Saturday, June 13, 2009

నీ కొండకు నీవే రప్పించుకో--7

నా శ్రీవారి దర్శనం! ఇక సీరియస్ గా దర్శనం, అనుభవం గురించి వ్రాస్తాను. గర్భగుడి ముందు క్యూ లోకి యెడమవైపు తిరిగినప్పటినుంచీ, నా ముందున్నవాళ్ళ తలల, మెడల పక్కనించీ స్వామిని చూడాలని అందరిలాగే ఆతృత! ముందు ‘సంజీవనీ పర్వతం యెడమచేత్తో పైకెత్తిపట్టుకుని, కుడిచేత్తో గదతో, వాలాన్ని తిప్పుతూ, గాలిలోకి యెగుస్తున్నట్టున్న’ ఆంజనేయ స్వామి ఆకారం గోచరించింది! ఒక్క క్షణం ఆశ్చర్యపోయి, దృష్టి కేంద్రీకరించి (నడుస్తూనే) చూడగా—ఓ షాక్ లాంటిది—స్వామి మూలబేరం రోడ్లు వెయ్యడానికీ, ఇళ్ళు కట్టేటప్పుడు కాంక్రీటు వెయ్యడానికీ వాడే కంకర మెటల్—దాన్నే ఇసుక రాయి (సాండ్ స్టోన్) అంటారనుకుంటా – తో తయారు చెయ్యబడ్డట్టు కనిపించింది! స్వామి వరద హస్తం, బేస్ బాల్ బౌలర్ కుడిచేతికి ధరించే తోలు ‘గ్లవ్’ అంత సైజులో, రేడియం లా మెరుస్తూ కనిపించింది! ఇక కటి హస్తం, చిన్నగా, రెండంగుళాల వెడల్పూ, నాలుగంగుళాల పొడవూ వున్న పచ్చ పొదగబడినట్టు, రేడియం లానే మెరుస్తూ, కనిపించింది! పాదాలు కనిపిస్తాయేమో అని వెతికాను! వాటికి వెండి తొడుగులేమీ లేవేమో, యెంత తీక్షణం గా చూసినా, కనిపించలేదు—ఆ మసక వెలుతురులో! స్వామివారికి ఇక యేవిధమైన అలంకారాలూ లేవు! ఇక, నా ముందున్నావిడని రక్షించి, నేను అందరికన్నా ముందున్నప్పుడు, స్వామివారి ‘నవ్వురాజిల్లెడు మోము’ చూద్దామని ప్రయత్నించా—శ్రీ నామం లో మధ్యవుండే యెరుపురంగు మాత్రమే కనిపించింది—ఇంకా బాగా వెతికితే, ఈ పక్కా, ఆ పక్కా నల్లటి రంగులో, కాటుక పెట్టినట్టు సగం నేత్రాలు గోచరమయ్యాయి—శ్రీనామం లో తెల్లటివి స్వామి రంగులో కలిసిపోయినట్టు అలవోకగా దర్శనమిచ్చాయనుకుంటా! ఈ లోపల మెట్టుదిగి యెడమవైపు మళ్ళడం, బయటికి నడవడం, మామూలే! నాకు తెలిసి, స్వామివారి విగ్రహం, నల్లని గ్రానైట్ రాయితో నిగనిగలాడుతూ వుండేది! అందరూ అదే చెప్పేవారు! మరి ఇప్పుడు, అనవసర అభిషేకాలతో, అరిగిపోయి, తెల్లబడిపోయిందా? వెంటనే ఓక నిజ నిర్ధారణ కమిటీని వేసి, రిపోర్టు తెప్పించాలి! అవసరమైతే, నిజరూప దర్శనాలూ, అభిషేకాలూ రద్దుచెయ్యాలి! స్వామి మూలబేరం కలియుగాంతం వరకూ సం రక్షింపబడాలి! ఇది నా ముఖ్య డిమాండ్! మిగిలిన ప్రజలు కూడా, తాము దర్శించినప్పుడు స్వామి యెలా గోచరించాడో, ఆత్మవంచన చేసుకోకుండా బయటపెట్టి, దేవస్థానం మీదా, ప్రభుత్వం మీదా వత్తిడి తేవాలి ఈ విషయం లో! నిజానికి స్వామివారిని అలా అలంకార రహితంగా నేనెప్పుడూ ఊహించుకోలేదు! మా చిన్నప్పుడు వచ్చినె ‘శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యం’ అనే సినిమాలో, చివరలో—శ్రీదేవి, భూదేవి—నారదుడితో అనుకుంటా మాట్లాడుతూ వుండగా, స్వామి నెమ్మదిగా ఒక్కో అడుగు వెనక్కి వేస్తూ, యేడడుగులువేసి, కొండచివరికి చేరి, విగ్రహం గా వెలసినట్టు చూపించారు—అదే విగ్రహాన్ని—చాలా విగ్రహాలు తయారు చేయించి, సినిమా ప్రదర్శితమవుతున్న ప్రతీ హాలు ముందూ వుంచారు—జనాలందరూ కొబ్బరికాయలు కొట్టి, హారతులూ, ప్రసాదాలూ పెట్టి, భక్తి పరవశులైపోయేవారు! అప్పుడు చూడడమే స్వామిని—అలంకార రహితం గా! మరి ప్రతీ లక్ష్మివారం, స్వామిని ఇలాగే దర్శనం చేయిస్తున్నారట—యెప్పటి నించి మొదలుపెట్టారో తెలియదు!

2 comments:

శ్రీ said...

దీన్ని నిజ రూప దర్శనం అంటారు.నాకు తెలిసి చాలా ఏళ్ళ నుండీ ఇలా జరుగుతుంది. ఆ రోజు స్వామికి ఒక నల్ల బొట్టు మాత్రమే పెడతారు.

A K Sastry said...

డియర్ శ్రీ!

నేను కొంతమందిని--నెలకి; రెండు నెలలకి; మూడు నెలలకి; ఆరు నెలలకి; సంవత్సరానికి; రెండు మూడేళ్ళకి; అయిదారేళ్ళకి; ఇలా ఓ నియమం పెట్టుకోకుండా, బుద్ధిపుట్టినప్పుడు లేదా ప్రత్యేక సందర్భాలు వచ్చినప్పుడు--ఇలా దర్శనానికి వెళ్ళేవాళ్ళని వాకబు చేశాను. కానీ, వాళ్ళలో చాలా తక్కువమంది లక్ష్మివారం దర్శనం చేసుకున్నవాళ్ళున్నారు!

వాళ్ళెవరూ ఆ రోజు నిజరూప దర్శనం వుంటుందని తెలియదనే చెప్పారు!

అందుకే 'యెన్నాళ్ళనించి మొదలయిందో' అన్నాను!

నాదగ్గర 1955 నించి తితిదే వాళ్ళ బ్రోచర్లు వున్నాయి--అప్పటి టిక్కెట్ ఖరీదులూ, సేవల రుసుములూ, దర్శనాల వివరాలూ వున్నాయి.

నిజరూప దర్శనం ఉదయం ఒక ప్రత్యేక దర్శనం గా వుండేది! తరవాత్తరవాత, స్వామివారికి అలంకరణలు చెయ్యడానికి సమయం సరిపోవడం లేదని, నిజ పాద దర్శనం మాత్రమే వుంచారు. నిజరూపాన్ని ప్రజలందరికీ ప్రదర్శించడమెందుకూ? అదీ గురువారాల్లో! (షిరిడీ సయిబాబా చుట్టాలూ, భక్తులూ కోసమా?) అయితే గియితే, తరతరాలనించీ స్వామివారికి ప్రీతిపాత్రమని చెప్పుకొనే శనివారం వుండాలి!

నిజరూప దర్శనం అయితే, ఆ వెండితొడుగులు యెందుకు?

మీరేమో 'నల్లబొట్టు ' అంటున్నారు! దీనితో యెంతమంది యేకీభవిస్తారు?

అసలు--ఇదిగో ఈరోజునించీ అనో, కనీసం ఈ సంవత్సరం నించీ అనో చెప్పగలవారెవరైనా వుంటే--చెప్పండి! అని నా అభ్యర్ధన!

నేననేది ఒక్కటే--వేలం వెఱ్ఱులతో, శ్రీ గిరినీ, శ్రీ పతినీ భ్రష్టు పట్టించవద్దు--అనే!

ధన్యవాదాలు!