శ్రీవారి ఆభరణాల విలువ
హమ్మయ్య! బెటర్ లేట్ దేన్ నెవర్ అన్నట్టు, ఇప్పటికైనా మన వున్నత న్యాయస్థానం వారి ఆదేశాల మేరకు ఆభరణాల విలువ లెఖ్ఖింపు ప్రక్రియ పూర్తి అయ్యిందట.
ఇదివరకే ముంబై, రాజస్థాన్ ల లోని జెమాలజీ నిపుణులు వజ్ర వైఢూర్యాల, ఇతర "రాళ్ల" నాణ్యత, పరిమాణం, స్వచ్చత, (విలువ?!) గురించీ, హైదరాబాదు మింట్ నిపుణులు బంగారం నాణ్యత, పరిమాణం, స్వచ్చత గురించీ రెండు నివేదికలు సమర్పించి వుండగా, ఇప్పుడు ఆభరణాల విలువపై నియమించిన కమిటీ కూడా నివేదిక సమర్పించిందట.
(తిన్నవాళ్లు తినగా, పోయినవి పోగా) "తిరువాభరణ" దస్త్రం మేరకు 137; "శ్రీ మలయప్ప స్వామి" దస్త్రం మేరకు 444; వెండివి 365; "ఇతర ఆభరణాల" దస్త్రం మేరకు 82--ఆభరణాల విలువని లెఖ్ఖించారట. (శ్రీవారికి వెండివి లేవా? ఇతరాలు 82 యేనా అని అడగొద్దు.)
శ్రీవారి "నిత్య కట్లు" విలువ లెఖ్ఖించలేదట. (వాటి వివరాల నమోదు యెక్కడైనా జరిగిందో లేదో!).
(అయినా, ప్రతి గురువారం అవికూడా లేకుండా స్వామి దర్శనం చేయిస్తున్నారుగా? ఇలాంటి దర్శనాన్ని రెండురోజులకి పొడిగించామన్నారు ఆ మధ్య. మరి రెండురోజులు చాలవా నిపుణులకి వాటి విలువ లెఖ్ఖించడానికి? యేమో. అసలు ఈ దర్శనాన్ని నిషేధించాలంటాను నేను--యెందుకంటే, "స్రగ్భూషాంబర హేతీనాం, సుషుమావహ మూర్తయే....." వల్ల "....శమనాయాస్తు....." అన్నారు కదా?)
ఇంకా, భద్రతా కారణాల దృష్ట్యా, ఆభరణాల 'మొత్తం విలువ' ప్రకటించకుండా జాగ్రత్తపడ్డారట. సరే.
ఆయా దస్త్రాల్లో యే తేదీ వరకూ నమోదయిన వాటిని లెఖ్ఖించారో, ఆ తరవాత వచ్చిన వాటి మాటేమిటో, న్యాయ స్థానం వారూ, ఈవోగారూ తగిన కట్టుదిట్టమయిన యేర్పాట్లు చేసేలా చూడాలి. ఇక నించీ యెప్పటికప్పుడు నమోదుల వివరాలూ, వాటి విలువలూ ప్రకటిస్తూ వుండాలి.
మన పిచ్చిగానీ, వాటిని కాపాడుకోవడం లో శ్రీవారికీ, దిగమింగడంలో దగుల్బాజీలకీ జరుగుతున్న పోటీలో యెవరు నెగ్గుతున్నారో చూస్తూనే వుంటాం కదా!