Thursday, August 27, 2009

రామస్వామి నగలు


బడాచోర్లు


‘….రెండుకాదు…11’ అంటోంది ఈనాడు!  


డి ఎస్పీ గంగరాజు, దర్యాప్తు అధికారి సీ ఐ సుధాకర్ రెడ్డి, విలేకర్ల సమావేశం లో ‘పదిహేనురోజుల క్రితం—3 లక్షలు చెల్లించి 3 నగలు పూజారి విడుదల చేయించినట్లు, వడ్డీ వ్యాపారి నుంచి 1.408 కేజీల బరువున్న 8 నగలు స్వాధీనం చేసుకొన్నట్లు, వాటిలో రెండు శుక్రవారమే స్వాధీనం చేసుకోగా, ఆరు శనివారం చేసుకున్నట్లు—డీ ఎస్పీ చెప్పగా, ఆర్చకుడి ఆరోగ్య పరిస్థితి సరిగ్గా లేకపోవడం వల్ల హాజరుపరచలేకపోయామని పోలీసులూ—తెలిపారట.  


స్వాధీనం చేసుకున్నట్టు చెపుతున్న నగల్ని ప్రదర్శించకపోవడం పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయట. ఇటీవల విడుదల చేయించిన నగలు భద్రం గా వున్నాయా అనే విషయం ఇంకా తేలాలట.  


మరి టీవీలో ఆ రాత్రి, 8 ఆభరణాలని స్వాధీనం చేసుకున్నారంటూ, అవేవో రంగు రంగుల రాళ్ళున్న ఆభరణాలని కొన్నింటిని చూపించారు! (బహుశా లైబ్రరీ షాట్లనుకుంటా!) మరి ఈ మీడియాల విశ్వసనీయత యేమిటి? యెవరి ఎజెండాలు వారికున్నాయనా?  


ఇక, డాలరు శేషాద్రి పేరు మొదటిసారి మొన్నీమధ్య కొండకి వెళ్ళినప్పుడు మా జర్నలిస్ట్ మిత్రుడి నించి విన్నాను. తరవాత మొన్న పేపర్లో చదవడమే! ఆయన్నెప్పుడూ చూడలేదు—ఒకవేళ గుడిలో చూశానేమో గానీ ఆయనే ‘ఫలానా’ అని తెలియదు.  


టీవీ లో ఆయన కళ్ళనీళ్ళతో, ‘నా జీవితమంతా రాత్రీ పగలూ స్వామివారికీ భక్తులకీ సేవ చెయ్యడానికే అంకితం చేశాను—బొక్కసం అంటే యేమిటో తెలియనివాళ్ళు దాని గురించి మాట్లాడుతున్నారు—బొక్కసం లో గానీ, నాదగ్గరగానీ డాలర్లు వుండవు—నాకు పిల్లలు లేరు—స్వంత ఇల్లు కూడా కట్టుకోకుండా నా భార్యతో అద్దె ఇంట్లో వుంటున్నాను—యెవరికోసం సంపాదించాలి—అదీ అవినీతితో!’ అని వాపోతుంటే, నిజం చెప్పొద్దూ—హృదయం ద్రవించింది!  


వారెన్ బఫెట్ ‘నా సంతానం రోడ్డున పడక్కర్లేనంత మాత్రమే వాళ్ళకి ఇచ్చి, మిగిలినదంతా సేవా సంస్థకి ఇచ్చేస్తున్నాను’ అని ప్రకటించాడు ఇదివరకు.  


మరి మన టాటా, బిర్లా, అంబానీలూ, బచ్చన్లూ, రెడ్డిలూ యెందుకు ఆలోచించరో!  


శ్రీ శేషాద్రి ప్రశ్నలకి సమాధానం చెప్పాల్సిన అవసరం వీరందరికీ, మీడియాకీ లేదా?



No comments: