Monday, June 15, 2009

నీ కొండకు నీవే రప్పించుకో--9

కాళ్ళు కాలిపోతున్నాయి—ఆ యెండలో—సిమెంటు రోడ్డు మీద—అలా వెతుక్కుంటూ, ఓ చెట్టునీడన నిలిచాం—

ఉమేష్ ‘నేను చూసి వస్తాను, మీరిక్కడే వుండండి సార్!’ అని గబగబా నడుచుకుంటూ వెళ్ళాడు—పాపం! (మా చెప్పులూ, సెల్ ఫోన్ లూ, బ్యాగులూ, అన్నీ టాక్సీలోనే వదిలెయ్యమని మా గైడ్ సలహా ప్రకారం అన్నీ వదిలేశాము మరి)మామూలుగా యాత్రికులు వాళ్ళ చెప్పులు యెక్కడ వదులుతారో తెలియదు.

మేం సెల్లార్ దర్శనం క్యూలో వున్నప్పుడు, పడమర మాడా వీధిలో కొంతమంది భక్తులో, స్థానికులో, వుద్యోగులో—పిల్లలతో సహా, చెప్పులు వేసుకొని నడుస్తూండడం చూశాను.

ఒకవేళ సెల్లార్ దర్శనం క్యూ లోకి వెళ్ళడానికి ముందు అక్కడ చెప్పులూ వగైరాల ‘డిపాజిటరీ’ యేమైనా వుంటే, గుడినించి బయటికి వచ్చాక, మళ్ళీ తిరిగి తిరిగి ఆ క్యూ మొదటికి వచ్చి, అవి తిరిగి తీసుకోవాలేమో!

మా టాక్సీ డ్రైవరు మా దగ్గరకి వచ్చి ‘బండి ఇక్కడే వుంది సార్! రండి! అని దగ్గరలోనే వున్న ఇంకో చెట్టుక్రింద పార్క్ చేసిన మా టాక్సీ దగ్గరకి తీసుకెళ్ళాడు. మా గైడ్ కూడా అక్కడే వున్నాడు.

ఇంకా రమేష్ జాడలేకపోవడం తో, ఉమేష్ కాస్త యేమైన కూల్ డ్రింక్ తాగి వస్తాను అంటూ వెళ్ళాడు. అతను వెళ్ళాక మాక్కూడా అనిపించింది—యెండ యెక్కువగానే వుంది కదా, మనం కూడా కూల్ డ్రింకులు యేమైనా త్రాగి వస్తే బాగుంటుందని. మేమూ వెళ్ళాము.

తిరిగి ఓ పదినిమిషాల్లో మేం ముగ్గురం టాక్సీ దగ్గర చేరేసరికి, గైడ్ చెప్పాడు—రమేష్ కూడా వచ్చి, ఇప్పుడే ఏ టీ ఎం కి వెళ్ళి వస్తానని వెళ్ళాడని. ఇంకో అయిదు నిమిషాల్లో తనూ వచ్చేసాడు—అందరం క్రిందకి బయలుదేరాం!

మళ్ళీ విషయాలు చెప్పుకోవడం మొదలు పెట్టాము—ఒక్క నా దర్శనం అనుభవం తప్ప—అన్నీ మాట్లాడుకున్నాము!

నేను ‘ముప్ఫై సంవత్సరాల తరవాత ఐ ఆర్ సీ టీ సీ ప్యాకేజ్ పుణ్యమాని చక్కగా దర్శనం అయిపోతోంది కదా అని ధ్వజ స్థంభాలవరకూ సంతోషించాను! కాని—అయాం మచ్ డిజప్పాయింటెడ్!’ అన్నాను.

రమేష్, ‘మీరే అంత డిజప్పాయింట్ అయితే, రెండునెలలకోసారి ఖచ్చితం గా వచ్చే నేను, ఆ రెండునెల్లోనూ వచ్చిన మార్పులకి నేనెలా ఫీలవ్వాలి!’ అన్నాడు.

గేట్ల కంట్రోలు గురించీ, స్టాఫ్ దర్శనం క్యూ గురించీ, తోపులాట గురించీ విమర్శించాను. ‘అదేమి దర్శనం క్యూ అండి! నిజంగా జనాలు వెర్రికూపులు అన్నట్టుగా వుంది’ అని తిట్టేశాను!

(అన్నట్టు శ్రీ కే యన్ వై పతంజలి తన ఖాకీ వనం నవలలో ఓ పోలీసాయన నోటినించి ‘ఎర్రికూపా’ అని తిట్టించి, తెలుగు సాహిత్యం లో ఆ మాటని ప్రవేశ పెట్టాడు! ఆ రికార్డుని ఇంతవరకూ యెవరూ బ్రేక్ చెయ్యలేదు!).

మహర్ద్వారం దగ్గరనించి, ఒకే మనిషి వెళ్ళగలిగే క్యూ లైను నిర్మించి, వీ ఐ పీ లతో సహా అందరినీ అదే క్యూ లో కలిపేసి, గర్భగుడివరకూ అందరినీ అనుమతించినా, లఘువులూ, మహా, మహావీరలూ అక్కరలేదు—అన్నాన్నేను! (ఆర్జితాలూ, కల్యాణాలూ, అవీ యెలాగూ మామూలే కదా). నాకప్పగిస్తే చేసి చూపిస్తాన్నాను! అందరూ నవ్వారు!

వీ ఐ పీ దర్శనాల గురించి రమేష్, ఉమేష్ మాట్లాడారు—వాటిని రద్దు చెయ్యలేరుగానీ, రెండుపూటలా ఒక టైము ప్రత్యేకించి క్రమబద్ధీకరించవచ్చు—అని. అసలు తితిదే చైర్మన్ గా ఒక మంచివాడిని—ఐ యే యస్ అధికారిని—వేస్తే, రాజకీయుల్ని మానేస్తే, సగం దరిద్రాలు తీరిపోతాయన్నారు!

సుబ్బిరామిరెడ్డి గురించి ప్రస్తావన వచ్చింది—ఓ వందమంది తొంబనేసుకుని తిన్నగా మహర్ద్వారం గుండా లోపలికి వెళ్ళిపోయి, దేవుడి ముందు ఒక్కడూ బైఠాయించి, ‘నేను ధ్యానం లోకి వెళుతున్నాను’ అంటాడట! ఇక అన్నితలుపులూ, క్యూలూ మూసేస్తారట! వాళ్ళ మంద మాత్రం లోపలే వుంటుందట! వాడు ధ్యానం లోంచి బయటికి వచ్చానని ప్రకటించేవరకూ, యెంతసేపైనా ఇంకెవరికీ దర్శనం వుండదట!

మొన్న ‘వైకుంఠం కాంప్లెక్స్’ రెయిలింగులు జనం విరక్కొట్టెయ్యడానికి వాడే కారణమట!

ఇలా కబుర్లతో కాలక్షేపం చేస్తూ, క్రిందకి చేరాము.

No comments: