Saturday, August 22, 2009

కూష్మాండాలు కుక్కబడతాయా?

మారణహోమమా?
పాపం….మహాయోగి రామకృష్ణ పరమహంస లా వున్నాడు చూడడానికి!
ఆ ముఖం చూస్తే, 8 లక్షలు—పెళ్ళిళ్ళకీ, అనారోగ్యానికీ అయితే మాత్రం—ఖర్చుపెట్టగలదిగా కనిపిస్తోందా?
2007 లో కనీసం 11 లక్షల విలువచేసే నగలు పట్టుకెళ్ళి తాకట్టు పెడతానంటే, అవి ఆయన స్వంతమే అని యెవరైనా నమ్మేటట్టుందా?
అసలు తాకట్టు యెందుకు—యే చిత్తూరో, చెన్నయ్యో తీసుకెళ్ళి అమ్మేస్తే పోలా—అనే అలోచనైనా వచ్చే తెలివి కనిపిస్తోందా?
ఆయనెవరంటారా!
శ్రీపతి పట్టణం లోని కోదండ రామస్వామి ఆలయం ప్రధానార్చకుడు శ్రీ చిన్న వెంకటరమణ దీక్షితులు!
ఆలయ మూల విగ్రహం మీద వుండే నగలని తాకట్టు పెట్టాడనే అరోపణమీద ఆయననీ, ఆయన భార్యనీ కూడా ‘అరెష్టు’ చేశారట!
ఆయనే తాకట్టు పెట్టినట్టు వొప్పుకోవడం, ఫలానా బంగారం షాపు యజమాని కొడుకు దాన్ని ధృవీకరించడం, అరెష్టులూ, టీవీల్లో వార్తలూ, పేపర్లకి వార్తలూ వచ్చేశాయట!
కొన్ని ప్రశ్నలు---
కొండమీది శ్రీవారినే, ఆభరణరహితం గా వారానికి ఓ రోజు దర్శనానికి అనుమతిస్తూండగా, రామాలయం లో 11 లక్షల విలువైన ఆభరణాలని 2007 వరకూ 365 రోజులూ అలంకరించే వుంచేవారా?
2007 లో కొన్నాళ్ళు 6 లక్షల విలువైన ఆభరణం ఒకటే వుండి, రెండోది కనిపించక పోయినా, యెవరికీ అనుమానం రాలేదా?
ఆ తరవాతైనా రెండూ లేనప్పుడు కూడా రాలేదా?
అనుమానం రాకుండా ఆయనేమయినా అలాంటివే గిల్టు నగలు తయారుచేయించి అలంకరించాడా?
కోదండ రాముడికి 47 రకాల స్వర్ణాభరణాలూ, 600 కిలోలకి పైబడి వెండి ఆభరణాలూ 70 కిలోల వరకూ వెండి కవచాలూ వున్నాయట. అవన్నీ ఒక చోట వుండి వుంటాయి కదా? గత రెండు సంవత్సరాల్లో అవేవీ స్వామికి అలంకరించలేదా? ఒకవేళ అలంకరిస్తే, మళ్ళీ అవి భద్రపరచబడాలికదా? అది దేవస్థానం వుద్యోగుల పనేగా? వాళ్ళెవరికీ అనుమానం రాలేదా?
‘పారుపత్తేదారు’ అంటే శ్రీవారి బొక్కసానికి సంబంధించిన ‘గుమాస్తా’ ట. ఆ పదవీ విరమణ చేసినాయన శ్రీ పి శేషాద్రి అట. (ఆయన్నే డాలరు శేషాద్రి అంటారట--మరి ఆయన ఇప్పుడు పొడిగింపు మీద ప్రత్యేకాధికారిగా కొనసాగుతున్నారట!) పదవీ విరమణ చేశాక కూడా, శ్రీవారి బొక్కసం తెరవగల ‘రెండు’ తాళాలూ ఆయనదగ్గరే వుంటున్నాయట. బొక్కసం నించి 300 బంగారు డాలర్లు మాయం అయ్యాయట.
ఈ విషయాలన్నీ నిఘా, భద్రతాధికారి శ్రీ బి వి రమణ కుమార్ క్షుణ్ణం గా పరిశీలించి తీసుకోవలసిన చర్యల్ని సూచిస్తూ, 2008 లోనే నివేదిక సమర్పించారట!
‘……యేమడిగారూ?.......అరెష్టా! ఇంకా నయం—ఆయనేమయినా ఓ పిచ్చి అర్చకుడా—భార్యా సమేతం గా అరెష్టుకీ, వుద్యోగం పీకెయ్యడానికీ……’ అంటున్నారెవరో!
మరి ఇవన్నీ గమనిస్తే, మొదలైన మారణహోమం లో ఇంకా చాలామంది సమిధలవుతారేమోనని నాకొచ్చిన ఆలోచన తప్పని యెవరైనా అనగలరా?
నడుస్తున్నది ‘దేవుడి’ పాలన అంటున్నారు మరి.

No comments: