Wednesday, June 24, 2009

శ్రీగిరి శ్రీపతి

నీ కొండకు నీవే రప్పించుకో--10
అలా క్రిందకి వచ్చాక, ఇక మంగాపురానికి మన ప్రయాణం అన్నాడు గైడ్!
కానీ, మా రమేష్, తనకేదో పని వుందనీ, తరవాత వెళతాననీ, టాక్సీ దిగిపోయాడు.
మేము మంగాపురం బయలుదేరాము!
అక్కడ, మా గైడ్ ‘టిక్కెట్లు తెచ్చిస్తాను, ఈలోగా మీరు ఈ ప్రత్యేక లైను నించి గోపురం దాకా వెళ్ళి అక్కడ వుండండి’ అంటే, అలాగే వెళ్ళాము.
మేము కాసేపు వేచి వుందామనుకుంటూంటే, అక్కడ వున్న మహిళా హోం గార్డు అనుకుంటా—యెందుకు ఆగుతారు—జనం పెద్దగా లేరు కదా, వెళితే వెళ్ళిపోండి—అంది. అక్కడి నించీ రెండు క్యూలూ యెలాగా కలిసిపోతాయి కాబట్టి, మేము లోపలకి వెళ్ళిపోయాము!
అక్కడ ముఖ్యమైనది—శ్రీ కళ్యాణ వేంకటేశ్వరుని (వరదరాజ స్వామి) దర్శనం! ఆ కళ్యాణ మూర్తి ని తనివి తీరా దర్శించుకోవచ్చు! అందరూ, అసలు స్వామి కన్నా ఇక్కడే చక్కగా వున్నాడు, దర్శనమూ ఇస్తున్నాడు—అని చెప్పుకొంటున్నారు!
ఆ స్వామి అక్కడ కళ్యాణమాడాక, ఒక నెలరోజులు అక్కడే వుండిపోయాడట! ఆ తరవాత, దేవతలందరి ప్రార్థనలూ ఆలకించి, శ్రీవారి మెట్టు ద్వారా మళ్ళీ కొండపైకి చేరుకొన్నాడట!
ఇక అమ్మవారి దర్శనం కూడా చక్కగా అయ్యింది. యెందుకో అందరూ అమ్మవారి గుడి ద్వారం పైన వున్న లక్ష్మీ దేవి బొమ్మని ముట్టుకొంటూ వుండడం నాకు నచ్చలేదు!
తరవాత ప్రసాదాలు—ఇక్కడకూడా, ఒక్కో టిక్కెట్ కీ రెండు లడ్డూలు—ఇవి తొక్కుడు లడ్డూలు అని మా ఆవిడ తరవాత అంది—లోపలి వ్యక్తి ‘కవరుకి రెండు రూపాయలివ్వండి’ అని అడిగి తీసుకొని, లడ్డూలు ఇచ్చాడు. (పేరుకి రెండే అని చెప్పుకున్నా, డబ్బు తీసుకొని, యెన్ని కావాలంటే అన్ని లడ్డూలూ ఇచ్చేస్తున్నాడు!)
బయటికి వచ్చి, షరా మామూలుగా కాలుతున్న కాళ్ళతో, మా టాక్సీ యెక్కడ పార్క్ చేశాడో వెతుక్కొని, అందులో పడ్డాక, హమ్మయ్య అనుకొన్నాము.
దారిలో ఓ శిల్పారామం కనిపించింది. యెప్పుడో ప్రారంభించేశారట. అప్పుడప్పుడూ కార్యక్రమాలేవో జరుగుతాయట.
శ్రీగిరి నించి క్రిందకి దిగుతూండగా, ‘మాలవాడి గుండం’ అని ఒకటి చూపించారు—హరిజనులకి ఆలయ ప్రవేశం లేనప్పుడు, వాళ్ళు ఇక్కడిదాకా వచ్చి, జలపాతం క్రింద వున్న గుండం లో స్నానాలు చేసి, అక్కడ నించే స్వామికి మొక్కి, వెనుతిరిగేవారట! 1946 లో గాంధీగారి ఉద్యమం లో భాగం గా, కొందరు దేశ భక్తులు పోరాడి వారికి ఆలయ ప్రవేశం కల్పించారట!
వేసవికాలం కాబట్టి జలపాతం లేదుగానీ, ఇప్పుడు కూడా జలపాతమున్న రోజుల్లో పులులు నీళ్ళు తాగడానికి అక్కడికి వచ్చి, భక్తులకి కనిపిస్తాయట!
తరవాత, గరుడాద్రి కొన కొమ్ము అచ్చం నిలువెత్తు గరుడుని ఆకారం లో వుండడం నిజం గా అత్యద్భుతం!
శ్రీ గిరి మొత్తమ్మీద యెక్కడా ‘గంట ‘ శబ్దం విన్నట్టులేదు! ఇదివరకు శ్రీవారి గుడి ముందు ఒక పెద్ద గంట వుండేదని గుర్తు! ఇప్పుడెక్కడా గంటలు లేవో, అవి మ్రోగించే తీరికా, ఓపికా భక్తులకి లేవో మరి!
గోవిందరాజులు స్వామినీ, వరాహ స్వామినీ కూడా జనాలు మరిచిపోయినట్టే!
అవండీ సంగతులు!

6 comments:

చిలమకూరు విజయమోహన్ said...

కొంచెం confusion గా ఉంది గురువుగారూ.మంగా పురం అంటే శ్రీనివాస మంగాపురం,అలర్మేల్ మంగాపురం రెండున్నాయి.శ్రీనివాసమంగాపురం మదనపల్లి కి పోయేదారిలో ఉన్నది.అక్కడ కళ్యాణ వెంకటేశ్వరుడు విరాజమానమై ఉన్నాడు.అలర్మేల్ మంగాపురంలో పద్మావతీ అమ్మవారు కొలువై ఉన్నారు.దీనినే తిరుచానూరు అని అంటారు.తిరుచానూరుకు పోయే దారిలోనే శిల్పారామం ఉంది.నాకు తెలిసి తిరుచానూరులో శ్రీసూర్యనారాయణస్వామి,శ్రీ కృష్ణస్వామి, శ్రీ సుందరరాజస్వామి వార్లు ఉన్నారు. వరదరాజస్వామివారున్నట్లు లేదే ! చాలారోజులతర్వాత తిరుపతికి వెళ్ళారు కదా కొంచెం confuse అయినట్లుంది.

చిలమకూరు విజయమోహన్ said...

క్షమించండి గురువుగారూ ! శ్రీ సుందరరాజస్వామినే వరదరాజస్వామి అని కూడా అంటారట.
word verification తీసివేయగలరు.

A K Sastry said...

అయ్యా! చిలమకూరు విజయ మోహన్!

మీ కామెంట్ నేనింకా చూడకుండానే, 'క్షమాపణ ' దాకా వచ్చిన మీ సహృదయానికి నా జేజేలు!

అది 'తిరుచానూరే!' అక్కడ గుడి ముందున్న బోర్డులు చదివి, గుర్తు పెట్టుకొని, వ్రాశాను!

లేకపోతే, మన ముళ్ళపూడి భాషలో, 'సోమరాజో, కామరాజో నాకేటి తెల్సు?'

ఇక 'వర్డ్ వెరిఫికేషన్ ' తీసెయ్యడం......!? నేను తీసెయ్యగలనా? యెలాగో చెపితే తప్పకుండా......వెంటనే! (నిజం చెప్పొద్దూ....నాక్కూడా చిరాగ్గానే వుంది.....కామెంట్ లు పబ్లిష్ చెయ్యడానికి ముందు, ఆ చక్రాల కుర్చీ ముందు వాళ్ళుచూపించిన అక్షరాలు వ్రాయడానికి!)

ధన్యవాదాలు!

A K Sastry said...

డియర్ చిలమకూరు విజయ మోహన్!

మరోసారి ధన్యవాదాలు!

చిలమకూరు విజయమోహన్ said...

word verification ఎలా తీసివేయాలో తెలియాలంటే ఈ క్రింది టపా చూడండి.
http://tolichiniku.blogspot.com/2008/09/word-verification.html

A K Sastry said...

హమ్మయ్య! తీసేశానండి!