స్వామి 'భక్తి చానెల్ '
విన్నారా? శ్రీవారి భక్తి చానెల్ 100 కోట్లకుపైగా నష్టాల్లో వుందట! 98 ధార్మిక సంస్థలకి కోట్లాది రూపాయలు ధారాదత్తం చేస్తోందట మన తి తి దే బోర్డు!
గత 30 యేళ్ళుగా అందరికీ తెలిసున్నవే! యెన్ని ప్రభుత్వాలు వచ్చినా అన్నీ ఆ తానులో ముక్కలే! యెగబడి అన్నివూళ్ళలోనూ 'కళ్యాణ మండపాలు ' కట్టించేశారు! (వాటితో గుత్తదారులు బాగుపడ్డారు!) ఇప్పుడవన్నీ శిథిలావస్తలో వున్నాయి (కట్టుబడిలో అవినీతి మూలంగా)--నిర్వహణ సరిగ్గాలేక, ఇప్పుడు 'ప్రైవేటు 'కి అప్పగిస్తామన్నారు--టెండర్లు పిలిచారు! (ఇక్కడ ఇంకోరకం అవినీతి)
యవడబ్బ సొమ్మని? (రాజుల సొమ్ము రాళ్ళపాలైనా, ఇప్పటికీ ఆ రాళ్ళైనా నిలిచి వున్నాయి--మరి దేవుడి సొమ్ము? పొట్టలు పెంచడానికా? ఆ పొట్టలు నిలుస్తాయా?)
భక్తి చానెల్ మొదలెట్టే ముందు యేమి చెప్పారు? సినిమాలూ, సీరియళ్ళూ నిర్మిస్తాము--స్పాన్సర్లు వస్తారు--ఇన్ని కోట్ల లాభం వస్తుంది--పైగా స్వామికార్యం కూడా నెరవేరుతుంది--అని! మరిప్పుడు?
చెపితే నవ్వుతారు (దేంతోనో మీ ఇష్టం!)
క్రితం వార్షిక బ్రహ్మోత్సవాల్లో 'ప్రత్యక్ష వ్యాఖ్యానం' చేసిన ఓ ప్రముఖ వ్యక్తికి, పదమూడువందలో యెంతో (రెండువేల లోపు) చెక్కు ఇచ్చారు శ్రీ భక్తి చానెల్ వారు! తీరా ఆయన బ్యాంకుకి వెళ్ళి ఆ చెక్కుని తన ఖాతా లో జమ చేయమని అడిగితే--శ్రీ 'చానెల్ ' వారి ఖాతాలో వున్న సొమ్ము అక్షరాలా 'పందొమ్మిది రూపాయలు '! మరి ఖాతాలో సరిపడిన సొమ్ము లేకుండా చెక్కులు ఇవ్వడం నేరం! (దానిమీద ఆయన కోర్టుకి వెళ్ళలేదు--స్వామి భక్తుడు కాబట్టి!)
మొన్న, పీ సీ సీ అధ్యక్షుడు శ్రీ ధర్మపురి శ్రీనివాస్ తన అనుచరులు కేవలం నలభయ్యే మందితో వెళితే, గంటన్నరపాటు క్యూలని ఆపేసి, రాజుగారినీ, వారి మంత్రులనీ సేవించడంలో సిబ్బంది తరించారట! పైగా, శ్రీ శ్రీనివాస్ 'వికలాంగుడు ' కాబట్టి, అది సమంజసమే అంటున్న ఆదికేశవుడు! {ఆయన వికలాంగుడనే ఇప్పటివరకు తెలియదు--యెలాంటి వికలాంగుడో యెవరికీ తెలియదు! పోనీ (ఆయనకి యేదో అంగం లోపించిందని) వొప్పుకున్నా, ఆ వెనక 40 మందికీ కూడా అవయవాలు లోపించాయా?}
విలేఖరులు వచ్చేసరికి, సిబ్బంది పరుగులు పెట్టి, సెల్ ఫోన్లకి పని చెప్పి, వైకుంఠం 17 నించి--వైకుంఠం 1 కి భక్తులని పంపించమని హడావుడి చేశారట!
నిజంగా మన మీడియా తలుచుకుంటే, ఓ క్రమ పద్ధతిలో వాళ్ళ సుకుమారమైన దున్నపోతుచర్మాలని వలిచెయ్యచ్చు!
మన మీడియా అందుకు పూనుకుంటుందా?
(అబ్బే! యెవరి సొంత ఎజెండాలు వాళ్ళకున్నాయి--అని యెవరో అంటున్నారు--అవునా?)
యేమో!
ఆ పైవాడికే తెలియాలి మరి!
తాజా కలం :-- శ్రీ వారి భక్తి చానెల్ ని (యెవరైనా తీసుకునేవాళ్ళుంటే), లీజుకి ఇచ్చేస్తారట! చూ. ఈనాడు సెప్టెంబరు 1, 2009--పే. 11
No comments:
Post a Comment