మా యెడమపక్కన ఉన్న క్యూ లైన్ లో, గుళ్ళో పెళ్ళి చేసుకున్న దంపతులతోపాటు ఓ పది మందికనుకుంటా—సెల్లార్ దర్శనం అనుమతిస్తున్నారు—అలాంటివాళ్ళూ, కొండమీడికి నడిచి వచ్చే వాళ్ళకి వెంటనే సెల్లార్ దర్శనం అనుమతిస్తున్నారట—అలాంటివాళ్ళూ వెళుతున్నారు!
రెండు క్యూ లైన్లూ పడమర మాడావీధి కనిపిస్తూండగా, పైకి మెట్లు యెక్కి వెళ్ళవలసివుంది. అక్కడ, పైకి యెక్కేసరికి, ఇంకా యెడమ పక్క వున్న క్యూ లైన్ నించి మా యెడమ పక్క క్యూలైన్ లోకి తెరుచుకొనే గేటు తెరిచారెవరో! ఆ క్యూలు రెండూ కొంతసేపు కలిసి పోవడమే కాదు, వాళ్ళ లైను త్వరగా కదిలి పోయింది! మా లైను ఓ పావుగంట కదల్లేదు! (ఆ గేటు ని యెవరో ‘మేనేజి’ చేసి వుంటారని మా లైన్లో అనుమానాలు!)
అక్కడి నించి ఓ గదిలో ప్రవేశించి, మళ్ళీ మెట్లెక్కుతూ, కుడివైపు తిరుగుతాయి క్యూ లైన్లు. అక్కడ మాత్రం, చీమల బారుల్లా నెమ్మదిగానే కదిలాయి లైన్లు!
ఆ తరవాత, మెట్లు క్రిందికి దిగి, మాడా వీధి గుండా క్యూ లైన్లు త్వర త్వరగానే కదిలి, దక్షిణ మాడా వీధికి మలుపు తిరిగి, త్వరలోనే మహర్ద్వారం దగ్గరికి చేరాము!
ఈ లోపల, నా క్రితం దర్శనాల్లో, ఈ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లూ, సెల్లార్ దర్శనాలూ లేవని, ముఖ్య ప్రాకారం చుట్టూ మాత్రమే క్యూ లైను (సర్వ దర్శనానికి) వుండేదనీ, అప్పటిలో పాతిక రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్ కొనుక్కున్న వారిని మహర్ద్వారం దగ్గర సర్వదర్శనం క్యూ లైన్ లో కలిపేవారనీ, మేము 1975 లో చేసుకున్న దర్శనం అదేననీ) (ఆ దర్శనం గురించి ఇంకో సంచలన నిజం తరవాత చెపుతాను!) ఆ క్యూ ప్రాకారం లోపల మళ్ళీ గోడ పక్కనే వెళుతూ, వెండివాకిలి దగ్గరకి చేరేదనీ, అప్పుడు వీఐపీ లని, మహర్ద్వారం గుండా బంగారువాకిలి దగ్గరకి తీసుకెళ్ళి, అక్కడ గర్భ గుడి దగ్గరదాకా వెళ్ళే జనరల్ క్యూ లో కలిపేవారనీ, బంగారు వాకిలి లోపల యెంతటివారైనా ఒకటే అనీ, (1979 లో నేను చేసుకున్నది వీఐపీ పాస్ దర్శనమే అనీ) నా ఙ్ఞాపకాలు చెప్పాను!
ఇప్పుడు ప్రాకారం లోపల గోడ పక్కన క్యూలు లేవనుకుంటా! లేకపోతే, అదంతా గడిచి సర్వ దర్శనం వాళ్ళు వచ్చారో తెలీదుగాని, వెండి వాకిలి ముందు ఓ పెద్ద మంద చేరింది! అక్కడ నించి తోపులాటలు మొదలు!
వెనకవాళ్ళు ‘గోవిందా! గోవింద!’ అంటూ ఒక్క తోపు తొయ్యడం, ముందువాళ్ళు ఇత్తడి కంచెలకి నొక్కుకు పోవడం!
పాత ధ్వజ స్థంభం ముట్టుకోవడానికీ, కొత్త ధ్వజ స్థంభం (పాత ధ్వజ స్థంభం యెప్పటినించో లేదు--స్థంభ మూలం మాత్రమే వుంది! మరి అది వుండగా, ఇంకో కొత్తమూలం, ఇంకో ధ్వజ స్థంభం యే ఆగమ శాస్త్ర ప్రకారం నిర్మించారో వారికే తెలియాలి!) ముట్టుకోడానికి అదే తోపులాట! అక్కడికి నలిగి నలిగి, వెండి ద్వారం ముందుకి చేరాం!
అక్కడొక ఇరవై నిమిషాలపాటు వుండిపోయాం! (పదకొండు గంటల నించీ—వికలాంగులకి, వయోవృద్ధులకీ ప్రత్యేక దర్శనాలు వుంటాయట—వాళ్ళు వెండివాకిలి గుండా తిరిగి వస్తూనే వున్నారు అంతసేపూ! (దేవస్థానం వాళ్ళు ఇలా ప్రత్యేక దర్శనాలకి కేటాయించడం చాలా ముదావహమని మాలో మేము సంతోషించాము!)
ఇంతలో, మా కుడిపక్క ఇంకో ప్రత్యేక క్యూ వెలుస్తోంది—దేవస్థానం వుద్యోగుల తాలూకు ప్రత్యేక క్యూ అట అది—లోపలి వాళ్ళందరూ దాదాపు బయటకి వచ్చెయ్యగానే, వీళ్ళని లోపలకి వదిలేశారు!
ఆ తరవాత మా క్యూలు (అంటే నిజంగా క్యూలు లేవు—మందలే!) వెండివాకిలి లోకి వదిలారు—మళ్ళీ వీలైనంతగా తోపులాట!
అక్కడ మళ్ళీ చిన్న క్యూ లైను! అక్కడికి వైకుంఠ ద్వారం కనిపిస్తూ వుంటుంది! అక్కడనించి కుడివైపు లోపలికి (బంగారువాకిలి దగ్గరకి) క్యూ! చెప్పానుగా, అప్పటికే అన్ని క్యూలూ కలిసిపోయాయని!
ఇక అక్కడ నించి ‘మహా లఘు’ లేదా ‘మహావీర లఘు’ దర్శనం!
6 comments:
> ఆ తరవాత మా క్యూలు (అంటే నిజంగా క్యూలు లేవు—మందలే!)
:-))
పాత ధ్వజ స్థంభం , కొత్త ధ్వజ స్థంభం అంటూ వేరువేరుగా లేవండి.ఉండేది ఒకటే .పాతదాని స్థానంలోనే మళ్ళీ క్రొత్తది ఏర్పాటుచేశారు.బలిపీఠాన్నే మీరు పాత ధ్వజస్థంభం అని అనుకుంటున్నట్లుంది.
మీరన్నట్లు అక్కడ క్యూలైన్లు కాదు మందలే.ఎప్పుడు ఎక్కడ cut చేస్తారో,ఎప్పుడు ఎక్కడ కలుపుతారో అక్కడి ఉద్యోగులకే తెలియాలి.గుడిలో డ్యూటీ చేస్తున్నచాలా మంది ఉద్యోగులకు భక్తులంటే చాలా చులకన భావం.తమకు ముడుపులు చెల్లించే భక్తులంటే,రాజకీయనాయకులంటే మాత్రం అపరిమితమైన గౌరవం.ఇంక డాలర్ శేషాద్రి గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.ఆయన తననో సుప్రీమ్ పవర్ అని ఫీలయిపోతుంటాడు.
scout గా,శ్రీవారిసేవకునిగా అక్కడ పనిచేసా కదా క్యూలని కట్ చేయడం,వదలడం దగ్గర మాత్రం చాలా దారుణమైన పరిస్థితి.ఒకేసారి వదలడం వల్ల నడవలేనివారు, ముసలివారు చాలా ఇబ్బందులు పడుతుంటారు. తొందరగా దర్శనం చేసుకుందామనే ఆత్రుతలో తోటి భక్తులూ వారిగురించి ఆలోచనచేయరు.అక్కడ జరిగే తతంగాన్నిచూసాక,సేవ చేయడానికి వచ్చిన వారిపై అక్కడి ఉద్యోగులకున్న చులకనభావాన్ని చూసాక మళ్ళీ శ్రీవారిసేవకు వెళ్దామనే కోరికే నశించిపోయింది.
ఆ ఏడుకొండలవాడిని దర్శించుకోవటం చాలా కష్టతరంగా మారినప్పటికి, ఆయనను సంవత్సరానికి కనీసం ఒకటి/రెండు సారైనా దర్శించుకోకుండా ఉండలేకున్నాను. ఆయనలోని దివ్యశక్తి మరియు ఆ గుడిలో నిరంతరం జరిగే వేధ్దోచ్చరణ, మంత్రఘోషణలు, శాశ్రోత్తకంగా జరుగు సేవలు, కైంకర్యముల వలన అక్కడ ఏర్పడినటువంటి దివ్యమైన వాతావరణము నన్ను అక్కడికి పలుమార్లు వచ్చేటట్లు చేస్తున్నది.
డియర్ Paipuri123!
అవునండీ! మీకు నవ్వు వస్తుంది! మీరెప్పుడూ ఆ మందల్లో లేరేమో!
ఒక వేళ వుండివుంటే, అందరిలాగే ఆ పాట్లు తలుచుకుని నవ్వు వస్తుందేమో!
ధన్యవాదాలు!
డియర్ చిలమకూరు విజయమోహన్!
నాకు తెలిసున్నంతవరకు, మీరు బలిపీఠం అంటున్నది ధ్వజస్థంభ మూలమే! అంతకు ముందు చెక్క ధ్వజ స్థంభం వుండేదట ఆ మూలం పైన! అప్పుడెప్పుడో గాలివానకి అది విరిగిపోయి, మూలం మాత్రం మిగిలిందట!
కొత్త ధ్వజస్థంభం మూలం కూడా అచ్చం అదే అకారం లో, డిజైన్ లో, అదే యెత్తూ, కొలతలతో వుంది--గమనించారో లేదో!
ఇక బలిపీఠం అనేది ఆ కుడివైపున సుమారు రెండడుగుల యెత్తు రాతి తిన్నె! దాని మీద కొన్ని కూరగాయ ముక్కలో, లడ్డూ బూందీనో జల్లి వుంటుంది!
యేమో! నాదే పొరపాటు అయి వుండవచ్చు! విఙ్ఞులెవరైనా తెలపాలి!
ఇక మీ అనుభవాలూ, ఉద్యోగుల గురించీ, డాలరు శేషాద్రి గురించీ, చక్కగా, దాపరికం లేకుండా వ్రాశారు! చదివే వాళ్ళందరూ కళ్ళు తెరవాలని, మార్పు కోసం ప్రయత్నించాలని--కోరుకుందాం!
కృతఙ్ఞతలు మరియు--
ధన్యవాదాలు!
డియర్ saipraveen!
మీదింకా చాలా చిన్నవయసు అనుకుంటా!
'వేదోచ్చారణ, మంత్రఘోషణలు ' యెక్కడయ్యా బాబు! మహర్ద్వారం దగ్గర వున్న చిన్న స్పీకరు లోంచి, 'గోవిందా! గోవింద!' అని నెమ్మదిగా వినిపించింది--ఆ ద్వారం దాటే వరకూ! అంతే!
కనీసం 'గోవిందా! గోవింద ' సినిమాలో బ్యాక్ గ్రవుండ్ లో వినిపించినట్టుకూడా--యెక్కడా లేదు! 'గోవిందా గోవింద ' అని వినిపించిందల్లా, తోసుకోవడానికి ముందే!
ఇదివరకు మహర్ద్వారం లోపల, కనీసం హారతి కర్పూర వాసన నిండి వుండేది! వెండి వాకిలి దాటాక, పునుగు, జవ్వాజి వాసనలు గుమ్మెత్తించేవి! ఇప్పుడేవీ లేవు!
పడమర మాడా వీధి లోకి దిగడానికి ముందు, శ్రీ వారి పోటు కి నేల మీద నించి 'కన్వేయరు బెల్టు ' కనిపించే చోట మాత్రం చక్కటి ప్రసాదం (నెయ్యీ, కర్పూరం, కమ్మని జీడి, బాదం పప్పులూ వాటి) వాసన పులకింప చేస్తుంది! (అన్నట్టు శ్రీవారి పోటులో ప్రతీ రోజూ 86 లడ్డూలు మాత్రమే చేసి, దేవుడికి నివేదన చేస్తారట!--మిగిలిన లడ్డూలన్నీ--ఉతూతి--అంతే!)
ఇక శాస్త్రోక్తం గా జరుగు సేవలు, కైంకర్యాలు, దివ్య వాతావరణం--ల గురించి నాకు తెలియదు!
ధన్యవాదాలు!
Post a Comment