ఆంధ్రదేశానికీ, తెలుగువాళ్ళకీ వ్యతిరేకం గా, బాగా వేళ్ళూనుకొన్న కుట్ర యేదో జరుగుతోందేమో అనిపిస్తూంది నాకు.
ఇదేదో--ప్రత్యేక తెలంగాణా గురించో, సమైక్య ఆంధ్ర గురించో, 'తిరు ' చిదంబరం గురించో అనడం లేదు.
శ్రీగిరి శ్రీపతి దేవస్థానం మొత్తం క్రమం గా 'తమిళీకరణ ' జరుగుతోందా--అని అనుమానం వస్తోంది!
లేకపోతే, సుప్రభాత సేవ కూడా రద్దుచేసి, 'తిరుప్పావై' పఠించాలని నిర్ణయించడం గత 40 యేళ్ళలో యెప్పుడైనా జరిగిందా? జరిగితే యెప్పుడు మొదలయ్యింది?
ఇంకా తి తి దే వారి "ఆళ్వారు దివ్య ప్రబంధ ప్రాజెక్ట్" సంస్థ ద్వారా, ఆంధ్ర దేశమంతటా, చిన్న పట్టణాళ్ళో కూడా, ఊరూపేరూ లేని విష్ణ్వాలయాలలోనూ, శివాలయలలోవున్న చిన్న చిన్న వైష్ణవాలయాల్లోనూ 'ధనుర్మాసం' పేరు చెప్పి, ప్రతిరోజూ 'తిరుప్పావై' పఠింపచెయ్యడం యేమిటి?
దానికి పత్రికలూ, మీడియా అమాయకం గా పబ్లిసిటీ ఇవ్వడం యేమిటి?
ఉదాహరణకి--పంచారామాల్లో ఒకటైన భీమవరం లోని భీమేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం లోని--శ్రీ రాధాకృష్ణ దేవాలయంలో--ఈ నెల 16 నించి జనవరి 14 వరకూ, అదే వూళ్ళో, 'సాంస్కృత కేంద్రం' లో వేంచేసిన శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం వద్ద--ఈ నెల 16 నించి జనవరి 13 వరకూ, పాలకొల్లులో 'అష్టభుజ లక్ష్మీనారాయణస్వామి 'ఆలయంలోనూ, తిరుప్పావై ప్రవచనాలు జరుగుతాయట!
ఇక ఈనాడు 'ఆధ్యాత్మికం' లో ఆప్పరుసు రమాకాంతరావు గారు (ఈయన క్రెడెన్షియల్స్ యేమిటో నాకు తెలియవు)-- 'విష్ణుచిత్తుడికి ' ఓ పాప దొరికితే, ఆమెకి 'చూడి కొడుత్త నాచ్చియర్ ' అని పేరు పెట్టాడని--అవాకులూ చెవాకులూ యెందుకు వ్రాసారో, దాన్ని ఈనాడు వారు యెందుకు ప్రచురించారో--వారికే తెలియాలి!
విష్ణుచిత్తుడికి దొరికిన పాపకి ఆయన పెట్టింది 'గోదాదేవి ' అనే పేరు! దాన్నే తమిళులు 'ఆండాళ్' అని పెట్టుకున్నారు!
మరి 'చూడి కొడుత్త నాచ్చియర్ ' యేమిటి?
గోదాదేవి యుక్తవయస్సులోకి వచ్చాక, రంగనాధుడిని వరించి, తను అందంగా వున్నానో లేదో, స్వామికి నచ్చుతానో లేదో అనుకొంటూ--స్వామికోసం కట్టిన పూల మాలల్నీ, దండల్నీ తానే ధరించి, నూతిలో నీడ చూసుకొని నమ్మకం కుదిరాక, వాటిని స్వామికి అలంకరించేది (ట)! అందుకని, 'తాను ధరించినవి అర్పించినది ' అనే అర్థం లో, 'శూడి కుడుత్త నాచ్చియర్ ' అన్నారట!
(ఆవిడ శ్రీరంగనాధుణ్ణే పెళ్ళాడానని వూహించుకోవడం, తిరుప్పావై రచించి గానం చెయ్యడం చరిత్ర--లేదా కొంతమందికి పుక్కిటి పురాణం!)
మరి ఆంధ్రులకి ఈ భావ దాస్యం యెందుకు?
ఐటీ, నీటిపారుదల, పారిశ్రామిక రంగాల్లో అభివృధ్ధి చెందుతున్న ఆంధ్రప్రదేశ్ ను ముక్కలు చెయ్యడానికి తమిళులు కుట్ర పన్నుతున్నారని అనుమానాలు వస్తున్నాయి అని మాజీ మంత్రి మాగంటి బాబు కూడా అన్నారట!
నేను మరోసారి హెచ్చరిస్తున్నాను--శ్రీగిరి శ్రీపతి ఆలయాన్ని 'వైష్ణవ దేవాలయం' అని వ్యవహరించడానికి వీల్లేదు!
ఆయన దేశ, కాల, భాషా, ప్రాంతీయ, కుల, మతాలకి అతీతుడు--కోట్లాది భారతీయులకి--అందులో సామాన్యులకి--కలియుగ దైవం!
పిచ్చి పిచ్చి వేషాలు వేశారో--ఝాగ్రత్త!