆ రోజు యెవరైనా కొండమీద అవినీతి గానీ, దొంగతనం గానీ, పాపం గానీ చేస్తే, వెంటనే దొరికిపోతారనీ! (అందుకే దేవస్థానం వుద్యోగులు సైతం, లక్ష్మివారాల్లో చాలా జాగ్రత్తగా వుంటారట! అనీ)
వెంటనే, నేను ‘ట్రాష్’ అన్నాను—ఉమేష్, ‘మిగతా లోజుల్లో ధైర్యం గా పాపాలూ అవీ చేస్తారన్నమాట’ అన్నాడు!
కానీ, అలంకార రహిత స్వామి గురించి ప్రముఖంగా ప్రస్తావన రాలేదు!
ఇక కొన్ని చిన్న చిన్న ముచ్చట్లూ, తరవాత మా తిరుగు ప్రయాణం, మిగతా యాత్రా!
రమేష్ (జర్నలిష్ట్) సన్నగా, అంత పొడుగూ, పొట్టి కాకుండా వుండడంతో, వెండివాకిలి దగ్గర తోపులాటకు ముందే లోపలికి వెళ్ళిపోయాడు! దర్శనం అయిపోయి, బయటికి టాక్సీ పార్కింగ్ దగ్గరకి మేమే ముందు వచ్చాముగానీ, ఆయన పత్తాలేదు!
ఉమేష్ మాత్రం కాస్త ఒడ్డు, పొడుగూ వుండడంవల్ల నేను వెండివాకిలి ముందు ‘మీరు కొంచెం ముందు వుండి మాకు దారి చెయ్యండి—బయటికి వెళ్ళేవరకూ మీరు ముందు వుంటేగానీ, మా ముసలాళ్ళం క్షేమం గా వస్తామని గ్యారంటీ లేదు’ అని అభ్యర్థించాను! పాపం అతడు అలాగే కట్టుబడ్డాడు!
బయటికి రాగానే, ‘మీరు హుండీ దగ్గరకి వెళ్ళాలా?’ అని అడిగాడు—ఉమేష్. నేను ‘మేము యేమీ వెయ్యాల్సిన అవసరం లేదు’—అన్నాను. తను, ‘మావాళ్ళిచ్చినవి నేను హుండీలో వెయ్యలి సార్, మీరు వెళ్ళండి, నేను వెనకాల వస్తాను’ అన్నాడు. నేను ‘ఆలా అయితే, అందరమూ కలిసే వెళదాము—కానీ హుండీ గర్భగుడికి కుడిపక్కన వుంటుంది, అక్కడికి డైరెక్టుగా గుడి వెనకాలనించి వెళ్ళచ్చు’ అన్నాను. కానీ, “ఇక్కడేదో మెట్లు యెక్కి అందరూ వెళుతున్నారు—హుండీ మార్చేశారేమో—బోర్డు కూడా ‘హుండీ కి దారి’ అని అటే వుంది” అన్నాడు! ‘అయితే అటే వెళదాం’ అని తీరా వెళితే, యేవో చిన్న మందిరాలూ, అవీ వున్నాయి.
సరే, గుడివెనకనించి కుడివైపు తరవాత, వెనకనించీ చుట్టు తిరిగి, హుండీ దగ్గరకి చేరి, మేము చేతికి వచ్చిన చిల్లరా, తను తెచ్చుకున్నవీ హుండీ లో వేశాక, బయటికి వచ్చాము.
ఇక ప్రసాదాలు తీసుకోవాలిగా! అటేపు నడుచుకొంటూ వెళుతూండగా, అక్కడ ‘ఈ బ్యాంకూ’ ‘ఆ బ్యాంకూ’ స్టాల్స్ ‘ప్రసాదం కవరు రూ.2/-‘ అని అన్ని ముఖ్య భాషల్లో వ్రాసుకొని అమ్ముకుంటున్నాయి—జనం అక్కడ కవర్లు కొనుక్కొని, ప్రసాదాలిచ్చే చోటికి వెళుతున్నారు! పాపం మా ఉమేష్, 'మీరిక్కడే వుండండి, నేను వెళ్ళి మన లడ్డూలు తెస్తాను! టిక్కెట్లు నా దగ్గరే వున్నాయి కదా?’ అని వెళ్ళాడు. మేం హమ్మయ్య అనుకొని, అక్కడ చతికిలపడ్డాము—ఓ బ్యాంకు స్టాల్ పక్కన పేవ్ మెంట్ మీద—ఇంతలో, ఓ దేవస్థానం ఉద్యోగి, ఓ రబ్బరు గొట్టం తో చివ్వున నీళ్ళు చిమ్ముతూ ఆ దారి శుభ్రం చేసేస్తున్నాడు—మనుషులు కూడా తడిసిపోయేలా—మమ్మల్ని మేము రక్షించుకున్నాం—తడిసిపోకుండా—పైపైకి జరిగి!
ఉమేష్ ప్రసాదం లడ్డూలతో తిరిగి రాగానే, గుడి ఆవరణనించి బయటికి నడిచాము—మా టాక్సీ పార్క్ చేసి వున్న చోటు వెతుక్కుంటూ!
No comments:
Post a Comment