లడ్డూల వితరణ
తి తి దే వారి బుధ్ధి వెర్రితలలు వేస్తోంది అనడానికి ఇంకో వుదాహరణ--లడ్డూ విక్రయానికి "ఏ టీ ఎం"లు యేర్పాటు చేస్తారట!
అదికూడా యెలాగ?
చూపుడువ్రేలి ముద్రని "సేకరించి" ఆ చాయాచిత్రాన్ని భద్రపరుస్తారట. అక్కడే లడ్డూలకి నగదు చెల్లింపు కూడా చెయ్యాలట!
అదయ్యాక, ఏటీఎం కి వెళ్లి, వ్రేలిముద్ర వెయ్యగానీ, అది లడ్డూలని "విసర్జిస్తుందట!"
అదికూడా, పర్యావరణ హితం కోరి, "కాగితరహిత" విధానాన్ని ప్రవేశ పెట్టడానికేనట!
యేమన్నా బాగుందా?
లక్షలో, కోట్లో ఖర్చుపెట్టి, మరిన్ని కుంభకోణాలకి తెరలేపడానికి కాకపోతే.....? ఇంత దివ్యమైన అవిడియా ఇచ్చినవాళ్లకి యెవార్డు కూడా సిఫార్సు చేస్తారేమో!
ఇప్పటి పధ్ధతిలో, ప్లాస్టిక్ కవర్లు బ్యాంకు కవుంటర్లలో కొనుక్కోవాలి. వాటిని లడ్డూ కవుంటర్లో ఇస్తే, వాటిలో లడ్డూలు నింపి, మన చేతికి ఇస్తారు. అంతకు ముందే, ఇంకో కవుంటర్లో నగదు చెల్లించి పొందిన రసీదుని వారికి ఇవ్వాలి.
ఈ పధ్ధతిలో, చక్కగా కొన్నివేల లడ్డూల వితరణ జరుగుతోంది! ఇంకా త్వరగా జరగాలంటే, కవుంటర్లనీ, సిబ్బందినీ పెంచాలి.
నాకు తెలీకడుగుతా, డబ్బు తీసుకొని, వ్రేలి ముద్ర సేకరించి, నిక్షిప్తం చెయ్యడానికి, (రసీదు ఇవ్వకుండా) యెంత సమయం పడుతుంది?
ఏటీఎం లో లడ్డూలు ఒకదాని తరవాత ఒకటి విసర్జింపబడడానికి యెంత సమయం పడుతుంది? తీరా వస్తే, అవి యే షేపులో వుంటాయి?
క్రింద "ట్రే" యే ఆకారంలో వుంటుంది? పడిన లడ్డూలు దొర్లుకొంటూ ఇంకో ట్రే లో పడతాయా?
లేక మనం ఆ క్రింద తట్ట పట్టుకొని సిధ్ధంగా వుండాలా?
నగదు వితరణ జరిగే ఏటీఎం లలోనే, ఖాతా నిల్వ సరిచూసుకోడానికీ, తరవాత నగదు పొందడానికీ, రసీదు, కార్డు పొందడానికీ యెంతలేదన్నా ఐదు నిమిషాల పైనే పడుతోంది.
మరి ఈ ఏటీఎం లు రోజంతా పనిచేసినా, యెంతమందికి యెన్ని లడ్డూలు వితరణ చెయ్యగలవు?
ఒకవేళ అవి "మొరాయిస్తే" దిక్కెవరు?
ఇంకెవరు! యేడుకొండలవాడే......యెప్పుడూ మన భక్తులకి!